Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 38


                            బ్రూహి ముకుందేవి
               
                శాంత రసం
    
    "శాంతమూ లేకా సౌక్యమూ లేదూ" అంటూ పాడుతోంది
    బగత్ప్రసిద్ద తమిళ గాయనీమణి ఆవిడ పేరు నేను
    చెప్పనక్కరలేనంత సుప్రసిద్ధం శాంతరసం వర్షిస్తున్న ఆమె
    సంగీతంలో తెలుగు భాషకి జరుగుతున్న చిన్న డామేజీని
    శ్రోతలెవ్వరూ ఖాతరుచెయ్యలేదు. నేను మాత్రం త్యాగయ్య
    గారిమీద కొద్దిగా జాలిపడుతూనే, సంగీత సుధారవంలో
    ఓలలాడుతున్నాను.
    
    ఆనాడు నేను హాజరయిన కచ్చేరీల వంటివి ఆవిడ పరశ్శతంగా చేసింది. కాలంనాడు జవళీల మాదిరి శృంగార రసస్ఫోరకమైన పాటలు పాడినా, వయస్సు హెచ్చినకొద్దీ ఆవిడలో భక్తి రెచ్చిన కారణంవల్ల ఇటీవల పదేళ్ళనుంచీ భజన కీర్తనలు తప్ప మరేవీ పాడలేదు. ఆమె గానంలో గొప్ప ఆధ్యాత్మిక విలువలున్నవని మొట్టమొదటిసారిగా మద్రాసులోని ఒక ప్రముఖ దినపత్రిక రివ్యూ ప్రచురించింది. సంగీతం విషయంలో ప్రత్యేకించి కర్ణాటక సంగీతం విషయంలో ఆ పత్రిక ఏది రాస్తే అదే ప్రామాణికం.
    ఏ మాట కా మాటే చెప్పుకోవాలి. తెలుగు భాషకి ఆవిడ ఎన్ని గాయాలు చేసినా, ఈనాటి అరవయ్యో ఏట కూడా ఆ మహాగాయని గాత్రమాధుర్యం చెక్కు చెదరలేదు. అది పూర్వజన్మ సుకృతమనీ, దైవప్రసాదమనీ, ఈ పుణ్యభూమిలో అందరూ అనుకుంటారు, నాబోటి కొందర్ని మినహాయిస్తే.
    ఆవిడ పాడుతూ ఉంటే శాంతరసం ఉట్టిపడుతుందనీ, ఏదో దివ్యలోకాలలో విహరిస్తున్న భావం కలుగుతుందనీ అందరూ అనుకుంటారు. అందుకే అయిదువందల రూపాయల టిక్కెట్టు కొని అయినా ఆమె గానాన్ని ఆస్వాదిస్తారు. నేను అయిదు రూపాయల టిక్కెట్టు రోజుల్లో ఆమె సంగీతం విన్నాను. సంగీతం గురించి సాధికారంగా మాట్లాడలేని నావంటివాడు ఆమెను గురించిగాని, ఆమె సంగీతం గురించిగాని విమర్శించడం అవినయమే అవుతుంది. సాహిత్యానికి ఆవిడ కలిగించే హానికి మాత్రం నేను లోలోపలే బాధపడుతూ వుంటాను.
    ప్రపంచం అంతటా పర్యటించి ఆవిడ కర్ణాటక సంగీతానికి ఎనలేని గౌరవం సమకూర్చింది. బహుశా ప్రపంచం అంతటా అందం అతిశయోక్తి కావచ్చు. ఎందుచేతనంటే కమ్యూనిష్టు దేశాలలో ఆమె తన సంగీతం వినిపించిన దాఖలాలు లేవు. అంతేకాక దైవభక్తిపరులు కానివారికి తన సంగీతం వినిపించడం ఆ దైవానికే అపచారం చెయ్యడమని ఆమె త్రికరణశుద్దిగా నమ్ముతుంది. అంతా విధి విలాసమనీ, ఆ దేవుడే తనచేత పాడిస్తున్నాడనీ (డబ్బు కూడా పుష్కలంగా వాడే ఇస్తున్నాడనీ) ఆమె దృఢ విశ్వాసం.
    ఆవిడ సంగీతంలో తతిమ్మా అన్ని రసాలూ ఇంకిపోయి శాంతరసం స్థాయి భావానికి వచ్చిన దశలో టిక్కెట్లు ప్రజలచేత కొనిపించి వాళ్ళకి సంగీతం పంచిపెట్టడం సక్రమమైన పద్దతి కాదని ఆమె కనిపించింది. అందుచేత ఇకమీద ఉచితంగానే అందరికీ సంగీతం    వినిపిస్తానని ఒక ప్రకటన చేసింది. దానితో దేశంలోని రకరకాల ప్రజోపయోగ సంస్థలనుండి ఆమెకు ఆహ్వానాలు రావడం ప్రారంభమయింది. ఆ సంస్థలు టిక్కెట్లు అమ్మకూడదని షరతుమీద వారి ప్రార్ధనలను ఆమె అంగీకరించేది. విరాళాలు వసూలు చెయ్యడంమీద ఆంక్షలు విధించేది కాదు. తన సంగీతం ద్వారా వాళ్ళు ఈ విధంగా లక్షలు పోగుచేస్తున్నాం కాబట్టి అందులో తనకు రావలసినంత పెద్ద వాటా రాబట్టుకోవడంలో ఏమీ తప్పులేదన్న ఉద్దేశంతో ఆవిడ తన ప్రదర్శనమైతే ఉచితమేకాని తనకూ తన బృందానికీ ఖర్చులు మాత్రం భరించితీరాలని పట్టుపట్టేది. ప్రయాణఖర్చులు (తరచు విమానంమీద) భోజనం ఖర్చులు (పెద్ద పెద్ద హోటేళ్ళలో) ఇలా ఎన్నో పద్దుల కింద బోలెడు డబ్బు గుంజుకునేది.
    ఇదే పద్దతిమీద ప్రధానమంత్రి పుట్టిన రోజున కూడా ఈవిడ పాడిందట. "అట" అని ఎందుకంటున్నానంటే కచ్చితమైన సాక్ష్యాధారాలేవీ నావద్ద లేవు కాబట్టి ఇండియా ప్రభుత్వమే ఈమె ఖర్చులన్నీ భరించిందట. ఇది కూడా "ఆట" మాత్రమే కారణం సువిదితం.
    ఈమె పాడడం ఇందిరా గాంధీ పుట్టిన రోజున కాదని నేను కచ్చితంగా చెప్పగలను అలాగయితే ప్రధానమంత్రిని అని ఉందును. ఇక పోతే మన కిద్దరే ప్రధాన మంత్రులుండేవారు కాబట్టి నెహ్రూ గారో, శాస్త్రిగారో పుట్టిన రోజున ఆమె పాడివుండాలి.
    ప్రధానమంత్రి పుట్టినరోజు ప్రసక్తి తేవడం ఇక్కడ అప్రసక్తం కాదు. ఎందుచేతనంటే ఆ మర్నాడో తమాషా జరిగింది. ఢిల్లీలో ఒక సేట్ జీ ఆనాటి తన పుట్టిన రోజు పండుగలో పాడవలసిందిగా ప్రాధేయపడుతూ "ఆమె" గారిని ఆహ్వానించాడు. ఆ రోజయితే ఖర్చుల గిట్టుబాటు కావని మన గాయకురాలు వచ్చే సంవత్సరం పండుగలో పాడుతాననీ, తన ప్రతిజ్ఞ ప్రకారం ఉచితంగానే పాడుతాననీ సేట్ జీకి  వాగ్దానం చేసింది.
    మరుసటి సంవత్సరం వచ్చింది. మరో రెండు రోజుల్లో సేట్ జీ పుట్టిన దినం వెంటనే బయల్దేరి (బృందంతో సహా) రావలసిందని సేట్ జీ టెలిగ్రాం ఇచ్చాడు.
    ఖర్చుల సంగతి సేట్ జీ కి తెలియదన్న సంగతి మన గాయనీమణికి తెలియదు సొంత ఖర్చుమీదనే పెద్ద బృందంతో బయల్దేరింది. వెళ్ళగానే బిల్లు చేతికిద్దామని అని ఎకౌంటెంట్ సలహా ఇచ్చాడు.
    ఢిల్లీ నగరంలో పెద్దపెట్టున ప్రచారం జరిగిపోయింది.
    ఖర్చుల నిమిత్తం ఒక్క పైసా అయినా ఇవ్వననీ, ఇచ్చిన మాటప్రకారం ఆవిడ పాడవలసిందే అని సేట్ జీ పట్టుపట్టాడు.
    ఆవిడ పాడక తప్పలేదు.
    పుట్టెడు దుఃఖంతో ఆవిడ (బ్రూహి ముకుందేతి, రసవే! పాహి ముకుందేవి అంటూ పాడింది. శ్రోతలందరూ శాంతరస వృష్టిలో తడిసిపోయారు.
    పాటమధ్యలో ఆమె గుండె పగిలి మరణించింది.
    "ఆహా! ఎంత భక్తురాలు! ఎంత పుణ్యాత్మురాలు" అంటూ అందరూ ఎంత మెచ్చుకున్నారు.
    నా వొక్కడికి మాత్రమే తెలుసు, ఆవిడ ఎందుకు చచ్చిపోయిందో అన్న అసలు కారణం.
    
                                ---౦౦౦---


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS