2
వేళకి పోస్టుమాన్ రాకపోతే చిరాకు పడేవాళ్ళలో జానకిరామయ్య ముఖ్యులు.
ఆయనకి రెండు రోజుల్నుంచీ అసలేం తోచడం లేదు. పోస్ట్ మాన్ తీసుకురాబోయే ఉత్తరాలొచ్చినా బావుండు, కాసేపు చదువుకుని మళ్ళా జవాబు రాయడంలో కొంతకాలం ఖర్చవుతుంది గదా అని ఆయన అభిప్రాయం. పోనీ, తిన్నగా పోస్టాఫీసు కే వెళ్ళి ఉత్తరాలు తీసుకొద్దామా అంటే వోపిక చాలడం లేదు దానికి తగ్గట్టు బయట ఎండ నిప్పులు కక్కుతోంది.
పెద్ద వయస్సు. ఈ దీపం మరింకెన్నాళ్ళో వెలగదు. దీపం వెలిగిన యిన్ని సంవత్సరాల్లో ఎంత చరిత్ర! ఎన్ని అనుభవాలు! గడచినదంతా కలలా, నడిచి వచ్చిన బాటలా ఉంది ఆయనకి.
జానకిరామయ్యగారు పేలవంగా నవ్వారు.
సుశీల కాఫీ తీసుకొచ్చింది. నాన్న పరాకుగా నవ్వడం గమనించి ఆమెకూడా నవ్వుతూ...
"కాఫీ నాన్నా! తీసుకొచ్చి రెండు నిముషాలయింది."
సుశీల మాటతో జానకిరామయ్యగారు తెప్పరిల్లారు. కాఫీ తీసుకుంటూ అడిగారు.
"ఇంకా పోస్టుమాన్ రాలే దేమిటమ్మా?"
ఆమె సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయింది.
కాఫీ ముగించి వీధి అరుగుమీదికి వచ్చి నిలబడ్డా రాయన. అక్కడ నిలబడి వీధివైపు ఆశగా చూడటం మొదలుపెట్టారు.
నిరంజనం ఉత్తరం రాసి పదిరోజులు దాటింది. "హోదాలో బ్రతుకుతూన్న కొడుక్కి తండ్రి కనిపిస్తాడటయ్యా' అంటాడు కోటయ్య పంతులు. పంతులు పిచ్చి కాపోతే-ఎంత హోదాలో ఉన్నా నిరంజనం తన కొడుకే. వాడిమీద నమ్మకం ఇంకా చావలేదు. తండ్రిని మరిచిపోయేంత ధూర్తుడుకాడు నిరంజనం.
నిరంజనం జాతకపురుషుడు. అతన్ని చూచి చాలామంది యిర్ష్యపడటం కూడా కద్దు. ఒక మామూలు బి.ఎ నిరంజనం ఇంత అదృష్టవాతుడవుతాడని జానకిరామయ్యగారుకూడా అనుకోలేదు.
ఆపిల్ల నిరంజనాన్ని ప్రేమించి పెళ్ళి చేసుకున్నదంటే - దాంట్లో ఆశ్చర్యపడక్కర్లేదు. నిరంజనం హుందాగా, అందంగా ఉంటాడు. తన పెంపకంలో గూడా అతనికి ఏ లోటూ రానివ్వలేదు. అతనికి ఒక్క దురభ్యాసమూ లేదు. ఆమాటకొస్తే అతను అందరిలాటివాడూ కాదు. బుద్దిగా చదువుకున్నాడు. అందరిలోనూ అవుననిపించుకున్నాడు.
అలాంటి నిరంజనం రేణుకని ఆకర్షించాడంటే అర్ధం లేకపోలేదు. అతనే తన సర్వస్వంగా ఎంచుకున్నదంటే ఆశ్చర్యపడక్కర్లేదు,
రేణుక, లక్షాధికారుల ఇంట్లోపుట్టింది. బంగారుటుయ్యాల్లో పస్థానం గడిపింది. ఆస్తి విషయంలో నిరంజనం రేణుక కంటే తక్కవ వాడే కావచ్చు. అంతమాత్రాన ఆమెకి తాగనివాడు మాత్రం కానే కాదు.
నిరంజనం మనసు అమృతంలాంటిది. అతని హృదయం నిష్కల్మషమైనది. నిరంజనం రేణుకని ప్రేమించాడని తెలీగానే జనం పెడర్ధాలు తీశారు. ఎన్నో చాటుగా అన్నారు. ఆ మాటలు జానకిరామయ్యగారి వరకూ వొచ్చిన మాట వాస్తవం.
అయితేనేం? కొడుకుపట్ల, అతని నిర్ణయాలమీద ఆయనకి గురీ, గౌరవమూ అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఉంటాయి.
వాళ్ళ పెళ్ళి నిర్విఘ్నంగా జరిగింది. నిరంజనాన్ని అల్లునిగా స్వీకరించడానికి రేణుక తండ్రి ఏ అభ్యంతరమూ పెట్టలేదు. పైగా ఈనాడు నిరంజనం చేత ఆయన పొగాకు వ్యాపారం పెట్టించాడు. గుంటూరులో కూతురూ, అల్లుడు ఉండేందుకు ఇంద్రభవనంలాటి ఇల్లు కట్టించేరు. వ్యాపారం నిరంజనం చేతిలో పెట్టి తాను నిశ్చింతగా పల్లెటూళ్ళో కాలం గడుపుతున్నారు.
నిరంజనంపట్ల ఆయనకున్న గాఢమైన విశ్వాసానికిది చక్కటి నిదర్శనం కాదూ?
ఎవరెన్ని అనుకుంటేనేం-వాళ్ళ మధ్య ఇంత వరకూ ఏ విధమైన పొరపొచ్చాలూ రాలేదు. రావుగూడాను.
జానకిరామయ్యగారు అరుగు దిగి రోడ్డుమీదికి వొచ్చారు. పోస్టుమాన్ కోసం వీధి చివరి వరకూ చూపు నిలిపారు. పోస్ట్ మాన్ ఆలస్యం చేస్తున్న కొద్దీ ఆయనకు విసుగు కలుగుతోంది. పోస్టల్ డిపార్టు మెంటు యావత్తునీ లోలోన తిట్టిపోస్తున్నారు. తండ్రి అవస్థ గమనించిన సుశీల నవ్వుతూ అన్నది.
"వొచ్చే పోస్టుమాన్ ఎలాగో వొస్తాడు గాని, నువ్వెందుకు నాన్నా రోడ్డుమీద ఎండలో నుంచోడం? లోపలికిరా."
ఆయన కిష్టంలేకపోయినా లోపలికొచ్చి కూర్చోక తప్పిందికాదు. కూర్చున్నారన్నమాటే గాని ధ్యాసంతా పోస్టుమాన్ మీదనే ఉంది.
'ఈపాటికి చర్చీ ప్రాంతాలకి వొచ్చిఉంటాడు. రత్నంగారికి ఉత్తరాలిస్తాడు. ఆ తర్వాత హాస్టల్ కి వెళ్ళాలి. అక్కడ స్టూడెంట్సు మరీ గడుగ్గాయిలు. వొచ్చిన ఉతత్రాల్ని సవ్యంగా తీసుకోడం వాళ్ళకి చాతకాదు. ఆ ముసలి పోస్ట్ మాన్ ని నానా అవస్థలూ పెడతారు. దానికితోడు ఈ మణియార్డర్ల బట్వాడా ఒకటి, పాపం, ఆ పోస్టుమాన్ బెదిరిపోతూంటాడు మరి. ఎవరికో వొచ్చిన మణియార్డర్ని మరెవడో తీసుకోడంలాటి ఘోరాలు జరుగుతూనే ఉన్నాయిట. ఎలా సపర్దుకొస్తున్నాడో ఇన్ని అవాంతరాలని. ఎండ-ఈ ఎండలో అంత వయస్సుతో తన డ్యూటీని సక్రమంగా చేసుకుపోవడం తలకుమించిన పనే. దార్లో హడావిడిలో తనకొచ్చిన ఉత్తరాలని కాస్తా దారిలో ఎక్కడయినా పారేస్తే? ఛ .... ఇంత సర్వీసున్న వాడు అంత అజాగ్రత్తగా ఎందుకుంటాడసలు? లోగడ రెండు మూడు తడవలు, తన మనసు ఆగక ఉత్తరాల కోసం తరచి తరచి అడుగుతే అతను బాధపడి అన్నాడు. 'వొస్తే నే నివ్వనా పంతులుగారూ!' అని. కాని తన ఆదుర్దా కాస్త గమనించివుంటే-?.....
ఇవ్వాళ ఎలాగైనా ఉత్తరం వొచ్చి ఉంటుంది. నిరంజనమైనా రాయాలి-లేదా-రెండు రోజుల క్రితం కాకినాడ వెళ్ళిన చిన్నకొడుకు శంకరమైన రాయాలి. తప్పదు. ఏదో ఒక ఉత్తరం తప్పని సరిగా రావాలి. ఇవ్వాళ గనక ఇద్దర్లో ఏ ఒక్కరి నుండైనా ఉత్తరం రాకపోతే గట్టిగా నాలుగు చివాట్లు పెట్టి బాబు రాయాలి.
బైట సైకిలు బెల్లు వినిపించడంతో జానకి రామయ్యగారు ఉలిక్కిపడి లేచారు. గబగబా వీధి లోకి వెళ్ళిపోయారు. పక్కింట్లో ఉర్తరాలిస్తూన్న పోస్ట్ మాన్ "మీకు ఒక ఉత్తరం ఒక ఎం.ఓ. ఉన్నాయండి పంతులుగారూ" అన్నాడు నవ్వుతూ.
జానకిరామయ్య గార్కి ఉత్సాహం కలిగింది.
"అమ్మాయ్ సుశీలా! నా పెన్ను ఇలా పట్రా తల్లీ" కేకపెట్టారు వీధి గుమ్మం దగ్గర నుంచుని.
సుశీల పెన్ను తీసుకొచ్చి యిచ్చింది. ఆసరికి పోస్ట్ మాన్ తనింటికి రానే వొచ్చాడు.
వొచ్చిన పోస్ట్ మాన్ వీధి అరుగు మీద తిష్ఠ వేసి, నింపాదిగా ఉత్తరాల కట్ట విప్పాడు. దాన్లోంచి ఒక ఉత్తరం లాగి జానకిరామయ్య గార్కి ఇచ్చాడు. ఆ తర్వాత మనియార్డరు ఫారము అందించాడు.
జానకిరామయ్యగారు గబగబా ఉత్తరం చదవడం పూర్తిచేసి, ఆ ఉత్తరాన్ని సుశీల కిస్తూ.

"చిన్నన్నయ్య రాశాడు. క్షేమంగా చేరాట్ట. ఉద్యోగ ప్రయత్నాలు సాగుతున్నాయట" అన్నారు.
తర్వాత మణియార్డరు ఫారంమీద సంతకం చేస్తో,
"అమ్మా పోస్ట్ మాన్ కి చిక్కటి మజ్జిగ ఉంటే పట్రా. పాపం ఎండలో పడి తిరగాలాయె" అన్నారు.
ఏభై రూపాయలు నిరంజనం పంపాడు. 'తమ్ముడు కాకినాడ వెడుతున్నాడని రాశారు. ఉద్యోగం దొరికిన తరువాత నాకు తెలియజేయండి. మీ ఆరోగ్య విషయం రాయండి. గుంటూర్లోనే వైద్య సౌకర్యాలు చాలా బావుంటాయి. ఓమాటు మీరిక్కడికి వస్తే మంచిది. ఆలోచించండి' నిరంజనరావు అని రాశాడు.
ఓ రూపాయి పోస్ట్ మాన్ చేతిలో ఉంచారు జానకిరామయ్య. సుశీల తెచ్చిన మజ్జిగ అతని కిస్తూ.
"పాపం...... యింత ఎండలో తిరగడం కష్టమే మరి."
"తప్పుతుందాండి. డ్యూటీ అన్న తరువాత డ్యూటే" అన్నాడు పోస్ట్ మాన్ మజ్జిగ తాగుతూ.
మరో రెండు నిముషాలు తన పవిత్రమైన డ్యూటీ గురించి మాటాడి, ఉత్తరాల కట్ట కట్టుకుని "ఉంటానండి పంతులుగారూ!" అన్నాడు వీధి అరుగు దిగుతూ.
"మంచిది" అన్నాడు జానకిరామయ్య.
అప్పటిగ్గాని జానకిరామయ్యగార్కి పోస్ట్ మాన్ గురించి ఆదుర్దా తగ్గిందికాదు. రేపు యీ సమయానికి గాని పోస్ట్ మాన్ మళ్ళీ గుర్తుకురాడు.
పడక కుర్చీలో నడుం వలచి మళ్ళా ఓ మాటు యిద్దరు కొడుకులూ రాసిన విషయాలు జాగ్రత్తగా చదివారు. అప్పటికప్పుడే నిరంజనానికి ఉత్తరం రాసేరు. డబ్బు ముట్టినట్టూ, వీలు దొరికితే తప్పకుండా గుంటూరు వొచ్చి నాలుగు రోజులపాటు ఉంటాననీను.
బాగా చల్లపడ్డ తర్వాత అలా బజారువైపు వెళ్ళాలనిపించింది.
సుశీలను పిలిచారు.
"పెద్దాడు పంపిన పైకాన్ని షావుకారికి జమ కట్టి వొస్తానమ్మా. పాపం ..... నోరు తెరుచుకు అడగలేక నానా యిబ్బందీ పడుతున్నా డతను. మరి వెళ్ళినొచ్చేదా?'
"వొచ్చేప్పుడు మాత్రం తప్పకుండా వెచ్చాలు పట్రా నాన్నా! ఇంట్లో నిండుకున్నాయి. ఏమేమి కావాలో రాసిచ్చాను గదా?"
"అలాగే."
ఆయన వీధిలోకి వొచ్చారు. ఆలోచిస్తూ పడక ప్రారంభించారు. వయస్సు ముంచుకొస్తుంది. జవసత్వాలు దిగిపోతున్నాయి. ఇంట్లోంచి కదిలి బయటికి రావడ మంటేనే భయం వేస్తోంది. బయటకొచ్చి, కాస్త అలా బజారు మొహం చూడకపోతే బొత్తిగా తోచి చావదాయె. ఎంతసేపని ఆ యింటి నాలుగ్గోడల మధ్యా కూర్చుని గోళ్ళు గిల్లుకోవడం?
చిన్నతనం జ్ఞాపకానికి వొచ్చింది. గతం ఎప్పుడూ అందంగానే ఉంటుందిట. నిజమేనేమో. లేకపోతే అప్పటి ఆనందం, హాయీ యిప్పుడేవి? ఎక్కడికి వెళ్ళిపోయాయి?
ఆరోజుల్లో జీవితం పట్ల యిన్ని ప్రశ్నలూ, యిన్ని ఆలోచనలూ ఉండేవి కావు. చదువుకోడం, స్నేహితుల్తో నవ్వుతూ హాయిగా తిరిగేయడం, ఈ రెండే ముఖ్యమైన వ్యాపకాలు.
చిన్నప్పుడు అందరూ తనని 'అగ్గిపిడుగు' అని పిలుస్తుండేవారు. ధైర్యసాహసాల్లో తనకి పెట్టింది పేరు. వయస్సుకు మించిన అంగసౌష్టవం, బలం తన సొత్తు. అందర్లోనూ చలాకీగా, కంటికి 'వదురు' గా కనిపించేవారు. దేన్నీ ఖాతరు చేసే వారు కానేకాదు,
ఒకసారి-తన కప్పుడు పదహారేళ్ళ వయస్సుంటుందేమో. కుర్రాళ్ళందర్తో కలసి చెడుగుడు ఆడటానికి 'పరర' లోకి వెళ్ళారు. కాస్సేపు ఆడుకున్న తరువాత, చింతచెట్టెక్కి చింతకాయలు కోసుకోడం మొదలెట్టారు.
ఆ ప్రాంతాల్లోనే మహా వికృతంగా ఉండే పిచ్చివా డొకడు తిరుగుతూ ఉండేవాడు. వాడిని చూచి పిల్లవాళ్ళే కాదు, పెద్దవాళ్ళు కూడా వంటరిగా ఉంటే గజగజ లాడేవారు. అప్పుడప్పుడూ ఆ పిచ్చాడు పిల్లల వెంటబడి తరిమేవాడు. దొరికితే కొట్టేవాడు కూడాను.
చింతకాయలు కోసుకుంటూన్న సమయంలో ఆ పిచ్చాడు అటు రావడం జరిగింది. అల్లంత దూరాన వాడిని చూడగానే పిల్లలందరూ బల్లి పిల్లల్లా కొమ్మలకి అంటుకుని పోయి గజగజ వణికిపోతున్నారు. దురదృష్టవశాత్తు, ఆ పిచ్చాడు తిన్నగా వొచ్చి ఆ చెట్టుక్రిందనే తిష్ఠ వేశాడు. పిల్లలకీ పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. వాడు చెట్టు క్రింద కూచుని పిచ్చిగా నవ్వుతూ గుడ్డ పేలికల్ని యిష్టం వొచ్చినట్టు చించుతూ, మధ్య మధ్య ఏదో వాగేస్తూ, కేకలు పెడుతూ నానా భీభత్సమూ చేసేస్తున్నాడు.
వాడు చేస్తున్న యీ హంగామాతో మరింత భయపడిపోయారు. పిల్లలు తేలుకుట్టిన దొంగల్లా గప్ చిప్ గా కొమ్మల్నే అంటి పెట్టుకుని కూర్చున్నారు.
వాడివాలకం చూస్తుంటే వాడు అంతలో కదిలే సూచనలు కనుపించడంలేదు. పోనీ, చెట్టు దిగి పారిపోదామా అంటే, వాళ్ళల్లో ఎవడో ఒకడు ఆ పిచ్చాడి చేతిలో పడక తప్పదు. ఈ స్థితిలో జానకిరామయ్య అనబడే పదహారేళ్ళ కుర్రాడు చిన్న ఉపాయం ఆలోచించేడు.
తనొక్కడే గబగబా చెట్టు దిగాడు. పిచ్చాడికి కాస్త అవతలగా నిలబడి, నడుంకి చేతులు ఆనించి వాడివంక గుడ్లురిమి చూశాడు. పిచ్చాడు తనని చూస్తూ పిచ్చిగా నవ్వేడు. తల గోక్కున్నాడు. గుడ్డపీలికలు తలమీద తలంబ్రాలులా వేసుకుని మురిసిపోతున్నాడు.
"ఏయ్......నువ్వక్కడ్నుంచి లే" అన్నాడు తను.
"...... ...... ...... ......"
"నీకే ...... వెళ్ళిపో యిక్కడ్నుంచి,"
ఈ మాటతో పిచ్చాడు లేచి నిలబడ్డాడు. తనవైపు కళ్ళెర్రజేసి చూశాడు. చెట్టుపై నున్న పిల్లలకి చెమట పడుతుంది. తర్వాత ఏమవుతుందోనని కన్నార్పకుండా చూస్తున్నారు.
వాళ్ళందరూ చెట్టు దిగి యిళ్ళకి వెళ్ళాలంటే యీ పిచ్చాడు యిక్కడ్నుంచి కదలాలి. వాడు కదలాలంటే తను వాడ్ని కవ్వించాలి.
"నీకేనోయ్ చెప్తూంట ..... కదలవే." మళ్ళా పిచ్చాడిని రెచ్చగొట్టాడు. వాడు కదిలాడు. తన వైపు నడిచాడు. తనూ కదిలాడు. వాడు తనను అనుసరిస్తున్నాడు. కొంతదూరం యిద్దరూ అలా నడిచిన తర్వాత, తన కాలికి బుద్ది చెప్పాడు.
ఆ పిచ్చాడిని ముఫైమూడు చెరువుల నీళ్ళు తాగించిన తర్వాత, తాపీగా తను యింటివైపు దారి తీశాడు. ఇంటిదగ్గర తనకోసం చాలామంది ఎదురు చూస్తూన్నారు. ఎవరో అన్నారు గూడా.
"నువ్వు అగ్గిపిడుగువేరా జానీ!"
ఆ రాత్రి అమ్మ తనకి దిష్టి తీసింది.
జానకిరామయ్యగారు నవ్వుకున్నాడు. ఆ వయస్సుకి అలాటి కార్యం 'సాహసమే' మరి. చాలా మంది భయపడిన ఆ మహత్కార్యాన్ని తాను సక్రమంగా ముగించారు. అందర్లోనూ అవుననిపించుకున్నారు.
చిన్నప్పట్నుంచీ తాను అలా పెరిగారు. ఇప్పుడు?
ఈ జీవితమంతా సాహసాలతో మునిగిపోతే ఎంత బావుండునూ. తన పిచ్సిగాని యిప్పుడీ జీవితమే ఒకానొక ఎడ్వంచర్. కాకపోతే-సంసారమనే యీ మహాసాగరాన్ని యీది, తనే ఆధారమైన తన పిల్లల్ని ప్రయోజకుల్ని చెయ్యడం తమాషానా? కాదుగదా.
