Previous Page Next Page 
ట్రిక్ ... ట్రిక్ ... ట్రిక్ పేజి 3


    రిసెప్షనిస్టు ఆమెవంక జాలిగాచూసి-"ఆ కృష్ణమూర్తి నాకు బాగా తెలుసు. స్మగ్లింగ్ కోసం ఈ ఊరువచ్చి ఇక్కడ ఈ హోటల్లోదిగుతాడు వచ్చినప్పుడల్లా ఓ అమ్మాయిని మోసం చేసిపోతూంటాడు...." అన్నది.
    శకుంతల ఆశ్చర్యంగానూ, భయంగానూ రిసెప్షనిస్టు వంక చూసి-'ఎవరిగురించి మీరు చెబుతున్నారు?" అనడిగింది.
    రిసెప్షనిస్టు కృష్ణమూర్తిని వర్ణించింది. ఆవర్ణన శేఖర్ కు సరిగ్గా సరిపోయింది.
    "కృష్ణమూర్తి ఎక్కడుంటాడో మీకు తెలుసా?"
    "నిన్న రాత్రే అతను తన ఊరికి వెళ్ళిపోయాడు...."
    "ఎలా తెలుసు మీకు?"
    ఆమెనవ్వి- "మీపేరు శకుంతల కదూ!" అన్నది.
    "మీకు నాపేరుకూడా తెలుసా?" శకుంతల మరింత ఆశ్చర్యపడింది.
    "ఒక్క పదినిముషాలలాకూర్చోండి. మీతో అన్నీ చెబుతాను...." అన్నది రిసెప్షనిస్టు.
    శకుంతల అసహనంగా వెళ్లి అక్కడున్న సోఫాలో కూర్చున్నది. అన్న ప్రకారం రిసెప్షనిస్టు పదినిముషాల్లో తన బాధ్యతను మరొకరికి అప్పగించి శకుంతల వద్దకువచ్చి- "నాతోరండి-" అన్నది.
    శకుంతల ఆమెను అనుసరించింది. ఇద్దరూ పార్కుకు వెళ్ళారు.
    రోజూ తను, శేఖర్ కలుసుకునే చోటుకే ఆమె తీసుకునివెళ్ళడం చూసి శకుంతల ఆశ్చర్యపడింది.
    ఇద్దరూ కూర్చున్నాక- "కృష్ణమూర్తి మీకు తన పేరు శేఖర్ అని చెప్పాడు కదూ-" అన్నది రిసెప్షనిస్టు.
    శకుంతల ఆశ్చర్యపడలేదు. ఆమెకు చాలా తెలుసునని గ్రహించిందామె. అందుకే తల ఊపి ఊరుకుంది.
    "అతని అసలుపేరు నాయుడు. ఫిరంగిపురం నాయుడంటేకొమ్ములు తిరిగిన వాళ్ళక్కూడా గుండెలదురుతాయి...."అన్నది రిసెప్షనిస్టు.
    "ఫిరంగిపురం నాయుడా?" కంగారుగా అన్నది శకుంతల. ఆపేరు ఆమెకూడా విని ఉన్నది.
    "అవును. మీరు శేఖర్ గా భావిస్తున్నది ఆ ఫిరంగిపురం నాయుడే! మీరతడికి పాతికేళ్ళుకూడా ఉండవనుకుంటారు. ముఫ్ఫైఅయిదుకు తక్కువుండదు అతడి వయసు...."
    శకుంతలకు బుర్రపని చేయడం మానేసింది. ఆమె చెవులప్పగించి రిసెప్షనిస్టు చెప్పేది వినసాగింది.
    "నాయుడికి వివాహమైంది. పిల్లలుకూడా ఉన్నారనుకుంటాను. భార్యంటే అతడికి పంచప్రాణాలు. ఆమె వంటిమీద ఈగవాలినా సహించలేడతను. ఆమె పూర్వకాలపు మనిషి. వయసులో అతనికంటే బాగా చిన్నది. అతడి నడవడికను గురించి పట్టించుకోదు. వారిది అన్యోన్యదాంపత్యం. నాయుడెలాంటి వాడంటే ఫిరంగి పురంలోని చౌదరికి సింహస్వప్నంలా మసులుతున్నాడు. మీకు తెలుసునో తెలియదో-ఒకప్పుడు ఫిరంగిపురంలో చౌదరికి ఎదురులేదనేవారు. అతడినెదిరించి బ్రతికి బట్టకట్టినవారూ లేరనేవారు. నాయుడు చౌదరికి ఎదురు తిరగడమేకాక- ఫిరంగిపురంలో చౌదరికి ప్రత్యర్ధిగా మనగలుగుతున్నాడు...."
    రిసెప్షనిస్టు చెప్పుకుని పోతోంది.
    శకుంతలకు ఫిరంగిపురం గురించి కొంత తెలుసు.
    రెండు ముఠాలక్కడ పని చేస్తున్నాయి. చట్టవిరుద్ధమైనపనులెన్నో అక్కడ జరిగిపోతున్నాయి. పోలీసులకు దుర్భేధ్యంగా ఉన్న ప్రాంతం ఫిరంగిపురం. ఒకప్పుడు చౌదరి ఆ ఊరికి మకుటం లేని మహారాజు. ఇప్పుడక్కడ నాయుడు వెలిశాడు.
    ఆ నాయుడి చేతిలో తను మోసపోయింది.
    "నాయుడు నాకునిన్న మీగురించి చెప్పాడు...."
    "ఏమని?"
    "పిల్లతెలివైనది. పార్కులో నేను కనపడకపోగానే మోసపోయానని గ్రహించి వెనక్కుపోతుంది. ఒకవేళ ఆమె తెలివి విషయంలో నా అంచనాతప్పి ఆమె లాడ్జికివస్తే-నువ్వే ఆమెకునాగురించి చెప్పిపంపేయ్.....అన్నాడు నాయుడు నాతో..."
    "నాయుడికీ మీకూ ఉన్న సంబంధమేమిటి?"
    "నాపేరు చంచల. ఒకనాటి శకుంతలను నేను...."
    శకుంతలముందు ఆశ్చర్యపడింది. తర్వాత ఆమె కనులు ఎర్రబడ్డాయి- "మీరు చెప్పిందే నిజమైతే - నేను ఫిరంగిపురం వెడతాను. నాయుడు కథకు ముగింపు కనిపెడతాను-"
    చంచల కంగారుగా శకుంతలవైపు చూసి- 'సముద్రపు లోతు చూడాలనుకునేవారు ఆ లోతులోనే కలసిపోతారు. నాయుడి కథకుముగింపు వెతకాలనుకుంటే-మీ కథ ముగిసిపోతుంది-" అన్నది.
    "అదేమిటో చూస్తాను...." అన్నది శకుంతల.
    "ప్లీజ్-నామాట వినండి..." అన్నది చంచల.
    శకుంతల నవ్వి- "నాకు కథంటూ ఉంటే అదెప్పుడో ముగిసిపోయింది. అందుకని కథ గురించీ, ముగింపు గురించీ నాకు బెంగలేదు-" అన్నది.
    ఫిరంగి పురం నాయుడి గురించి మీకు అంతగా తెలిసినట్లు లేదు. ఒకప్పుడు నేనూ అలాగే అనుకుని ఫలితం అనుభవించాను...."
    "అంటే?"
    "నేనొకసారి ఫిరంగిపురం వెళ్ళాను. నాయుణ్ణి కలిశాను. అతడేమిటో, ఎవరో తెలుసుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళిన కారణంగా నా జీవితం మారిపోయింది. ఇప్పుడు నేను నాయుడికి బానిసను. అతడు చెప్పినట్టల్లా వినాలి. అతడు చెప్పేదాకా పెళ్ళికూడా చేసుకోకూడదు. అతడి గురించే నేనీ హోటల్లో రిసెప్షనిస్టుగా చేరవలసివచ్చింది....."
    "ఎందుకని? అతడెలాగూ మిమ్మల్ని మోసగించాడు. ఇంకా అతడికి అణగిమణగి ఉండి ఏం సాధిద్దామని?" అన్నది శకుంతల.
    "సాధిస్తున్నది నేనుకాదు-అతడు-" అన్నది చంచల.
    "అంటే?"
    "నేను ఫిరంగిపురం వెళ్ళినపుడు అతడు బలవంతంగా నాకు ఇలా ఫోటో తీశాడు...." అంటూ తన హ్యాండ్ బ్యాగ్ నుంచి ఒక ఫోటోతీసి "ఇది మరొకరి కంటపడకుండా ఉండాలనే నేను నాయుడు చెప్పినట్లు విన్నాను కానీ ఇలాంటి ఫోటోలో నా స్థానంలో మిమ్మల్ని చూడకుండా ఆపగలగడంకోసం ఇది మీకు చూపిస్తున్నాను-" అని ఆఫోటో శకుంతలకు అందించింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS