Previous Page Next Page 
మల్లమ్మదేవి ఉసురు పేజి 4


    నా అద్భుత యాత్రలలో అటువంటి అనుభవాలున్నాయి యింతకూ యేమంటే నేను చాలామంది దొరసానుల్ని చూచాను.
    కాని మిస్ మార్లిన్ రూపురేఖలు విశిష్టంగా వున్నాయి.
    సౌరిస్ లా వుంది. రతీదేవిలా వుంది. ద్రౌపదిలా వుంది. వరూధినిలా వుంది. కళాపూర్ణోదయం హీరోయిన్ లా వుంది. అందంగా వుంది. అద్భుతంగా వుంది. మోకాలు దిగీ దిగని గౌను. భుజానికి వ్రేలాడుతున్న బాగ్ ఎయిర్ బాగ్. కళ్ళల్లో కాంతి పెదవులమీద చిరునవ్వు. ముఖంలో అర్ధంకాని వుత్తేజం. మనిషిని మొత్తంగా చూస్తే 'లేని సమాధానం కోసం వేసిన ఒక పెద్ద ప్రశ్నార్ధకంలా కన్పించింది నాకు.
    ఏ మహా నగరంలోనో, దూరం పోయే ఎక్స్ ప్రెస్ రైలులోనో కాక యీ గ్రామంలో, రాజావారి యింటిలో నా గదిలో నా యెదురుగా దొరసాని కన్పించింది యేమిటా అని ఆశ్చర్యపోతున్నాను.
    "నేను-మహాదేవి మల్లమ్మను" అన్నది స్వచ్చమైన తెలుగులో. దొరసాని తెలుగు మాట్లాడటమా? నన్ను నేను చేయిమీద గిచ్చుకుని చూచుకున్నాను. రెండు విషయాలు బోధపడినాయి.
    నేను మేలుకునే వున్నాను. రెండోది యెదురుగా కన్పించేది యదార్ధం. నాకు చెప్పలేనంత ఆశ్చర్యమయింది.
    దొరసాని వచ్చి మహాదేవి మల్లమ్మను అంటోంది యేమిటి? నేను అప్రయత్నంగా కుర్చీలోంచి యెప్పుడు లేచానో జ్ఞాపకం లేదు కాని ఆమె దగ్గరగా వెళ్లాను. ఆమె నవ్వింది.
    ఆ నవ్వు యెంత బాగుందని.
    హిమాచలప్రదేశ్ లో ఆటవికజాతి స్త్రీలు నవ్వినంత మధురంగా నవ్వింది, హిమాచలప్రదేశ్ కిన్నెరదేశం. మన పురాణాలు వర్ణించిన కిన్నెరలు వాళ్ళే వాళ్ళ కంఠాలకు సాటివచ్చే కంఠమాధుర్యం ప్రపంచంలో మరెక్కడా వుండదు. అది వాళ్ళకు జన్మతో వచ్చిన వరం. ప్రకృతి యిచ్చిన వరం.
    వాళ్ళ నవ్వు వింటుంటే సంగీతం వింటున్నంత మధురంగా వుంటుంది. దగ్గరగా వెళ్ళితే కంపు. ఏడాదికి ఒకసారే నీళ్ళు పోసుకోవటం.
    మిస్ మార్లిన్ శరీరం విద్యుత్తేజం తెగిపడినట్లుగా వుంది. గౌరవర్ణంతో వున్న పట్టులాంటి జుత్తు గాలికి యెగురుతోంది. హైహీల్సు తొడిగింది. ముంజేతులమీదా, మోకాళ్ళక్రింద పాదాలవరకూ గౌరవర్ణం నూనూగు వెంట్రుకలున్నాయి.
    అవి చూస్తున్నప్పుడు శంఖినీస్త్రీలా వుంది కాని, దానిమ్మపూవు రేకుల్లా యెర్రగా మెత్తగా వున్న అరచేతులు, కాంతివంతమయిన కళ్ళు, అప్పుడే పాలసముద్రంలోంచి పట్టుకొచ్చిన శంఖంలా వున్న మెడా చూస్తుంటే పద్నినీజాతి స్త్రీ అనిపించింది.
    "మహాదేవి మల్లమ్మ ఏమిటి?" అన్నాను అయోమయంగా.
    "నేనే మల్లమ్మదేవిని" అన్నది సమాధానంగా నాకు ఒకటి అనిపించింది. బహుశా యీమెకు మతి చలించే జాడ్యం వుండి వుంటుంది. రైలులో ప్రయాణం చేస్తూ వుండగా యీమె తాలూకు పురుషుడు నిద్రపోతూ వుండగా మతిపోయి రైలు దిగి యిలా వచ్చింది కాబోలు అనిపించింది.
    నా అనుమానం రెండువిధాల తప్పు అయింది.
    అలా వస్తే తెలుగు యెలా మాట్లాడగలదు? అని ఒకటి.
    "తెలుగు వచ్చినా మల్లమ్మదేవి పేరు యెలా తెలుస్తుంది?" అన్నది రెండు. నా మొదటి వూహ యిలా రెండు విధాలుగా తప్పు అయిపోగానే నేను మరింత కంగారుపడిపోయాను. మొత్తం సంగతి అర్ధం చేసుకోవాలి అనిపించింది.
    "లోపలికి రండి" అంటూ మర్యాదగా పిలిచి గది లోపలకు తీసుకుపోయాను.
    
                          2
    
    మిస్ మార్లిన్ మన లోకంలో లేదు. నేను మనుషుల మధ్య వున్నా నన్న స్పృహ ఆమెకు వున్నదని నాకు అన్పించలేదు. బొత్తిగా వళ్ళు మర్చిపోయినట్టుగా వుంది. మాటలు మారిపోయినాయి.
    ఈ వింత చూచేందుకు పనివాళ్ళంతా నా గది వాకిలి దగ్గర గుమిగూడారు. మార్లిన్ కు ఆ విషయంకూడా తెలియదు.
    "నువ్వెవరు? యిక్కడెందుకున్నావు?" అని అడిగిందామె. అది నేను ఆమెను అడగవలసిన ప్రశ్న. ఆమే నన్ను అడుగుతోంది.
    ఇటువంటి సందర్భాలలో ప్రశాంతంగానూ, ఓర్పుతోనూ వుండటం చాలా అవుసరం. నేను చెప్పాను.
    "నేనెవరు? అనే విషయాన్ని గురించి నేనూ కొంతకాలంగా ఆలోచిస్తూనే వున్నాను. అయినా నాకు అర్ధం కాలేదు. అర్ధమయిన రోజు నీ ప్రశ్నకు తప్పకుండా సమాధానం చెప్తాను" అని.
    ఆమె నవ్వింది! గల గలా నవ్వింది. సెలయేరు పారుతున్నట్లు, దూరంగా యెక్కడో చర్చిలో గంటలు మ్రోగుతున్నట్లు నవ్వింది.
    "ధర్మారాయుడు బాబాయి యెక్కడ?" అడిగింది రాణీవాసపు దర్పంతో.
    "ఏ ధర్మారాయుడు తల్లీ!" అన్నాను ఆశ్చర్యంతో మునిగి తేలుతూ.
    "దామెర్ల ధర్మారాయుడు బాబాయి" అన్నదామె తడుముకోకుండా.
    "చచ్చిపోయి రెండువందల యిరవై సంవత్సరాలు దాటినాయి" అని సమాధానం చెప్పాను భయపడుతూనే.
    "యూ రాస్కెల్, ఫూల్ బాబాయి చచ్చిపోయాడంటావా? ముందు నీ పని పడతాను చూడు" అంటూ నామీదికి బెబ్బులిలా లంఘించింది మిస్ మార్లిన్. సుకుమారమైన చేతుల్లోకి అంత బలం యెలా వచ్చిందో?
    దానిమ్మపూవు రేకుల్లా వున్న మెత్తని యెర్రని చేతులతో చెంపమీద రెండిచ్చింది. మరో రెండిచ్చినా ఫరవాలేదు కాని యీ విచిత్రం యేమిటో త్వరగా అర్ధం అయితే బాగుండును అనుకుంటున్నాను.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS