కొక్కిలిగడ్డ ధనలక్ష్మి మూలపాలెం గ్రామము
వయస్సు: 25 సం||లు

మాది ఒంటి నిట్టాడి చుట్టిల్లు. నేనూ నా భర్త, ఇద్దరు ఆడ పిల్లలు. మేమంతా మా యింట్లోనే వున్నాము. శనివారం తెల్లవారిన కాడినుంచి గాలి యెక్కువయింది. విపరీతంగా వాన కురుస్తోంది. పిల్లలు మమ్ము కావిలించుకొని యేడుస్తున్నారు. క్రిందటి రాత్రి వండుకున్న అన్నం వుంటే గంజి పోసుకొని, తలా కాస్తా తిన్నాము. గాలి ఎక్కువయింది. మా యిల్లంతా ఉదయం 10 గంటలకే యెగిరిపోయింది. మేమంతా తడిసిపోయాము. మాకు దగ్గరలో వున్న కోలా యశోదమ్మగారి యింటికి జేరుకొన్నాము. ఆ యిల్లు మట్టి యిల్లయినా చాలా గట్టిగా వుంది. ఇంటిపైన వలలతోను, మోకులతోను, కప్పారు, మేమంతా యింటిలోనే వున్నాము.
మగవాళ్ళు కొంతమంది తలుపుల్ని అదిమి పట్టుకున్నారు. బయట గాలి హోరుమని వీస్తోంది. ఇంటి కట్టలు పెళపేళమంటున్నవి షుమారు సాయంత్రం 3 1/2 లేక 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా యింటిలోకి నీళ్ళు వచ్చాయి. చూస్తుండగానే బొడ్డు లోతు వచ్చింది. మేము నలుగురము కలిసి యింటిగోడ యెక్కి, పై పెండెలు పట్టుకొని కూర్చున్నాము, నీళ్ళు పెరుగుతూ మాదాకా వచ్చేశాయి ఒకే దఫా గోడంతా యిరిగి పడిపోయింది. మేమంతా నీళ్ళలో పడిపోయాము. మా మీదుగా ఆ యిల్లు కొట్టుకపోయింది నాకు యీతవచ్చు. నీళ్ళపైకి తేలియాడుతున్నాము. నీళ్ళలో మునకలు వేస్తూ నా కూతురు కనిపించింది. ఒకచేత్తో యీదుచు ఆ పిల్లను పట్టుకొన్నాను. వాగయెత్తి మమ్ము ఒక లైను తుమ్మచెట్టు మీద పారేసింది. మేము దాన్ని పట్టుకొని దాని మీదే వున్నాము.
గాలికి చెట్టంతా వూగుతోంది. వాగవచ్చే వైపుకు చూడలేక పోతున్నాము. నా భర్త నా రెండవ కూతుర్ని తీసుకొని యీదుకొంటూ వచ్చాడు, మేమున్న చెట్టు యెక్కాడు. తుమ్మమందలు వల్లంతా చీల్చేస్తున్నాయి. క్రమేపి వాగలు యెక్కువగుతున్నాయి మాకు నీళ్ళు పుక్కిలింతలగుతున్నాయి. చెట్టు మీద నిలబడలేక పోతున్నాము. వాగవచ్చి మమ్ము క్రిందకు పడదోసింది. క్రింద పడంగానే వాగ మమ్మల్ని నెట్టివేసింది. మేమొక చెర్లో పడిపోయాము. పెద్దపిల్ల నావద్దనే వున్నది. చిన్నపిల్ల నా భర్తవద్ద వుంది. కాని ఎవరిత్రోవ వాళ్ళదయింది.
నేను పిల్లను తీసుకొని ఈదుకొంటూ పోతున్నాను. నా చీర ఒక ముళ్ళ చెట్టుకు పట్టుకుంది. వాగా ముందుకు నెట్టుతుంది. చీర వెనక్కు లాగుతుంది. నీళ్ళలో మునిగిపోయాను. పిల్ల చేయి జారిపోయింది. నేను మునిగి నా చీర కట్టు ముడిని విప్పేశాను. చీరంతా వూడిపోయింది, నీళ్ళలో పైకి తేలాను. దూరంగా పిల్ల కొట్టుక పోతోంది. అమ్మా నేను చచ్చిపోతున్నాను అని కేక వేస్తోంది. వాగాలు పిల్లను మునగ దీసివేస్తున్నవి. నా గుండెలు బ్రద్దలగుతున్నాయి పాపిష్టి దాన్ని యింతసేపు బ్రతికించి యిప్పుడు నీటిపాలు చేస్తున్నాను. నాకు బ్రతుకుతాననే ఆశలేదు. గుండెలు బాదుకోవాలనిపిస్తోంది. కాని చేతులు, కాళ్ళు తేలిపోతున్నాయి. వాగాలు చెంపలు వాయకొడుతున్నాయి. ముందుకు కొట్టుకపోతున్నాను, వాగాలు ముంచి లేవదీస్తున్నవి. వరికుప్పలు, యిండ్లు, తెప్పలుగా కొట్టుకుపోతున్నాయి. నేనూ కొట్టుకపోతున్నాను.
నా పిల్లలు వాగల్లో కొట్టుకుపోయారు. నా భర్త కొట్టుకుపోయాడు. నేను మాత్రం ఎందుకు బ్రతకటం? చచ్చిపోదామనిపించింది. ఇంతలో నాకు దగ్గర నుంచి ఒక యిల్లు కొట్టుకపోతోంది. దానిమీద మనుషులు కూర్చున్నారు నన్ను పైకి లాక్కొన్నారు, దానిమీద ఇద్దరు మగవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్ళు వున్నారు. నాకు ఒంటిమీద బట్టలు లేవు. మునగ దీసుకొని దానిమీద కూర్చున్నాను. నా వంక చూసి జాలివేసి పానమాల లక్ష్మీపతి తన నడుమునకు కట్టుకున్న తుండును తీసి నాకిచ్చాడు. నేను దాన్ని మొలకు చుట్టుకున్నాను, అతని తండ్రి, భార్య, తల్లి, దాని మీదనే వున్నారు, ఇల్లు కొట్టుకుపోతోంది. ఎంతదూరం పోయామో తెలియదు. ఒక చెట్టు అడ్డు వచ్చింది. మా యింటిని ఆ చెట్టుకేసి కొట్టింది. ఇల్లు రెండు చెక్కలయింది. ఒక దానిమీద, నేను, లక్ష్మీపతి భార్యవున్నాము. మిగిలిన దానిమీద, లక్ష్మీపతి, అతని తండ్రి తల్లి వున్నారు. వాళ్ళొకవైపు మేమొకవైపు కొట్టుకపోతున్నాము.
సముద్రాన లేచిన వాగల్లా పెద్ద యెత్తున వస్తున్నవి. ఒక్కొక్కసారి వాగాలు మా మీదుగ పోతున్నవి. లక్ష్మీపతి వాళ్ళ తెప్పమీద అతనొక్కడే కనబడుతున్నాడు, తల్లీ, తండ్రి నీళ్ళలో కొట్టుకపోయి వుంటారనుకుంటాను. ఇది చూసి వాళ్ళ కోడలు గోడు గోడున యేడుస్తోంది, నా దుఃఖాన్ని నేను దిగమ్రింగి ఆమెను వోదార్చాను. తెప్పముందుకుపోతోంది మేము యెక్కడ యేమవుతామో తెలియదు చూస్తుండగానే మా తెప్ప కూడా విడిపోయింది లక్ష్మీపతి భార్య నీళ్ళలో పడిపోయింది. ఆమె చీర చెంగు పట్టుకొన్నాను వాగా మమ్మల్ని యెత్తికొట్టింది. చీర వూడి వచ్చింది ఆ అమ్మాయి నీళ్ళలో కొట్టుకుపోయింది.
బిక్కుబిక్కుమంటూ! నేనొక్కదాన్నే మిగిలిపోయాను. నేను కొట్టుకపోతున్న తెప్ప ఒక తాటి బొంద మీద పట్టింది. దాని మొవ్వు పట్టుకొని దానిమీదే కూర్చున్నాను, అది చచ్చిపోయిన తాడి యెండిపోయిన మొవ్వు నా దురదృష్టం కొలది ఆ మొవ్వు వూడిపోయింది. నేను క్రింద పడిపోయాను. ఈదే ఓపిక లేదు. వాగలు ముందుకు నెట్టేస్తున్నవి. దొర్లుకొంటూ పోతున్నాను. ఒక వాగ వచ్చింది. ఒక యెత్తాంటి దిబ్బమీద పారేసింది. అక్కడే పడిపోయాను. అన్నీ తాళ్ళే. చీకట్లోవున్నాను, మునగడ తీసుకకూర్చున్నా. వల్లంతా బిగదీసుక పోయింది. చలితో మూలుగుతూ అక్కడే కూర్చున్నా.
గాలి వాన తగ్గింది, ఉప్పెన వెనక్కు మళ్ళింది. నీరంతా పోయింది. పైన చుక్కలు కనబడుతున్నాయి నా చుట్టూ బాతులు అరుస్తున్నవి. దూరాన కోళ్ళు కూస్తున్నవి. తూర్పు తెల్లవారింది. యేదో వింత జంతువు నా వైపు వస్తోంది. నా గుండెలు కొట్టుకుంటున్నవి, దగ్గరకు రానే వచ్చింది. లేచి పారిపోయే వోపిక నాకులేదు. నిలువు గుడ్లు పడిపోయాయి. కళ్ళప్పగించి చూస్తున్నా! దగ్గరకు వచ్చిన కొలది కొంత భయం తగ్గింది. మనిషి ఆకారంగానే వుంది. వంగిపోయిన నడుము చేతిలో ఒక కర్ర వణుకుకొంటూ, గొణుక్కొంటూ వస్తున్నాడు ఎవరో ముసలోడు, యెవరివమ్మా నీవని అడిగాడు, నాది మూలపాలెం అని చెప్పాను అతను నా వద్ద చతికిల పడ్డాడు.
తెల్లవారింది. అతని ఒంటిమీద బట్టలు లేవు. నా ఒంటిమీద బట్టలు లేవు. తెల్లవారుతున్న కొలది నాకు లజ్జ ఎక్కువయింది. తాతా యెక్కడన్నా గుడ్డ దొరుకుతుందేమో చూడమని అడిగాను. తాత వెతికి ఒక గుడ్డచెట్టుకు చుట్టేసుకొని వుంటే దాన్ని తెచ్చియిచ్చాడు. నేను మొలకు చుట్టుకున్నాను. నేను పైకి లేచే ఓపిక లేదు. కొంతసేపటికి నా భర్త వచ్చాడు. పిల్ల వున్నదా అని అడిగాను. బావురుమని యేడ్చాడు. నేనూ యేడ్చాను. చేయి పట్టుకు పైకి లేపాడు. యింటికి వెళదామన్నాను. ఇంకెక్కడి యిల్లు మన వూరంతా వల్ల కాడయిపోయింది. మనవూళ్ళో ఒక యిల్లు కూడా లేదు నేనొక చెట్టుపైన ఎక్కి బ్రతికాను. మన వూళ్ళో మొత్తం నూట ఏబదిమంది దాకా పోయారు. మనం నాగయలంక పోదామన్నాడు. మెల్లగా బయలుదేరాము. ఆదివారం సాయంత్రానికి నాగాయలంక జేరుకొన్నాము పిల్లలు పోయారు మేముమాత్రం మోళ్ళులాగా మిగిలిపోయాము.
