సడన్ గా నన్ను అక్కడ చూసి కంగారుగా రికార్డు ఆపేసాడు.
క్రింద కూర్చున్నవాడల్లా అలాగే నావేపు తలెత్తి చూసాడు.
"మధ్యాహ్నం నాకు సాయం చేసినందుకు థాంక్స్" అన్నాను.
అతనేం మాట్లాడలేదు.
"నాతో ఎందుకు మాట్లాడవూ? నా గొంతుమాత్రం పనికొస్తుందా?" ఉక్రోషంగా అడిగాను.
అయినా బదులివ్వలేదు.
"దీపూ....నేను పరాయిదాన్ని కాదు! నువ్వుంటే నాకిష్టం. అలాగే నేనంటే నీకూ అభిమానమేనని నాకు తెలుసు. కానీ నీ మనసులో ఏం వుందో నాకు తెలియడంలేదు" అన్నాను.
"ఏమీ లేదు మీరు పైకి ఎందుకు వచ్చారూ? జాగ్రత్తగా క్రిందికి వెళ్ళండి" అన్నాడు.
"ఊహూ! నువ్వు వదినా అని పిలిచి నాతో మనస్ఫూర్తిగా మాట్లాడ్తానే వెళతాను" కాస్త మొండిగా అన్నాను.
"స్వభావ విరుద్దమయిన పనులు చెయ్యడం మనకి అగ్నిపరీక్ష పెట్టుకోవడమే" అన్నాడు.
"ఆ!" అర్ధంకానట్లు చూసాను.
అతనికేం మాట్లాడాల్సిందేం లేనట్లు ఓపుస్తకం పట్టుకుని చదవసాగాడు.
నేను వెనక్కి తిరిగి రెండు అడుగులేసి ఆగి కావాలనే.... "ఆ....." అని కేకేసాను.
దీపూ కంగారుగా లేచొచ్చాడు.
"అబ్బా...." అన్నాను కడుపు పట్టుకుని.
"ఏవయిందీ?" నా భుజాలు పట్టుకుని అడిగాడు.
"ఏవయింది వదినా? అని అడగవా?" అల్లరిగా నవ్వుతూ అడిగాను.
అతను ఠపీమని వదిలేసాడు. మొహం బాగా ఎర్రబడింది. అతని ముందు నేను చాలా పొట్టిగా వున్నాను. గబగబా వెళ్ళి మంచంమీద పడుకున్నాడు. అనవసరంగా కోపం తెప్పించానేమో అన్పించింది. మెల్లగా మెట్లు దిగుతుండగా అప్పుడొచ్చింది కడుపులోంచి వెన్నులోకి శూలం పోటులాంటి నెప్పి.
"అ....మ్మా" అంటూ క్రింద కూర్చుండిపోయాను.
మళ్ళీ ఇంకో నెప్పి....
"అ....మ్మా.....ఆ..." ఓర్చుకోలేక పెద్దగా కేకలు పెట్టాను.
అలా పెడుతూనే ఉన్నాను.
దీపూ గదిలోంచి బయటకి రాలేదు. అతను ఇదంతా కూడా నటనే అనుకుంటున్నాడులా వుంది!
నాకు ముచ్చెమటలు పోస్తున్నాయి. ఈ మెట్లమీద నుండి పడిపోతానేమో అనిపిస్తోంది. కడుపు పట్టుకుని నెప్పి ఓర్చుకోలేక గిలగిలలాడసాగాను.
వంటావిడ పరిగెత్తుకు వచ్చింది.
"అయ్యో....అయ్యో.....అమ్మగారికి నెప్పులొస్తున్నాయి. చిన్నబాబుగారూ....చిన్నబాబుగారూ.... డాక్టర్ కి ఫోన్ చెయ్యండి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్ళాలి" అని అరుస్తూ వచ్చింది.
నేను భరించలేక ఆవిడ్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నాను.
"మీరు పక్కకి జరగండి" దీపూ గొంతు విన్పించింది.
అతని కళ్ళల్లోకి చూసాను.
చాలా గంభీరంగా కన్పించాడు. ముందుకి ఒంగి నా నడుం క్రింద చెయ్యివేసి ఇంకో చెయ్యి భుజం వెనకనుండి వేసి లేవదీసి మెట్లు దిగాడు. నేను అరుస్తూనే వున్నాను. అతను నన్ను కార్లో ఎక్కించి ఆస్పత్రికి తీసుకెళ్ళాడు.
* * *
పునీత పుట్టింది.
"అచ్చు నీలాగే పుత్తడి బొమ్మలా వుంది హలా! థాంక్యూ....! థాంక్యూ..." రఘు ఆనందంతో తేలిపోతూ నా నుదుటిమీద ముద్దు పెట్టుకుని అన్నాడు. పేరు కూడా అప్పటికప్పుడే డిసైడ్ చేసి రికార్డ్స్ లో వ్రాయించాడు.
నాకూ దీపూ కన్పించలేదు.
నేను డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చేసరికి దీపూ హాస్టల్ కి వెళ్ళిపోయినట్లు తెలిసింది.
అతను ఇంజనీరింగ్ ఫైన్ ల్ కి వచ్చాడు.
నాకు పునీత పుట్టాకా కాలమే తెలియకుండా పోయింది. లాలిపాటలూ, జోలపాటలూ, నేను స్వంతంగా కూర్చి కట్టుకున్న పాటలూ పాడుతూ శృతిబద్దంగా పెంచసాగాను. దాని ఏడుపులో కూడా నాకు ఆరోహణా అవరోహణా విన్పించేవి.
అర్ధరాత్రి రఘుని లేపి - "ఇదిగో....పంచమం....అదిగో షడ్జమం" అంటూ వినిపిస్తే నిద్ర చెడగొట్టినందుకు విసుక్కునేవాడు.
రఘు చాలా బిజీ అయిపోయాడు. ఒక్కోసారి రాత్రిళ్ళు ఎప్పుడొస్తున్నాడో కూడా తెలియడంలేదు. పాప ఏడుపుతో నిద్ర పాడవుతోందని పైన బెడ్ రూంలో పడుకుంటున్నాడు.
దాసుగారు పాపకి గొలుసు చేయించి తెచ్చారు. దాసమ్మగారు అచ్చం మా అమ్మలా వుందని పాపని ముద్దాడింది. సాంబ్రాణి ధూపం, బొట్టూ, చేతికి నల్లపూసలూ.... ఇలా పాప అలంకరణలూ, పాప పనులూ కాలం గడిచిపోతోంది.
దాసుగారు ఒకనాడు నెమ్మదిగా అడిగారు. "సరస్వతీ వరప్రసాదివి తల్లీ నువ్వు! ఇంక పాడటం ఆపేసినట్లేనా? రెడ్డిగారూ వర్మగారూ లాంటి వాళ్ళు చాలా బాధపడుతూ నాతో చెప్పారు."
"ఆయనకి ఇష్టం లేదు నాన్నగారూ!" అన్నాను.
ఆయన దీర్ఘంగా నిట్టూర్చారు. ఆ నిట్టూర్పులో ఎంత బరువుందో నాకు తెలుసు. పన్నెండేళ్ళ అకుంఠిత దీక్షతో ఒక శిల్పాన్ని చెక్కితే ఎవడో వచ్చి రాయితో దాని ముక్కుని చితక్కొట్టినప్పుడు కలిగేటంత బాధ ఆ శబ్దంలో కనిపించింది.
కానీ నేనేం చెయ్యనూ? పాప కావాలా? పాట కావాలా? అంటాడు! నా మొగుడు మొండివాడు.
* * *
పాపకి మూడో ఏడొచ్చింది. దాన్ని స్కూల్లో వేశాకగానీ నాకు తెలియలేదు. నేనేం పోగొట్టుకున్నానో! నేను బయటకి వస్తే నా చుట్టూ గుంపులు గుంపులుగా జనం మూగడంలేదు. "అదిగో ప్లేబాక్ సింగర్ అహల్య..." అంటూ ఆటోగ్రాఫ్ ల కోసం ఎగబడడంలేదు. ఎవరైనా తెలిసినవాళ్ళు పలకరించి "ఈ మధ్యన పాడడం లేదేం?" అని మాత్రం అడుగుతున్నారు.
ఈ మార్పుకి నేను అలవాటుపడి పోయాను. కానీ రఘు ప్రవర్తనకి మాత్రం అస్సలు అలవాటు పడలేకపోతున్నాను. ప్రొద్దుట బయటికి వెళితే అర్ధరాత్రి దాకా రాడు. వచ్చినా నా గదిలోకి వస్తాడన్న నమ్మకం లేదు. ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా అతను నా గదిలోకి రావాలనీ పూర్వంలా కాంక్షగా నా అణువు అణువూ శోధిస్తున్నట్లుగా తడుముతూ తాదాత్మ్యంగా నన్ను తనలో ఐక్యం చేసుకోవాలని నాకు కోరికగా వుండేది. కానీ అతను ఫోన్ కి కూడా అందడు. చాలా బ్రాంచ్ ఆఫీసులొచ్చాయి. ప్రతి బ్రాంచ్ లో ఒక అమ్మాయి పి.ఏ.గా వుంది.
నా చెవిన అప్పుడప్పుడూ వినకూడని మాటలన్నీ వినపడుతున్నాయి. రఘు సింగపూర్ వెళ్ళినప్పుడు అతని పి.ఏ.ని తీసుకుని వెళ్ళాడని ఇతరుల ద్వారా తెలిసి ఆశ్చర్యపోయాను. డ్రింక్ చెయ్యడం కూడా ఈ మధ్య రెగ్యులర్ అయిపోయింది. ఏవన్నా అంటే బిజినెస్ లో వుండే టెన్షన్స్ నీకు అర్ధంకావు. అందుకే అలా మాట్లాడతావు అంటాడు.
