'మీకు బావ విప్లవాన్ని సూచిస్తూ మరుగుతున్న సత్యాల్ని వెలుగులోకి తెచ్చే ఈ ఆడ రచయితలు ఇష్టంగా ఉన్నట్లు లేదు. అవున్లెండి ఎవరైనా, మనం చేస్తున్న అన్యాయాల్ని, అవెంత వికృతంగా ఉంటున్నాయో, వివరంగా చూపిస్తే సహించగలమా? మీరేకాదు నేనూ సహించలేననిపిస్తుంది. కాని అవి నిజాలు, దాగమంటే దాగవు. మేలుకుంటున్న స్త్రీ శక్తి వాటినింకే మాత్రమూ సహించకుండా బట్ట బయలు చేయడానికే నిశ్చయించుకున్న ట్లుంది. అందుకే వాటికి జనాదరణ ఎంత ఉందో మీకు తెలుస్తూనే ఉన్నది కదా!' - అన్నాడు మధు. సుందరశర్మ, ఏవిటి వీడి ధోరణి అన్నట్లుగా మిర్రి మిర్రి చూచాడు. మళ్ళీ మధే అందుకుని, 'ఇంతకూ అసలు సంగతి వదిలి దూరంగా వచ్చేశాం. ఎవరీ రాధికారాణి?' అని అడిగాడు.
'ఈ ఊరే! రెస్క్యూ హోమ్ లో టీచరుపని చేస్తోందట. ఇంటర్వ్యూ ఏమన్నా చెయ్యదలచుకున్నావా? ఆఫీసు ఫైల్లో అడ్రసుంది, వాళ్ళింటికి వెళ్ళు' అన్నాడు శర్మ.
మధు శర్మ ముఖంకేసి చూస్తూ కూడా. అన్యాసక్తంగా, 'నిజమే వో పెద్ద ఇంటర్వ్యూ జరపవలసిందే. ఇవ్వాళే వెళ్ళి చూస్తాను.' అని లేచి వచ్చేశాడు.
అడ్రసు చేతపట్టి ఇల్లు కనుక్కునే టప్పటికి బ్రహ్మ ప్రళయమై పోయింది. సాయంత్రం నాలుగ్గంటలకు బయలుదేరిన మనిషి చీకటి పడుతుండగా గమ్యం చేరుకున్నాడు. ఇల్లు చిన్నది. ఇంటికి ముందు మెల్లా కొద్దిగా ఉంది. అందులో రకరకాల పువ్వులు, పొడుగ్గా కాడల చివర, విడిగిమధురంగా నవ్వుతూ వచ్చే వాళ్ళ నాహ్వానిస్తున్నయ్ జంకు జంకుగా తడిక తోసుకుని, ఇంటి ఆవరణలో ప్రవేశించాడు మధు. గుమ్మంలో పండంటి పిల్లవాణ్ణి అడ్డాల్లో ఉంచుకుని ఓ ముసలమ్మ కూచుని ఉంది. పనిమనిషిలా ఉన్న దాని వాలకం చూచి ఇది రాధికారాణిగా రిల్లేనా' అన్నాడు.
;'మా అమ్మగారిపేరు రాధమ్మగారు' అన్నది అవ్వ...
'హోమ్ లో టీచరుపని చేస్తారు గదూ మీ అమ్మగారు! వారున్నారా?' అని అడిగాడు.
'లేరు ఆయమ్మ ఇంకా హోమ్ నుంచి రాలేదు.' అని మధు కదలకపోయేసరికి,
'కుర్చీ తెస్తానుండండి బాబూ' అంటూ పిల్లవాడితోసహా లోపలికెళ్ళింది అవ్వ.
ఈ పిల్లవాడెవరు?-ఒక్కసారిగా గుండె గొంతుకలో కొట్టుకున్నట్లయింది. రాధికారాణి కధలో సుందరి అవివాహిత మాత. ఆ అంశం కూడా కల్పితం కాదా? అంటే, తను....తను - తండ్రి అయ్యాడన్న మాట! ఎంత చిత్రం? పెద్ద వాళ్ళ తతంగాలు లేకుండా పెళ్ళి కర్చులు లేకుండా తనకే ఇంతవరకూ తెలియకుండా ఒక్కక్షణంలో తను తండ్రి నయ్యానన్న ఆ ఎరుక ఎంత గిలిగింతలు పెడుతోంది?
'అవ్వా!' అని కేకవేశాడు.
అవ్వ చేతుల్లో పిల్లవాడితోటి వచ్చింది. మధు అదాటుగాలేచి పిల్లవాడి దగ్గరకు చేరి పాలబుగ్గల మీద చేయివేసి నిమిరాడు. ఎంత మధురమైన, మృదుస్పర్శ! వాడి కళ్ళల్లో కళ్ళు గుచ్చి వాడు తనవాడే అని చెప్పుకోడానికి ఆధారాలు వెదికాడు. మనసమతా గాలిలో తేలిపోతూ ఉంది. ముఖం అనిర్వచనీయమైన తృప్తితో వెలిగి పోతూ ఉంది. బయట అడుగుల చప్పుడు కూడా లెక్కపెట్టకుండా తన్మయంగా అలా చూస్తూ ఉండిపోయాడు.
ఆ తన్మయత్వంలోనుంచి పిల్లగాలిలా మెల్లిగా వో మంద మధురధ్వని అతణ్ణి బాహ్య ప్రపంచంలోకి తెచ్చి విడిచింది.
'బాబును ఆయనకిచ్చేసి నువ్వు రెండు కప్పులు కాఫీ పట్రా అవ్వా!'-
కొత్తగా వచ్చిన ఎవరో వో మనిషికి పిల్లవాన్ని అందివ్వడ మేమిటో, అమ్మ గారి గొంతు అంత బరువుగా ఉండడ మేమిటో, ఏదీ అర్ధంకాక అయోమయంగా బాబును మధు చేతుల్లో ఉంచేసి అవ్వ లోపలికి వెళ్ళిపోయింది.
'తీసుకోండి! ఇది మీ సొత్తే! ఇప్పటికి మీకే అప్పగించగల శుభఘడియ వచ్చింది.' అన్నది రాధ, ఆవిడ గొంతు ఆనందమో, ఆవేశమో తెలీని తన్మయ స్థితివల్ల స్వల్పంగా ఒణుకుతుండడం మధు గమనించాడు. రాధముఖం ప్రఫుల్ల కమలంలా స్వచ్చంగా, వికాసంతో వెలిగి పోతోంది. ఈ రాధ తన్ను పరిపూర్ణంగా ప్రేమించి తన్ను తాను సమర్పించుకున్న రాధే, ఏవిధమైన మార్పూ పొందకుండా తనకోసం వెయ్యికళ్ళతో ఎదురు చూస్తున్న రాధ! తన ప్రేమఫలాన్ని పండించి పసిపాప రూపంలో చేతుల్లో ఉంచగలిగిన రాధ! తన రాధ! ఒక్క మాటైనా ఆడనీయకుండా ఆవేశం కంఠ గతమై మధును ఉక్కిరిబిక్కిరి చేసింది. పిల్లవాడున్న సందిలి కొంచెంగా ఒణుకు తుండగా, రెండో చేత్తో దగ్గరగా నిలబడ్డ రాధను మరీ దగ్గరగా పొదుపుకున్నాడు. ఆ స్పర్శ రాధకెన్నో అర్ధాలు విప్పి చెప్పింది. ఈ మధు ఇక నీవాడేనని నిర్ధారించింది. ఆనంద పారవశ్యం చేత చెమ్మగిల్లిన రాధ కళ్ళల్లో కోటి స్వర్గాలు విరిసి నర్తించాయి.
* * *
ఆవేళ మాధవికి పోస్టులో వచ్చిన మూడుత్తరాలూ, ఆవిడకు మూడు జీవిత కాలాలపాటు సంచలనం కలిగించే వార్తలు తెచ్చాయి. అందులో ఒకటి రిజిష్టరు చేసిన ఉత్తరం. అందులో రాజారావు తన వీలునామా పంపించాడు. స్వయంకృషిచేత తాను సంపాదించిన ఆస్తి అంతా మరదలు మాధవికి చెందేటట్లు రాశాడు. శకుంతలను పెంచి పెద్దచేసి దాని జీవితాన్ని తీర్చిదిద్దే బాధ్యతకూడా ఆస్తితోపాటే అప్పగించాడు. అందులో వో ఉత్తరం కూడా ఉంది.
'మాధవీ!
నిన్ను పొందలేని ఈ జీవితానికి అర్ధం కనపడడం లేదు. మనస్సంతా నీవై వెలిగే నేను, నిన్ను మర్చిపోవడమనేది సాధ్యం కాదని ఇన్నాళ్ళ అనుభవం తర్వాత గ్రహించాను. నీ అక్క కూతుర్ని పెంచే బాధ్యత నీదే. తనకిచ్చిన మాటకోసం జీవితంలో పెద్ద త్యాగానికి కూడా ముందుకు తూగి నిలిచినదానివి, శకుంతల పెంపకపు బాధ్యతను నీవు చిరునవ్వుతో స్వీకరించ గలవని నాకు తెలుసు. ఆ నమ్మకం ఉండ బట్టే దాన్ని నీ దగ్గర వదలి వచ్చేశాను.
శాంతి లేని ఈ మనస్సుతో మనుషుల మధ్య బ్రతకలేను మాధవీ! కృత్రిమపు బ్రతుకు ఈడ్చలేను. ప్రకృతిలో ఉన్న సౌందర్యాన్ని అన్వేషిస్తూ వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తానో ఎప్పుడు వస్తావో చెప్పలేను. అసలు రానేమో కూడా. కాని నీకు మాట ఇచ్చి వెళ్తున్నాను. నేను ఆత్మహత్యమాత్రం చేసుకోను.
నీ బావ
రాజారావు.' ఈ ఉత్తరం అశనిపాతంలాగే తాకింది మాధవికి. చిత్రమైన మనిషి! తాను కోరి చేయి అందించబోయి నప్పుడు అభిమానపడి అందుకోలేక పోయాడు. ఇప్పుడు! - నిజంగా అంతగా ప్రేమిస్తున్నాడా బావ తన్ను! ఆయనంటే తనకు అంతులేని గౌరవం! ఒక సజ్జనున్ని చూచినప్పుడు కలిగే వెన్నెల లాంటి చల్లదనం మనస్సుకు! అటువంటి వాణ్ణి కూడా సుఖపెట్టలేక పోవడం అటుంచి, పై పెచ్చు అశాంతికి కారణ మైంది తను. తన జాతకం అలాంటిది కాబోలు!'
రెండో ఉత్తరం రాధ రాసింది. మధు తన్నెలా స్వీకరించిందీ, తానెంత ఆనందంగా ఉన్నదీ వివరించింది. అందులో, ఆ ఉత్తర మంతా గుప్తంగా తనమీద సానుభూతిలాటి భావమేదో పూసల్లో దారంలా కనపడకుండా దాగుకొని ఉండడం గమనించక బోలేదు మాధవి. అది చదవ గానే తనకు కలగవలసినంత ఆనందం కలగలేదన్న సత్యం మాధవి మనస్సుకు ముల్లులా గుచ్చుకుంది. అన్నాళ్ళూ రాధ జీవితానికో స్థిరత్వం కలిగితీరాలని ఆక్రోశించిన హృదయానికీ వికారమేమిటి? ఈర్ష్య అంటే ఇదేనా? తన జీవితం ఒక గమ్యం లేకుండా నాశనమై పోతుంటే., తన చెల్లెలు స్థిరంగా సంసారం చేసుకుంటున్నదన్న అసూయా దీనికి కారణం? లేక తను ప్రేమించిన మనిషి మరో వ్యక్తికి ఎటువంటి ప్రతిఘటనా లేకుండా సొంతమై పోయాడన్న గుండెమంటా ఇది? ఒకవేళ మధు రాధను కాదని తన్ను కోరితే అతని మొహమైనా చూడడాని కిచ్చ గించేదా తను! అతన్ని భరించగలిగేదా? తనకేం కావాలో తనకే తెలియడం లేదు' జరుగకూడనిదేదో జరిగిపోయిం తర్వాత, ఇప్పుడు కథ ఎటు మొగ్గినా తనకు సుఖం లేదు- తనకీ జీవితంలో ఎప్పుడూ సుఖం లేదు. తనది దగ్ధ హృదయం!
మూడో ఉత్తరం యూనివర్శిటీ వారు పంపించింది. ఎప్పుడో తాను చేసిన ప్రయత్నాల ఫలితంగా విదేశాలకు ఆహ్వానం వచ్చింది. ఈ ఉత్తరం మెండుతున్న తన గుండెల మీద పన్నీరు చిలకరించింది. కారు చీకట్లో, ఒక్కక్షణం సేపే నిలిచే మెరుపైనా అది ఎంతగా వాంఛనీయమైంది! ఈ మనుషులమథ్యనుండి తానెరగని మనుషుల మధ్యకు, తాను చూడని లోకాల లోకి పారిపోవాలి. బావ ఒకవిధంగా పారిపోతే తాను మరోవిధంగా ఈ చిత్రవధను తప్పించుకుంటుంది. ఒక కొత్తజీవితం. జీవితానికో అర్ధం ఇకముందైనా తనకు లభ్య మౌతుందేమో చూడాలి! శాంతంగా చిరుద్రేకంగా నూరేళ్ళ పంట అయిన తన జీవితాన్ని సార్ధకం చేసుకోవాలి? పరిస్థితులు పగబట్టి తన్ను చిత్తు చేయాలనీ చూస్తున్నా తాను వోడిపోకూడదు. ఈ నిర్విరామ జీవన సమరంలో తాను అపరాజితగా వెలగాలి. వరంలాంటి ఈ జీవితాన్ని విచారాలమధ్య, ఫలించని మమతల మధ్య, మసిచేసుకో కూడదు!- ఈ నిర్ణయంతో కొద్దిగా శాంతించింది మాధవి పెద్దమ్మను రాధ దగ్గరికి పంపించేస్తాను. శకుంతలను నాతోనే తీసుకు వెళ్ళడానికి ఏమన్నా వీలుంటుందేమో కనుక్కుంటాను-అనుకుంది.
ఆ రాత్రంతా మాధవికి కంటిమీద కునుకు లేదు. భవిష్యత్తులోకి తొంగి చూస్తూ కూడా గతాన్ని నెమరు వేసుకోకుండా ఉండలేక పోవడం మనుషుల్లో కనిపించే బలహీనత. గతంలో ఎక్కడ చూచినా మధు కనిపించసాగాడు. అదేదో సినిమాలో ప్రతిచోటా రాధకు శ్రీకృష్ణుడే కనిపించినట్లు! మధును తనింకా ప్రేమిస్తూనే ఉందా? తన్ను కాదని, వో పడుచు వెంట తగిలిన అతి సామాన్యుడైన ఆ మగవాడికోసం తన మనస్సు ఆక్రోశిస్తూ ఉందా? ఆ మాత్రం మగవాడు తనకు దొరకడనేనా ఈ అశాంతి? ఇదేనా ప్రేమ! కాదు! - ప్రేమ అనే ఈ పదం వెనక గూడు కట్టుకున్న బలహీనత స్త్రీ జాతికి అందులోనూ భారత స్త్రీ జాతికి ఒక్కనాటికీ అర్ధం కాదు. మాధవి మనస్సు అసహనంతోటీ, అర్ధం లేని కోపంతోటీ మండిపోసాగింది. తనకు మధు మీద కాదు ప్రేమ! అతని మీదకంటే, తన జీవితంలో మరోమనిషికి స్థానం లేదనుకోవడం మీద ప్రేమ! పురాణగాథలలోని సీత, అనసూయ దమయంతి సుమతి వంటి స్త్రీలయొక్క శీల గాఢత మీద మోజువల్ల పెరిగిన ఇష్టం ఇది. ఇది ప్రేమకాదు!-
ఆలోచనల్తో అలిసిపోతోంది మాధవి. సన్నని జలతారు వలువ, ముసుగు వేసి నట్లుగా, మాధవి మనోగత చైతన్యం మీదికి నిద్ర జారుతోంది. అయినా ఆ నిద్రకు లొంగిపోవడంకూడా ఇష్టం లేదులా ఉంది తనకు! నడిసిన రెక్కల్ని టపటపా విదిలించుకుని నీటి మీద కొంత దూరం పయనించే, నీటి పులుగులా, నిద్రను విదుల్చుకుని మళ్ళీ ఆలోచనల్ని ఆహ్వానించ సాగింది.
'పోనీ! ఆ యిష్టాన్ని పోగొట్టుకోవడమెందుకు? మధును గురించి ఆలోచించి నప్పుడు మనస్సు బాధతో మండిపోతుంది నిజమే. కాని ఆ బాధలోనే మళ్ళీ ఏదో స్మశాన శాంతి. ఒక రకపు వెగటు కలిగించే ఇష్టం. అదీ లేకపోతే తను బ్రతకలేదు.
ఏం చేస్తుంటాడు మధు అనుకోకుండా తన భార్యగా మారి తన జీవితంలో కష్ట సుఖాల్ని సమానంగా పంచుకోడానికి సిద్ధమైన రాధను అలరిస్తున్నాడు కాబోలు!
తన ఆలోచనలకి తానే నవ్వుకుంది. కట్టుకున్న బార్యతో కాపరం చేసుకునే వాడిని గురించి తనకీ ఆరాలెందుకు?
ఇంతలో పక్కలో ఉన్న శకుంతల ఒత్తిగిలి మెత్తని తామర కాడలాంటి చేతిని మాధవి మెడచుట్టూ వేసింది. ఆ స్పర్శకు మాధవి ఉలిక్కి పడ్డది. ఒక్కక్షణంలో సగం సేపట్లో, మనస్సులో గూడుకట్టుకున్న బాధంతా దుఃఖమై గుండె లోపలి నుండి పైకి ఎగదట్టడం మొదలు పెట్టింది.
'ఇది మధు చెయ్యి కాదు. ఆ కృతఘ్నుడి చెయ్యి కానేకాదు!' అని ఆక్రోశిస్తున్న హృదయాన్ని నిర్దాక్షిణ్యంగా అదిమి పెట్టి, తన్ను కరుచుకుని నిద్రపోతున్న శకుంతల ముఖానికి ముఖం మోటించి, నీళ్ళు నిండిన కళ్ళను గట్టిగా మూసుకుంది మాధవి!'
:-అయిపోయింది-:
