Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 40

                            వెలుతురు కిరణాలు
                                     
వీరరసం
    
    "నీ అంతు ఇప్పుడే తేల్చేస్తా" అంటూ, గురిచూసి  గొడ్డలి
    విసిరాడు గెరిల్లా యోధుడు ఎదురుగుండా గొడ్డంకి
    చెట్టునానుకుని పొంచున్న పోలీసు వుద్యోగి మోకరించి
    చూస్తున్నాడు. దూసుకువస్తోంది గొడ్డలి. పోలీసాయన
    పాముని చూసిన కప్పలాగా నిశ్చలంగా వున్నాడు. ఇద్దరికీ
    మధ్య ముఫ్ఫయి మీటర్ల కన్నా ఎక్కువ దూరం లేదు.
    
    గెరిల్లా యోధుడి గొడ్డలి నిమిషానికైదుమైళ్ళ వేగంతో పోతోంది.
    ఈ దేశంలో ఆ మాట కొస్తే, ఏ దేశంలోనైనా చాలామంది ధీరులున్నారు అంతకు మించి అనేక రెట్లమంది పిరికి వాళ్ళూ వున్నారు.
    వీరుల్ని గురించి పిరికి వాళ్ళకి ఆచూకీ యిచ్చేవాళ్ళూ వున్నారు.
    వీరుల నెత్తిమీద బహుమతి ప్రకటించి తమదారిని నిష్కంటకం చేసుకోవచ్చునని ప్రభుత్వాలూ ఉన్నాయి.
    అయినా, వీరులు ప్రభవిస్తూనే ఉంటారు. ప్రభుత్వాలను పడగొడుతూనే వుంటారు. అయితే నిత్యమూ జరిగే సంఘటన కాదు. అనుదినం జరిగేది ఇలాటి వీరులు ముందు సంఖ్యలో మరణిస్తూ ఉండడం.
    ఒక ఉషస్సూ పుట్టాలంటే ఎన్నో కోట్ల నక్షత్రాలు చనిపోవాలన్న కవి మాట కవిత్వం గాదు, యదార్ధం కూడా!
    వీరుడి గొడ్డలి ఒక సెంటీమీటరు వారలో తప్పింది. చెట్టులో చిక్కుకుంది పోలీసాయన బతికి బయటపడ్డందుకు అతనికే ఆశ్చర్యం వేసింది. మళ్ళీ కరచరణాదులాడుతున్నాయి. క్షణకాలం శవంలాగయి పోయిన అతని శరీరంలో చైతన్యం ప్రవహిస్తోంది.
    మూసిన కళ్ళు ఒక్కసారి తెరచి చూశాడు. వీరుడు పొదల్లో మాయమవుతున్నాడు.
    పోలీస్ ఆఫీసర్ విజిల్ ఊదాడు. రివాల్వరును సవరించి పొజిషన్ లోకి తెచ్చాడు రెండు జీపులలో వచ్చిన పోలీసు దళాలు ఆ ప్రాంతాన్నంతా చుట్టుముట్టాయి. వీరుడుకి గత్యంతరం లేదు. దాగడానికి పొదలు లేవు.
    పరుగెత్తుతున్న వీరుణ్ణి గురిచూసి ఒక పోలీసు జవాను తుపాకి కాల్చాడు. గుండు గురి తప్పింది గానీ వీరుడి తోడల్లోకి దూసుకుపోయింది.
    వీరుడు పడిపోయాడు. స్పృహదప్పి మాత్రం కాదు. అతని దగ్గరికి వెళ్ళడానికి అందరూ భయపడుతున్నారు. పోలీస్ ఆఫీసరు కొంచెం ధైర్యం చేసి అల్లంత దూరం నుంచీ వీరుడి రెండవ కాలిమీద రివాల్వరు పేల్చాడు.
    వీరుణ్ణి జిల్లా హెడ్ క్వార్టర్స్ కి తీసుకుపోయారు ఒకపోలీసు ఠానాలో నిర్భంధించిన తర్వాత అతణ్ణి పెట్టిన చిత్రవధలను గురించి ఇక్కడ రాయను.
    చెప్పేనుగాదూ, ఈ జరిగినదంతా మన దేశంలోనే జరిగిందనుకోనక్కరలేదు. అనుకుని వాళ్ళు అనుకోడానికి నాకు అభ్యంతరం లేదు.
    పారిపోతూండగా ఒక బందిపోటును కాల్చి చంపడం జరిగిందని కొన్ని పత్రికలూ, పోలీసులు ఆత్మరక్షణార్ధం కాల్పులు చెయ్యగా ఒక దేశద్రోహి మరణించాడని కొన్ని పత్రికలూ ప్రకటించాయి.
    వీరుడింకా బ్రతికే ఉన్నాడు. ఒక ఉన్నత రక్షక భటాధికారి జైలు సెల్లులో అతణ్ణి ప్రశ్నిస్తున్నాడు.
        "నీ పేరేమిటి?"
        "మానవుడు"
        "ఓహో అలాగా పశువ్వనుకున్నాను. మనిషివే'
        అన్నమాట సరే, నీ ఊరేమిటి?"
        "ప్రపంచం"
        "అదో ఊరిపేరుకాదు. అతి తెలివిగా జవాబు
        చెప్పడం మాని నీవే ఊళ్ళో పుట్టావో        
        ఆ ఊరిపేరు చెప్పు".
        "ఆ ఊరినెప్పుడో మీవాళ్ళు నేలమట్టం చేశారు."
        "నేలమట్టం చేయకముందు, దానికో పేరు లేదూ?"
        "ఉంది. ప్రపంచంలో కుగ్రామం."
        "ఇక నిన్ను ప్రశ్నించి లాభంలేదు. ఇదిగో
        చూడబ్బాయీ! నువ్వు కుర్రవాడివి. బతికి బాగు
        పడవలసిన వాడివి. దేశానికి నీలాటి యువకులు
        ఎంతో అవసరం. నా మాట విని-"
        "విని, మా రహస్యాలు చెప్పేస్తే మా వాళ్ళందరికీ
        ద్రోహం చేస్తే, నాకు మంచి ఉద్యోగం యిస్తారు.
        నన్ను మీ మార్గంలో బాగు చేస్తారు. అంతేగదూ!
        యూ స్కంక్!"
        అరదండాల చేతులు పోలీసు ఉద్యోగి నెత్తిమీద
        పడబోయినాయి.
    ఇలాంటి అఘాయిత్యం ఏదో జరుగుతుందని అనుకుంటూనే ఉన్న పోలీసు ప్రముఖుడు నేర్పుగా తప్పించుకున్నాడు. ఇద్దరు పోలీసు జవాన్లను లోనికి రమ్మన్నాడు. పోలీసు స్టేషన్ నిర్బంధితున్ని చంపకూడదంటూనే "బయటకు తీసికెళ్ళి వీణ్ణి కాల్చేయండి" అని ఆర్డరు వేశాడు.
    పూర్తిగా చీకట్లుపోని, బాగా వెల్తురురాని సమయం అది. అప్పుడు వీరుడు సంతోషపూర్వకంగా తుపాకీ గుళ్ళను స్వీకరించాడు.
    ఆ చీకట్లో అతనికేవో వెలుతురు కిరణాలు కనిపించాయి. అవి తాను చదువుకునే గదిలో పెట్టుకున్న మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్, మావోల వర్ణచిత్రాలు.
    
                                                            ---౦౦౦---


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS