తెల్లవారి వాసుకి కాఫీ ఇస్తూ నవ్వుతూ అడిగింది శ్రీలక్ష్మి "మాధవీలత" ఎవరూ అంటూ.
"మాధవీ లతా... వారెవరు" తెల్లముఖం పెట్టాడు వాసు.
"అయ్యో నీకు తెలవదూ.. ఆరాధ్య దేవత...కలలోకూడా ఆ నామజనమే స్మరించే ఆ సుందరిని నాకు చూపిస్తే పాపం వస్తుందా!"
శ్రీలక్ష్మికి పుస్తకాలు చదివే అలవాటు బాగా వుంది. ఆవిడ చదవటంకాదు. తినేస్తుందంటే సరీగా వుంటుంది. ఈమాటే తరుచు రాఘవరావు అంటూ వుంటాడు. కొత్త పుస్తకాలు వుంటే అన్నం నీళ్ళూ అక్కరలేదు. తనకి అక్కరలేదని మిగతా వాళ్ళ "ఆకలిని" గుర్తించకుంటే ఎలా? ఇంట రెస్టింగ్ గా వున్న పుస్తకం మధ్యలో వదిలెయ్యాలంటే బోలెడంత బాధకల్గి అది చదువుతూనే కూర మాడ్చేస్తుంది. పులుసుకాటు పోతుంది. పాలుపొంగిపోతాయి. అన్నం పలుకు అవుతుంది.
ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయో రాఘవరావుకీ వాసుకీ తెలుసు. శ్రీలక్ష్మి కాపురానికి వచ్చిన కొత్తలో పుస్తకాలు చదివే అలవాటు మంచిదేఅని రాఘవరావు సంతృప్తి పడినా ఆ తర్వాత ఈ అలవాటు అతనికి ప్రాణాంతకంగా పరిణమించింది.
భర్త ఆఫీసు నించి అయిదున్నరకి వచ్చినా పుస్తకంలోంచి తలయెత్తి గడియారం వైపు చూసే తీరిక వుండేది కాదు. ఆకలితో యింటికి వచ్చిన రాఘవరావుకి భార్యని చూస్తే వళ్ళుమండి పోయేది. ఆ పట్టున చేతులో పుస్తకం లాగి చించిముక్కలు చేసిన రోజులు చాలానే వున్నాయి.
కాని యేం ప్రయోజనం! శ్రీలక్ష్మి చదవటం మానలేదు.
డిటెక్టివ్ సాహిత్యం దగ్గరనించి సెక్సు సాహిత్యం వరకూ చరిత్రాత్మకంనించి సామాజిక నవలలవరకూ పక్షపాతరహితంగా అందినంత వరకూ చదివేస్తూ వుంటుంది. వాసుకి వదినగారి పద్ధతులు కొన్ని నచ్చుతాయి. కాని కొన్ని నచ్చవు?
"ఇంతకీ మాలతి ఎవరంటే నాలుగు దోసెలు తిన్నావు గాని జవాబు చెప్పవేంటి?...నిష్టూరంగా అనేసింది శ్రీలక్ష్మి.
వాసుకి ఆ సంభాషణ ఎలా మరో మలుపు తిప్పాలో తెలియక వెంటనే అన్నాడు.
"వదినా... శాంతిలో కొత్త పిక్చర్.... నీ అభిమాన హీరో బిశ్వజిత్ వున్నాడు"
వెనక గదిలోనించి రాఘవరావు గొంతు విన్పించింది.
"శ్రీ... వాడిని ఓసారి ఇలా రమ్మను"
వదినగారితో కబుర్లు కట్టిపెట్టి మూతి తుడుచుకుంటూ పైజమాతోనే ముందు గదిలోకి వచ్చాడు వాసు.
అప్పటికే అక్కడ ఓ ముసలాయనా ఓ బట్టతలాయనా కూర్చున్నారు. "ఎందుకు" అన్నట్లు అన్నగారి ముఖంలోకి చూశాడు వాసు. ఆ కుర్చీలో కూర్చో..... నిన్ను చూసేందుకు వచ్చారు" అంటూ పరిచయం చేశాడు.
ముసలాయన కళ్ళజోడు తీసేసి పైపంచతో తుడుస్తూ ప్రశ్న పరంపరలు విడుస్తున్నాడు వాసుమీదకి.
ఈ ఇంటర్వ్యూ లంటే తగని మంట వాసుకి.
వివరాలు తెలుసుకునే వచ్చి మళ్ళీ అవే ప్రశ్నలు. పక్కన అన్నగారు లేకుంటే ఈ ఇద్ధరినీ ఓ వూపు వూపేవాడు. వాళ్ళు వేసే ప్రశ్నలకి జవాబివ్వటం ఆలస్యం అయిపోతోందని అప్పటికే రాఘవరావు ముఖం గంభీరంగా మారిపోయింది.
వదిన కాఫీ తెచ్చి లోపల గుమ్మంలో నిలబడింది.
ఓ! వదినకి ఈ వ్యవహారం ముందే తెలుసన్నమాట. కానీయ్ "తనకి దూరసందులేదు. మెడకో డోలు" అన్నట్లు నా కిప్పుడు పెళ్ళి కేం తొందరొచ్చింది అని యెన్నోసార్లు వదినగారికి చెప్పాడు. మనస్సులో ఇష్టం లేకున్నా ఆ కాఫీ కప్పులు అందరికీ తనే అందించాడు.
"నీ హైట్ ఎంత? బట్టతలాయన అడుగుతూంటే ముసలాయన డైరీలాంటి బుక్ తీసి పట్టుకున్నాడు.
చూస్తుంటే తెలియటంలా" పళ్ళు కొరుక్కున్నాడు వాసు.
"హైటు 5' - 6" ఎందుకన్నా మంచిది. వెయిట్ కూడా చెప్తాను నోట్ చేసుకోండి." ఇంకా ముందుకు మాట్లాడబోయే తమ్ముడిని మింగేలా చూశాడు రాఘవరావు.
ఇంక అక్కడ కూర్చోలేని వాసు "ఆ... వస్తున్నా వదినా" అంటూ లోపలికి వచ్చేశాడు.
"నేను పిలవందే" శ్రీలక్ష్మి కసిరింది.
"వూ.... పిలవ్వు ఎందుకు పిలుస్తావ్...నీకు ముందే ఈ పెళ్ళిళ్ళపేరయ్యలు వస్తున్నట్లు తెలిస్తే మరి నాకు వార్నింగ్ ఇవ్వలేదేం?...
"హుష్! మన మాటలు వాళ్ళకి విన్పిస్తున్నాయి...... మూతి మీద వేలు వుంచి ముందు గదిలో వాళ్ళు మాట్లాడేది యేమైనా విన్పిస్తుందేమో అని చెవులు రిక్కించింది శ్రీలక్ష్మి. ఆ కీచుగొంతు ముసలాయనైతే ఏదో మాట్లాడు తున్నాడు కాని ఒక్కమాటా అర్ధం కావటం లేదు.
ఆ ఇద్దరూ మరో అర్ధగంట తర్వాత వెళ్ళి పోయారు.
"అమ్మయ్య" అనుకుంటూ బట్టలు మార్చుకుని అన్నగారి స్కూటర్ బయటికి తీసి బయలు దేరాడు వాసు.
ఆదివారం వస్తే రాఘవరావు ఇల్లు కదలడు. వాసుకి వళ్ళంతా చీమలూ జెర్రులూ పాకినట్లు వుంటుంది. ఎటు తిరిగినా అన్నగారి ముఖమే కన్పిస్తూ వుంటుంది. అది భరించలేని వాసు ఆదివారం వస్తే రోడ్ల మీద కాలక్షేపం చేస్తూ వుంటాడు వెంకటేశ్వర్లు కిల్లీకొట్టు వాసుకి విడిది.
* * *
వారం రోజుల నించీ మాలతి వెంకటేశ్వర్లు కిల్లీ కొట్టులో వుద్యోగం చేస్తూంది. నెలకి ముఫ్ఫై ఇస్తానంటూ ఒప్పుకున్నాడు.
"ముఫ్ఫై చాలా తక్కువ" అంటూ నసిగింది మాలతి.
వాసుకి వళ్ళు మండిపోయింది. పెద్ద "గవర్నరెస్స్"లా మాట్లాడతావేం. ఈ వుద్యోగానికి ఈ జీతం చాలు" అంటూ కసురుకోవటంతో మళ్ళీ మాట్లాడలేదు మాలతి.
అమ్మకం పెరిగింది గాని షాపులో "ఆవారా గాళ్ళు"బైఠాయించటం యెక్కువైంది. అప్పుడప్పుడూ గల్లా పెట్టెలో మూడూ నాలుగూ తక్కువ లెక్కవస్తోంది.
"వెంకటేశ్వర్లు షాపులో ఓ అందమైన ఆడపిల్ల వుద్యోగం చేస్తోంది" అనేమాట ఆ నోటా ఆ నోటా వెంకటేశ్వర్లు భార్య సూరేకారం వరకూ వెళ్ళింది, క్షమించాలి. సూర్యకాంతం భర్త ముద్దుగా పెట్టుకున్న పేరు సూరేకారం.
ఒక రోజు వెంకటేశ్వర్లు ఇంట్లో "ఓ ఆడదాన్ని కొట్లో కూచోపెట్టి డబ్బంతా తగలేస్తున్నావా, ఇంక నేను బతికి యెందుకూ నీకు పరాయి ఆడది కావాల్సి వస్తే... వురెట్టుకు చస్తా" అంటూ సూరేకారం రాగాలు తీస్తూంటే ఇరుగూ పొరుగూ పోగై వెంకటేశ్వర్లుని చివాట్లేశారు.
"ఇంట్లో నిక్షేపం లాంటి ఇల్లాల్ని వుంచుకుని నీ కిదేం పోయే కాలమయ్యా.... వ్యాపారంలో ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నవాడివి. ఇలాంటి పక్కదారులు పడితే ఇంక బగుపడతావా" అంటూ.
వెంకటేశ్వర్లు చెప్పేమాట ఎవ్వరూ వినేస్థితిలో లేరు. భార్య మీద యెంతకోపం తెచ్చుకునీ యేం ప్రయోజనం. సంసారం వీధికి లాగేస్తోంది సూరేకారం. ఇంక గత్యంతరంలేక
"నోరుగలమ్మా నీకో దణ్ణం." అనుకుని తనే తగ్గి తన సంసార శకటాన్ని లాక్కువస్తున్నాడు.
"మాలతిని ఎలా వదిలించుకోవాలి! ఎన్నో విధాల ఆలోచనలు చేస్తున్నాడు. వాసు దారితప్పి నూరేళ్ళ పంట అయిన జీవితాన్ని నాశనం చేసుకోబోయే అమ్మాయిని ఆదుకుని తిరిగి దారిలోకి తేవాలని ప్రయత్నిస్తూ ప్రస్తుతం కాస్త సహాయపడు అని అర్ధించాడు తనని. మిత్రుడి మాట కాదనలేక వుద్యోగం ఇచ్చాడు. చుట్టూ ప్రపంచం మాకెందుకని వూరుకుంటుందా! అయ్యోరామా ఇప్పుడు ఏం చెయ్యాలీ....వాసు మరో పని మాలతికి ఇప్పించాలని ప్రయత్నిస్తూనే వున్నాడు. ఇలాంటి సమయంలో నేనూ కాదంటే ఎలా ఎలా అనుకుంటూ మహా బాధపడిపోతున్నాడు వెంకటేశ్వర్లు.
కాని ఏదారీ కన్పించటం లేదు.
కిల్లీ కొట్టుదగ్గర చేరే ఆవారాగాళ్ళు వికవికలూ పకపకలూ పోతుంటే వెంకటేశ్వర్లు మందలించబోతే... "నీ లెక్కేంటి" అనే వరకూ వచ్చారు.
పరిస్థితి అదుపు తప్పుతున్నదని గ్రహించిన వెంకటేశ్వర్లు ఇంక వూరుకుంటే లాభంలేదని మరోటి యేదైనా చూపించి ఇది తీసేస్తే బాగుంటుందని చచ్చీ చెడీ ఓ మిత్రుడిని పట్టుకుని ఎలాగైతేనేం మాలతికి సినిమా హాలులో టికెట్లు అమ్మే వుద్యోగం వేయించాడు.

ఎటువచ్చి ఎటుపోయినా అంటే "డబ్బు విషయం" వెంకటేశ్వర్లుదే పూచీ ఆ షరతు మీదే వాళ్ళు వుద్యోగం ఇచ్చారు.
"జీతంకూడా అరవై....ఫర్వాలేదు" అంటూ వాసునికూడా వప్పించి మాలతిని పనిలో చేర్పించారు.
బాధ్యతని జాగ్రత్తగా నిర్వహించమని వాసు మరీమరీ హెచ్చరించాడు.
టిక్కెట్లు ఇచ్చి డబ్బు ఎలా లెక్కచూసు కోవాలో. తిరిగి చిల్లర ఇచ్చేప్పుడు తేలిగ్గా లెక్కలు ఎలా కూడుకోవాలో ఒకరోజంతా వివరించాడు వాసు
పొరపాటుగా మనంమాత్రం ఒక్కపైసా కూడా ఎక్కువ ఇవ్వకూడదు. "మనం తీసుకున్నా ఫర్వాలేదు. ఓవేళ వాళ్ళు అడిగి తిరిగి వచ్చేస్తాంగా అప్పుడు ఇచ్చేస్తాం" అంటూ వ్యాపారంలోని తన అనుభవం విప్పిచెప్పాడు. వెంకటేశ్వర్లు
"ఏదో పెద్దయింటి పిల్లలా వుంది." అనుకుని మాలతిని ఓ కంట కనిపెడుతూనే వున్నాడు మానేజర్.
మాలతి కృతజ్ఞతగా ఆ ఇద్దరికీ నమస్కరించి తన డ్యూటీలో చేరింది.
కొన్నిరోజులు ఫర్వాలేదు అనుకుని సంతృప్తిగా నిట్టూర్చి ఇంటికి వచ్చిన వాసుకి ఓ వుత్తరం అందించి పీటవాల్చి అన్నం వడ్డించింది శ్రీలక్ష్మి.
చాలా రోజుల తర్వాత స్నేహితుడు విశ్వం రాసిన ఉత్తరం. అన్నంమాట మరచిపోయి ఉత్తరం చదవటంలో లీనమైపోయాడు వాసు.
"అబ్బ అన్నం తినవయ్యా తర్వాత చదువు కుందువుగాని".
నిద్ర కళ్ళ మీదకి తోసుకువస్తూంటే ఆవలిస్తూ అక్కడే ఓపీట వాల్చుకు కూర్చున్న శ్రీలక్ష్మిని చూసి తిరిగి గబగబా చదవటం పూర్తి చేసి పావుగంట తర్వాత అన్నం కలుపుకుని "నెయ్యి" అంటూ చెయ్యిపెట్టి తలయెత్తిన వాసుకి నిద్రలో తూగుతున్న వదినగారినే మరీ మరీ చూడాలన్పించింది. తెల్లచీరె నల్ల జాకెట్టు ముడిలో తురుముకున్న మల్లెలలో నించి దెవనం ముందుకొచ్చి వాసుని పల్కరిస్తున్నట్లు అన్పించింది.
పాపం వదిన తెల్లవారి అయిదు గంటలకి లేస్తే తిరిగి రాత్రి తొమ్మిది గంటల వరకూ విశ్రాంతి దొరకదు. ఇల్లునీ పిల్లలనీ యెంత పరిశుభ్రంగా వుంచినా రాఘవరావు యేదో వంక వెతుక్కుని భార్య మీద కారాలు మిరియాలూ నూరుతూనే వుంటాడు. వాసుకి అన్పిస్తుంది. "అన్నయ్య ఇంత సాధిస్తున్నా... వదినకి కోపంరాదూ! అసలు జవాబే ఇవ్వదే."?
అసలు రాఘవరావు నవ్వుతూ భార్యతో మాట్లాడే సంఘటనలు చాలా తక్కువగా కన్పిస్తాయి వాసుకి.
శ్రీలక్ష్మి మాత్రం యెప్పుడూ ఒకే రకంగా కన్పిస్తుంది.
వాసు గబగబా తనే వడ్డించుకుని తినేస్తూంటే మెలుకువ వచ్చింది శ్రీలక్ష్మికి.
"అయ్యో నీ కోసం పెరుగు వుంచాను. మజ్జిగ పోసేసుకున్నావా నీతో మాట్లాడుతూంటేనే కునుకు వచ్చింది. వుండు మరి కాస్త అన్నం పెట్టి పెరుగు వేస్తాను" అంటూ లేచి వాసుకోసం దాచిన పెరుగు గుమ్మరించింది. ఈ ఇంట్లో లక్ష్మి లాంటి ఈ వదిన లేకుంటే తను ఒక్కక్షణం వుండలేకపోయేవాడు. ఇంతమంచి వదిన్ని అన్నయ్య యెప్పుడూ ఎందుకు సాధిస్తాడో అంతుపట్టదు వాసుకి.
చెయ్యి కడుక్కుని తన గదిలోకి వెళ్ళి పోయాడు.
వంటయిల్లు సర్దుకుని శ్రీలక్ష్మి వాసువున్న గదిలోకి వచ్చింది.
"వాసూ రేపు నువ్వు యెక్కడకీ నాకు చెప్పకుండా వెళ్ళకు. పెళ్ళిచూపులకి వెళ్ళాలిట. మొన్న వచ్చిన ఆ బట్టతలాయన మళ్ళీ వచ్చి పది హేనువేలు ఇస్తాం పిల్లని చూసుకోండి" అంటూ మరీమరీ చెప్పి వెళ్ళాడు.
"నాకు పనివుంది. అని అన్నయ్యకి చెప్పు. రేపు అస్సలు తీరుబడి లేదు."
పిలిచి పిల్లనిస్తామంటే అలిగి అందలం యెక్కాడుట. నీలాంటివాడు. మీ అన్నయ్య చెప్పమన్నారు. చెప్పాను అంతే....
"సరే... నేను చెప్పమన్నాననీ చెప్పేయ్."
