Previous Page Next Page 
అర్ధ మానవుడు పేజి 5


    వింటున్న శ్రోతలందరూ విభ్రాంతులైనారు. అటువంటి ప్రాణి గురించి తామెన్నడూ కని విని ఎరుగరు. అసలు ఆ ప్రాణి గురించి ఊహించేందుకయినా వీలుకాకుండా ఉంది. ఎవరికివారే ఆలోచనా నిమగ్నులయిపోయారు.
    వారి మనఃపుటలాల మీద ఒక పెద్ద ప్రశ్నార్ధకం విశ్వ రూపం ధరించింది.
    చాలసేపటి ఆలోచన తరువాత "అయితే యిప్పుడు మన కర్తవ్యం ఏమిటి." అని అడిగాడు గోయెల్.
    "నేనింక ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేను. తెల్లవారడం తరువాయి తిరుగుముఖం పట్టిపోతాను. బ్రతికి ఉంటే బండలు మోసి అయినా బ్రతకవచ్చు." అన్నాడు సిన్హా ఊహించటానికి కూడా వీలు కాని ఆ ప్రాణి గురించి విన్న తరువాత అందరికీ అలానే అన్పిస్తోంది.
    కొద్ది పాటి చర్చ తరువాత ప్రస్తుతానికి వెనుదిరిగి పోవటమే మేలని అందరూ తీర్మానించారు. అయితే ఫిజో అందుకు అంగీకరించలేదు. "సోదరులారా! మీతో తిరిగి వచ్చేందుకు నాకు మనస్కరించటంలేదు. అత్యంత సాహసికురాలయిన మన నాయకురాలి గురించి అన్వేషణ కొనసాగించటం నా కర్తవ్యం అనుకుంటున్నాను. నాకోసం మీరెవరూ బాధ పడనక్కరలేదు. మీరంతా తిరిగి వెళ్లిపోండి, మీకు అవసరమైన ఆహరం మీరు ఉంచుకొని మిగిలినది వదిలేయండి. ఈ టెంట్ లోనే ఉండి నా అన్వేషణా కార్యక్రమం కొనసాగిస్తాను.
    నేను ఆరాధించే ఆదర్శ నాయకురాలిపట్ల ఇలా చేయటం నా కర్తవ్యం. ఆమెకోసం అన్వేషణ కొనసాగించేందుకు అవసరమైతే ప్రాణాలు అయినా పణంగా ఒడ్డుతాను. ఇది నా ప్రతిజ్ఞ. మీరంతా నిద్రకుపక్రమించండి. రేపటి సుప్రభాతాన మీ నిర్ణయం ప్రకారం తిరిగి వెళ్ళిపొండి" అన్నాడతను.
    అందరూ నిద్రకు ఉపక్రమించారు.
    ఫిజో మాత్రం తన ప్రియతమ నాయకురాలయిన మాలతి కోసం ఆలోచించ సాగాడు. ఆమె అన్వేషణలో తాను రచించవలసిన పధకాల గురించి ఆలోచిస్తూ ఉండిపోయినాడు, ఆ రాత్రి అతడికి నిర్ణిద్రంగా గడచి పోతోంది.
    
                     ౦    ౦    ౦
    
    అగాధ మయిన లోయలోకి అవలీలగా దిగిపోతోంది ఆప్రాణి. కాళ్ళకు తగిలి చెదిరిపోతున్న చిన్న చిన్న రాళ్ళు శబ్దం చేసుకుంటూ లోయలోకి దొర్లి పోతున్నాయి. ఆ ప్రాంతాలలో ఉన్నచలికి ఆ ప్రాణి రవంత అయినా చలించటంలేదు.
    ఆశీతల పవనాలకు మాలతి శరీరమంతా మొద్దుబారినట్లుగా అయిపోయింది. రక్తం గడ్డకడుతున్నట్లు అనిపిస్తోంది. రెండు కాళ్ళ మీద నడుస్తున్న ఆ ప్రాణి భుజాల మీద మాలతి నడుము ఊగిస లాడుతోంది. కాళ్ళు ముందుకు వ్రేలాడు తున్నాయి. తన వెన్ను మీద వ్రేలాడుతోంది. ఆమెను జారి పడిపోకుండా రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది ఆ ప్రాణి.
    చేతులకున్న పొడవు పాటి గోళ్ళు వెన్నులో గ్రుచ్చుకుంటున్నాయి.
    మాలతి తాను ఎన్నడూ కని విని ఎరుగని అపూర్వ మయిన అ జంతువు గురించి పరిపరి విధాల ఆలోచిస్తోంది. చేతికున్న ఎలక్ట్రానిక్ వాచ్ లో టైంని చూచిందామె.
    అప్పటికి సమయం సరిగా పన్నెండు గంటలు!
    అంటే రెండున్నర గంటలుగా అలా భుజంమీద తాను వ్రేలాడతోందన్నమాట: ఇంతసేపు తనకు ఎటువంటి అపకారం చేయలేదంటే అది క్రూరజంతువుకాదు అని ఆమెకు అర్ధమయింది అది అసలు జంతువా? మనిషా?
    
                                            3
    
    ఆమె తల వెన్ను ప్రక్కకు వాలి ఉండటం నించి ఆ ఆకారం తాలూకు విశేషాలను గ్రహించలేక పోయిందామె. అనాచ్చాదితమయిన కొంత వెన్ను భాగం. తొడలూ, పాదాల వెనుక భాగమూ మాత్రమే కన్పిస్తున్నాయి. పిరుదుల మీద చమరీమృగం తాలూకు చర్మం చుట్టబడింది.
    జంతువులేవి చర్మాలను ధరించవు. జంతుదశలో దాదాపు అన్నింటి కన్నా మెదడు అభివృద్ధిచెందిన గొరిల్లా, గిబ్బన్ బురాంగుటాక్ వంటి జంతువులు కూడా శరీరాన్ని దాచుకోవాలని కించిత్తు ప్రయత్నించవు.
    అనాటమీ మేధావుల అంచనాలను అనుసరించి క్రోమాన్వాన్ నియాండర్ వలే మానవుల దశకు చేరుకున్న తరువాతనే ప్రాణులకు తమ శరీరాన్ని దాచుకోవాలన్న ఆలోచన ప్ర్రారంభమవుతుంది. ఆ దశకు లోపుగా ఉన్న జంతువులన్నీ శరీరాన్ని పోషించు కోవాలని మాత్రమే చూస్తాయి. కాని దాచుకోవాలని ప్రయత్నించవు.
    కాని ఈ ప్రాణి చమరీ మృగం తాలూకు చర్మాన్ని నడుముకు ధరించింది. అంటే ఇతడు మనిషే. ప్రిమెటివ్ మాన్!!
    మాలతి అలా అనుకోగానే గుండెలు దడ దడలాడినాయి. ఇటు వంటి ప్రాధమిక తెగ మానవులు నరమాంస భక్షణచేస్తారు. అయితే మిగిలిన క్రూరజంతువుల్లా కన్పించగానే మీదపడిచంపేయరు. మనిషిని ఎత్తుకుపోయి మాంసం ఖండలుగాకోసి నెగడులో కాల్చుకు తింటారు.
    ఇలా అనుకోగానే మాలతికి అంతచలిలోనూ చెమటలు పట్టడం ప్ర్రారంభమయింది. అర్ధంతరంగా బ్రతుకు ఆసాంత మవుతుందనగానే మొట్టమొదట జ్ఞాపకం వచ్చినవాడు తండ్రి ఆ తరువాత ఆశలన్నీ తనమీద పెట్టుకుని మధురమయిన ఆ తరుణం కోసం ఎదురు చూస్తున్న ప్రియుడు.
    ఆమె మనసు కల్లోల సాగరమయింది. తన మీదఆశలు పెంచుకున్న వారందరినీ వొదిలేసి యిలా సాహసోపేత మయిన కార్యక్రమాలలో తల దూర్చిందితాను.
    ఇప్పుడిలా తన బ్రతుకు అర్ధంతరంగా ఆసాంత మవుతోంది-అనుకోగానే ఆమె కన్నులు చమరించినాయి!
    పూర్తిగా లోయలోకి దిగిపోయాక ఒక మహా ముఖానికి ఎదురుగా నిలిచిపోయినాడు ప్రిమిటీవ్ మాన్. మాలతిని భుజంమీదినించి కిందికి దింపాడు. చలి శరీరాన్ని కొంగర్లు త్రిప్పుతోంది. ఎనస్థీషియా యిచ్చినట్లు శరీరమంతా స్పర్శావిహీనంగా అయిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS