'నమ్మటానికీ నమ్మక పోవడానికి ఏముంది బావయ్యా? అన్యాయం నువ్వు చేస్తే మాత్రం ఏమయింది? తృప్తిగా భరించగలను.' కాని.
'???'
'మనం కలిసి బ్రతికే యోగమే వుంటే యిలా జరిగిందంటావా?'
'అది మేం చేసిన తప్పు . క్షమించు శ్రీదేవి.
'ఒక్కొక్కసారి తప్పుకూ ఒప్పుకూ తేడా తెలియదు, ఆయా పరిస్థితుల్ని బట్టి అలా చలామణి ఔతూఉంటుందంతే?

'పోనీ రాగలవా చెప్పు. అతన్ని వదిలి పెట్టగలవా? నువ్వే అన్నావు గా వదిలి పోతానంటూ రోజుకు పది సార్లు బెడిరిస్తున్నాడని.'
దీనంగా నవ్వింది శ్రీదేవి పల్చగా.
'ఏమంటావ్ శ్రీదేవి? నీకు నాలాంటి నీడ కావాలి. నాకునీలాంటి తోడూ కావాలి.'
'కావాలనుకో -- కానీ -చేతులు కాలిపోయాయి. ఇప్పుడు ఆకులూ పట్టుకుంటే గాయం యింకా రేగుతుంది అంతే. అదీ గాక- నువ్వు ఏదో ఉద్రేకంలో యిలా అంటున్నావు గాని- చూస్తూ చూస్తూ పావనికి అంత ద్రోహం చేయగలవా? అలా తృణీకరించగలవా?'
'ఆవిడను నేను తృణీకరించలేదు ఆవిడే నన్ను తృణీకరించింది. ఈ పరిస్థితుల్లో అటువంటి మనిషితో నే బ్రతకలేను. అమ్మను బ్రతికించుకోలేను-'
త్రుళ్ళిపడింది శ్రీదేవి.
;శ్రీదేవి?'
'నీకు నిజంగా మతి స్త్ఘిమితం తప్పుతుంది.'
'నిజం శ్రీదేవి! మతి స్థిమితం పోగొట్టుకున్న అమ్మను బ్రతికించుకుంటానికే నీ సహాయం కావాలంటున్నాను . నీకు తెలియదు.'
'ఏమిటి బావయ్యా నువ్వు చెబుతున్నది?'
'నా జీవిత రహస్యం.'
'అంటే?'
'నమ్మగలవా శ్రీదేవి నే చెబితే?'
'ఎందుకు నమ్మను బావయ్యా?'
'మా అమ్మ మా అమ్మకాదు. నిజం. అమ్మ చెప్పింది ఆఖరి ఊపిరి విడిచే ముందు. ఎంత అజ్ఞానం లో బ్రతికానో చూడు ఇన్నాళ్ళు. ఇన్నేళ్ళూ. నన్ను కన్నతల్లి రంగాజమ్మ?'
'నమ్మలేను బావయ్యా.'
'నేనూ నమ్మలేదు. కానీ ఆఖరి ఊపిరి పీలుస్తున్న మనిషి అబద్దం చెబుతుందంటావా? చిన్ననాడు నన్ను అమ్మ చేతిలో పెడుతూ కళ్ళు తుడుచుకుంది. ఆ కన్నీటి రహస్యం అప్పుడు నాకు అర్ధం కాలేదు. ఆ అజ్ఞానం లో యింతకాలం -- ఒక అమ్మను పోగొట్టుకుని- మరొక అమ్మను సంపాదించుకున్నాను. ఈ విచిత్రమైన ఈ పరిస్థితికి ప్రతిఫలంగా నేను పొందింది ఏమిటో పోగొట్టుకున్నది ఏమిటో ఎవరు నిర్ణయించగలరు?' ఎంత పని చేసింది? 'పిన్నీ' అని పిలిచింది నోరు కన్నతల్లినే. కధలు చెబుతూ - నవ్విస్తూ , కవ్విస్తూ , ఒక్క సారిగా కళ్ళు తుడుచుకుని - నేను ఎవరిని బాబూ నీకు - అంటూ అడిగేది. ఆ ప్రశ్నకు నేనిచ్చిన సమాధానం ? పిన్నివి! అ ఏడుపుకు అప్పుడు అర్ధం తెలుసుకోలేక పోయాను. తెలుసుకుని కన్నతల్లి కన్నీటిని తుదవలేక పోయాను. ఇంత పోగొట్టుకున్నాక -- ఇప్పుడు తెలుసుకున్నాక -- యింకా వదిలి పెట్టుకోగలనా?'
'ఎక్కడుంది ఆవిడ?'
'పిచ్చాసుపత్రిలో.'
'నిట్టూర్చింది శ్రీదేవి.
'అమ్మను బ్రతికించుకుంటానికి నీ సహాయం కావాలి శ్రీదేవి. అర్ధం చేసుకో లేవా నన్ను. ఏమంటావు శ్రీదేవీ. నువ్వు కాదంటే నాకు మరొక మార్గం లేదు. అమ్మను తెచ్చుకుందాం. పిచ్చిది కానీ, వెర్రిది కానీ శేషజీవితం నా చేతుల మీదనే కరిగి పోనీ. కాని శక్తి లేని ఈ పరిస్థితుల్లో ఈ మనస్సుకు- ఈ ఒంటరితనం లో నువ్వు బలంగా నిలవాలి. శ్రీదేవి - ఎవరు తల్లి? ఎవరు బిడ్డ? అంతా మిధ్య. ఈ బంధాలు -- ఈ మమకారాలు ఈ కన్నీటి వగర్పులు- జన్మాంతరబంధానికి అర్ధమేమిటి? చావు నిజం చెబుతుంది. ఎందుకు భయం నిజాన్ని చూసి? అమ్మ తగలబడి పోతుంటే - కళ్ళ ముందు - ఏం చేయగలిగాను? ఏం చేయటానికుంది శక్తి? ఆ మంటల వెలుగులు- ఆ వెలుగు నీడలు- నవ్వుతున్నట్లనిపించింది అమ్మ-'
బావయ్యా! బావయ్యా!!'
'నవ్వాలనిపించింది నాకూ బిగ్గరగా నవ్వాను. ఎంత దూరం -- అ కొండ - మసక చీకట్లో -- కొండ వెనక నుంచి మబ్బుల పూల రధం వచ్చింది. అమ్మ కూర్చుని రధంలో , నాయనా స్వాములూ వెర్రి వాడివిరా. నువ్వు స్కూలు ఫైనల్ పాసై నా కష్టాలు తీరిపోతాయిరా అంటూ -- అంత దూరం చేయి చాచి నా తల నిమిరింది చల్లని చెయ్యి. నీళ్ళ బిందెలు మోసిమోసి చల్లబాడింది -- 'నిన్ను కడుపున మోయని పాపానికి , నీళ్ళ బిందెలు మోసి ప్రాయశ్చిత్తం చేసుకున్నానురా బాబూ.' అంటూ యెలా నవ్విందో తెలుసా?' -
బావయ్యా -- కొంపతీసి నీకు మతి పోవడం లేదు గదా!'
'నువ్వు కాదంటే నిజంగానే పోతుంది. ఔనను ముందు.'
'చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను కాసేపు పడుకో బావయ్యా నామాట వినవూ?'
'ఔనను.'
'సరేలే పడుకో. ఎంతకాల ముండగలవు యిలా నిద్రాహారాలు లేకుండా?'
'ఒకమాట చెప్పనా? రేపే మన ప్రయాణం -- ముందేం చేయాలంటే....'
'ముందు కాసేపు పడుకో తర్వాత నువ్వేం చెప్పినా వింటాను.'
బలవంతంగా మంచం మీద పడుకో బెట్టి దుప్పటి కప్పింది.'
'పడుకుంటా ఈ సమయంలో నాకు కావాల్సింది నిద్ర. నాకూ తెలుసు . కానీ నువ్వు యిలా -- పోనీ దగ్గర కూర్చో శ్రీదేవి. ఏమిటో ప్రవాహంలో కొట్టుకు పోతున్నట్లుంది భయం - ఏదో వైకల్యం అపార్ధం చేసుకోకు కూర్చో.'
మంచం మీద ప్రక్కనే కూర్చుంది శ్రీదేవి. ఆమె చేతిని అతని నోటికి అడ్డం పెట్టింది. కళ్ళు మూసింది బలవంతంగా, కసిరింది. ఆమె చేతిని గుండెలకు హత్తుకుని నిద్రపోయాడు స్వామి.
* * * *
తెల్లవారింది. బారెడు ప్రోద్దుక్కే వరకూ చైతన్యం లేని బండరాయి లా నిద్ర పోయాడు స్వామి. శ్రీదేవి లేపకపోతే అలాగే పడుకుని వుండేవాడేమో.
నిద్రలేచేసరికి కాఫీ అందించింది శ్రీదేవి.
'సూర్యారావు ఏడి?' అన్నాడు స్వామి.
'వెళ్ళిపోయాడు' అంది శ్రీదేవి.
'ఎక్కడికి?'
'నాకు తెలీదు.'
'చెప్పావా?'
'ఏమిటి?'
మన సంగతి ?'
'భయమేముంది? బావయ్య తో వెళ్లి పోతున్నానని చెప్పెను.'
'ఏమన్నాడు?'
'వెళ్ళవద్దంటూ బ్రతిమిలాడటం మొదలు పెట్టాడు. 'రోజుకు పదిసార్లు బెదిరించావు గదా నన్ను వదిలి పోతానని చివరకు నేనే నిన్ను వదిలి పోతున్నాను చూడు' అని అతని సాధింపులన్నింటికి ఒక్క మాటతో బదులు చెప్పాను.
'ఏదో కోపంలో అన్నాను. నువ్వు పొతే నే బ్రతక లేనంటూ ఏడవటం మొదలు పెట్టాడు. నేను పొతే తాను ఈ ప్రపంచం నుంచే పోతానంటూ బెదిరించాడు. క్షమించమన్నాడు. భార్యా భర్త మధ్య మాత్రం పట్టుదలలూ పోట్లాటలు రావా అన్నాడు. అంత మాత్రాన తెగేదాకా అందరూ లాక్కుంటూన్నారా అన్నాడు. చంటిపిల్లాడిలా కుమిలి కుమిలి ఏడ్చాడనుకో పాపం. జాలి అనిపించింది బావయ్యా'
నిట్టూర్చాడు స్వామి.
'సాయింత్రం బండికి మన హైదరాబాద్ ప్రయాణం వున్నట్టేనా?'
మాట్లాడలేదు స్వామి.
'ఏమిటి నిన్ను నమ్ముకుని- ఉన్న ఆ కాస్త బంధంతెంచుకున్నాను. ఆ సూర్యారావు తో....'
'శ్రీదేవి?'
'ఎందుకలా నిట్టురుస్తావు బావయ్యా. తప్పో ఒప్పో ఒక నిర్ణయానికి వచ్చాం. ఇంక జరిగిపోయినదాన్ని గురించి ఆలోచించగూడదంటాను. అసలు ఈ ఆలోచనలే బావయ్యా మనిషి జీవితాన్ని తినేసేవి.అన్ని మరిచిపో. ఇన్నాళ్ళ కు భగవంతుడు మనిద్దరినీ ఒకచోటకు చేర్చాడు. ఒకటి కమ్మన్నాడు. నీ నీడలో సుఖంగా బ్రతికే అవకాశమిచ్చాడు- ఇదంతా నా అదృష్టం.మరొకరి దురదృష్టమనుకో. ఈ ప్తపంచపు తీరే అంత. ఒకరి అదృష్టం మరొకరి దురదృష్టం ,చిన్న చేపను పెద్ద చేప మ్రింగుతుంది. ఆ పెద్ద చేపను తిమింగలం మ్రింగుతుంది. ఆ అనుభవాల తర్వాత నా కనిపించింది బావయ్యా. ప్రాణి మనుగడకు మూలస్తంభం స్వార్ధం. దయాదాక్షిణ్యాలు పెట్టుకుంటే బ్రతకలేం బావయ్యా. ప్రవాహంలో నిజంగా కొట్టుకు పోతూ బ్రతికింది నేను. దొరికిన ఆధారాన్ని వదిలి పెట్టుకోనేటంత తెలివి తక్కువ దాన్నంటావా చెప్పు?'
అనర్గళంగా మాట్లాడుతున్న శ్రీదేవిని నివ్వెరపోయి చూస్తున్నాడు స్వామి.
'ఏమిటి బావయ్యా అలా కొయ్యబారిపోయావ్? కొంపతీసి మీ ఆవిడ గుర్తు రాలేదు కదా? ఇంత పెద్ద మలుపు తిరుగుతుందని మన జీవితం. ఈ సమయంలో మనస్సులు దాచుకోవడం కూడా అంత మంచిది కాదేమో. అందుకే చెబుతున్నాను. అందుకే మరొక మాట గూడ నిన్ను అడగాలనుకుంటున్నాను. అడగనా?'
'ఊ'
'నువ్వొక మాట యివ్వాలి. నిన్ను నమ్ముకుని- నువ్వు తప్ప మరెవ్వరూ లేరనుకుని- నన్ను నమ్ముకున్న సూర్యారావుని కూడా వదిలిపెట్టి - నీతో లేచి వస్తున్నాను. నువ్వు మాటివ్వాలి నాకు. పదిమంది పెద్దవాళ్ళూ అంగీకరించి ఆశీర్వదించే సంబంధం కాదు మనది. అత్మసాక్షిగా ఒకటి కాబోతున్నాం. నీ అంతరాత్మ సాక్షిగా -- మళ్ళీ ఎన్నడూ నన్ను వదిలి పెట్టనని ప్రమాణం చెయ్యి బావయ్యా.'
చెయ్యి చాచింది శ్రీదేవి.
ఆ చెయ్యి పట్టుకుని తలవంచుకున్నాడు స్వామి.
'మాటియ్యాలి బావయ్యా.'
'మనిషి మీద లేని నమ్మకాన్ని -- ఆ మనిషి మాట నిలబెట్టగలదంటావా?'
'నా జాగ్రత్త నాది మరి. ఇది జీవన్మరణ సమస్య నాకు. రేపు మీ ఆవిడ వస్తుంది. నా యింటిమీదకు యుద్దానికి వస్తుంది. పదిమంది పెద్దల్ని పిలిపించి మన నట్టింట్లో పంచాయితీ పెట్టిస్తుంది. ఆ మంత్రం పారకపోతే చివరకు నీ కాళ్ళ మీద పడి తల బద్దలు కొట్టుకు చఎడుస్తుంది. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది. నువ్వు ఏమాత్రం లోంగినా - అణుమాత్రం మెత్తబడ్డా నా పరిస్థితి ఏమౌతుందో ఆలోచించు. చివరకు మొండి కెత్తి ఏ బండరాయో గట్టుకొని , ఏ మోట బావిలోనో పడి ప్రాణం తీసుకుంటుందనుకో. ఆ తర్వాత నువ్వు గుండెలు బాదుకుంటూ, ఈ దారుణ పాపానికి నన్ను కారణంగా , కనీసం ప్రేరణ గా జమకట్టి బ్రతికినంత కాలం నన్ను ద్వేషించే పరిస్థితి కొస్తే ఆ హింస నేను భరించగలనంటావా చెప్పు?' మాట్లాడు బావయ్యా. ఈ భయంకర పరిస్తితులన్నింటినీ తట్టుకుంటానికి నువ్వు సిద్దపడాలి. పావని విషయం -- అసలు మీకు పెళ్ళి అయిన సంగతే మరిచిపోవాలి. వింటున్నావా బావా?'
'ఊ'
'ఒకరకంగా పాపభీతి -- జాలి-- మమకారం -- ఇలాంటి దౌర్భాగ్యలక్షణాలన్నీ కూడా మనం మరిచిపోవాలి. గతాన్ని మరిచిపోవడం అంత సులభం కాదనుకో. కాని గుండె రాయి చేసుకోవాలి. ఇన్నాళ్ళు పావని చేతి అన్నం తిన్నావు. ఒక మంచం మీద ఒకటిగా పడుకుని, ఒకరి ఊపిరి వెచ్చదనాన్ని ఒకరు అనుభవించారు. బ్రతుకును గురించి, భవిష్యత్తు ని గురించి , కలలు కంటూ- నా దగ్గరున్నప్పుడు నన్ను చూసినప్పుడు నీకు ఆ సరసాలు సరాగాలూ అన్నీ గుర్తుకు వస్తాయి. పావని నీడ మనని దయ్యంలా పట్టి పీడిస్తుంది . తండ్రి పోయాక ఆమె అనాధై పోతుంది. మగ దిక్కులేక , తిండి లేక , నీడ లేక ఎటువంటి అఘాయిత్యాలకు తలబడుతుందో- వయసులోఉన్న పిల్ల -- ప్రపంచం నలిపివేస్తే నన్ను నిందించగూడదు బావయ్య నువ్వు'
'శ్రీదేవి!'
'ఎందుకు బావయ్యా అలా కంట తడిపెడ్తావ్ ? పొల్లు మాట చెప్పలేదు నేను- ఉన్న పరిస్థితి , మనం ఎదుర్కోనబోయే పరిస్థితులూ చెబుతున్నానంతే - ఏమంటావు? యింక జీవితంలో పావని గురించి ఆలోచించనని, దాని ముఖం చూడనని నువ్వు ప్రమాణం చెయ్యాలి. చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చెయ్యి బావా!'
శ్రీదేవి రెండు చేతులూ పట్టుకుని- ముఖానికి అద్దుకున్నాడు.
'నాకు తెలుసు బావయ్యా అంత కఠినుడివి కాదు నువ్వు అంత నిర్దయగా బ్రతకలేవు నువ్వు- పాపం చేయగలిగిన సామర్ధ్యం కూడా అందరు మనుష్యుల్లో సమానంగా వుండదు. చేసినా దాన్ని హరించుకోగల జీర్ణశక్తి అందరికే వుండదు. నువ్వు అంతకు తెగించలేవు - పావని అంత నాశనమయ్యాక - నన్ను బ్రతికించలేవు కాదంటావా?'
'ఏ-మో'
'వెర్రి బావయ్య! నీ మనస్సు నేను అర్ధం చేసుకోలేనంటావా? కొన్ని విషయాల్లో మగవాళ్ళు మరీ చంటి పిల్లల్లా ప్రవర్తిస్తారు తెలుసా? పోన్లే . ముందే తేలిపోయింది. నిన్ను నమ్ముకుని ఆయన్ను పోగొట్టుకున్నాను.'
'శ్రీదేవి' మూలిగినట్లు నీరసంగా కేకపెట్టాడు స్వామి.
'శ్రీదేవి' అని కాదు బావయ్యా నువ్వు పిలవాల్సింది పావని అని పిలిచి చూడు . భార్య పేరు పిలవడానికి కూడా సిగ్గెందుకు? ఎన్నిసార్లు ఎన్నిరకాల వంపులు వంచి పిలవలా ఆ పేరు నువ్వు? పిలిచి చూడు ఎక్కడున్నా పరిగెత్తు కొస్తుంది. వచ్చి -- నువ్వు ఎంత అఘాయిత్యం తలపెట్టి నందుకు చెంపలు వాయించి గుంజీలు తీయిస్తుందో -- నీ మనసు ప్రకారం నడుచుకుంటూ నీ కష్ట సుఖాల్నీ జీవితాన్ని మనో వాక్కాయ కర్మలా ధర్మపత్ని గనుక పంచుకు తీరాలంటుందో పరీక్షించి చూడు బావా - మరీ అంత - పోనీ నే పిలవనా? పావనీ - పావనీ'
తడిక ప్రక్కన నిలబడిన స్త్రీ మూర్తి వచ్చి స్వామి పాదాల మీద పడింది.
'పావనీ'
'ఏమండీ'
సిగ్గుపడుతూ బయటకు నడిచింది శ్రీదేవి.
* * * *
అది పిచ్చాసుపత్రి.
'రంగాజమ్మా? ఓ ఆవిడ పరిస్థితి నయమయింది. ఇంతకుముందే డిశ్చార్జి చేశారు. ఆవిడ కుమారుడనుకుంటా తీసుకు వెళ్ళాడు. బహుశా సూపరింటెండెంటుగారి గదిలో ఉన్నారేమో యింకా చూడండి.'
స్వామి పావని చేయి పట్టుకుని పట్టారాని ఉద్వేగంలో సూపరెంటెండెంటు గదిలో అడుగుపెట్టాడు. తడబడుతున్న కాళ్ళతో - తందరిస్తున్న గుండెలతో, నివ్వెర పోయి చూశాడు ఆ స్త్రీ మూర్తిని. ప్రక్కన కుర్చీలో అనందం కనిపించాడు. అలికిడికి వెనక్కు తిరిగి - 'వో స్వామీ- దా - మా అమ్మ' అంటూ ఆ స్త్రీ మూర్తిని పరిచయం చేశాడు.
'అన్నయ్య!' - మాట పెగిలి రాలేదు స్వామి గొంతు నించి.
ఎల్లప్పుడూ మనిషి మనస్సు -- కేవలం మాటల మీదనే ఆధార పడదు!.
....అయిపోయింది...
