Previous Page Next Page 
వసుంధర కధలు-10 పేజి 3

 

    ఈలోగా ముత్యాలమ్మ అక్కడికి గుండెలు బాదుకుంటూ వచ్చేసింది. కొడుకున్నపరిస్థితి చూసి "ఆ పూజారయ్య చెప్పనే చెప్పాడు. మహాకాళి నరబలి కోరుకుందని. మా మొగుడు చేసిన తప్పుకు నేను లెంప లేసుకుంటున్నాను. తల్లీ నా ఒక్క గానొక్క బిడ్డను రక్షించు...." అంటూ లెంపలు వాయించుకోసాగింది.
    నాటువైద్యుడు జాలిగా ఆమె వేపు చూసి "ఊరికే అలా హడావుడి పడకు ముత్యాలమ్మా -నేనున్నాగా అన్నీ చూసుకుంటాను. డాక్టరు దేవుడు కంటే ఎక్కువ. నాకే కానుకలిచ్చుకొంటావో ఏమో , నీ కొడుకును నా శాయశక్తులా ప్రయత్నించి బ్రతికిస్తాను " అన్నాడు.
    ముత్యాలమ్మ మరి మాట్లాడకుండా "నీ ఋణముంచు కొను బాబూ" అని ఊరుకుంది.
    కృష్ణమూర్తికి రెండు గంటల తర్వాత తెలివి వచ్చింది. అప్పటికి అక్కడికి చంద్రయ్య కూదావచ్చి చేరాడు. కృష్ణమూర్తి తల్లినితండ్రిని చూసి, "ఏమిటి - మనమిక్కడెందుకున్నాము?" అనడిగాడు. అతనిమాటలు తెలివి గానే వున్నాయి. అందర్నీ బాగానే గుర్తు పట్టాడు.
    చంద్రయ్య, ముత్యాలమ్మ సంతోషంతో కళ్ళు తుడుచుకున్నారు. కానీ ఆ సంతోషం ఎక్కువ సేపు నిలబడలేదు. కృష్ణమూర్తి వళ్ళు సలసలా కాగిపోతోంది.
    "కంగారు పడక్కర్లేదుచంద్రయ్య -- జ్వరం తగ్గిపోతుంది" అన్నాడు నాటు వైద్యుడు. చంద్రయ్య అసంతృప్తిగా తలూపాడు.
    ముత్యాలమ్మ మాత్రం "తక్షణం గుడికి వెళ్ళి అమ్మవారికి దణ్ణం పెట్టి లెంప లేసుకుని అపరాధం మన్నించమని అడుగు. అబ్బాయికి జ్వరం   తగ్గగానే పూజ చేయిడ్డాము" అంది.
    చంద్రయ్య కాపని చేయడం ఇష్ట మున్నట్లు లేదు. కానీ కొడుకు పరిస్థితి చూస్తుంటే అతనికి బెదురుగా వుంది. అయిష్టం గానే అక్కణ్ణించి కదిలి వెళ్ళి భార్య చెప్పినట్లు చేశాడు.
    కృష్ణమూర్తి కిజ్వరం తగ్గింది. మారు మాట్లాడకుండా అమ్మవారికి పూజలు కూడా చేయించాడు.

                                                            4
    మాణిక్యాలరావును ఎవరో తట్టి లేపినట్లయింది.అతడు మంచి నిద్రలో వున్నాడేమో , కళ్ళు తెరవకుండానే మత్తుగా "ఊ" అన్నాడు.
    కానీ ఎవరో అతన్నింకా లేపడానికి ప్రయత్నిస్తున్నారు.
    మాణిక్యాలరావు కళ్ళు నలుముకున్నాడు. కళ్ళు తెరిచినా అతనికి ఏమీ కనబడలేదు. గదంతా చీకటి గా వుంది.
    "ఎవరు?" అన్నాడు మాణిక్యాలరావు.
    "మహాకాళి ...." అన్న మాటలు వినపడ్డాయతనికి. ఆ కంఠం బొంగురుగా అదోరకం గా వుంది. మాణిక్యాలరావు స్వతహాగా ధైర్యవంతుడు. మహాకాళి యెవరో అర్ధం కాక "మహాకాళి అంటే?" అన్నాడు.
    "ఈవూరి అమ్మవారు........"
    మాణిక్యాలరావుకు భయం వేసింది. "ఎందుకొచ్చావ్ ?" అన్నాడు. అప్పుడే అతని మాటల్లో వణుకు ప్రారంభమయింది.
    "నీకింకొక్కరోజే అయుష్షు వుంది. నువ్వు మంచి వాడివి కాబట్టి ఆ సంగతి చెప్పడానికి వచ్చాను...." అంది ఆ కంఠం.
    మాణిక్యాలరావు భయంగా "నాకింకా బ్రతకాలని వుంది" అన్నాడు.
    "బ్రతకాలని అందరికీ ఉంటుంది. ఆ అదృష్టం మాత్రం అందరికీ వుండదు. రేపు నీకు చావు తప్పదు."
    "నేనేం తప్పు చేశాను?"
    "నువ్వేం తప్పు చేయలేదు. తప్పు ఈ ఊరు చేసింది. అందుకే నాకు నరరక్తం కావాలిరా...."
    'అమ్మవారు మాకు తల్లి లాంటిది. మనిషి రక్తాన్ని కోరేది దేవత కాదు.నువ్వెవరో నన్ను భయపెట్టాలని చూస్తున్నావు...." అన్నాడు మాణిక్యాలరావు.
    అప్పుడే సరిగ్గా గదిలో ఓ దీపం వెలిగి ప్రకాశవంతమైంది. తనకు కనబడ్డ ఆకారాన్ని చూసి నోట మాట రాకుండా అలా చూస్తుండి పోయాడు మాణిక్యాలరావు.
    ఆ ఆకారం చాలా భయంకరంగా వుంది. అసహ్యకరమైన ముఖానికి తోడు రెండు పెద్ద కోరలు కూడా వున్నాయి. చూపులు చాలా కర్కశంగా వున్నాయి.
    భయంతో మాణిక్యాలరావుకు స్పృహ తప్పింది.

                                    5

    "ఏడిశావ్! ఏదో కలగనుంటావ్!" అన్నాడు శేషావతారం.
    "లేదు నాన్నా - అది కల కాదు. నిజంగా జరిగింది ."    
    "బాగుందిరా. చదువుకుని క్లాసులో ఫస్టుగా వస్తున్నావు కదా అని ఎంతో ఆనందిస్తున్నాను. ఆఖరికిలా తయారయ్యావు నువ్వు, అమ్మవారేమిటి భయంకరంగా ఉండటమేమిటి ? నీ గదిలోకి వచ్చి బెదిరించడ మేమిటి? చదువుకునే వాళ్ళనవలసిన ముక్కలు కావివి."
    "ఏదో పీడకల వచ్చినట్లుంది. వాడి ముఖం చూడంగానే బాగా భయపద్దట్లు కనిపిస్తున్నాడు వాడు" అంది చంద్రవంక.
    "కల కాదమ్మా -- నిజంగా చూశాను" అన్నాడు మాణిక్యాలరావు.
    "ఎందుకయినా మంచిది. పూజారి రంగయ్యను పిలిపిద్దాం "అంది చంద్రవంక.
    రంగయ్య వచ్చి మాణిక్యాలరావు కల గురించి సావధానంగా విని -- "కుర్రాడి మాటల్ని మరీ అంత తేలికగా కొట్టి పారేయకండి.నిజంగానే కనబడిందో,కలలో వచ్చిందో కానీ ఇది అమ్మవారి పని అన్నమాట సత్యం. అమ్మవారిని చూసిన తేజస్సు నాకు కుర్రాడిలో కనబడుతోంది. ఈ మధ్య ఊళ్ళో వాళ్ళకు బొత్తిగా భయ భక్తులు నశించాయి. అమ్మవారికి మొక్కుబడులు చెల్లించడం మానేశారు. అందువల్ల నాకు బెంగగానే వుంది - ఇది నరబలిదాకా దారి తీస్తుందేమోనని. ఈ మధ్యనే చంద్రయ్య కొడుక్కు తల పగిలి చచ్చి బ్రతికాడు. అమ్మవారి దయ వల్లనే ఆ కుర్రాడి ప్రాణాలు నిలబడ్డాయి ...." అన్నాడు.
    "ఇప్పుడెం చేయాలంటావ్?" అన్నాడు శేషావతారం చిరాగ్గా.
    "కుర్రాడి పేరున అమ్మవారికి పూజ చేయించి దండిగా కనుక లిచ్చుకోండి"
    "బాగుందయ్యా ! అసలు నీలాంటి వాళ్ళ మూలాన అమ్మవారంటే విలువ తగ్గి పోతోంది. వాడికేదో పీడకల వస్తే నువ్వు లాభం పొందాలని చూస్తున్నావు..." అన్నాడు శేషావతారం.
    "అడిగారు కాబట్టి చెప్పాను. ఆపైన తమ చిత్తం " అన్నాడు రంగయ్య.
    చంద్రవంక  రంగయ్య ను రహస్యంగా పిలిచి "ఓ రెండు మూడు రోజుల్లో నేను పూజ చేయిస్తాన్లె కానీ - అబ్బాయికీ అమ్మగారి బొట్టు పెట్టు ...." అంది.
    రంగయ్య మాణిక్యాలరావును చెయ్యెత్తి ఆశీర్వదించి ముఖానికి అమ్మవారి కుంకుం బొట్టు పెట్టాడు.
    రంగయ్య ఊళ్ళో వెళ్ళాక మాణిక్యాలరావు కల గురించి చాలామందికి చెప్పాడు. ఆ కల ఊరంతా చర్చ నీయంశమై పోయింది. కొంతమంది అది కలేనని అనుకున్నారు. మరికొందరు శేషావతారం ఆడుతున్న నాటకమేమోనని అనుకున్నారు.
    శేషావతారం ఆ గుడికి ధర్మకర్త . అయితే అతను ఏ పనీ శ్రద్దగా చేయడం లేదన్న అపవాదు వుంది. అతడి ఆధ్వర్యం లోనే ఆ గుడికి పలుకుబడి నశించడం మొదలయింది. ఈ విధంగా గుడికి మళ్ళీ పేరు లేపుకువద్దామనుకుంటున్నాడని చాలామంది అనుకున్నాడు.
    మాణిక్యాలరావుకు తను చూసిన భయంకరాకారం బాగా గుర్తుండి పోయింది. అది కల అని అతను అనుకోలేక పోతున్నాడు. అందు గురించే అతనొక పర్యాయం అమ్మవారి గుడికి వెళ్ళి వచ్చాడు. గుడిలోని అమ్మవారి విగ్రహానికి తను చూసిన అకారానికీ ఎక్కడా పోలికలు లేవు.
    ఆరోజు మధ్యాహ్నానికి మాణిక్యాలరావుకు తను చూసినది పీడకలే అయి ఉంటుందని నమ్మకం కలిగింది. అతడు మాములుగా స్నేహితులతో ఆటకు వెళ్ళి పోయాడు.
    అంతా కలిసి అకాట అడుకుంటూన్నారు. పంటలు వేసుకోవడమైనాక ఇద్దరు దొంగలు తేలారు. వేపాకులు తీసుకు రమ్మని వాళ్ళకు పురమాయించారు.
    వేపచెట్టు అక్కడకు చాలా దూరంగా వుంది. దొంగలు వెళ్ళి వేపాకు తెచ్చేలోగా మిగతా వాళ్ళందరూ రహస్య ప్రదేశాలలో దాక్కుంటారు. దొంగ వాళ్ళను వెతుక్కుని వేపాకుతో ఎవరిని ముట్టుకుంటే వాళ్ళు దొంగ అవుతారు.
    సాయంత్రం దాకా స్నేహితులా అట ఆడారు. అట పూర్తయ్యే సమయానికి వాళ్ళకు మాణిక్యాలరావు కనబడలేదు. "ఇంకా ఎక్కడ దాక్కున్నాడు వీడు?" అంటూ చాలా చోట్ల వెతికారు. కానీ ఎక్కడా కనబడలేదు.
    "బహుశా ఇంటికి పోయాడేమో" అనుకుని వూరుకున్నారు వాళ్ళు. అలా వెళ్ళి నందుకు కృష్ణమూర్తి కి కోపం కూడా వచ్చి 'అట మధ్యలో యిలా వెళ్ళడం గుడ్ మేనర్స్ కాదు. అడుగుదాముండండి" అంటూ నలుగురయిదుగురు కుర్రాళ్ళని వెంట బెట్టుకుని మునసబు గారింటికి వెళ్ళాడు.
    వీళ్ళను చూస్తూనే "మావాడేడీ?" అన్నాడు మునసబు.
    "ఇంకా యింటికి రాలేదాండీ ?" అన్నాడు కృష్ణమూర్తి.
    "రాలేదు. మీతో అడుకోదానికే వెళ్ళాడు ...." అన్నాడు శేషావతారం.
    కృష్ణమూర్తి జరిగింది చెప్పగా శేషావతారం కొద్ది గా కలవర పడ్డాడు. "ఇదిగో కాస్త గ్రామనౌకర్లకు కబురు చెప్పి వేడుదురూ" అన్నాడాయన కృష్ణమూర్తితో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS