Previous Page Next Page 
చదువు పేజి 4

   

     క్షణక్షణానికి వేళ్ళతీపు హెచ్చిపోతున్నది. పంతులు రాసిన అక్షరం అంతకంతకూ లావెక్కి మెలికలు కలసిపోతున్నై . దీనికి తగ్గట్టుగా అరిచేతులు చెమటపట్టి ప్రవాహాలు కడుతున్నై. సుందరం బలపాన్ని కిందపెట్టి అరిచెయ్యి లాగుకు తుడుచుకుని చూసుకున్నాడు. చూపుడువేలిమొన, మధ్యవేలి  మధ్యకణపు పక్కభాగమూ. బొటనవేలిమొనా ఎర్రగా కందినై.
  క్షణక్షణానికి వేళ్ళతీపు హెచ్చిపోతున్నది
    "దిద్దూ,"

    ఈ పెడబొబ్బకు సుందరం హడలిపోయినాడు, మళ్ళీ అక్షరాలు దిద్దసాగాడు.

    ఎంతసేపు దిద్దాడో తెలియదు. చెయ్యి అక్షరం దిద్దుతూనే ఉంది. నోరు అక్షరాలను ఉచ్చరిస్తూనే ఉంది. కాని సుందరం మనస్సు ఎక్కడో ఉంది, వాడికి వాళ్ళమ్మ జ్ఞాపకం వచ్చింది. సుబ్బమ్మ కూతురు లక్ష్మి జ్ఞాపకం వహ్చింది. కిందటేడు వాళ్ళ బంధువులింట్లో జరిగిన పెళ్ళిజ్ఞాపకం వచ్చింది. పందిళ్ళవాసన జ్ఞాపకం వచ్చింది. ఆ పెళ్ళి అయిపోయిన తరువాత కొన్ని మాసాలకు శ్రీమన్నారాయణ తమ వాకిలిముందు చిన్న తాటాకుల పందిరి వేయించాడు. ఆ తాటాకుల వాసన తగలగానే తను "అమ్మా. మన పందిలి పెళ్ళివాసన," అన్నాడు. ఆ మాటకు తల్లి తనను ముద్దుపెట్టుకుంది.

    రాఘవయ్యపంతులు బళ్ళో కూచుని అక్షరాలు దిద్దుకునే సుందరం మొహాన కొద్దిపాటి ఆనంద రేఖ కనిపించింది. అది మరెవరికీ కాదు. రాఘవయ్యకే కనిపించింది. మరుక్షణం ఠపీమని సుందరం నెత్తిన మొట్టికాయపడింది.

    వెధవా అక్షరాలన్నీ చెరిపేస్తావా?" అన్నాడు పంతులు. అప్పటిదాకా సుందరం చూసుకోనేలేదు. వాడి చేతి చెమటకు అక్షరాలూ చాలా భాగం చెరిగిపోయినై.

    రాఘవయ్యపంతులు పలక చెరిపి మళ్ళీ అక్షరాలురాసి దిద్దమన్నాడు.

    రాఘవయ్యపంతులు బడి వీధిబడికాదు. ఆయన తన సొంత ఇంటి ఆవరణలోనే ఒకపక్కన పెంకులు కప్పిన వసారా ఒకటి వేయించి అందులో బడి పెట్టేవాడు. అందులో కాస్త మంచి తరగతికి చెందిన కుంటుంబాల పిల్లలు చదువుకునేవాళ్ళు. వీధిబడికి తమ పిల్లల్ని పంపటం నామోషిగా భావించేవాళ్ళు, రాఘవయ్యకు ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు. ఈ బడిమీద రాఘవయ్యకు నెలకు ఏ పది పన్నెండు రూపాయలో గిట్టేవి.

    రాఘవయ్య బాగా చెప్పగలవాడని ప్రతీతి ఉండేదిగాని నిజంగా ఆయన పిల్లలకు శ్రద్దగా చదువు చెప్పేవాడుకాడు. ఎక్కువ కాలం పిల్లలతో గడిపేవాడుకాడు. పిల్లలదగ్గిర కూర్చున్నంతసేపూ వాళ్ళను హింసించేవాడు. ఆయన బాగా పిల్లలను శిక్షిస్తాడనేమాటను పిల్లల తల్లిదండ్రులు మంచి శిక్షణ ఇస్తాడని అర్ధం చేసుకునేవారు.

    సుందరం "అ ఆ"దిద్దుతూండగా రాఘవయ్య వెళ్ళిపోయినాడు. ఆయన మొదట ఇంట్లోకివెళ్ళి, తరువాత బయటకి వెళ్ళాడు. ఆయన బయటకి వెళ్ళగానే ఒక కుర్రాడు, పొడుగాటి పళ్ళవాడు వచ్చి సుందరం పక్కన కూచుని "ఏం రా, గుండూ సరిగా దిద్దు," అన్నాడు.

    సుందరం తప్ప అందరూ చదువు మానేసి కబుర్లులో పడ్డారు. సుందరం కూడా చేతికి కాస్తవిశ్రాంతి ఇచ్చాడు. వాడికి ఈ కుర్రాణ్ణి చూస్తే ఎందుకో పంతుల్ని చూసిన దానికన్న ఎక్కువ భయం వేసింది. అందుకని వాడు మళ్ళీ బలపం పట్టుకుని దిద్దసాగాడు.

    కాని సుందరం మనస్సులో ఏదో ఆవేదన బయలుదేరింది. చదువుకోవటమంటే వాడూహించినదానికీ దీనికీ ఏమీ సంబంధం లేదు. తన జన్మంతా ఈ "అ ఆ" దిద్దటంతోనే సరిపోయేటట్టు  కనిపించింది.

    పంతులు తిరిగి వచ్చేసరికి ఎవరిపాఠాలు వాళ్ళు మళ్ళీ చదవసాగారు. ఒక్క కుర్రవాడు మాత్రం గోడ కానుకుని తల రొమ్ముమీదికి వాల్చుకుని నిద్రపోతున్నాడు. పంతులు లోపలికి వస్తూనే చూరులోంచి పేంబెత్తం తీసి వాణ్ణి కసిగా నెత్తినా, భూజాలమీదా కాళ్ళమీదా దబదబా కొట్టాడు. వాడు మొదటి దెబ్బకే "చచ్చానో" అని కేక పెట్టాడు. దెబ్బ దెబ్బకూ ఆ కుర్రాడు అమ్మో! బాబో! నాయనోయ్! అయ్యో!" అని కేకలు పెడుతుంటే సుందరం గుండెలు అవిసిపోయినై.

    రాఘవయ్యను చూస్తె ఆక్షణాన సుందరానికి భయంతోబాటు, భయాన్నిమించిన కోపంకూడా వచ్చింది. తన మనస్సులో సుందరం  ఆ రాఘవయ్యను పెద్ద కట్టెపెట్టి ఒళ్లంతా పచ్చడి పచ్చడి అయ్యేటట్టు కొట్టాడు.

    సుందరాని  కిప్పుడు వేళ్ళతీపుకూడా అంత బాధించటంలేదు. ఎప్పుడు బడి అయిపోతుందా ఎప్పుడు ఇంటికి పోదామా అనే చింత వాన్ని తీవ్రంగా బాధించసాగింది.
 
    చివరకు రాఘవయ్యపంతులు బడి విడిచే సమయానికి సుందరానికి పెద్దచెరవదలినట్టయింది.

    సుందరాన్ని యింటిదగ్గర దిగవిడవమని పంతులు ఇద్దరు పిల్లల్ని వెంటపంపాడు. వాళ్ళలో ఒకడు పేంబెత్తందెబ్బతిన్నవాడు.

    దారిలో ముగ్గురూ ఏవో మాట్లాడుకుంటూ వచ్చారు.

    "సరే కాని, పంతులు కొడితే నీకుబగా నెప్పెత్తిందా?" అని సుందరం దెబ్బలుతిన్న కుర్రాణ్ణి అడిగాడు.

    "నాకేం నెప్పిలేదు," అన్నాడు కుర్రాడు.

    సుందరాకి కామాట బడాయిగా కనిపించింది.

    "అంతగట్టిగా ఏడిచావే?" అన్నాడు సుందరం.

    "దెబ్బల నెప్పికన్నా ఎక్కువ ఏడిస్తే నెప్పిఉండదు. నీకు తెలీదా?" అన్నాడు ఆ కుర్రాడు.

    ఇది సుందరానికి వింతగా తోచింది. వాడు దెబ్బల అనుభవం ఉన్నవాడు కాడు.
 
    "మా నాన్నకూడా నన్ను చచ్చేటట్టు కొడతాడు. గొంతుచించు కేడుస్తాను. ఏమీ నెప్పివుండదు." అన్నాడా కుర్రాడు, సుందరాన్ని నమ్మించేటట్టు చెబుతూ.
   
                                                                        __0___


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS