"ముందు బిస్కట్లు, టీ తీసుకో... తరువాత చెప్పు! సమస్యలు వస్తుంటాయి. అవే పోతాయి" అంది సుమతి కళ్ళలోకి చూస్తూ.
"నువ్వు చెప్పు పిన్నీ, ఇందులో ఏం న్యాయం వుందీ?! వరద వచ్చినప్పుడు ఎవరు అక్కడ వదిలిపెట్టారో - అసలు ఏమిటో నాకేం అర్ధం కాదు. ఓ పసిగుడ్డుని-అదీ ఆడపిల్లని, దాన్ని పెంచుదాం అంటారు ఈయన, నువ్వే చెప్పు, నాకు ఓ కొడుకున్నాడు. కావాలంటే ఇంకో పిల్లని కనొచ్చు. అంతే కాని..." సుమతి ఇంకేదో చెప్తోంది.
తులసమ్మ తలవంచి కనుబొమలు చిట్లించి ఏదో ఆలోచిస్తోంది. "ఇక్కడ వదిలిందా..?" - అప్రయత్నంగా నోటినుంచి మాట వెలువడగానే -
"అంటే... ఆ పిల్ల తల్లి తెలుసా?" అంది కంగారుగా సుమతి.
"ఛీ, అదేమిటీ - ఎవరన్నా కానీ... అక్కడ వదిలిందా? సుమతీ, నువ్వు ఊరికే ఖంగారు పడిపోకు. నేనూ, మీ అమ్మ చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయిని గురించి ఇలాగే చెప్పుకునేవారు-తుపానుకి కొట్టుకొచ్చిందనీ.... కొన ఊపిరితో వున్న పిల్లని ఎలాగో బతికించారని... ఆ అమ్మాయే ఈ అమ్మాయి అని..! అది గుర్తొచ్చింది."
"ఇప్పుడామ్మాయి ఎక్కడుందో..!" అంది సుమతి.
"మా చదువులు, ఆ అమ్మాయి ఇప్పటి విషయమా..? నలభై ఏళ్ళనాటి విషయం!" అంది - తులసమ్మ సుమతివైపు చూస్తూ.
"ఇంతకీ - ఏం చేద్దామని నీ ఉద్దేశం?"
"చెప్పాను- ఏ అనాధాశ్రమంలోనే యిచ్చేయమని! ఆయన అలా ఇవ్వడట. పెంచి పెద్దదాన్ని చేసి, పెళ్ళి చేసి..... ఛీ!" సుమతి కళ్ళలో నీళ్ళు నిలిచాయి.
"అనాధాశ్రమంలోనా... పాపం!" అంది తులసమ్మ.
"అంటే, పిన్నీ- నువ్వుకూడా ఆ పిల్లని నేను పెంచాలనే అనుకుంటున్నావా?" అంది కోపంగా సుమతి.
"ఆ పిల్లని ఏం చేయాలో, ఎవరి దగ్గరకైనా పంపించాలో, ఎక్కడుంచాలో అన్నీ నేను ఆలోచిస్తాగా! అయినా- మీ ఆయనకి మాత్రం అంత మొండితనం ఏమిటీ - భార్యకి ఇష్టంకాని పని, అందులోనూ- నీ మాట కాదనటమేమిటీ? నే కనుక్కుంటా వుండు- నువ్వు ఖంగారుపడకు. ఇంటికెళ్ళు- నేను ఏదైనా ఉపాయం ఆలోచిస్తాగా!" అంది తులసమ్మ నెమ్మదిగా.
సుమతి పిల్లాడిని తీసుకు లేచింది. తులసమ్మ గుమ్మం దగ్గరగా నిలబడి వెడుతున్న సుమతిని, పిల్లాడిని గమనిస్తోంది.
ఒక్కసారిగా రెండేళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది తులసమ్మ....
గబగబా తలుపు తోసుకువచ్చాడు సుధాకర్.
"ఏమిటీ హడావిడి?" అంది తులసమ్మ దేవుడికి పూలమాల కడుతూ.
"రోజూ మనింటి ముందునించి వెడుతుంది చూడు, ఆ అమ్మాయి!"
"అదా... లీల!"
"ఆ- ఆ లీల గురించి!"
"అంటే... పెళ్ళాడాలనా?" నవ్వింది తులసమ్మ.
"నా మనసులో మాట బయటకి చెప్పేశావే..! నిజంగానే..."
- ఏదో నసిగాడు సుధాకర్.
సుధాకర్ ఎదురింట్లో గదిలో అద్దెకుండి, కొత్తగా ఉద్యోగంలో చేరాడు. దూరపు చుట్టం కూడా తులసమ్మకి! తులసమ్మని 'అమ్మమ్మా...' అని పిలుస్తాడు.
ఆరోజు ఆ సంభాషణ అక్కడితో ఆగిపోలేదు.
రోజూ ఇంటి ముందునించి నడిచివెళ్ళే లీల ఇంటర్ చదువుతోంది. లీల తల్లి స్కూల్ టీచరు. తండ్రి లేడు. ఎంతో బుద్దిమంతురాలిగా కనిపిస్తూ ఎంతో అందంగా వుండే లీల ఎవరికైనా నచ్చుతుంది. కానీ, కట్నకానుకలిచ్చుకోలేని లీల తల్లి, పిల్ల పెళ్ళి గురించే ఆలోచించటం లేదు. పైగా- పిల్లని బాగా చదివించాలని, ఉద్యోగంలో పెట్టాలనీ ఆలోచిస్తుంది.
సుధాకర్ మంచివాడే. తల్లీ, తండ్రి పల్లెటూళ్ళో వుంటారు. లీలని చూసిన దగ్గరనుంచి ఆమెను పెల్లాదాలనే భావం రోజురోజుకీ పెరిగిపోయింది. మధ్యవర్తిత్వం నెరపడానికి తులసమ్మ తగిన మనిషని భావించాడు. చంద్రయ్య ఉత్సాహంగా అంగీకరించాడు.
"నిజమే- పిల్లాడు ఉద్యోగంలో వున్నాడు. బరువు బాధ్యతలు లేవు. నువ్వు మాత్రం ఇంతకన్నా మంచి సంబంధం తెస్తావా?" అంది తులసమ్మ లీల తల్లితో.
"అప్పుడే పెళ్ళేమిటి దానికి - ఇంకా చిన్నది" అంది.
అలా అలా మాటలు పెరిగాయి. "కట్నకానుకలు కూడా కోరటం లేదు, మాట్లాడకుండా ఒప్పేసుకో!" అంది తులసమ్మ.
పెళ్ళి పెద్దగా నిలబడి సుధాకర్, లీలల పెళ్ళి జరిపించింది తులసమ్మ. ఇది రెండేళ్ళనాటి విషయం. పెళ్లవగానే వేరొక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు సుధాకర్.
హాయిగా సాగిపోతోంది దాంపత్యం. కానీ, హాయిగా వుంటే చూడలేని లోకం ఒకటి ఎప్పుడూ వుంటుందిగా!
"నీ పెళ్ళి కుదిర్చిందే నేను... మావాడికి నిన్ను చూపించిందే నేను... తులసమ్మ మధ్యవర్తిత్వమే కాదు, నాదీవుంది మీ ఇద్దరికీ పెళ్ళిచేయించటంలో!" అన్నాడు నవ్వి చంద్రయ్య.
సుధాకర్ ముఖం చిరాగ్గా పెట్టుకున్నాడు- ఈ బాబాయి ఇంకేమేమి మాట్లాడేస్తాడోనని!
సుధాకర్ తండ్రి ఊళ్ళో వ్యవసాయం చూసుకుంటాడు. చంద్రయ్య, సుధాకర్ పిన్ని భర్త వుండటం పల్లెటూళ్ళోనే అయినా, సగం కాలం ఇక్కడే, పట్నంలో వుంటాడు చంద్రయ్య. 'ఆయన ఏం పని చేస్తాడూ...' అంటే- 'ఇది' అని చెప్పలేం కానీ, అన్ని పనులూ చేస్తాడు. వడ్డీ వ్యాపారం, చీట్లు కట్టించటంలాంటి పనులేకాక- ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారంటే- "మీకు అన్ని సహాయాలు చేస్తాను, సిమెంటు నా ఫ్రెండు దగ్గరనుంచి చౌకగా తెచ్చిస్తా, మేస్త్రీలను నేను మాట్లాడతా"నని, ఇలా రకరకాలుగా సమస్తమూ తెలిసినట్లుగా మనుషుల్ని బుట్టలో వేసుకోవడం, అవసరమైతే తలలు మార్చి తలలు పెట్టడం చేయగలడు చంద్రయ్య.
ఈ చంద్రయ్య దూరపు బంధువు తులసమ్మ. ఆ వంకని తులసమ్మతో స్నేహం, ఆత్మీయత, పెద్దదిక్కు అయిపోయాడు చంద్రయ్య. రకరకాల వ్యాపారాల్లో నేర్పరైన చంద్రయ్య తులసమ్మను వాటిల్లోకి దించాలని ప్రయత్నం.
ఆరోజు లీల తల్లి తులసమ్మ ఇంటికొచ్చింది. అక్కడే వున్న చంద్రయ్య లీల తల్లి మహాలక్ష్మి వివరాలన్నీ కబుర్లలో కనుక్కున్నాడు.
"ఒక్క పిల్ల - పెళ్ళికంత తొందరేముందిలే!" అన్నాడు మహాలక్ష్మితో.
"అదేనండీ, తులసమ్మ త్వరగా చేసేయమంటోంది. పైగా- పిల్లవాడు..." ఏదో చెప్పబోయింది మహాలక్ష్మి.
"మళ్ళీ వస్తా... పనుంది...!" అంటూ వెళ్ళిపోయాడు చంద్రయ్య.
ఆ చంద్రయ్య తిన్నగా సుధాకర్ ఇంటి దగ్గర ఆగాడు.
"ఆడకూతురొక్కర్తీ ఏదో టీచరు ఉద్యోగం చేసుకుంటూ బతుకుతోంది. ఆ పిల్ల బుద్దిమంతురాలల్లేనే వుంది... నువ్వు చేసేసుకో.... ఇంతకంటే మంచి అవకాశం రాదు నీకైనా!" అన్నాడు.
"కాదు బాబాయ్, నాదా చిన్న ఉద్యోగం. అప్పుడే పెళ్ళేమిటి?-పెళ్ళయిన దగ్గరనుంచి, హమ్మో ...ఎన్ని బరువులూ, ఎన్ని బాధ్యతలూ!!" అన్నాడు సుధాకర్.
"నీ మొహం - ఇటు విను" గొంతు తగ్గించాడు-
"పెళ్ళయినా ఇల్లు వెతుక్కోనక్కర్లేదు. ఆ ఇల్లు నీదే- నీకుకాక ఎవరికిస్తుందీ? ఇంక ఆవిడ జీతం- కూతురికీ, అల్లుడికీ కాకా ఎవరికీ పెడుతుందీ? అంతే కాదు... ఇంకా చాలా లాభాలున్నాయిలే! ముందు తులసమ్మ దగ్గర కెళ్ళు" అన్నాడు గీతోపదేశం చేస్తున్న కృష్ణ పరమాత్మలా చిరునవ్వు నవ్వి.
సుధాకర్ యువకుడు. నిజానికి లీల రోజూ ఇటు వెడుతుంటే చూస్తున్నాడు. చక్కటి పిల్ల, పైగా ఒక్కతే ఆడపిల్ల, ఇల్లు! -బాబాయి వారికి ముందు చూపుతో చెప్తాడు. ఏం చెప్పినా అవి మనసులో సమాధానపరచుకుని, లీలని ఎలాగైనా పెళ్ళాడాలని నిశ్చయించాడు, పెళ్ళి చేసుకున్నాడు.
బాబాయి చాలాసార్లు సుధాకర్ ని కలిసాడు ఆఫీసులో.
"ఆ అద్దెకొంప ఏమిటిరా - హాయిగా అత్తగారింట్లో వుండక!" అన్నాడు.
"ఛీ, నాకేం ఖర్మ అత్తగారింట్లో వుండటానికీ! - అయినా లీల కూడా ఇష్టపడదు - ఒద్దు బాబాయ్!" అన్నాడు.
"సిరికా మోకాలడ్డటం అంటే ఇదే!" బాబాయ్ వెళ్ళిపోయాడు.
సుధాకర్ మనసు రకరకాలుగా పనిచేస్తోంది. బాబాయి మాటల్లో తప్పేముందీ కూతురూ, అల్లుడూ తోడుగా వుంటే తప్పేమిటీ!!
"లీలా..."
నాలుగు నెలల గర్భవతి, చదువుతోన్న నవల పక్కన పెట్టి వచ్చింది.
ఎలా చెప్పాలో అర్ధంకాక కాసేపు తికమకపడ్డాడు సుధాకర్.
"నీ పురిటికి మీ అమ్మ వస్తుంది కదా..!" అన్నాడు నెమ్మదిగా.
ఫక్కున నవ్వింది లీల.
"మా అమ్మ రావటమేమిటీ -నేనే వెడతాను" అంది.
"అబ్బా... నువ్వువెడితే నేనొక్కన్నీ వుండాలనా?"
"భార్య పురిటికెడితే వెంటపడి భర్తకూడా వస్తాడా? ఛీ... నవ్వుతారు" అంది.
"అయినా- నేను ఇప్పుడే వెళ్ళనుగా, తొమ్మిదో నెల వచ్చాక వెళ్ళి, నెలలోపు వచ్చేస్తా!"
సుధాకర్ ఏదో చెప్దామనుకున్నాడు... గబుక్కున లేచాడు.
"ఏమిటి, చిరాగ్గా వున్నారూ..!" అంది లీల.
"ఏం లేదులే.... ఇప్పుడే వస్తా!" బయటకెళ్ళాడు సుధాకర్.
లీల మనసు పరిపరి విధాల పోతోంది. నిజమే, అమ్మ ఒక్కర్తీ వుండటమేమిటీ, తనూ, భర్త తల్లికి సాయంగా వుండచ్చుగా!! ఏమో!!
