"కాలపురుశునికి ధర్మమే తెలుసు తప్ప దయ వుండదు. కాలం వేగంగా పరుగులుదీస్తుంటే అందమైన యవ్వనం పతనం అవుతూనే వుంటుంది. వృద్దాప్యం దొంగలాగా వచ్చి జీవన కుటీరం తలుపుతట్టి లోనికి ప్రవేశించి తిష్ట వేసుకు కూర్చుంటుంది. నిన్నటి వరకూ రకరకాల భోగాలను అనుభవించిన శరీరం శుష్కించిపోయి రోగాలపాలవుతుంది. వార్ధక్యంలో వున్న బ్రతుకు మోయలేని భారమౌతుంది.
"జీవుడికి దీనావస్థ, హీనావస్థ తప్పవు. దీనులకు , హీనులకు దిక్కెవరు? సంసార కూపంలో పడిన వాడికి చేయూత నిచ్చేవాడు , కరుణించేవాడు ఆ పరమశివుడు ఒక్కడే అని ఆదిశంకరుల వారి అభిమతం......'
ఆ విధంగా విష్ణు చాలాసేపు సభికుల సందేహాలను తనదైన శైలిలో వివరణలు ఇవ్వడంతో కరతాళధ్వనులు మిన్నుముట్టాయి.....
విష్ణు దైవాంశ సంభుతుడో కాదో ఇదమిద్దంగా ఒక నిర్ణయానికి రాలేని ఏసిపి కిరణ్మయి, సి.పి పృద్విరాజ్, ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ లాంటి పోలీసు అధికారులలో తొలిసారిగా విష్ణుని గురించి తమ అభిప్రాయం తప్పేమో అన్న భావం పొడసూపింది.
"గౌరవనీయులైన కలెక్టర్ గారు ఎంతో భావోద్వేగంతో చెప్పిన ప్రసంగానికి నేను వివరణ ఇవ్వవలసి వున్నది. చెప్పబోయేముందు నాదొక చిన్న విన్నపం....."
అని విష్ణు ఒక క్షణం మౌనం వహించాడు.
సభికులందరూ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.
'మైడియర్ ఇన్ స్పెక్టర్ ......మీలాంటి యంగ్ , డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ఈ సభాస్థలిలో వుండి చేసేదేమీ లేదని నా అభిప్రాయం. నా భక్తులను కాపలా కాయనవసరం లేదు. ఏ విధమైన తొక్కిసలాట జరుగకుండా నా శిష్యులు చూసుకోగలరు. కానీ మీరు డ్యూటీ నిర్వర్తించవలసింది ఇక్కడ కాదు. పరమపూజ్యమైన ఈరోజు కనకదుర్గ గుడి పరిసరాలన్నీ విపరీతమైన రద్దీగా వుంటాయి. అక్కడ ఎవరికీ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చూడవలసిందిగా నా మనవి."
ఆ మాటలకు వినయ కుమార్ లో ఎలాంటి స్పందన లేదు.
శాంతి భద్రతలను పరిరక్షించే విషయం తనకు తెలుసు....ఆ ఏరియా పోలీసులు అక్కడ తమ విద్యుక్తధర్మాన్ని నిర్వర్తిస్తూ వుంటారు. తను వెళ్ళి ప్రత్యేకంగా చేసేదేం వుంటుంది....ఇక్కడ ఇంతమంది జనాన్ని వదిలి బాధ్యత కలిగిన పోలీస్ అధికారిగా విష్ణు మాటలను మన్నించి వెళ్ళడం తమ డిపార్టుమెంట్ పెద్దలు హర్షించరు.....
అందుకే మౌనం వహించాడతను.
విష్ణు భ్రుకుటి ముడిపడింది. ముఖం గంభీరంగా మారింది.....
"మిస్టర్ వినయ్ కుమార్.......మిమ్మల్ని అక్కడకు వెళ్ళమనడానికి ఇంకొక కారణం కూడా ఉన్నది. ఇంకొక పది నిమిషాలలో అక్కడ ఒక ఘోరం జరగబోతున్నది......మీరు ఈలోగా అక్కడ వుండగలిగితే ఆ ఘోరాన్ని నివారించవచ్చు. దయచేసి వెళ్ళండి" ఈసారి విష్ణు గొంతులో అభ్యర్ధన......
అక్కడ గుమికూడిన జనంలో కేకలు.......అరుపులు......
"స్వామీజీ చెప్పినట్టు చేయాలి......' నినాదాలు మిన్నుముట్టాయి.
వేదికపై వున్న ధీరజ.......కిరణ్మయిలకు అసలేమీ అంతుబట్టలేదు.
భారతీ , రీటాలు మాత్రం ముఖముఖాలు చూసుకున్నారు.
జనంలో వస్తున్న రియాక్షన్ గమనించిన ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ వేదిక పైనున్న కమీషనర్ పృద్విరాజ్ వైపు చూశాడు.
అయన కళ్ళతోనే వెళ్ళమని సైగ చేశాడు........
మనసులో అయిష్టంగా వున్నప్పటికీ ప్రజల నాడిని పసిగట్టి యింక చేసేదేమీ లేక గ్రౌండ్స్ లో నుండి పార్క్ చేయబడిన జీప్ వైపు ఇన్ స్పెక్టర్ వినయ్ మెల్ల మెల్లగా సాగిపోయాడు.
* * * *
అక్కడ విష్ణు ప్రసంగం కొనసాగుతూనే వుంది......
అంతా బుద్దిమంతులైన విద్యార్ధుల్లా మౌనం వహించి విష్ణు చెప్పే మాటలను శ్రద్ధగా వింటున్నారు.
'ఆత్మ సాక్షాత్కారం అంటే వ్యక్తీ తన జీవితకాలంలో పొందగలిగే అత్యున్నతమైన పరిణామం. మరొక అర్ధంలో అది మానవుడు సాధించగల అత్యున్నతమైన జ్ఞానం. ఈ రెండింటిలో అర్ధం ఏదైనా ఆత్మ సాక్షాత్కారం అంటే మానవుని అత్యున్నత వికాసం. ఈ అభివృద్ధి రెండు విధాలుగా వుంటుంది. మనస్తత్వ సంబంధం (తాత్వికం లేదా మానసికం) , ఆధ్యాత్మికం.......
'అయితే మనస్తత్వశాస్త్రం ప్రస్తుత కాలంలో వున్నంత క్షిణదశలో చరిత్రలో ఎన్నడూ లేదు. ఆ శాస్త్రం దాని మూలానికి , అర్ధానికి దూరమై పోయింది. నిజానికి మనస్తత్వశాస్త్రం అత్యంత ప్రాచీనమైన శాస్త్రం. మన స్తత్వశాస్త్రానికి ఆంగ్ల పదం "సైకాలజీ" , సుఖి అనే గ్రీకు పదం నుంచి సైకాలజీ అనే పదం ఏర్పడింది.
"సుఖి అనగా ఆత్మ. ఆత్మను గురించి దాని అమరత్వాన్ని గురించి ప్రభోదించినందుకే ప్రపంచ ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త సోక్రటీస్ విషం త్రాగవలసి వచ్చింది.
భారతదేశంలో హతయోగం, లయయోగం, రాజయోగం, కర్మ యోగం, ధ్యానయోగం , జ్ఞానయోగం, భక్తీ యోగం లాంటి యోగ మార్గాలన్నీ ప్రధానంగా మనస్తత్వ శాస్త్రాలే. అతి ప్రాచీనకాలంలో అవి ప్రచారంలో వున్నాయి.
