Previous Page Next Page 
తిలక్ కథలు పేజి 42

    "ఎందుకు జూదమాడి తగలేస్తారు చెప్పండి. కాపరానికొచ్చిన నాటి నుండి సరదాలేదు, సుఖంలేదు. ఉన్న ఆస్తంతా తగలేశారు చాలదా?"

    "వెధవ లెక్చరివ్వక మర్యాదగా తీసి ఇలా ఇయ్యి. లేకపోతే......"

    "ఈ ఉన్న ఒక్క గొలుసూ ఇస్తే నాగతేంకాను. బాబు గతి ఏంకాను! చూడండి వాణ్ణి -కన్న కొడుకుని. మీకు దయలేదా? జాలిలేదా? ఏమండీ - ఈవాళ్టికి ఊరుకోండి. పన్నెండు గంటలవుతోంది. ఒక్కర్తినీ బిక్కు బిక్కుమంటూ ఇంట్లో - రండి. పడుకోండి.

    కర్కశంగా వినబడింది ఈసారి మగ గొంతు - " ఇస్తావా -పీకపిసికి చంపెయ్యమన్నావా, వెధవ పీడ వదుల్తుంది"
 
    "ఇవ్వను"

    "ఇవ్వవా?"

    "ఇవ్వనుగాక ఇవ్వను. ఇది మా పుట్టింటివారు పెట్టింది. ఇది నా ఆస్తి"

    వింటూన్న గోపాలానికి ఆవిడ మాటలలో ఏదో న్యాయం గోచరించింది. ఆవిడ గొంతు తియ్యగా సన్నగా జాలిగా వుంది. గోపాలానికి ఆవిడ మొగుడిమీద కోపం వచ్చింది.

    "నీ ఆస్తా? ఏఁవిటే పేలావుముండా ఇన్నాళ్ళూ తిన్నది నా డబ్బు కాదూ! తే -గొలుసు తే"

    "ఏఁవండీ. ఇలా అన్నాయంగా మాట్లాడతారేమండి.... నేను మాత్రం మీకోసం. మీ బాగుకోసం కాదూ చెపుతున్నది. ఈ గొలుసొక్కటే యింక మనకి ఆధారం. నాకు పసుపు కుంకుమకింద మావాళ్ళు రాసిచ్చిన ఎకరమూ మీరు అమ్మేస్తే యేమైనాఅ్న్నానా? మీరు తాగుతారు, జూదమాడుతారు. మీకు మంచీ, చెడ్డా. భార్యా కొడుకూ అన్న విచక్షణ పోయింది. ఈ నరకంలో మగ్గిపోతూ ఉండాల్సిందేనా, మీ కాళ్ళు పట్టుకుంటాను.నా మాట వినండి"

    ఛెళ్ళుమని చప్పుడు వినిపించింది గోపాలానికి. ఆవిడని మొగుడు కొడుతున్నాడు. గోపాలానికి జాలీ ఉద్రేకమూ కలిగాయి. దీనంగా మధురంగా గద్గదికంగా ఉన్న ఆమె గొంతు అతన్ని ఆకట్టింది.

    "కొట్టండి, చంపండి. నా గొలుసుమాత్రం యివ్వను"

    "ఇవ్వవూ, ఇవ్వవుటే పింజారి ముండా" మళ్ళీ గుద్దినట్టు చప్పుడు. ఆమె ఏడుస్తోంది నిస్సహాయంగా. దీనంగా, బాధగా. ఆమె ఆక్రోశించింది. ఇద్దరూ పెనుగులాడుతున్న ధ్వని వినపడింది గోపాలానికి.

    "వొదలండి, నన్నొదలండి. అమ్మో"

    గోపాలం పిడికిళ్ళు బిగించాడు. అతని కళ్ళల్లో ఎర్రజీర కదలింది.

    "పీక పిసికి తీసుకెళతాను. గొలుసు ఇలా పడెయ్యి."

    "ఎందుకివ్వాలి మీకు, జూదంలో తగలెయ్యడానికా?" ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూనే మాట్లాడుతోంది. "పిల్లవాడికి దగ్గుమందైనా తీసుకురాలేదు. ఒక్క మంచిచీర లేదు. కట్టుకున్న పెళ్లాం చచ్చిందో బతికిందో చూడరు. ఇంక వీధులమ్మట ముష్టెత్తుకుని బతకాలి నేను"

    "ఈ వేలెడు వెధవకోసం నా కివ్వవన్నమాట. ఆగు వీడిని చంపేస్తాను. వీడి పీక నులిమేస్తాను"
 
    "అయ్యో అయ్యో వాణ్ణి ఏం చెయ్యకండి. అయ్యో అయ్యో" ఆవిడ పెద్ద పెట్టున కోకలు. పిల్లవాడు కెవ్వుమని ఏడుపు.

    గోపాలం ఇంక ఆగలేకపోయాడు. కుర్రవాణ్ణి పీక నులిమి చంపివేస్తున్న దృశ్యం అతని కళ్ళ ముందు కదిలింది. బలమంతా ఉపయోగించి తలుపు తన్నాడు. రాలేదు. తిరిగి దడదడా తన్నాడు. తలుపులు విచ్చుకున్నాయి. ఆమె కుర్రవాణ్ణి ఎత్తుకొని గోడమూలగా నక్కి వుంది. వణికిపోతూ వుంది.

    "బాబు నేమీ చెయ్యకండి. వొదలండి. ఇదిగో గొలుసు" అంటూ మీదకి రాక్షసుడులా వొంగిన అతనికి గొలుసు ఇస్తోంది. మొగుడు తీసుకుని వెనక్కి తిరిగాడు. ఎదురుగా గోపాలం.

    "ఎవడవురా నువ్వు?" అన్నాడు మొగుడు.

    గోపాలం బలంగా అతని దవడమీద ఒకటి వేశాడు. మొగుడు తూలిపడబోయాడు. గోపాలం యీసారి మీదికురికి అతని తలవంచి బలంగా గుద్దాడు. అతను కిందపడ్డాడు.

    "ఆడకూతుర్ని కొడతావా? ఆ గొలుసు కాజెయ్యాలని చూస్తావా? దొంగయెదవా , సిగ్గులేదురా నీకు, బుద్దిలేదురా, ఏది ఆ గొలుసు ఇలాయియ్యి లేవకు, లేచావంటే సంపేత్తాను."

    గోపాలం అతని చేతిలోంచి గొలుసు లాక్కున్నాడు. అతను కిందపడి వగరుస్తున్నాడు. రొప్పుతున్నాడు. ఆమె యీ హఠాత్పరిణామం అర్ధంకాక నిశ్చేష్టురాలై గోడకి బల్లిలా అంటుకుని కళ్ళప్పగించి చూస్తోంది.

    "తాగుతూ జూదమునట్రా నీకు, సదువుకున్నోడివి. ఉద్యోగం చేసి పెళ్ళాం పిల్లల్ని పోషించాల్సింది . పైగా పెళ్ళాం నగలే ఎత్తుకు పోతావట్రా దొంగనాయాల....."

    నేలను కరుచుకున్నా మొగుడు అస్పష్టంగా బూతులు తిడుతున్నాడు.

    గోపాలం డొక్కలో ఒకటి తన్ని "నోర్ముయ్యి" అన్నాడు. ఆమె "వద్దు వద్దు కొట్టకు" అని అరచింది.

    గోపాలం చేతిలో గొలుసుతో గోడవారనున్న ఆమెను సమీపించాడు. ఆమె సన్నగా ఎర్రగా నాజూకుగా వుంది. జుట్టంతా రేగిపోయివుంది. చెక్కిళ్ళు కన్నీళ్ళతో తడిసిపోయి వున్నాయి. పాతికేళ్లయినా ఉండవు. ఆమె కళ్ళలో భయాశ్చర్యాలు పెనవేసుకున్నాయి. చంకలో పిల్లవాడు ఏడుస్తున్నాడు.

    "ఇదిగోనమ్మా గొలుసు" అంటూ ఆమె చేతికి గొలుసు ఇచ్చాడు. కింద దొర్లుతూన్న మొగుడు లేవబోయాడు. గోపాలం మొలనుండి కత్తితీశాడు.

    "ఇదేఁవిటో చూశావా! లేవడానికి ప్రయత్నించావా పొడిచేస్తాను. కబడ్దార్. దెబ్బకి యెగిరిపోతావు"
    మొగుడు దండం పెట్టాడు.

    "నువ్వు మళ్ళీ ఎప్పుడేనా గొలుసు తీసుకున్నట్టుకాని ఆవిడ వంటి మీద దెబ్బపడినట్టుగాని తెలిసిందా నీప్రాణం తీసేస్తాను" గోపాలం కత్తిని అతని ముఖానికి దగ్గరగా పెట్టి ఝళిపించాడు.

    మొగుడు తలవూపాడు ఇంకెప్పుడూ చెయ్యనన్నట్టుగా.

    గోపాలం ఆమెవైపు తిరిగాడు. "ఏం భయంలేదు. ధైర్యంగా ఉండమ్మా" అన్నాడు.

    ఆమె భయంతో కృతజ్ఞతతో తల వూపింది.

    గోపాలం కత్తి మొలలో పెట్టుకుని వెళ్ళిపోబోయాడు. ఆమె హీనస్వరంతో అడిగింది "ఎవ్వరు బాబూ నువ్వు....."

    "నేనా......నేనా" తెల్లబోయాడు గోపాలం. "నన్ను గోపాలం అంటారు లెండి. అంతే" అంటూ గోపాలం తలెత్తకుండా వడివడిగా పెరట్లోకి చీకట్లోకి వెళ్ళిపోయాడు.,

                                                         (జ్యోతి -మార్చి 1964 -ఉగాది సంచిక)

                                                                            ********


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS