Previous Page Next Page 
ట్రిక్ ... ట్రిక్ ... ట్రిక్ పేజి 5


    "ఇప్పటికొకసారి నాయుడిచేత మోసగించబడ్డాను. ఈ జీవితానికది చాలు. మరో మగాడి మోసంవద్దు నాకు...." అన్నది శకుంతల.
    చౌదరి తల పంకించి- "మాటిమాటికీ మగాడని నాగురించి అనడం నాకు నచ్చలేదు నేను నీ తండ్రిని. ఏ తండ్రీ కన్న కూతుర్ని ఆడదానిగా చూడాలనీ, ఆడదానిగా ఉపయోగించుకోవాలనీ అనుకోడు. సకల మర్యాదలతోనూ నీకు నేనాశ్రయమిస్తాను...." అన్నాడు.
    ఏమనుకున్నదో శకుంతల చౌదరితో నడిచింది.
    
                                            2
    
    అర్దరాత్రి వేళ ఎవరో తలుపు తడితే వెళ్ళి తలుపు తీసింది శాంతమ్మ. ఓ అపరిచితుడు త్వరగా లోనికి వచ్చి తనే తలుపులువేశాడు.
    "ఎవర్నువ్వు?" అన్నది శాంతమ్మ.
    "నేనెవరో నీకు అవసరం- ఈ రాత్రికిక్కడ తలదాచుకుంటాను. ఉదయమే వెళ్ళిపోతాను...... ఓ రాత్రివేళ ఇంటికెవరైనా వచ్చి ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా అనడిగితే-లేరని చెప్పాలి....."
    "ఏమిటిదంతా?" అన్నది శాంతమ్మ కంగారుగా.
    అపరిచితుడు తమాషాగా నవ్వాడు. ఆ నవ్వు వింటూనే శాంతమ్మ కలవరంగా- "నువ్వు.....నువ్వు.....నాయుడివి కదూ-" అన్నది.
    అతడు ఆశ్చర్యంగా- "ఏమన్నావ్?" అన్నాడు.
    "నాకు తెలుసు......నీ నవ్వు నా కెప్పుడూ గుర్తుంటుంది. సుమారు నాలుగు సంవత్సరాల క్రితం నా భర్తను చంపేటప్పుడు ఇలాగే నవ్వావు- ఆ నవ్వు నాగుండెల్లో ఎప్పుడూ ప్రతిధ్వనినిస్తూంటుంది. ఆ నవ్వుఎప్పుడు.....ఎక్కడ విన్నా నేను గుర్తు పట్టగలను...." అన్నది శాంతమ్మ.
    అతడు కంగారుగా ఆమె వంకచూసి- "నీజ్ఞాపకశక్తి ప్రమాదకరమైనది...." అన్నాడు.
    "ఎందుకొచ్చావిక్కడికి?" అన్నదామె. ఆమె గొంతులో భయం కంటే కోపమే ఎక్కువగా ధ్వనిస్తున్నది.
    "నేను వచ్చింది ఒకందుకు. అది మరొకందుకు లాభిస్తున్నది. దీన్నే అదృష్టమని అంటారు...." అన్నాడతడు.
    "వెంటనే ఇక్కన్నుంచి వెళ్ళిపో-లేకుంటే నేను అరిచి నలుగుర్నీ పిలుస్తాను...." అన్నది శాంతమ్మ.
    "నన్ను వెళ్ళిపొమ్మంటున్నావు. నీకు నీభర్త వద్దకు వెళ్ళాలని లేదూ?" అన్నాడు నాయుడు జాలిగా ఆమెవంకచూస్తూ.
    "అంటే?"
    "నానవ్వు విని ఎక్కడున్నా గుర్తించగల నువ్వు చివ్వుననాకు ప్రమాదం నీ జ్ఞాపకశక్తి నీకు ప్రమాదం. నా ప్రమాదాన్ని నేను తొలగించుకో గలను...." అంటూ అతడామెను సమీపించి నోరునొక్కాడు.
    మరుక్షణంలో కత్తి ఆమెగుండెల్లో దిగబడి రక్తం చిమ్మింది. శాంతమ్మ అరవలేక నేలకూలింది. ఆక్షణంలోనే ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
    నాయుడామె నాడి పరీక్షించి-"చచ్చింది-" అనుకున్నాడు.
    
                                     *    *    *    *
    
    తల్లి హత్యకాబడుతున్నప్పుడు పక్కగదిలో గోపీ వున్నాడు. అతడామెకు ఒక్కగానొక్కకొడుకు. బియ్యే ప్యాసై ఆర్నెల్లయింది.
    గోపీ నెమ్మదస్థుడు. పిరికివాడు. పేదరికానికి పూర్తిగా తలవంచిన వాడు. దేనికీ ఎవర్నీ ఎదిరించాలనుకోడు.
    సుమారు నాలుగు సంవత్సరాల క్రితం అతడి తండ్రిహత్యచేయబడ్డాడు. గోపీతండ్రి చిన్న కిరాణావ్యాపారస్థుడు. నాయుడతడిని స్మగ్లింగ్ కు ఉపయోగించుకోవాలనుకున్నాడు. దేశభక్తి పరుడైన గోపీతండ్రి అందుకంగీకరించలేదు. ఏమైందో గోపీకి సరిగ్గా తెలియదు. ఒకరాత్రివేళ అతడు హత్యచేయబడ్డాడు. హత్య తల్లిచూసింది. వివరాలు క్లుప్తంగా గోపీకి చెప్పింది.
    గోపీకి తండ్రి ఎప్పుడూ ఒకేవిషయం చెప్పాడు-"ఎంతో కాలం భారతదేశం విదేశీపాలనలో మగ్గిపోయింది. ఎందరో దేశభక్తుల కృషి ఫలితంగా యావద్భారతమూ ఒక్కటై స్వతంత్రం లభించింది. ఈ స్వతంత్రాన్ని నిలబెట్టుకునేందుకు ప్రతిపౌరుడూ కృషిచేయాలి. దేశాన్ని ప్రేమించాలి. చట్టాన్ని గౌరవించాలి. నీతికి ప్రాధాన్యతనివ్వాలి. అవినీతిని ద్వేషించాలి-"
    ఈమాటలు గోపీకి బాగా వంటబట్టాయి. అయితే తండ్రిపోవడానికి కారణం దేశభక్తి అని తల్లి చెప్పినప్పుడు అతడు వణికిపోయి- "అమ్మా! నేనిప్పుడేంచెయ్యాలి?" అని అడిగాడు.
    దేశభక్తి వల్ల ప్రాణాలుపోయే అవకాశముంది. దేశభక్తిని విడనాడితే తండ్రి ఆత్మకు శాంతి ఉండదు.
    "ఎప్పుడూ ఎవర్నీ దేనికి ఎదిరించకు. సామాన్యుడిలా బ్రతుకు. గుర్తింపుకోసం ప్రయత్నించకు. అప్పుడు నీ దేశభక్తి నీ ప్రాణాలు తీయదు...." అన్నది తల్లి.
    అందువల్ల గోపీ చాలా మందకొడిగా ఉంటూవచ్చాడు.
    ఆరోజు తల్లి హత్యచేయబడుతూంటే అతడు నిస్సహాయంగా చూస్తూండిపోయాడు తప్పితే ఆమెను రక్షించాలనుకోలేదు. రక్షించగలనన్న ధైర్యమూ అతడికిలేదు. హంతకుడు కత్తినెత్తితే అతడికి ఏడుపువచ్చింది తప్పితే ఆవేశం రాలేదు.
    హత్యజరిగేక-హంతకుడు గోపీఉన్న గదిలోనికేవచ్చాడు. అప్పుడు గోపీచాటుగా దాక్కున్నాడు. అతడెంతసేపూ హంతకుడి కళ్ళపడకుండా ఉండడం కోసమే ప్రయత్నించాడు తప్పితే-ప్రతీకారం గురించి ఆలోచించలేదు.
    భయం.....నరనరాలా భయం.....అదే గోపీని ఆవహించివున్నది.
    హంతకుడా యింట్లో నాలుగుగంటలున్నాడు. ఆ నాలుగు గంటలూ ముళ్ళమీద ఉన్నట్లే ఉన్నాడు గోపీ. గోపీ మసలిన తీరుచూస్తే ఆ యిల్లు హంతకుడిదనీ-అక్కడకు గోపీ దొంగతనంగా ప్రవేశించాడనీ అనిపిస్తుంది.
    హంతకుడు వెళ్ళిపోయాక గోపీ తేలికగా వూపిరి పీల్చుకున్నాడు. అప్పుడతడు నెమ్మదిగా తల్లి శవంవద్దకు వెళ్ళాడు. నిర్జీవంగా పడివున్న తల్లిశవాన్ని చూడగానే అతడిలో దుఃఖం కట్టలు తెంచుకుని పొంగింది.
    భోరున ఏడ్చాడతడు.
    
                                       *    *    *    *
    
    "అడుగో-హీరో వస్తున్నాడు...." అన్నాడొకడు.
    "వస్తున్నాడేమిటి-వచ్చేశాడు...." అన్నాడింకొకడు.
    అప్పటికి గోపీ వాళ్ళని సమీపించి ఏదో అడగాలనుకుని ఆగిపోయాడు.
    "హీరోగారికి మాతో ఏంపనో?" అన్నాడింకోయువకుడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS