తామిద్దరమే ఒంటరిగా ప్రయాణం చెయ్యాలని తెలిసి చారుమతి, 'భగవంతుడా! ఎవ్వలేనా ఎక్కితే బాగుండును' అనుకుంది.
భగవంతుడు చారుమతి మొర ఆలకించలేదు. ఎవరు ఎక్కకుండానే రైలు కదిలింది.
"కాస్సేపు రెస్టు తీసుకున్నట్టు ఉంటుంది, పడుకుంటారా?" రాధాకృష్ణ చారుమతిని చూస్తూ అడిగాడు.
"ఉహు" అంది, కిటికీలోంచి చెట్లను, బయళ్ళను చూస్తూ.
"మీరు ఏమీ అనుకోను అంటే నేను ఒకటి చెబుతా."
"ఏమిటి?"
"మీకు చదువుకోవాలని చాలా కుతూహలం కదూ. మీరు ఈ ఏడే కాలేజీలో చేరండి. మీ రెంత వరకు చదివితే అంతవరకు నేను డబ్బు ఇస్తాను."
తను చదువుకోవడమేమిటి? దాని కతను డబ్బివ్వడమేమిటి? అర్ధంకానట్టు ఆశ్చర్యంగా చూసింది అతనివేపు.
"మీరు మరోలా అనుకోకండి. మా నాన్న మంచి పేరున్న ప్లీడరని తెలుసు గదా! ఆయన బోల్డు సంపాదిస్తున్నారు. ప్రతి నెల కొంత డబ్బు నా పేర, మా తమ్ముడి పేర బాంకులో వెయ్యడం ఆయనకి చాలా ఏళ్లుగా అలవాటు. నా పేర ఇప్పుడు పాతికవేలదాకా ఉంటుంది. అందులోనించి నేను మీకు సహాయం చెయ్యగలను."
ముక్కు, మొహం తెలియని ఆడపిల్లకి డబ్బు ఇస్తాననడంలో ఈయన ఉద్దేశమేమిటి? మౌనంగా కూర్చున్న చారుమతిని చూస్తూ మళ్ళీ రాధాకృష్ణే అన్నాడు నవ్వుతూ:
"మీరీ విషయం, అంటే నేను మీకు డబ్బు ఇస్తున్నట్లు ఎవరికీ చెప్పకండి. పైవాళ్ళకి ఇలాంటివి తెలిస్తే బాగుండదు. మనిద్ధరిని గురించి ఏమైనా ఊహించుకోవచ్చును."
అతని నవ్వు చూస్తే విపరీతమైన అసహ్యం వేసింది చారుమతికి. ఇంతసేపు అతని సంభాషణలో అర్ధంకాని దేమిటో అర్ధం అయిపోయినట్టు అనిపించింది.
"ఏమంటారు?" అన్నాడు అతను కుతూహలంగా.
'ఏమీలేదు" అంటూ పెట్టెలోంచి బుచ్చిబాబు 'చివరకు మిగిలేది' పుస్తకం తీసుకుని మధ్యలోంచి చదవడం మొదలుపెట్టింది.
రాధాకృష్ణ తన పర్సులోంచి చారుమతి టికెట్ తీసి, సీటుమీద పడిఉన్న ఆమె హాండ్ బాగ్ లో పెట్టాడు.
చాలా దగ్గిరయిన స్నేహితులతోకూడా చెప్పుకోలేని స్వవిషయాలు ఒక్కొక్కప్పుడు అపరిచితులతో చెప్పేను కుంటాం. ఇలాటివి సాధారణంగా ప్రయాణాలలో జరుగుతూంటాయి. ఎదటి వ్యక్తి సానుభూతి చూపిస్తున్నట్టు, శ్రద్ధ చూపిస్తున్నట్టు తోస్తే, మన మనస్సుల్లో భారాలు దింపేసుకోడం జరుగుతుంది. ఇవి ఆకస్మికాలు. ముందు ఆలోచించి 'ఇలా చెప్పాలి, వీళ్ళతో చెప్పాలి' అని అనుకున్నవి కావు. 'ఆ అపరిచితుడు ఇక మళ్ళీ మన జీవితంలో కనిపించడు. అతనితో చెప్పుకోవడంవల్ల జరిగే నష్టమేమీ లేదు!' అన్న నిశ్చింత మనని పురిగొల్పుతుందేమో! అంతేకాని, మన కష్టాలు విని, ఎదటి వ్యక్తి ఏదో సహాయం చెయ్యాలని ఆశించము. సహాయం చెయ్యడానికి పూనుకుంటే అహం దెబ్బ తింటుంది.
ఇదే జరిగింది ఇక్కడ. తను చెప్పినవి శ్రద్ధగా వింటున్నట్టు కనిపించిన అపరిచితుడైన రాధాకృష్ణతో చారుమతి తన సంసారవిషయాలు, కష్టసుఖాలు చెప్పేసుకుంది. అతను సహాయం చెయ్యబూనుకోవడం, దానివెనక అసహ్యమైన భావం ఉండడం చూసి ఇప్పుడు సహించలేకపోయింది.
'ఛ, ఎంత పొరపాటు చేశాను!' అనుకుంది బాధగా. పుస్తకం చేతిలో ఉన్నా, ఒక్క అక్షరంకూడా చదవడం లేదు.
రాధాకృష్ణ చారుమతినే చూస్తున్నాడు. కనుముక్కు అంత తీరుగా లేకపోయినా, తెల్లని ఒంటి రంగుతో మెరిసిపోతూ ఆకర్షణీయంగా ఉంది చారుమతి. బారెడు నల్లని జడ. జూన్ నెలైనా, ఇంకా విపరీతమైన ఎండగా ఉంది. కిటికీలోంచి కొడుతున్న ఎండగాలికి తెల్లటి బుగ్గలు ఎర్రగా కంది, ముఖం చాలా అందంగా ఉంది.
'జామ పండులా ఉంది మనిషి అనుకున్నాడు రాధాకృష్ణ.
"ఏమండీ, మన కంపార్టు మెంటు ఏర్ కండిషన్ చేసుకుందామా!" అంటూ చారుమతి సమాధానం కోసం చూడకుండానే కిటికీల తలుపులన్నీ వేసేశాడు.
"ఇప్పుడు చల్లగా ఉంటుంది, చూడండి! పాపం, మీరు ఇంతసేపు కిటికీ దగ్గిర ఎండలో కూర్చున్నారు" అన్నాడు.
చారుమతికి భయంవేసింది.
"తరవాత స్టేషను ఏమిటి?" అంది.
"అనకాపల్లి."
"ఎంతసేపు ఆగుతుంది?"
"అయిదు నిమిషాలు కూడా ఆగదేమో." రాధాకృష్ణ వాచీ చూసుకున్నాడు.
మూసేసిన కిటికీ తలుపులు తీసింది చారుమతి.
"మళ్ళీ ఎందుకండీ తలుపులు తీస్తారు? అనకాపల్లిలో ఎవరైనా ఎక్కెయ్యగలరు." కంగారుగా అన్నాడు రాధాకృష్ణ.
"అనకాపల్లి స్టేషను చూడాలండి. స్టేషను రాగానే మూసేస్తాను."
రాధాకృష్ణ తన హోల్డాలు సైబెర్తుమీద పరిచాడు. ఒక దుప్పటీ, తలగడా తీసి కిందసీటు మీద పెట్టాడు. సావకాశంగా దుప్పటీ సీటుమీద పరిచి, తలగడా వెనక్కి వేసి జారబడి కూర్చున్నాడు. అతనిలో ఏదో ఉత్సాహం ఉరకలు వేస్తూంది సన్నగా ఈల వేస్తున్నాడు.
"చిగురాకులలో చిలకమ్మా, చిన్నమాట సెలవీవమ్మా."-ఆ ఈలపాట వింటున్నకొద్దీ భయంతో వణికింది చారుమతి. మనస్సులో భగవంతున్ని ప్రార్ధించుకుంది. గోముఖవ్యాఘ్రంలా ఉన్న ఇతనిని. సాయంగా పంపిన తండ్రిని మనసులోనే నిందించుకుంది.
అనకాపల్లి స్టేషను వస్తూంది అనగా తువాలు, సబ్బుపెట్టె తీసుకుని బాత్ రూములోకి వెళ్ళాడు రాధాకృష్ణ.
భగవన్నామస్మరణ చేసుకుంటూ కంగారుగా తలుపు దగ్గిరే నిలబడింది చారుమతి. అనకాపల్లి స్టేషను వచ్చింది. రాధాకృష్ణ బాత్ రూములోనించి బయటికి రాలేదు. తలుపు తీసుకుని, తన పెట్టె, బుట్ట తీసుకుని గబగబా దిగి పక్క మూడవ తరగతి పెట్టెకు పరిగెత్తింది. జనంతో క్రిక్కిరిసి కాలు పెట్టడానికి వీల్లేకుండా ఉన్న ఆ పెట్టె దగ్గిర దిక్కుతోచక నుంచుంది చారుమతి. గార్డు విజిల్ వేశాడు. రైలు కదిలింది.
"ఓలమ్మో! ఆడకూతురు నిలబడిపోనాది" అంటూ జబర్దస్తీగా, వస్తాదులా ఉన్న ఓ గవరమనిషి చారుమతిని పెట్టెలోకి పైకి లాగేసింది.
'నా మొర ఆలకించి దేవుడు ఈమెను పంపాడు' అని మనసులో ఆమెకి వెయ్యి నమస్కారాలు చేసింది చారుమతి. విశాఖపట్నం వచ్చేవరకు గంటన్నర నిలుచునే ప్రయాణం చేసినా, మొదటి తరగతి ప్రయాణంకంటే లక్షరెట్లు హాయిగా ఉన్నట్లు అనిపించింది.
'మగవాడిని ఎప్పుడూ నమ్మకూడదు.' తెలిసి వచ్చింది చారుమతికి. అనకాపల్లిలో దిగిపోకపోతే ఏం జరిగేది? తలుచుకున్నప్పుడల్లా ఆ రాత్రేకాక, చాలారోజులవరకు ఎన్నో రాత్రులు నిద్ర పట్టక వణికి పోయేది. ఈ సంఘటన చారుమతి హృదయానికి ఒక పెద్ద దెబ్బలా నిలిచిపోయింది.
4
పెళ్ళివారంతా మద్రాసు రైల్లో ఎక్కారు. పద్మ తల్లి పక్కనే కూర్చుని కిటికీలోనుంచి బయటికి చూస్తూంది. పెళ్ళిముందు శ్రీదేవి, చారుమతి తన్ను ఏడిపించడం గుర్తుకువచ్చింది. దాంతో ముగ్గురు ఇన్నేళ్ళు గడిపిన మధురమైన జీవితం జ్ఞప్తికి వచ్చింది. రోజూ సాయంత్రం ముగ్గురు శ్రీదేవివాళ్ళ ఇంట్లో కలుసుకునేవాళ్ళు శ్రీదేవి కాలేజీ లైబ్రరీలోనించి పుస్తకాలు తెచ్చేది. మొదట్లో నవలలు తెచ్చేది. ముగ్గురు చదివాక, పెరట్లో మామిడిచెట్టుకింద గడ్డిలో కూర్చుని కథ, పాత్రల గురించి చర్చించుకునే వాళ్ళు. క్రమేపీ నవలలోనించి నేటి తెలుగు కవిత్వం మీదికి మళ్ళింది వాళ్ళ దృష్టి గురజాడ అప్పారావు, వేంకట పార్వతీశ కవులు, అడవి బాపిరాజు, పింగళి, కాటూరి, నండూరి, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, కరుణశ్రీ, నారాయణరెడ్డి, దాశరథి, ఆరుద్ర - వరసగా అందరి కవుల రచనలు చదివారు. చదువుతున్నకొద్ది రోజురోజు ఎంతో ఉత్సాహం పొంగేది. ఒక రోజు శ్రీదేవి ముద్దుకృష్ణ సంకలనం 'వైతాళికులు' తెచ్చింది. 'అన్ని పుస్తకాలు కొనుక్కోలేనివాళ్ళకు ఇది ఒక్కటి చాలు" అంది చారుమతి.
