Previous Page Next Page 
తిలక్ కథలు పేజి 47

   
    అరగంట జరిగింది. రామచంద్రం పట్టుదలగా, యింజన్ తో తిప్పలు పడుతున్నాడు.  "కారు బాగుపడదు. ఈ రాత్రి అంతా యిక్కడ బిక్కు బిక్కుమంటూ ఉండాల్సిందే" అన్నాడు నాగభూషణం.

    కాస్సేపాగి మళ్ళీ అన్నాడు. "వద్దురా యీ కార్లో ప్రయాణం అంటే విన్నావు కాదు. మా ప్రాణాలు తియ్యటానికి వచ్చింది ఖర్మం."

    రామచంద్రం సహనం కోల్పోయి. "అబ్బ చంపకు. .వెధవ గోలా నువ్వూ. బాగుపడకపోతే నువ్వు కార్లో ఎక్కి స్టీరింగ్ దగ్గర కూర్చో, నేను తాడేపల్లిగూడెం వచ్చేవరకూ తోస్తాను. నీ ప్రాణానికి నా హామీ సరేనా......." అని అరిచాడు.


    మనుష్యుల గొంతులకి రోడ్డు వారనున్న చెట్లలో కలకలం రేగింది. ఒక్క క్షణఁ సద్దు అణగింది. రామచంద్రం లేచి రేగిన జుట్టుని వెనక్కి తోసుకుని "ఆఖరి ప్రయత్నం చేస్తాను. ఒక లావుపాటి కర్ర ఉంటే చూడాలి. కారుని పైకి ఎత్తి పెట్టుకోవాలి" అంటూ రోడ్డు వారకుపోయి కర్రలకోసం వెదుకుతున్నాడు. నేను భయంతో ఆకాశం కేసి చూశాను. తెలుపూ నలుపూ కలిపిన చిరుమబ్బులు చంద్రుణ్ణి కప్పివేస్తున్నాయి. చలిగాలి వీస్తోంది. నాగభూషణం దిగులుగా కారు పక్కనే నుంచున్నాడు. రామచంద్రం కర్రకోసం వెదుకుతూ పదిగజాలదూరం ముందుకు నడిచాడు.

    రోడ్డువారనే చింతచెట్టూ, రావిచెట్లూ ఉన్నాయి. ఎప్పటివో ముసలి చెట్లు శాఖోపశాఖలుగా అంతటా ఆక్రమించి వేశాయి. ఒక పెద్ద మర్రిచెట్టు ఊడలతో చీకట్లో అసహ్యంగా భయంకరంగా ఉంది. ఊడలు చీకటి పేగులలాగా వేలాడుతున్నాయి. చెట్టు చెట్టుకీ మధ్య యీత ముళ్లపొదలు, బ్రహ్మచెముడు డొంకలు, రకరకాల తీగలూ అల్లిబిల్లిగా యెగిరింది. ఆ చప్పుడికి ఉడతలు కాబోలు కిచకిచమంటూ పరుగులెత్తాయి. మనుష్యులకి నివాసంకాని యీ కీకారణ్యం జంతువులకి సహజమైన ఆవాసంగా ఉంది. ప్రకృతి శాసనం తప్ప వాటికి వేరే జీవన విధానమూ, నియమమూ, నీతి లేవు. ప్రతీ ప్రాణి యిక్కడ తనని తాను రక్షించుకుంటూ, తనకన్న అల్పమైనదానిని భక్షిస్తూ బతుకుతూంటుంది. ఈ అడవి యిలాగ యెన్నిమైళ్లు లోపలికి చొచ్చుకుపోయిందో! లోపల చిరుతపులులేకాదు, పెద్దపులులూ, సింహాలూ ఉన్నా మాత్రం ఏం తెలుస్తుంది? అమాంతం మనిషి మీదపడి నోట కరుచుకుపోయి ఏ పొదలోనో దాగి ఒక్కొక్క అవయవాన్నే సావకాశంగా చీల్చి రుచిగా భక్షిస్తాయి కాబోలు. ఈ అడవి మీద వెన్నెల అనవసరంగా, అసందర్భంగా ఉంది. అందుకే అడవి కాచిన వెన్నెల అంటారు. అదేకాదు, వెన్నెల సహజమైన సౌకుమార్యాన్నీ ఆహ్లాదత్వాన్నీ కోల్పోయి దుర్మార్గంగా, దుస్సహంగాకూడా ఉంది. గుబురుగా ఉన్న ఆకుల మధ్యనుండి కొంచెం కొంచెం వెన్నెల నేలమీదకుజారి వందల కొలదీ కట్లపాములూ, కొండపాములూ పాకుతూన్నట్టుగా ఉంది.

    "మరీ లోపలకు వెళ్ళకు, జాగర్తరోయ్" అంటూ భూషణం కేక వేశాడు.

    "కారు బాగుపడకపోతే రాత్రి అంతా ఇక్కడ వుండిపోవడమే!" అన్నాను నేను. నాకు భయంగా వుంది. గొంతుక యెండిపోతూన్నట్టు వుంది.

    "మంచినీళ్ళు కావాలి" అన్నాను.

    "మంచినీళ్ళు! ఎక్కడ దొరుకుతాయి. ఇదేం మీ యిల్లనుకున్నావా" విసుక్కున్నాడు నాగభూషణం.

    నిస్సహాయతవలన నాగభూషణానికి అసహనం ఎక్కువైపోతోంది. నాకు ఎందుకో అమ్మా,మా ఇల్లూ అన్నీ జ్ఞాపకం వచ్చాయి. లోపల్లోపల చిరుతపులి వచ్చి కరుచుకుపోతుందన్న భయం అవ్యక్తంగా పెరుగుతోంది కాబోలు. నాకు ఏడుపు రాబోయింది. నాగభూణం నా వళ్ళు నిమురుతూ అన్నాడు "భయపడకురా అబ్బాయి. ధైర్యం తెచ్చుకోవాలి. పన్నెండు గంటలయింది. ఇంకో నాలుగైదు గంటలు వోపిక పట్టితే తెల్లవారిపోతుంది. కారు బాగుపడిందా సమస్యే లేదు."

    నేను మౌనంగా తలూపాను

    హఠాత్తుగా "భూషణం! పాము! పాము!" అన్న భయ విహ్వలమైన కేక నిశ్శబ్దాన్ని కత్తిలా చీలుస్తూ వినపడింది. నాగభూషణం రామచంద్రం వెళ్ళిన వైపు నాలుగడుగులు ముందుకు వేశాడు. దూరంగా రోడ్డుమీద ఒకవైపు నుండి మరోవైపుకి పెద్ద పాము మెలికలు తిరుగుతూ గుడ్డి వెన్నెలలో మెరుస్తూ వెళ్ళిపోయింది.  "రామచంద్రం, రామచంద్రం" అంటూ కేకలు వేస్తూ పరుగెత్తాడు నాగభూషణం. రామచంద్రం అక్కడ పొదలదగ్గరే కూలబడ్డాడు. నా ప్రాణాలు బిగుసుకుపోయాయి. నెత్తురు జిలజిల మంది.

    రెండు చేతులతోనూ పొదివి పట్టుకుని తనమీద ఆనుకున్న రామచంద్రాన్ని తీసుకవస్తున్నాడు భూషణం. రామచంద్రం వణికిపోతున్నాడు. "తలుపు తియ్యి" అన్నాడు భూషణం. కారు తలుపు తీశాను.
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS