తన పేరేమిటని ఎవరైనా అడిగినప్పుడు తను చాలా ఇబ్బంది పడిపోతాడు. ఈ ఇబ్బందివల్లే వెంటనే నోరు పెగలదు. ఇక తప్పదని అక్షరాలను కూడబలుక్కుని చెబుతాడు. ఎదుటివాళ్ళు తన పేరు వినగానే కళ్ళ నొసలను చిట్లించడం ఎన్నోసార్లు గమనించాడు.
"వినయ్ అని నాకు ఎవరు పేరు పెట్టారో తెలుసా? మా ఆంటీ ఆవిడకి ఎంత ముందు చూపుంటే పాతిక సంవత్సరాల క్రితం ఈపేరు పెడుతుంది. ఎన్ని సంవత్సరాలయినా చాలా ఆకర్షణీయంగా వుండే పేరు పెట్టడం ఒక ఆర్టు."
"వినయ్ తన పేరును గురించి ఎంతో సంబరంతో చెబుతుంటాడు."
ఆంజనేయులని తనకు ఈ పేరు ఎవరు పెట్టారు? నాన్న పెట్టాడా? పురోహితుడు పెట్టాడా? అమ్మ మాత్రం కాదు. తను పుడుతూనే అమ్మ చచ్చిపోయింది. తన ప్రతిబింబాన్ని ఈ లోకంలో వదలి అమ్మ మరో లోకానికి వెళ్ళిపోయింది. ఎలా వుండేదో అమ్మ?
అమ్మగుర్తొచ్చేసరికి అతనికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
"ఒక్క బస్సూ రావడంలేదు." సంధ్య విసుక్కుంది.
వచ్చేస్తుంది బస్సు రాగానే వెళ్ళిపోదాం." కళ్ళనీళ్ళు కనపడకుండా తుడుచుకుంటూ చెప్పాడు ఆంజనేయులు.
మళ్ళీ అతను తన ప్రపంచంలోకి.
అమ్మ చచ్చిపోతే తను పిన్ని చేతుల్లో పెరిగాడు. అయితే ఆ చేతుల్లో అభిమానపు వెచ్చదనం లేదు. అనురాగపు చల్లదనం లేదు. నాన్న ఎప్పుడూ దగ్గరికి చేర్చేవాడు కాడు. జీవితంలో తగిలిన దెబ్బలను నిమురుకోడంలోనే ఆయన అలసిపోయేవాడు. తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ అంతే. వాళ్ళకే ప్రేమ దొరకనప్పుడు ఎదుటి వాళ్ళకు ఏం పంచుతారు! తమ మధ్య ఎప్పుడూ ఆత్మీయత లేదు ఉన్నా ఎలా ఎక్స్ ప్రెస్ చేసుకోవాలో తెలీదు. ప్రేమను ప్రకటించుకోవాలంటే కూడా డబ్బు కావాలి.
నిజానికి తనకు చెల్లెళ్ళంటే చాలా యిష్టం కానీ ఏరోజూ వాళ్ళ అవసరాలను తను తీర్చలేక పోయాడు. ఎప్పుడూ వాళ్ళకు బట్టలు తేలేదు. ఆభరణాలు బహుమతిగా ఇవ్వలేదు. మంచి భోజనమూ పెట్టలేదు.
ఇవేమీ చేయకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఎలా నమ్ముతారు? ప్రేమ మానసికమైనదే కావచ్చు కానీ దాన్ని ప్రకటించడానికి భౌతికమైన ఆధారం కావాలి. అది తన దగ్గరలేదు.
అందుకే వాళ్ళకూ తనలాంటి జబ్బే ప్రేమరాహిత్యం ఈజబ్బు వుండడంవల్లే తాముసరిగా పెరగలేకపోయారు. ఎవరూ పొడుగ్గా బలిష్టంగా వుండరు. అదే జీవన్, రాహుల్, వినయ్ ఒకరేమిటి డబ్బున్న పిల్లలందరూ పొడవుగా వుంటారు. బలంగా వుంటారు గ్లామరస్ గా కనిపిస్తారు.
పెద్దయ్యాక కూడా అంతే ఆజబ్బు తమను వదలడంలేదు. ఒక చిన్న ఆత్మీయత స్పర్శకోసం, ఓచిన్న అనురాగపు పలకరింపు కోసం మనసు ఎంతగా వాచిపోయిందో తన ఒక్కడికి తెలుసు.
అదే వినయ్ కు ఎంత మంది స్నేహితురాళ్ళు! ఎన్ని ఉత్తరాలు ఎన్ని ఫోన్ కాల్స్. ఎంతమంది లేడీ విజిటర్స్ లెక్కలేనంత మంది.
ఇప్పుడు వినయ్ ఇటు రాకూడదూ? ఒక్కసారి ఇటొచ్చి తనకూ పక్కన ఓ అమ్మాయి వుండడం చూడకూడదా తనూ ఓ మనిషేనని తనకూ ఓ ఆడ తోడుందని అతను గుర్తిస్తే ఎంత బావుండు. ఒక్క క్షణం సేపు వినయ్ కళ్ళల్లో తనపట్ల ఈర్ష్య లాంటిది కదలడం చూడాలని ఎంతో ఆరాటం మనసులో.
తను కొన్ని వేలసార్లు వినయ్ ను ఈర్ష్యతో చూసాడు. ఎవరైనా అమ్మాయి ఆఫీసుకు వచ్చిందంటే వినయ్ కోసం కాబోలు అనుకుంటారంతా. రోజుకోసారైనా మేనేజర్ వినయ్ సీటు దగ్గరకెళ్ళి "సార్ ఫోన్ ఎవరో లేడీస్" అనంటాడు అప్పుడు వినయ్ లేచి "అబ్బబ్బ! ఈ ఫోన్లతో ఛస్తున్నాను. అభిమానం కూడా అప్పుడప్పుడూ ఇబ్బంది పెడుతుందంటే ఇదేననుకుంటా" అని విసుగుని ప్రదర్శించబోయి విఫలమౌతాడు. గర్వంతో అప్పటికే దూకేసిన నవ్వు ముఖాన్ని విశాలంచేస్తుంది బుగ్గలను సాగదీస్తుంది కళ్ళను మెరిపిస్తుంది.
నిన్ననే వినయ్ ఓ అమ్మాయి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ చెవుల్లో మెదిలింది ఆంజనేయులుకు.
నిన్న పదిన్నరకల్లా వినయ్ కు ఫోన్ వచ్చింది. ఎవరో అమ్మాయి అని గుర్నాధం ఫోన్ అందించాడు. ఇలాంటి సమయాల్లో అందరి చెవులు ఫోన్ చుట్టూ మూగుతాయి. వినయ్ ఎంత చిన్నగా మాట్లాడినా విన్పిస్తుంది.
ఫోన్ సంభాషణ అటూ ఇటూగా ఇలా నడిచింది.
"... ..... ....."
"నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. నీకు ఓ గుడ్ మార్నింగ్ చెప్పేస్తే ఈ రోజు నాకోసమే ఉదయించినట్టు అన్పిస్తుంది."
"..... ....."
"ఏమిటి విశేషాలు కాలేజీకి బయల్దేరావా?"
"..... ......"
"కాలేజీకి వెళ్ళడం లేదా నేను మరోలా వూహించాను కాలేజీకి వెళుతూ ఫోన్ చేస్తున్నావని అనుకున్నాను. నీచుట్టూ పరిభ్రమించే పరిమళాలను ఫోన్ రిసీవ్ చేసుకుని నా మీద గుమ్మరిస్తే ఎంత బావుండో అనుకుంటూ ఫోన్ అందుకున్నాను. కానీ ఇలా కాలేజీకి వెళ్ళకుండా ఇంట్లో వున్నావనుకోలేదు"
"..... ......"
"పరిమళాల సంగతి అటుంచి నువ్వు వేసుకున్న డ్రస్ కలర్ ఏమిటో చెప్పాలా? పూర్వం అయితే మాంత్రికుల దగ్గర దుర్భిణి వుండేది కానీ ఇప్పుడు నాదగ్గర అలాంటిది లేదుగా అయినా చెబుతున్నాను. బ్లాక్ డ్రస్ లా వున్నావు. అచ్చు తారులో ముంచిన మందారపు పువ్వులాగా"
".... ...."
"కరెక్టా! మరేమనుకున్నావ్ వినయ్ అంటే."
"... ...."
"ఎలా చెప్పగలిగానంటే చాలాసింపుల్ నిన్న ఈవినింగ్ మీ ఇంటికొచ్చేసరికి బ్లాక్ శారీలో వున్నావు. 'అవుట్ ఆఫ్ ది డోర్స్' అన్నావు కనుక రోజూ వారి నీ కార్యక్రమం మారి వుంటుంది. కనుక ఈ పాటికి స్నానం చేస్తుండవు. అలా నిద్రలేచి మీ అన్నయ్య కొడుకు డుంబూకు చాక్లెట్ ఆశ చూపించి ఫోన్ నెంబర్ చెప్పి రింగ్ చేయించుంటావు. నువ్వు కిటికీ బయట కూర్చుని ఫోన్ లో మాట్లాడుతున్నావు."
"..... ...."
"నిన్ను చూస్తూనే డ్రస్ సెన్స్ వుందనిపించింది అవుటాఫ్ ది డోర్స్" అన్న విషాదానికి సూచనగా ఆ డ్రస్ వేసుకున్నట్లు అనిపించింది. ఈ మూడు రోజులు మీకు ఇబ్బందేకదా అసలు స్త్రీలకు డిప్రెష్ దీంతోనే మొదలవుతుందని నా అభిప్రాయం మీకు ఇష్టమున్నా లేకపోయినా ఈ మూడురోజులూ మీరు కొన్ని నియమాలు పాటించాలి. దేవాలయాలకు వెళ్ళకూడదు. శుభకార్యాలకు అటెండ్ కాకూడదు. మీరొక్కరే బయటదీనంగా నిస్తేజంగా కూర్చోవాల్సి వస్తుంది. తన యిష్టాయిష్టాలు తనవికావనీ తల్లిదండ్రుల దగ్గర్నుంచి ప్రకృతి వరకు తన మీద పెత్తనం చెలాయిస్తుందని ఆడపిల్ల గ్రహిస్తుంది, దీంతో నిరాశ మొదలవుతుంది.
".... ....."
