మీనాక్షి మరేం మాట్లాడక మోకాళ్ళ లో తలదాచుకుంది.
"వెళ్ళు వెళ్లి అన్నం తిను. ఒంట్లో బాగుండడం లేదేమిటి? రేపు తప్పకుండా వెళ్దాం విజయ పరీక్ష చేస్తానంది."
మీనాక్షి విసురుగా తలెత్తి - "నేనా గడప తొక్కనని ఎన్నిసార్లు చెప్పాను? నీకిష్టమైతే ఒకటికి పదిసార్లు వెళ్ళు! అంతేగానీ నన్ను తీసికెళ్ళాలనుకోవడం ఏం బాగాలేదు. వాళ్ళ కార్లూ, మేడలూ చూసి నువ్వు భ్రమించి పోతావేమో..... ఎన్ని కార్లున్న, ఎన్ని మేడలున్నా ఎవరికైనా యిస్తారా? వాళ్ళ వరకే వుంటాయి" అంది.
"అంత అన్యాయంగా మాట్లాడకు. నన్ను చదివించి యింతవాణ్ణి చేసింది అత్తయ్య కాదా?"
"అవును , నీకు మటుకు అత్తయ్యే! నాకు కాదు. వాళ్ళెవరూ నాకేం కాదు. " మెల్లగా స్పష్టంగా , కఠినంగా అంది.
"ఇన్నీ మాట్లాడే ముందు కనీసం ఒక్కసారన్నా ఆలోచించాలని తెలీదూ? ఇదీ అత్తయ్య తప్పేలా అవుతుంది? సుందరమే నిన్ను చేసుకో నన్నాడు."
"అవును ఎవరి తప్పూ కాదు. అంతా నా తప్పే! కూటికి లేని గర్భ దరిద్రుల కడుపున పుట్టి లక్షాదికార్లను చేసుకోవాలనుకోవడం నాదే తప్పు. ఒప్పుకుంటున్నాను. కానీ నన్ను మటుకు ఆ కొంపలోకి తీసికెళ్ళే అందుకు ప్రయత్నించకు. ఏ మేలూ నువ్వు నాకు చెయ్యకున్నా కనీసం ఈ మేలన్నా చెయ్యి." చాప మీద నుండి లేచి ఎర్ర బడిన కళ్ళతో భానుమూర్తి ముఖంలోకి చూస్తూ ఆవేశంగా అంది.
కోపమూ, దుఃఖమూ , నిస్సహాయాతా కలిసి మీనాక్షి కంఠాన్ని రుద్దంగా చేశాయి.
కళ్ళల్లో నుండి నీళ్ళు రాలి పడేటట్లున్నాయి.
"సరే! నీకంత కష్టంగా వుంటే రావద్దు లే. దుఃఖాన్నంతా మింగి వరండా లోకి వచ్చాడు.
విశాల స్కూలు నుండి వచ్చి గేటు తీస్తూ యధాలాపంగా వరండాలో పాలిపోయిన ముఖంతో దీన దృక్కులతో తన వైపే చూస్తున్న అతని చూపులు విశాల హృదయాన్ని కలచి వేసిన మాట మటుకు నిజం. మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. హల్లో యీజీచైర్లో విచారంగా కూర్చొనున్న రాఘవయ్యా, నేలమీద పైట చెరుగు పరుచుకొని పడుకోనున్న కృష్ణ వేణమ్మా విశాలకు జరిగిన విషయమేమిటో కొంచెంగా చెప్పేశారు.
"నాన్నా! ఏమైంది? అమ్మ అలా పడుకోనుందేం?"
"మనింట్లో ఏమవుతుంది. విశాలా?" డగ్గుత్తికతో అన్నాడు.
"అన్నయ్యోచ్చాడా?' ఆత్రంగా అంది.
"ఊ....."
"విశాల గదిలోకి వెళ్ళి "ఇన్నాళ్ళకు నీకు యిల్లు కన్పించిందా? యీ వారం రోజులూ ఎక్కడున్నావు?" అంది.
"నీకు చెప్పుకోవలేమిటి?" విసురుగా అన్నాడు మురళి.
"చెప్పాలనిపిస్తే చెప్పు.... బలవంతమేముంది?"
"ఎక్కడో వున్నాను. అదంతా నీకనవసరం. నాకు అర్జంటుగా యిరవై రూపాయలు కావాలి."
"నాదగ్గరెక్కడున్నాయి?"
"ఉన్నాయి కనకే అడుగుతున్నాను."
"ఉంటె మటుకు యివ్వాలని ఎక్కడుంది?" నవ్వడానికి ప్రయత్నిస్తూ అంది.
"ఇవ్వవా?" కోపంగా చూస్తూ అడిగాడు.
"ఊహు... ఎందుకివ్వాలి? తాగి తలకి పోసుకునెందుకెనా?"
"అది నీకనవసరం."
"డబ్బివ్వడమేనా నా కవసరం?" కనుకొలకుల్లో నుండి చూస్తూ అంది.
మురళి ఏం మాట్లడలేదు. కోపంతో ముఖం ఎర్రబడింది.
విశాల లోపలికి వెళ్ళింది.
"మర్యాదగా యిస్తే యిచ్చినట్లు, లేకుంటే పెట్టె తాళం పగలకొట్టాల్సివస్తుంది. "గదిలో నుండి పెద్ద గొంతుక చేసుకుని అరిచాడు మురళి.
హల్లో కూర్చొనున్న రాఘవయ్య కోపంతో వణికిపోయాడు.
"వింటున్నావా?' క్రిందపడి పార్లాడుతున్న కృష్ణవేణమ్మ నుద్దేశించి అన్నాడు. కృష్ణ వేణమ్మ కన్నీళ్ళు తుడుచుకుంది- జవాబుగా.
ఎవ్వరి దగ్గరి నుండి ఎలాంటి జవాబూ రాకపోయేసరికి మురళి రాయి తీసుకుని తాళం పగులగొట్ట సాగాడు.
రాఘవయ్య లేచి గదిలోకి వెళ్ళి కొడుకు చెంప మీద ఒక్కటిచ్చాడు.
మురళి రోషంతో చెయ్యెత్తాడు తండ్రి మీదకు. విశాల వెళ్ళి మురళి చేతిని గట్టిగా పట్టుకుంది.
"వదులు! నీకెందుకు ? మామధ్యలో వచ్చేందుకు నువ్వేవరు?" విశాల చేతిని బలంగా లాగేస్తూ అరిచాడు మురళి.
"దాని సంపాదన తింటూ ఎవరంటావేం? సిగ్గులేదూ?" ముఖం చిట్లించి అన్నాడు రాఘవయ్య.
"మహా సంపాదన! చిన్నప్పట్నించి నాకి చదువు చెప్పించావే దాని కేవడిస్తాడూ?" ఉరిమి నంత పనిచేశాడు మురళి.
"నీ సొమ్మేం పెట్టలేదు."
"నీసోమ్మేమి నేనడగలేదు."
"ఛీ! నీతో మాట్లాడ్డం పరువు తక్కువ!"
"ఎవరు మాట్లాడమన్నారు? డబ్బిస్తే నేనిప్పుడే వెళ్ళిపోతాను."
"నీతాత సొమ్మేం యిక్కడ లేదు. ముందు బయటకు నడువు.
"నేనేళ్ళను. ఏం చేస్తారేమిటి?"
రాఘవయ్య కొడుకు ముఖంలోకి చూశాడు. మురళి వ్యంగ్యంగా, ఏహ్యంగా, క్రూరంగా నవ్వాడు. రాఘవయ్య హృదయంలో ఆ నవ్వు తుపాకీ గుండులా మ్రోగింది. ముఖం ప్రక్కకు తిప్పుకున్నాడు. మనసులోని బాధ పైకి కనబడనీకుండా.
"అన్నయ్యా! డబ్బు విషయం తర్వాత చూసుకుందువు గానీ..... మేఉండు అన్నానికి రా!"
"అబ్బ! ఎంత ప్రేమ! హు.... అసలు నీ ఆసరా చూసుకునేగా అయన నన్ను గడ్డి పోచలా తీసి పారేస్తున్నాడు!" కళ్ళల్లో నుంచి నిప్పులు కురిపిస్తూ అన్నాడు మురళి.
"గడ్డి పోచను గడ్డి పోచలా కాక పువ్వులా తల మీద పెట్టుకుని తిరగేటంతటి అవివేకం నాలో లేదు. నీ విలువెంతో నాకు తెలుసు" మండి పడ్డాడు రాఘవయ్య.
"ఏం? ఆ కులం లేని దాని పాటి చేయ్యనేమిటి?" చీత్కారం చేసి అన్నాడు మురళి.
విశాల ముఖం కత్తి వేసినా నెత్తురు చుక్క లేనంత తెల్లగా పాలిపోయింది.
రాఘవయ్య కళ్ళలో మండి నిప్పులు రాలిపడ్డాయి. ఓ క్షణానికి తన్ను తాను తమాయించుకుని-- "కులమెందుకురా వెధవా! కావలసింది గుణం! పదారు వన్నెల బంగారం నా తల్లి!" అన్నాడు.
"అలాగేం! అయితే ఆ పదారు వన్నెల బంగారం అమ్ముడు పోకుండా వుందెం?" అన్నాడు యెగతాళిగా.
ఆ మాటకు రాఘవయ్య అప్రతిభుడై పోయాడు. ఏం జవాబు చెప్పాలో తోచలేదు.
విశాల కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి.
"నేనేం అపకారం చేశానని యిలా అవమానిస్తావు? ఈ విషయం ఎత్తి నన్నింతగా అవమానించకు. నీకేంతయినా పుణ్యముంటుంది." చెక్కిళ్ళ మీద కారిన కన్నీళ్ళ ని తుడుచుకుంటూ రుద్ద కంఠం తో అంది విశాల.
మురళి తల విసురుగా తిప్పుకుని హాల్లోకి వచ్చాడు. "నీ దగ్గరుంటే ఓ రూపాయి యివ్వు" అన్నాడు తల్లి నుద్దేశించి.
కృష్ణ వేణమ్మ ఏమీ జవాబుచేప్పలేదు. కళ్ళల్లో నీళ్ళు కొడుకు కంట పడనీకుండా పైట చెంగు ముఖం మీదకు లాక్కుంది.
"ఇక్కడ ఎవరి దగ్గరా రూపాయలు కుప్పలు పోసి లేవు. ముందు మర్యాదగా బయటి కెళ్ళు." కోపంతో అరిచాడు రాఘవయ్య.
"నువ్వు పెట్టనంత మాత్రన బ్రతకలేనేమిటి?"
"మారాజుగా బ్రతుకు! నాక్కావలసింది అదే! వెళ్ళు. నువ్వొక నరరూప రాక్షసుడివి. రాక్షసులు శరీరాన్ని మింగేస్తే నువ్వు హృదయాలనే కబలిస్తావు."
మురళి విసురుగా బయటికి వెళ్ళాడు.
రాఘవయ్య కుప్పలా కుర్చీలో కూలబడి పోయాడు.
విశాల స్కూలుకు వెళ్లేందుకు పుస్తకాలు తీసుకుంది.
"విశాలా! వాడన్న మాటలు మనసులో పెట్టుకోకమ్మా! కాస్త ఎంగిలి పడిపో తల్లీ!" గద్గద కంఠంతో అన్నాడు.
కృష్ణ వేణమ్మ లేచి కూర్చుని - "యిన్ని రోజులకు వాడి యింటి కొస్తే కనీసం నాలుగు మేతుకులన్నా తిననీకుండా తరిమేశారా?" అంది. రాఘవయ్య ముఖంలోకి చూసి.
"నీకేనా వాడి మీద ప్రేమ? నాకూ వుంది" అన్నాడు.
"అది తెలుస్తూనే ఉంది!" దేప్పింది.
"నాన్న మటుకేం చేస్తారు? అన్నయ్య ప్రవర్తన నువ్వు చూస్తున్నవుగా?" అంది విశాల.
"మంచివాడు కాదు. నిజమే! కానీ యీ యింట్లో నాలుగు మెతుకులు తినే అధికారం కూడా వాడికి లేదా?"
"అధికారం మాటే మాట్లాడతావు గానీ అన్నీ కాకున్నా కనీసం కొన్నయినా బాధ్యాతలు వాడు నిర్వర్తించాలన్న విషయం నీకు గుర్తుకు రాదా?"
అందుకు కృష్ణ వేణమ్మ ఎలాంటి జవాబూ చెప్పలేదు. ఏం చెప్తుంది?
కన్నకడుపు న్యాయాన్యాయాలను విచారిస్తే ప్రపంచం ఏవిధంగా ఉండేదో చెప్పడం కష్టమే. సర్వభాక్షకుడైన నీతిహోత్రునిలా ఎన్ని తప్పులయినా, పాపాలయినా భక్షించి , జీర్ణించుకోగలదు. ఆ హృదయం అలాంటిది.
దానికంత శక్తి ఉంది. కానీ నవనీతం లాంటి ఆ మనసు నొప్పించకుండా చూసుకోవాలన్న యింగిత జ్ఞానం మురళి లాంటి వాళ్ళకు బొత్తిగా వుండదు.
తమ శ్రేయస్సు కోసం సర్వస్వం ధారపోసినందుకు ఎల్ల కాలాల యందు సంసిద్దంగా ఉన్న ఆదేవతా స్వరూపిణికి వాళ్ళ కళ్ళకు ఉత్త మనిషిలా, కేవలం రక్త మాంసాల మిశ్రమంలా కన్పించడం శోచనీయం.
విశాల చెప్పులు తొడుక్కుని మౌనంగా వరండాలోకి వచ్చింది.
"విశాలా! నేనేదో అంటాన్లె! నా విషయం నీకు తెలిసిందేగా? అన్నం తినకుండా వెళ్ళి పాఠాలేలా చెప్తావు? అన్నం వడ్డిస్తాను తిని పొడువు గానీరా!" బరువుగా నిట్టూర్చి లేస్తూ అంది కృష్ణ వేణమ్మ.
"వద్దు, టైమైంది."
వరండా లో నిల్చోనున్న భాను మూర్తిని చూడగానే విశాల హృదయం అవమాన భారంతో కృంగి పోయింది. తలెత్తి భానుమూర్తి ముఖంలోకి చూసే ధైర్యం కూడా లేక బరువుగా అడుగులు వేస్తూ గేటు వైపు నడిచింది.
