ఇంకోసారి, సెలవులకి తను, అక్క, అన్నయ్య మద్రాసు పెద్దనాన్నగారింటికి వెళ్ళారు. డ్రైవర్ పిల్లలందరితో ఎంతో స్నేహంగా వుండేవాడు. మద్రాసంతా చూపిస్తూ ఎన్నో కబుర్లు చెప్పినవ్వించేవాడు. వీరన్న ఒకరోజు పెద్దనాన్నదగ్గరకు వచ్చి ఏదో కొంతసేపు తెలుగులోను, మధ్య మధ్యలో అరవంలోను చెప్తూ, గొంతులో ఏడుపు ధ్వనిస్తోంటే ఒకటే చెప్తున్నాడు. అక్క, అన్న అంతా నిద్రపోతున్నారు. శారద లేచి పెద్దనాన్నగారి దగ్గర నుంచుని మాటలు వింటోంది. రంగన్న కూతుర్ని పెళ్ళాడుతానని తన ఇంట్లో అద్దెకుండే కుర్రాడు కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. ఆ పిల్ల నాంచారి వాడిమాటలు నమ్మింది. వాడు దాంతో తిరిగి, చివరకి నేనెందుకు పెళ్ళి చేసుకుంటా, నా అత్తకూతురు సంబంధం ఏనాడో ఖాయమైందని తప్పించుకు పారిపోయాడు. అప్పటికి నాలుగు నెలల గర్భంతో ఆ పిల్ల ఏం చేయాలోతోచక చీరకొంగుతో ఉరేసుకుంది. ఈ విషయం చెప్తూ వీరన్నగొల్లున ఏడ్చాడు. పెద్దనాన్న వాడిని ఓదార్చాడు. "వాడిని పోలీసులకు అప్పచెప్పచ్చుగా, బాగా తన్నచ్చుగా. ఏడుస్తే వాడికి శిక్షలేదుగా రంగన్న" అంది శారద కల్పించుకుని.
"నువ్వు ఈ విషయాలు మాట్లాడకూడదు. లోపలకెళ్ళిపో"
- పెద్ద నాన్నగారు మందలించారు...తనెందుకు నాంచారి మరణం గురించి, ఆమోసం చేసిన వాడికి శిక్షపడాలని ఎందుకు మాట్లాడకూడదో శారదకి అర్ధంకాలేదు.
శారద పెరుగుతున్న కొద్దీ ఆడపిల్లని మగాడితో సమంగా చూడరెందుకు అనే ప్రశ్న పెరుగుతూ వచ్చింది. సమాధానం దొరక్క శారద చాలాసార్లు ఆవేదన పడింది.
'అయ్య ఇంట్లోలేడుగా. కూరలు లేకపోతేనే ఏం" అంటుంది. పనిమనిషి ఒక రోజు శారద పెద్దగా పోట్లాడింది. అయ్యలేక పోతే మనం ఎవరం కూరలు, సాంబారు వేసుకు భోజనం చెయ్యక్కర్లేదా. ఇంకోసారి ఇలా మాట్లాడితే నిన్ను కొడతానంది అమ్మతలలో పూలుకొని పెట్టుకోదు. ఎందుకు పెట్టుకోవూ అంటే నాన్న ఊళ్ళో లేకుండా నాకీ ముస్తాబెందుకూ అంది. శారదకి ఏమీ అర్ధమయేదికాదు.
* * *
కాలం నత్తలాగనడుస్తోంది. ఆ రోజు అబార్షన్ చేయించుకు వచ్చాక శారద మనసు చాలా సంఘర్షణకి గురి అయింది. 'తను తప్పుచేసిందా మనసుని మరీ మరీ ప్రశ్నించుకుంది. 'అమ్మా.. తప్పునేను చేసాను. ఆడపిల్లగా కాకుండా నీలో ప్రవేశిస్తే నేను బతికేదాన్ని కదూ......అమ్మా, అమ్మా" - ఏదో తియ్యని గొంతు శారద అంతరంగం నుంచే ధ్వనిస్తోంది. శారద చెవులు మూసుకుంది వీధిలో కూరలమ్మ కేక విని గుమ్మంతో వచ్చి కూచుంది.
'ఏం రాములమ్మా కూరలేవి'- శారద గుమ్మంలో కూచుంది.
"నిన్న నా బిడ్డ కన్నది. ఆడపిల్ల, నోట్లో వున్న కిల్లీపక్కకి ఉమ్మింది.
'ఆడపిల్లా' . ఉలిక్కిపడింది శారద.
"ఇది మూడోది. బంతిలాగ గుండ్రంగా వుందమ్మ. అప్పుడే కళ్ళు తెరిచి చూస్తోంది. తల్లి దగ్గర పాలుతాగుతోంది. ఏమిటో అంతా మాయ. నిన్నటి దాకాలేని ఆకలి ఇవాల ఎక్కడనుంచి వచ్చిందో.' రాములమ్మ మాటలు ఆ తర్వాత శారదకి వినిపించలేదు.
"రాములమ్మా. డబ్బుతీసుకెళ్ళు. నేపడుకోవాలి" - శారద లోపలకెళ్ళిపోయింది. రాములమ్మ కూతురికి ముగ్గురు ఆడపిల్లలా!
* * *
వీధి తలుపు చప్పుడయింది.
"ఏమిటే శారదా. నిన్న నువ్వు నీర సంగావున్నావని నిన్ను మాట్లాడించకుండా వెళ్ళపోయాను. అయినా అంతతొందరేమిటి - ఆ చేయించుకునే అబార్షన్ కి రెండురోజులు ఆగితే ఏమైనా ప్రమాదమా" - లలిత కొంచం కోపంగా అంది శారద లేచి కూచుంది.
"అంటే - రెండురోజులాగితే నువ్వువచ్చేసి అబార్షన్ చేయించుకోకుండా ఆపేదానివా. ఆడ పిల్లలని కన్నతల్లే తల్లి. అని, అటు రాణి ఝాన్సీని చూడు, ఇటు రాణి రుద్రమని చూడు అంటూ నా మనసు కదిలించేసి, నువ్వురామం పక్షం వహించేసేదానివా. ఇటువిను లలితా. అటు కట్నం యిచ్చుకోలేక చచ్చిపోయిన కన్నతండ్రిని చూడు, చూడు, ఆడపిల్ల పెళ్ళిచేసి అడుక్కుతింటున్న అయ్యని చూడు. "శారద గొంతువణికింది. అయినా, తాను అబార్షన్ చేయించుకున్నంత మాత్రం చేత మహా పాపం చేసినట్టా ఇంత మాత్రానికే నాపై అలిగితే, ఇలాటి మనిషితో జీవితాంతం నేను కాపురం చేయగలనా. అసలు అలాంటి మొగుడే నాకు అక్కర్లేదు - వెళ్ళు", - శారద మంచంమీద వాలిపోయింది. లలిత విస్తుపోయింది. 'ఏమిటీ పిచ్చి పుట్టిందా. రామంతో నేనెందుకు చెప్తాను. నువ్వు చెప్పుకో ఏం చెప్పుకుంటావో. మీ ఇద్దరి మధ్యగొడవల్లో నాకేం పని. అసలు రామానికి" లలిత మాటపూర్తి చేయలేదు.
"ఊ రామనికి ఏమైందీ. అవును. లోకంలో అందరి మగాళ్ళలాటివాడే అతనూ భార్యంటే బానిస అనుకొనేవాడే అసలు నేనే తప్పు చేసాను. మనిషి గురించి పూర్తిగా తెలియకుండా"
"తెలియకుండా పెళ్ళి చేసుకున్నానని బాధపడుతున్నావా. ఇప్పుడేం కొంప మునిగింది. నీలాటి వాళ్ళు" - లలిత ఏదో అనబోయింది.
"నాలాంటి వాళ్ళు పెళ్ళికి తగరు. అదేనా నువ్వు అనేది. ఛీ.. లలితా, పూర్తిగా మోసపోయానే. ఇంత స్వార్ధం" - అరిచింది శారద.
"స్వార్ధమా. శారదా ఏం మాట్లాడుతున్నదో తెలుసా.. నాకే స్వార్ధముంటే రామాన్ని ఏనాడో"-
"ఏనాడో పెళ్ళిచేసుకొనేదానివి. అంతేనా. లలితా, గెట్ అవుట్ - గెట్ అవుట్" పెద్దగా అరిచింది. లలితకి ఏం చేయాలో తెలియ లేదు రామం ఏమనుకుంటాడో - లలిత గదిలోంచి బయటకొచ్చేసింది. శారద మంచం మీద వాలిపోయింది.
'క్షమించండి' - రామం గుమ్మం దగ్గర నుంచుని లలితతో అన్నాడు "మళ్ళీ కలుస్తాను" - లలిత గబగబా వెళ్ళిపోయింది. మనసు శ్రుతి తప్పింది....ఆలోచనలో అపశ్రుతులు పరిగెత్తి వచ్చి ప్రవేశించాయి. కాగితం మీద పిచ్చి గీతల్లా శారద మనసులో ఆలోచనలు క్షణంలో అటు ఇటు పరుగులు తీస్తున్నాయి. లలిత ఎంత స్వార్ధపరురాలో స్వార్ధపరురాలా కాదు, రామం ఎంత స్వార్ధపరుడో - తనని పెళ్ళి చేసుకున్నాడు. లలితతో స్నేహంగా వున్నాడు. కాకపోతే ఆ రోజు తమ ఆస్పత్రి నుంచి వచ్చేలోపల ఇంట్లో వున్నది లలిత కాదూ.. తను లేనప్పుడు లలిత ఎందుకు రావాలీ. రామం కన్నా పెద్దది లలిత - అందుకే రామం లలితని పెళ్ళి చేసుకోలేదా - ఏమో!!
