Previous Page Next Page 
అందరూ దొంగలే పేజి 4

                                                                       

                                 2
   
    వన్ టౌన్ పోలీస్ స్టేషన్. ఉదయం ఎనిమిదిగంటలకే పోలీస్ స్టేషన్ లోంచి ఏడుపులు వినిపిస్తున్నాయి.ఆ దారినపోయే జనం స్టేషన్ ముందు క్షణం ఆగి కళ్ళు చిట్లించి చూసి ముందుకు కదులుతున్నారు.

    "ఈ పోలీసోళ్ళకి ఏం మాయరోగం వచ్చిందో ఏమో....లాకప్ లో వున్నవాళ్ళని పొద్దున్నే చింతకాయపచ్చడిలా దంచుతున్నారు. రేపు న్యూస్ పేపర్లలో వన్ టౌన్ పోలీస్  స్టేషన్ లో లాకప్ డెత్ అని  వార్త పడుతుందో ఏంటో"ఒక ముసలాయన వణుక్కుంటూ ముందుకు కదిలాడు.

    కానీ పోలీస్ స్టేషన్ లోపలి పరిస్థితి అందరూ ఊహిస్తున్న దానికి భిన్నంగా వుంది. స్టేషన్ లోపల....

    సెల్ లోని క్రిమినల్స్ ఒకటే నవ్వుతున్నారు తమ ఎదురుగా జరుగుతున్న సీన్ ని చూస్తూ.

    గది మధ్యలో ఇన్స్ పెక్టర్ అప్పారావ్ సీరియస్ గా నిలబడి వున్నాడు. అతని ముక్కు నల్లగా కమిలి వుంది. అతను నెత్తిమీద క్యాప్ పెట్టుకోలేదు....ఎందుచేతనంటే అతని తలమీద అయిదారు బొడిపెలు వున్నాయి. అవి బాగా నెప్పి పుడుతున్నాయి....క్యాప్ పెడితే బోడిపెలకి ఒరుసుకుని మరింత నోప్పి పుడ్తాయని అతను క్యాప్ పెట్టుకోలేదు.

    అతని కాళ్ళ దగ్గర బోర్లా పడుకుని, సాష్టాంగ దండ ప్రమాణాలు చేస్తూ, బోరున ఏడుస్తున్నాడు హెడ్ కానిస్టేబుల్ రాంబాబు, కానిస్టేబుల్ చిన్నారావ్. వీళ్ళిద్దరి ఏడుపులే స్టేషన్ బయట జనాలకి వినిపిస్తున్నది.

    "ఏడ్చింది చాల్లే....ఇక లేవండి...." అరుస్తూ అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

    రాంబాబు, చిన్నారావులు ముక్కుతూ, మూలుగుతూ, ముక్కులు చీదుతూ నేలమీంచి లేచి నిలబడ్డారు.

    "సార్....అయితే మీరు మామీద ఏ రకమైన యాక్షన్ తీసుకోరు కదా!" మెల్లగా అడిగాడు రాంబాబు.

    "తీసుకోనులే...." చిరాకుగా సమాధానం చెప్పాడు ఇన్స్ పెక్టర్  అప్పారావ్.

    "నిజంగానా సార్....? తల్లి తోడు" అడిగాడు చిన్నారావ్.

    "ఒరేయ్....ఈగోలలోకి నా తల్లిని కూడా లాక్కొస్తున్నార్రా" కోపంతో  ఊగిపోతూ అన్నాడు ఇన్స్ పెక్టర్  అప్పారావ్.

    "యాక్షన్ తీసుకోనని అన్నారు కదా....తల్లి తోడూ, బామ్మ తోడూ అంటూ విసిగిస్తావేం?" అంటూ చిన్నారావ్ ని మందలించాడు రాంబాబు.

    "నో....తీస్కుంటాను....మరోసారి ఇలాంటి పొరపాటు జరిగిందంటే మిమ్మల్ని డిస్మిస్ చేస్తాను" ఆవేశంతో వూగిపోతూ అని నేలనేద దబ్బున పడ్డాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

    రాంబాబు, చిన్నారావ్ లు గబుక్కున చెరోరెక్కా పట్టుకుని ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ని లేవదీశారు.

    "మీరు ఆవేశంతో కాస్త ఎక్కువగా ఊగినట్టున్నారు సార్....అందుకే బ్యాలెన్స్ అవుటయి పడ్డారు...." జాలిగా చూస్తూ  అన్నాడు రాంబాబు.

    ఇంతలో ఫోన్ మోగింది. ఇన్స్ పెక్టర్ అప్పారావ్ రిసీవర్ ఎత్తి  "హలో ఇన్స్ పెక్టర్ అప్పారావ్ స్పీకింగ్ అన్నాడు.

    "హలో ...." అవతలి గొంతు పలికింది.
    
    "నేను ది చిల్లర డైలీ న్యూస్ పేపర్ ఎడిటర్ ని మాట్లాడుతున్నా - మీ ఏరియా నుండి మాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. మీ పోలిస్ స్టేషన్లో ఏదో లాకప్ డెత్ జరగబోతుందటగా....అదేదో జరిగింతర్వాత మాకు తెలియజేస్తే మేం విలేఖర్లవి పంపిస్తాం న్యూస్ కవర్ చెయ్యడానికి ....మీరు కూడా కలర్ ఫుల్  డ్రస్ వేసుకోండి....మీ ఫోటోలు తీసుకుంటాం."

    ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కి చిర్రెత్తుకొచ్చింది.

    "ఇక్కడే లాకప్ డెత్ లూ జరగబోవడం లేదు....మాలో మేం కొట్టుకు చస్తున్నాం. అంతే...."విసుగ్గా  నెత్తిమీద మొట్టుకుని  "హబ్బా" అని బాధగా అరిచాడు ఇన్స్ పెక్టర్.

    "లాకప్ డెత్ జరగ బోవడంలేదని అన్నారు మరి 'అబ్బా!' అని బాధగా అరిచిందెవరు?" ఎడిటర్ అనుమానంగా ప్రశ్నించాడు.

    "ఆ అరిచింది నేనెనయ్యా  బాబూ....నెత్తిన మొట్టుకుని, బోడిపలు నెప్పెట్టి బాధగా అరిచా" అని విసుగ్గా ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు.

    ఆ తర్వాత క్రూరంగా రాంబాబు, చిన్నారావ్ లని చూశాడు.

    "ఇదంతా మీవల్లే జరిగింది" అన్నాడు.

    "నిజమే ననుకోండి....కానీ మీది కూడా కాస్త తప్పుంది సార్....మీరు దొంగలా మారువేషం వేస్కుని ఉండాల్సింది కాద్సార్" మెల్లగా అన్నాడు రాంబాబు.

    "దొంగలా కాకుండా మీలా పోలీస్ యూనిఫాంలో ఉంటే దొంగలు దగ్గరి కొస్తారా....? అందుకే  దొంగ గెటప్ లో దొంగల్ని పట్టుకోవాలనుకున్నా" అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

    "అది సరేగానీ అందరూ దొంగ దొంగ అని వెంటపడినప్పుడు మీరు పరుగు తియ్యకుండా నేను దొంగని కాను....ఇన్స్ పెక్టర్ ని అని చెప్పి వుండాల్సింది సార్" అన్నాడు చిన్నారావ్.

    "నేను చెప్తే జనం నమ్ముతారా? నా దగ్గర ఐడెంటిటీ కార్డ్ కూడా పెట్టుకోలేదు! అయినా ఆ టైంలో నేను దొంగ గెటప్ లో వుండి నాకు నేను దొంగలా కూడా ఫీలయిపోయా ఎందుకో" కాస్త సిగ్గుపడ్తూ అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

    రాంబాబు, చిన్నారావ్ కిసుక్కున నవ్వారు.

    ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కి ఎక్కడో మండింది.

    "మీరు ఈ డ్యూటీలు చెయ్యడానికి పనికిరారుగానీ....నాతో పదండి!" అన్నాడు కోపంగా.

    "ఎక్కడికి సార్?" అడిగాడు చిన్నారావ్.

    "నోర్మూస్కుని నాతో రండి...." అని  "ఏయ్ ఫోర్ ట్వంటీ...." అంటూ పిలిచాడు.

    కానిస్టేబుల్ 420 వరండాలోంచి  లోపలికొచ్చి  "యస్సార్!" అంటూ సెల్యూట్ చేశాడు.

    "మీరు స్టేషన్ జాగ్రత్తగా చూస్కోండి....నేనో అరగంటలో వస్తాను!" అని చెప్పి "మీరు పదండి" అన్నాడు రాంబాబు, చిన్నారావ్ ల వంక చూస్తూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS