Previous Page Next Page 
ఆకాశ దీపాలు పేజి 5


                                                                                                                            3
    ఇందిర తడబాటుగా అడుగు ముందుకు వేసింది. ఇల్లు చేరిందే గానీ, ఆమెను ఆలోచనలెన్నో ముసురుకుని, శాంతిగా విశ్రాంతి తీసుకోనివ్వ లేదు.
    ఆ మధ్యాహ్నమంతా ఆమె కదే ధ్యాస!
    'ఇంత ధైర్యం బాబ్జీ కి ఎలా వచ్చింది? ఎన్నిసార్లు అతనింటికి వెళ్ళినా, దూరంగానే నిలబడి మాట్లాడటమే గాని, హద్దు మీరిన క్షణాలు లేనే లేవు. కానీ ఈ వేళ..?
    నిజం చెప్పద్దూ..... ఆ ఎర్రటి బట్టల్లోనే ఉంది అందమంతా. ఎరుపు కామానికి గుర్తుట! ఆ బట్టలు కట్టుకుంటే చాలు, తనకే తనెంతో ముద్దొస్తుంది.
    ఛ - ఇదేమాట ఒకసారి సుందరితో అంటే, మొదట నవ్వింది ; ఆ తర్వాత అంది సుందరి -- 'ఆ బట్టలు కుట్టుకుంటే నీకుముద్దోస్తుందే గాని నాకయితే బట్టలు కట్టుకోకుండా ఉంటేనే ముద్దోస్తావు --' అని!
    ఎంతయినా తగును సుందరి!
    పొరబాటు తనదే-- పోయి, పోయి సుందరితో చెప్పుకోవడమేం?- నవ్వుకుంది ఇందిర. వెంటనే బాబ్జీ గుర్తొచ్చాడు.
    బాబ్జీ-- బాబ్జీ సాయంత్రం రమ్మన్నాడు ఎందుకు?
    గుడికని!-- కానీ అందుకేనా?
    అందుకు కాకపొతే బాగుండును!
    ఏమో! -- వెళ్ళకపోతే హాయి-- అనుకుంది ఇందిర.
    అలా అనుకుందే గాని, వెళ్ళితే గానే హాయి లేదని ఇందిరకు తెలుసు. అందుకే వెళ్ళింది ఇందిర సాయంత్రం అయింది అనిపించగానే!
    వెంకటేశ్వర్లు ఇందిర రాకను గమనించి కూడా ఊరుకున్నాడు-- అతనిలో అనేకమైన ఆలోచనలు ఉదయం నుండి చెలరేగు తున్నాయి.
    వీళ్ళ ఈ సరాగాలు ఎన్నాళ్ళ నుండి సాగుతున్నాయి?
    --తెలీదు.
    వీళ్ళ ఈ సరాగాలకు గమ్యం ఏమిటో, పర్యవసానం ఏమిటో వీళ్ళు గుర్తించినట్లు లేదు. ఈ విషయం చెప్పటం ఎలా?
    --తెలీదు.
    'నమస్కారమండీ --'
    ఎందుకో ఇందిర రాగానే వెంకటేశ్వర్లు మనసు ఆనందంతో గంతులు వేస్తుంది. అంతవరకూ ఉన్న ఆలోచనలు అన్నీ క్షణం లో అంతు తెలీకుండా మాయమవుతాయి.
    'రా-- అమ్మా-- రా--'
    'బాబ్జీ ...'
    'ఉన్నాడు , వెళ్ళు లోపలికి ...'
    ఇందిర ;లోపలికి వెళ్ళిపోయింది.
    అతన్ని మళ్ళీ ఆలోచనలు ముసురుకున్నాయి. వీళ్ళిద్దరి మధ్య ఈ అనురాగ బంధం , ఈ ఆప్యాయతలు, ఈ ఆత్మీయతలు ...ప్చ్, ఎలా చెప్పాలి?
    'నాన్నా-- మేమలా , గుడి దాకా వెళ్ళొస్తాము-'
    మౌనంగా తల ఊపాడు వెంకటేశ్వర్లు .
    ఇద్దరూ కదిలారు.
    'చీకటి పడకుండా రండి-' వెంకటేశ్వర్లు కష్టం మీద అన్నాడు.
    'అలాగేనండి...' అంది ఇందిర వెనుదిరిగి చూస్తూ.
    ఆ ముఖంలో ప్రసన్నత, ఆ ముఖంలో ఆనందం...ఈ అమ్మాయి రాబోయే ప్రమాదాన్ని గమనించినట్లు లేదు.అసలు ప్రమాదమన్నది ఉంది అని కూడా గుర్తించి నట్లు లేదు...దీర్ఘంగా నిట్టూర్చాడు వెంకటేశ్వర్లు.
    వీళ్ళ ప్రపంచం వేరు -- వీళ్ళ ఆశయాలు --వాటిని ఆశయాలు అనవచ్చో, అనకూడదో గానీ, వీళ్ళ ఆశయాలు వేరు, వీళ్ళ ఆదర్శం వేరు.'
    వీళ్ళ ప్రపంచం ఒక రంగుల కల.
    వీళ్ళ ఆశయం కలలు కనటం!
    వీళ్ల ఆదర్శం నవ్వుకోవటం -- నవ్వు కుంటూ కాలం గడపటం!!
    అంతే!-
    పకపక నవ్వింది ఇందిర.
    'నిజం చెప్పద్దూ బాబ్జీ, నాకే ఆశ్చర్యం వేసిందనుకో!'
    ఈసారి రాంబాబు నవ్వాడు. 'పెద్ద అంత ధైర్యం నాకేక్కడిదో నాకే తెలీలేదనుకో! కానీ ఒకటి నిజం....'
    తన విశాల నేత్రాలను మరింత విశాలం చేసింది ఇందిర    
    'చెప్పు, ఆ నిజం ఏమిటో...'
    'ఏమన్నా అంటావని!'
    నవ్వాపుకుంటూ అంది ఇందిర - భయపడే కాబోలు, పొద్దున్న...' ఇంక మాట్లాడ లేకపోయింది సిగ్గుతో.
    'ఊ....అదే చెబుతున్నా! ప్రొద్దున్న ఎందుకలా అయిదంటే...'
    'ఎందుకు?'
    'ఇందూ, నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా?'
    ఇందిర ఆశ్చర్య పోయింది -- ఎన్నడూ బాబ్జీ 'ఇందూ ' అని పిలవలేదు. నిజానికి 'ఇందిర' అన్నంత అందం 'ఇందూ' లో లేదు.
    కానీ 'ఇందూ' లో ఉన్నంత ఆత్మీయత ఇందిరలో లేదు మరి!
    ఆ పిలుపు మరి ఆప్యాయంగా ఉంది. మరోసారి వినాలనే కోరిక ఆమెకు తెలీకనే జనించింది ఆమెలో. పైగా ఆ రెండో వాక్యం ....
    సిగ్గు పడింది ఇందిర. ఆ ప్రశంశ కు.
    అంతే!
    ఆడది బుట్టలో ఎప్పుడూ పొగడ్త వల్లే పడుతుంది . నిజం!!
    'నువ్వెంత అందంగా ఉన్నావో...' ఇంత కన్నా ఏ ఆడది ఏ వాక్యమూ వినాలని కోరుకోదు. ఆడదానికి బహుశా లక్ష్యం ఈ వాక్యమే ఏమో!
    ఆ వాక్యం వినలేదనుకున్నాడేమో , రాం బాబు మళ్ళీ అన్నాడు. 'నిజం ఇందూ! నువ్వెంత అందంగా కనిపించావో -- అయమ్ సారీ-- నిగ్రహించుకోలేకపోయాను-'
    ఇందిర సిగ్గుతో సతమతమవుతుంది. ఏమనాలో తెలీలేదు ఇందిరకు. మౌనంగా ఊరుకుంది. ఆ మౌనాన్ని ఇంకో విధంగా అర్ధం చేసుకున్నాడు రాంబాబు. తను చేసిన పనికి కోపగించు కుంతుందేమోననే అనుమానం అతనిలో ప్రవేశించింది.
    'సారీ ఇందిరా. నిన్ను గాయపర్చానేమో ఇందిరా -- నా ఊహ అది కానే కాదు...'
    'ఫర్వాలేదు' అందామనుకున్నా అనలేక పోయింది ఎందుకో.'
    'కోపం వచ్చిందా? ప్లీజ్...'
    ఇక ఊరుకోలేక పోయింది ఇండిర 'చాలు నాయనా -- అపుడే మర్చిపోయా దాన్ని నేను! ఇక సాగాతీయకు!'
    నిజంగా ఇందిర అబద్దం ఆడింది -- ఆ విషయం అప్పుడే మరిచి పోయానంది గానీ, నిజానికి మర్చిపోలేదు. ఆ అనుభూతి జీవితాంతం మర్చిపోలేదు . ఇటీజ్ ఏ స్వీట్ స్వీట్ కిస్!!
    రాంబాబు అడిగాడు ఇంకా అనుమానం గానే -- 'కోపం రాలేదు గదా?'
    'ఉహూ...' తల ఊపింది ఇందిర.
    'గుడికి రావేమోననుకున్నా సుమా! .. పోన్లే గానీ ఒకటి చెప్పు -- నీకు నేనంటే ఇష్టమే గదూ?'
    ఆశ్చర్యపోయింది ఇందిర.
    ఏమిటలా అడిగాడు?'
    --అందులోనూ ఇంత హటాత్తుగా!
    చిరునవ్వు నవ్వింది ఇందిర జవాబెమీ ఇవ్వాలో తెలీక.
    'థాంక్స్ ఇందూ -- ఆయామ్ ఏ లక్కీ ఫెలో -- భలే భయపడే వాణ్ణి ఏం వినాలో నని!'
    ఇందిర మౌనంగా వింటోంది. అతని మాటలు. అతని మాటలు ఆమెలో తీవ్ర సంచలనం లేపాయి.
    ఏమిటి ఈ బాబ్జీ ?
    ఇంత హటాత్తుగా ఇలా అడిగాడు!
    ఇందుకేనా రమ్మన్నది?
    ఏమో!!
    --గుడి చేరుకున్నారు ఇద్దరూ.
    మెట్లు ఎక్కుతుంటే , హటాత్తుగా చేయి పట్టుకుని ఆపాడు -- రాంబాబు ఇందిరను.
    'ఏం?'
    'కుడికాలు ముందు పెట్టు-- నవ్వుతూ అన్నాడు రాంబాబు.
    'యూ సిల్లీ ఫెలో -- ' అందే గానీ కుడికాలు ముందు పెట్టింది ఇందిర.
    దేముడికి దణ్ణం పెట్టారు.
    'ఏమడిగావు?'
    'నువ్వో?' ఇందిర అంది కవింపుగా .
    'చెప్పనా?'
    'చెప్పు,' కళ్ళు రెపరెప లాడిస్తూ అంది ఇందిర.
    'నిన్ను, -- నీ చేయి నాదే కావాలని కోరుకున్నాను--'
    ఇందిర హృదయం ఆనందంతో ఎగిసెగిసి పడింది!
    నిజమే -- ప్రేమించటం కన్న ప్రేమించబడటం ఎంత గొప్ప!
    'నువ్వు ఏమడిగావుఇందూ?'
    'ఊ- ఏమీ అడగలేదు--'
    'ఏం?'
    'కోరిక తీరిపోయాక ఇంక ఏం అడగాలి?'
    'థాంక్స్ ఇందూ - 'ఇందిర చేయి అందుకొన్నాడు ఆనందంతో . ఇందిరేమీ అనలేదు. తీర్ధ ప్రసాదాలు అందుకోన్నవి ఆరగించారు.
    'కాసేపు కూచుని పోవాలి - తెలుసా ?' అన్నాడు రాంబాబు.
    'అలాగె- పద--'
    వేపచెట్టు వెనకకు చేరారు.
    వీళ్ళు వేపచెట్టు వెనకకు చేరడం చూశాడు రామచంద్రయ్య. పిలవాలో, పిలవకూడదో అర్ధం కాలేదతనికి. మౌనంగా దేవునికి దణ్ణం పెట్టుకొని వెనుదిరిగాడు రామచంద్రయ్య.వీళ్ళనింకా వదల కూడదు, వీళ్ళకి స్వేచ్చ పనికి రాదను కుంటూ.
    కానీ --
    రామచంద్రయ్య కేం తెలుసు -- వీళ్ళే పరిస్థితిలో దేవాలయం చేరారో?
     అలాగే వీళ్ళకేం తెలుసు -- తమను రామచంద్రయ్య గమనించి వెళ్ళాడని?
    నిజానికి --
    వాళ్ళు ఆరోజు ఎవరినీ గమనించే స్థితిలో లేరు.
    అందుకే --
    అందుకే ఆరోజు ఆ గుడి వాళ్ళిద్దరి కి స్వర్గం ప్రసాదించింది, ఆ చీకట్లోనే.'
    
                                *    *    *    *
    ఇందిరకు ఆరోజు ఎంత ఆనందంగా గడిచిందో, రాంబాబుకు అంత ఆనందంగానే గడిచింది కానీ, ఇందిరకు ఆ ఆనందం మర్నాడుదయానికి కూడా మిగిలి ఉంది. రాంబాబు కు మాత్రం ఆ ఆనందం అంతా తెల్లవార కుండానే మాయమయిపోయింది.
    గుడిలో ఇందిర చూపించిన స్వర్గ సౌఖ్యాలను మనసులో నెమరు వేసుకుంటూ ఇంటికి వచ్చాడు రాంబాబు. అప్పటికి పొద్దుపోయి కనీసం గంటయినా అయి ఉండాలి- ఎందుకంటె అతనిల్లు చేరేసరికి గోడ గడియారం తంగున ఒకటి కొట్టింది. అంటే, ఏడున్నర అయిందన్న మాట!
    అంతవరకూ గుర్తు లేనిది ఆ క్షణం లో ఉన్నట్లుండి గుర్తొచ్చింది రాంబాబు కు-- వెడుతున్నప్పుడు తండ్రి తొందరగా రమ్మని హెచ్చరించడం ! తొందరగా ఎందుకో రాలేక పోయారిద్దరూ-- ఇంటికి రాగానే అది గుర్తుకు రావటం తోనే మనసు వికలమయి పోయింది. తండ్రి బహుశా ఊహించగలిగాడేమో -- ఇలాంటిదేదో జరుగుతుందని -- అందుకే ఎన్నడూ లేనిది ఈవేళ హెచ్చరించాడు !
    కానీ--
    అలా జరగకుండా ఉండాల్సింది! ఇన్నాళ్ళూ ఎంతగానో కాపాడుకొస్తున్న నిగ్రహం అంతా ఏమయిందో ఏమో -- క్షణాల మీద అంతా జరిగిపోయింది!
    మళ్ళీ రేపు--
    రేపు ఇందిర నెలా చూడాలి? ఎలా చూడగలడు?
    అతని మనసంతా వికలమాయి పోయింది.
    ఇందిరను, ఇందిర ప్రవర్తనను గుర్తు తెచ్చుకుంటే అతనికి ఇందిర ఇదేమీ పట్టించుకున్నట్లు లేదు. ఎందుకంటె 'రేపు రా ఇందూ-- ' అంటే 'అలాగే' అంది. కానీ రేపటి లోగా ఎన్నయినా జరగచ్చు మరి! - రాత్రి అంతా ఆలోచనలతో సతమతమయి, ఆ ఆలోచనల వల్ల అనేకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఆ నిర్ణయాలు తనకు వ్యతిరేక మయితే ....'    
    అ నరకాన్ని మనసులో కూడా ఊహించు కోలేకపోయాడు రాంబాబు. అందుకే మనసులోంచి రేపు అనే దాన్ని అతి కష్టం మీద చేరుపుకున్నాడు.
    తన గదిలోకి బట్టలు మార్చే యత్నం చేయబోతూ , ఎవరో వచ్చినట్లు అలికిడైతే వెనుదిరిగి చూశాడు. తండ్రి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS