3
బ్రాహ్మణ బాలకుల రామ్ శాస్త్రిని గురించి తమకి తెలిసినదంతా తమ గురువు గారికి చెప్పారు. చదువు మీద ఆ పిల్లవాడు ఆసక్తి తో అంతదూరంనడిచి వచ్చాడని విని అయన చాలా ఆనందించాడు. రామ్ శాస్త్రి ముఖం లోకి పరిశీలనగా చూశాడు. అతని ముఖంలో కనిపించిన తేజస్సూ ,నిజాయితీ ఆయనని ఆకర్షించాయి.
"అబ్బాయి , ఇంతకు ముందు నువ్వే పాఠశాలలో చదువు కున్నావు? ఎంతదాకా చదువుకున్నావు?' అని అడిగాడు సాదరంగా.
రామ్ మొహం చిన్నపోయింది. నోటమాట రాలేదు. "కౌముది చదువు కున్నావా?' అని ప్రశ్నించాడు.
రామ్ తల అడ్డంగా ఆడించాడు.
"ఇదేమిటి కౌముది పూర్తీ కాకుండా కాశీలో పాఠశాలలో చేరుదామని వచ్చావా?" పాఠశాల గురువు గారు ఆశ్చర్యం వెలిబుచ్చాడు. "పోనీ కనీసం కావ్యాలన్నా కంఠస్థం చేశావా?"
"లేదండీ !" రామ్ గొంతుకలో నిరాశ, నిస్పృహ ప్రతిధ్వనించాయి.
"ఏమిటీ! కావ్యాలు కూడా చదవ లేదూ!' గురువుకి చిరాకు వేసింది. "ఓహో! ఏదో కాస్త సంస్కృతం నేర్చుకుని రూపావళీ , సమాస చక్రమూ చదువుకుని ఉంటావు! ఇక్కడికి వచ్చేశావన్న మాట! ఈ మిడిమిడి జ్ఞానంతో నా పాఠశాలలో చేరుదామనుకొనటం ఎంత సాహసమో తెలుసా?"
"అయ్యా, నేను ఈ రూపావళీ, సమాస చక్రాలు కూడా చదువుకోలేదు." అన్నాడు రామ్ శాస్త్రి బెరుకుగా.
గురువు గారి ఆశ్చర్యానికి అంతులేదు. తన శిష్యుల వైపు తిరిగి వాళ్ళని కేకలు వేశాడు. "మీ కసలు బుద్దుందా . ఈ మొద్దుని నా దగ్గర కేవడు తీసుకు రమ్మన్నాడు? ఇరవయ్యేళ్లు నెత్తి మీద కొస్తున్నాయి. రూపావళీ, సమాస చక్రాలంటే ఏమిటో తెలియదంటాడు! ఈ పాఠశాల కట్టెలు కొట్టేవాళ్ళ కీ, నీళ్ళు చేదే వాళ్ళకీ ఆశ్రయ మనుకున్నారా?"
పిల్లవాళ్ళు హడిలి పోయి, మాట్లాడకుండా రామ్ శాస్త్రిని అక్కడ నుంచి తీసుకు వెళ్ళటానికి ప్రయత్నించారు.
రామ్ శాస్త్రి తన నిరాశనీ, ఆవేశాన్ని అణుచుకో లేక గురువు కాళ్ళ మీద పడ్డాడు.
"అయ్యా. క్షమించండి! నా మీద దయ ఉంచండి! నన్ను పంపించేశారంటే బ్రతకలేను! నే చెప్పేది వినండి-- నా బ్రతుకు ఎంత చెడ్డదో చెప్పనివ్వండి" అంటూ తన కధనంతా ఏకరువు పెట్టాడు. "గురుదేవా! నేను మిమ్మల్ని అడిగేది విద్యాభిక్ష కోసమే! నా ఆహార నివాసాల విషయంలో మీకే బాధ్యతా ఉండదు. అవన్నీ నేను చూసుకుంటాను! వళ్ళు వంచి పని చెయ్యటం నాకు బాగా అలవాటే -- అసలు మిమ్మల్ని తిండి గుడ్డలు అడిగే అర్హత కూడా నాకు లేదు. నా క్షోభని గుర్తించి సరస్వతిని పూజించే అవకాశం ఇప్పించండి!"
గురువు గారిది జాలి గుండె. రామ్ ఆక్రోశం ఆయనని కదల్చి వేసింది. అతన్ని లేవదీసి , మృదువుగా వీపు మీద తడుతూ, "బాబూ, నీ దీక్ష నిజంగా మెచ్చుకో తగ్గది. నీకు అసలే చదువు రాకపోయినా వీళ్ళందరి తో బాటే ఒక శిష్యుడిగా చేర్చుకోనటానికి నిశ్చయించు కున్నాను. ఆహార నివాసాలని గురించి బాధపడకు, నీకన్నీ దొరుకుతాయి! నీ దృడ సంకల్పం నెరవేరాలని ఆశీర్వదిస్తున్నాను, లే! సరస్వతీ దేవి నిన్ను తప్పకుండా కటాక్షిస్తుంది" అన్నాడు.
ఆ గురువు గారు నిజంగా సార్ధక నామధేయుడు. అయన ఆశీస్సులు ఫలించాయి. రామ్ లో అణగారి పోయి ఉన్న ఉత్సాహం చిగిరించే అవకాశం ఇన్నాళ్ళ కి కలిగింది. పది సంవత్సరాల తర్వాత అతని వివేకం, బుద్ది మేలుకునే అవకాశం కలిగింది ........
రామ్ ఆదర్శ విద్యార్ధి అయిపోయాడు. అసలు వారణాసి లో అంత దీక్ష, శ్రద్ధ కలవాడు లేడని పించు కున్నాడు. ఎందరో పండితుల ప్రశంసలని అందుకున్నాడు. ఎన్నో పండిత సభలలో తన అర్హతలని నిరూపించు కున్నాడు. న్యాయశాస్త్రం లో ప్రత్యెక కృషి చేశాడు.
చివరికి రామ్ ని అయిదుగురు పండితులు కలిసి పరీక్ష చేసే రోజు సమీపించింది. పరీక్ష లో కృతార్ధుడయితే కుర్రవాడు రామ్ నిజంగా రామ్ శాస్త్రి ' అవుతాడు!
సభ ఏర్పాటు చేశారు. రామ్ పాండిత్య పరీక్ష ప్రారంభం అయింది. సభకి విచ్చేసిన పండితులు అతనిని ఎన్నో విధాల పరీక్షించారు. వారి ప్రశ్నలన్నిటి కీ రామ్ సరయిన సమాధానాలు చెప్పాడు. విద్యాంసులందరికీ రామ్ పాండిత్యం ప్రగాడ మయినదని తెలిసింది. అయినా, చివరి పరీక్ష గా న్యాయశాస్త్రం మీద ఉపన్యసించమన్నారు.
రామ్ తన గురువు గారికి నమస్కరించి స్వచ్చమైన సంస్కృతం లో ఉపన్యాసం ప్రారంభించాడు. తన పాండిత్యపు లోతులతో సభికులని విస్మయులని కావించాడు. ఎన్నో ప్రాచీన ప్రమాణ గ్రంధాలలోని ఉదాహరణలు అతని నోటి నుండి ధారాళంగా వెలువడి న్యాయశాస్త్రం రామ్ 'శాస్త్రి' కి కరతలామలకమని నిరూపించాయి! సభ "సాధు! సాధు!!" అన్న నినాదాలతో ప్రతిధ్వనించింది. రామ్ శాస్త్రి ని పరీక్షించటానికి వచ్చిన పండితులలో ముఖ్యుడు లేచి ఈ యువ పండితుడి ప్రసంగాన్ని ప్రశంసించారు. అతని మెడలో హారం వేసి "శాస్త్రి' బిరుదు ఉచ్చాడు. ఆ తర్వాత అతనికి "మహా వస్త్రం' - బంగారు నగిషి చేసిన శాలువ -- కప్పాడు. కాశీలో పండిత లోక ప్రవేశానికి అర్హత సంపాదించుకున్న "షాగిర్ద్ ' రామ్ , 'రామ్ శాస్త్రి' అయిపోయాడు! సభ కరతాళ ధ్వనులతో ముగిసింది.
రామ్ శాస్త్రి కన్నీరు ధారాళంగా ప్రవహిస్తూ ఉండగా "మహా వస్త్రాన్ని' అతి వినయంగా తన గురువు గారి పాదాల వద్ద ఉంచాడు. ఆ తర్వాత ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాడు. గురువు గారి ఆనందం వెల్లి విరిసింది. శిష్యుడి ని ఆప్యాయంగా లేవదీసి, "శతాయు]
షీ భవ!" అని దీవించాడు.
* * * *
మర్నాడు రామ్ శాస్త్రి చేతులు కట్టుకుని గురువు ముందర నుంచున్నాడు.
"అయ్యా, మా తల్లిని చూసి పది సంవత్సరాలకి పైగా అయింది. తమరు నా మీద చూపిన దయ ఇంతా అంతా కాదు. తమని వదిలి వెళ్ళాలంటే నాకెంత కష్టంగా ఉందొ చెప్పలేను. కాని ఆవిడని చూడాలి కదా..." అని మనవి చేసుకున్నాడు. గురువు గారు సమాధానం చెప్పే లోపలే మళ్ళీ ఇలా అన్నాడు: "నా బ్రతుకంతా పేదరికం లోనే గడిచి పోయింది. అయినా, నేడు ఆ పేదరికం నన్ను బాధించినంతగా మరేదీ బాధించటం లేదు. మీ వద్ద ఇంత మేలు పొంది మీకు 'గురుదక్షిణ ' సమర్పించుకునే భాగ్యం నాకు లేకపోయింది!'
రామ్ శాస్త్రి విశ్వాసాభిమానాలు అతని గురువు గారి కన్నీళ్ళు చమర్చేట్లు చేశాయి. "బాబూ, ఇటు వంటి వాటిని తలుచుకుని బాధపడకు! నీ జీవిత మంతా ఒక గొప్ప సత్యాన్ని ఎప్పుడూ గుర్తు ఉంచుకో "సావిద్యాయా విముక్తయే!" అన్నారు మన ఋషులు. ఈ విద్యని ఎప్పుడూ దుర్వినియోగం చెయ్యకు! ఇది భగవత్ ప్రసాదితమయిన వరంగా భావించు! నువ్విక్కడేమయినా నేర్చుకున్నా వంటే దానిని ఆత్మ శుద్దితో , పరోపకారర్ధమై న్యాయంగా వినియోగించు! ఇదే నీ వద్ద నేను కోరే గురుదక్షిణ!" అని ఉపదేశించాడు.
* * * *
రామ్ శాస్త్రి గృహోన్ముఖుడయ్యాడు. కొన్ని వారాలలో "మహులీ' గ్రామానికి ఎదురుగా, కృష్ణానదీ అవతల గట్టు మీద ఉన్న పల్లెని చేరుకున్నాడు. వెంటనే నది దాటి తన తల్లిని చూడాలని ఆరాట పడ్డాడు. కాని నది పొంగులో ఉంది. పడవ వాళ్ళెవరూ ఆ ప్రవాహం లోకి వెళ్ళటానికి సాహసించటం లేదు .
రామ్ శాస్త్రి కి ఏం చెయ్యాలో తోచలేదు. కొంచెం సేపు అటూ ఇటూ తిరిగాడు. ప్రవాహం హోరు ఉరకలు వేస్తూ నురగలు కక్కే అలలు ఎంత సాహసం కలవాడినయినా వెనుకాడేట్లు చేస్తున్నాయి. కాని తల్లిని చూడాలనే ఆదుర్దా క్షణక్షణం ఎదురవుతోంది. చుట్టూ ప్రక్కల నుంచి ఉన్నవారు నది పొంగు ఎప్పుడూ ఇంత తీవ్రంగా ఉండగా చూడలేదను కుంటున్నారు. ఇంతలో ఒక సుపరిచిత స్వరూపం రామ్ ని సమీపించింది. పరధ్యానంలో ఈ వ్యక్తీ ఎవరో రామ్ సరిగ్గా గమనించలేదు. కాని, అతనే రామ్ ముఖంలోకి తేరిపార చూసి, "ఎవరూ! రామ్ నువ్వేనా?" అన్నాడు సంతోషంలో సందేహం కూడా కలవగా.
రామ్ ఉలిక్కిపడి అటు తిరిగాడు. "జాన్ బా!" అన్నాడు బిగ్గరగా. ఇద్దరూ కొన్ని క్షణాలు ఒకరినొకరు సంభ్రమాశ్చర్యలతో చూసుకుంటూ మాట లేకుండా నిలబడి పోయారు. రామ్ పేరు వినగానే మరికొందరు కూడా అక్కడ మూగారు. అతని పూర్వ చరిత్ర కొంత తెలిసినవారు ప్రశ్నల వర్షం కురిపించారు. రామ్ శాస్త్రి వారికి సమాధానం చెప్పే స్తితిలో లేడు.
"జాన్ బా! మా అమ్మగారేలా ఉన్నారు?" అని ప్రశ్నించాడు. ప్రశ్న వేస్తూ ఉండగానే అతని కంఠం రుద్దమయి పోయింది.
జాన్ బా జవాబు చెప్పలేదు. రామ్ శాస్త్రి కలవర పాటు అధికం అయింది.
"ఏం, మాట్లాడరు! మా అమ్మగారెలా ఉన్నారు!" అన్నాడు మళ్ళీ. జాన్ బా కళ్ళు చెమర్చాయి.
జాన్ బా బదులు పక్కన ఉన్న మనిషి ఒకతను సమాధానం ఇచ్చాడు. రాదాభాయి కి కొంతకాలంగా అనారోగ్యంగా ఉంది. రెండు మూడు రోజులుగా ఆమె పరిస్థితి మరీ దిగజారిపోయింది. వైద్యుడి దగ్గర మందు తీసుకోనటాని కని జాన్ బా నది ఇవతలకి వచ్చాడు. అవసరంగా మహులీ వెడదమనే అనుకున్నాడు కాని ఈ అడ్డం వచ్చింది. రాధభాయి ఆరోగ్య పరిస్థితి ని గురించి జాన్ బా ఆలోచించని వేళ లేదు. తన అసాహాయ పరిస్థితికి జాన్ బా ఎంత బాధ పడుతున్నాడో చెప్పలేము!
రామ్ శాస్త్రి మౌనంగా జాన్ బా చేతిలోని మందు పొట్లాన్ని తీసుకున్నాడు. ఇది కాక పండిత సభలో తను సంపాదించిన "మహా వస్త్రాన్ని' తల్లి కోసం కాశీ నుంచి తెచ్చిన గంగా జలాన్ని మాత్రం తీసుకుని తన మూట ని అక్కడే పడవేశాడు.
జాన్ బా కి ఒకసారి నమస్కరించి నదిలోకి దూకాడు. ఇదంతా చూసేవారికి అతన్ని వారించేందుకు కూడా వ్యవధి లేకపోయింది. నోటమాట పెగలక అతను అతి కష్టం మీద అవతల తీరం చేరుకోనటం చూశారు. తడి గుడ్డలతో , అలిసిపోయిన రామ్ శాస్త్రి ఆ వడ్డు మీద లేచి నుంచోనగానే వారి కంఠలలో 'హా, హా కారాలు ధ్వనించాయి. అవతల గట్టు మీద నుంచి ఆ దృశ్యం చూస్తున్న మరి కొందరు రామ్ శాస్త్రి వద్దకి పరుగెత్తి అతని చుట్టూ మూగి తమకి తోచిన సహాయం చెయ్యటానికి ప్రయత్నించారు.
రామ్ శాస్త్రి ఇదేమీ పట్టించుకొని వాడివలె తడి గుడ్డల తోనే ఇంటికి పరిగెత్తాడు.
రాదాభాయి కోన ఊపిరితో ఉంది. ఆమె కొడుకు ఒక్క ఉదుటున వెళ్లి ఆమె కాళ్ళ మీద పడ్డాడు. అతని రాకతో ఆమెకి కొత్త ప్రాణం పోసినట్లయింది. హీనస్వరంతో అతన్ని దీవించింది. రామ్ శాస్త్రి ఆమెకి తన కధ అంతా చెప్పాడు. మహావస్త్రం సంపాదించుకున్న వృత్తాంతం విన్న ఆమె సంతోషానికి అవధి లేదు.

'నీకోసం ఈ గంగాజలం కూడా తెచ్చానమ్మా!" అన్నాడు రామ్ శాస్త్రి ఆమె గుండెల్లో తన తల దాచుకుంటూ.
"బాబూ నా వంటి అదృష్ట వంతురాలు ఉండదు! నీవంటి రత్నం నా కొడుక్కావటం నా పూర్వ జన్మ ఫలమే! నీ తండ్రి లాగే నువ్వూ నీ పాండిత్య ప్రతిభతో మహా వస్త్రాన్ని సంపాదించు కున్నావు! నా ఆఖరి క్షణాల్లో గంగాతీర్ధం ఇప్పిస్తున్నావు! ఈ సుదినం కోసం వెయ్యి కళ్ళతో కాచుకుని ఉన్న నా మీద భగవంతుడు దయ దలిచాడు! 'శాస్త్రి' బిరుదు సంపాదించుకున్న నా కన్న కొడుకుని దీవిస్తూ, పవిత్ర గంగా జలాన్ని సేవిస్తూ ఈ లోకాన్ని విడుస్తున్నాను! ఇంతకన్నా నాకేం కావాలి?..." అంటూ తన ఆఖరి శ్వాస వదిలింది రాదాభాయి.
