Previous Page Next Page 
అగ్ని పరీక్ష పేజి 3


    "అర్చనగారూ మీతో చాలా విషయాలు మాట్లాడాలి. నేను నాలుగైదు రోజులలో మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోవాలి. రేపు రాజమండ్రి రమ్మంటారా మాట్లాడడానికి ఎల్లుండి ఆదివారంకదా మీకు వీలుంటుందా."
    అర్చన సాలోచనగా చూసింది. "రండి తప్పకుండా ఇంతకీ ఏమిటంత సీరియస్ గా అంటున్నారు. ఏమిటి విషయం?" కుతూహలంగా అడిగింది.
    "ఇక్కడెందుకు, నేను రేపు వస్తాను. డైరెక్ట్ గా మీ దగ్గరికి రావచ్చునా. మీ ఫ్రెండు వుంటుందేమో యింట్లో. ఏమన్నా అనుకుంటుందా, నేను వస్తే."
    "ఫరవాలేదులెండి, మీరు నా కజిన్ అని చెపుతా. అది సాధారణంగా ఆదివారం ఇంట్లో వుండదు. వూర్లో వాళ్ళ బంధువులింటికి వెడుతుంది. రాత్రి వరకు రాదు."
    "అయితే సరే, రేపు వస్తాను చాలా మాట్లాడాలి."
    "మీరు నన్ను భలే సస్పెన్స్ లో పెట్టేస్తున్నారు. అంత నాతో మాట్లాడాల్సింది ఏముందో నా ఊహకి తట్టలేదు. కాస్త చెప్పకూడదూ ఏ విషయం గురించో" కుతూహలం ఆపుకోలేక అంది అర్చన.
    రాజేష్ చిలిపిగా చూశాడు. "ఊహు, ఆ సస్పెన్స్ రేపటి వరకు వీడదు. ఈ రెండేళ్ళు నన్ను ఎడ్రసివ్వకుండా బాధపెట్టినందుకు రేపటి వరకు ఇది మీకు శిక్ష. అదే సరేగాని పూజ ఏది. మీతో వుండడం లేదా."
    "ఊహు, లేదు. వాళ్ళమ్మమ్మ తాత దగ్గర వుంచాను. నే కాలేజీకి వెడితే యింటి దగ్గర ఒకర్తే ఎలావుంటుంది.....స్కూల్లో చేర్చాను అక్కడ వాళ్ళమ్మమ్మ, తాతగారి దగ్గర ఈ రెండేళ్ళలో బాగా చేరిక అయింది."
    "అదేమిటి మరి, మీరు మీ అత్తవారింట్లో ఎలా వుంచారు. ఆయనాతో....వాళ్ళు ఏం అన్నారు. పాపని అక్కడ ఎందుకు వుంచారు మరి" సందిగ్ధంగా చూశాడు.
    "మా అత్తగారు, మావగారు కూడా చాలా మంచివారండి. ఆయన అలాంటివారి కడుపున ఎలా పుట్టారా అనిపిస్తుంది. జరిగినదానికి ఎంతో బాధపడ్డారు. కొడుకుని తిట్టారు. యిద్దరికీ సంధి కుదర్చాలని చాలా తాపత్రయపడ్డారు. కాని ఆయన మగ అహంతో తన తప్పులు ఒప్పుకోలేదు. నేనూ సంధికి అసలు వప్పుకోలేదు. అలాంటి మనిషితో కాపురం చేయమని బలవంతంచేస్తే ఆత్మహత్య చేసుకుంటానని తెగేసి చెప్పాను. అన్ని రకాలుగా ప్రయత్నం చేసే యిటూ అటూ అందరూ నిస్సహాయంగా ఊరుకున్నారు. కనీసం పాపని తమ దగ్గర ఉంచమని బతిమలాడారు. ఈ రెండేళ్ళు నే కాలేజీలో చదివేవరకు ఉంచుకుంటామని బతిమలాడితే కాదనలేకపోయాను. మా అమ్మ, మా నాన్నగారు పోయాక బాగా జబ్బుపడింది. అమ్మకి పాపని చూసుకునే ఓపికలేదు. సరే మా అత్తగారు అంత ముద్దుగా చూసుకుంటాం అంటే కాదనలేకపోయాను."
    "ఇలా అలవాటయ్యాక, 'అది నా కూతురు నేనివ్వను' అని మీవారంటే అప్పుడు ఏం చేస్తారు అక్కడ వుంచడం మంచిపని కాదేమో అర్చనగారూ! వాళ్ళకీ ఎటాచ్ మెంట్ పెరిగిపోతుంది కదా!"
    "నేనూ చాలా ఆలోచించాను. మా అత్తగారు, మావగారు నేనెప్పుడు కావాలంటే అప్పుడు పాపని తీసికెళ్ళనిచ్చే షరతుమీద ఒప్పుకున్నాను. వాళ్ళ అబ్బాయికీ విషయంలో ఏ సంబంధం వుండదని చెప్పేకే నేను అంగీకరించాను."
    "ఆహా సరే అదిగో కాజీపేట వస్తోంది. నేమరి దిగిపోతాను మిగతా విషయాలు రేపు! రెండు గంటలు ఎలా గడిచిపోయాయో మాటల్లో చూశారా. యిప్పుడు నా మనసు ఎంత తేలిక అయిపోయిందో తెలుసా అతని మాటల్లో సంతోషాన్ని అతని మొహంలో మెరుపు వింతగా చూసింది అర్చన. రైలాగగానే దిగి కంపార్టుమెంటు దగ్గిర నిలబడి "మరి వెళ్ళిరాణా అర్చనా, రేపు సాయంత్రం వస్తాను. బై" చెయ్యివూపి వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళాడు రాజేష్.
    మిగతా ప్రయాణం అంతా అర్చనకి రాజేష్ గురించి ఆలోచనల్తో సరిపోయాయి. అతను తనతో అంతలా మాట్లాడవలసింది ఏముందబ్బా అన్న ఆలోచనే! అన్నట్టు రాజేష్ యింకా పెళ్ళిచేసుకున్నాడో లేదో అడగనే లేదే అనుకుంది.
    
                                        *    *    *
    
    రాత్రంతా రాజేషుకి నిద్రరాలేదు. అర్చన మళ్ళీ కనిపించిన తృప్తి, సంతోషంతో అతని మనసంతా నిండిపోయింది. అర్చనతో రేపు ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అని రిహార్సల్స్ పదేపదే వేసుకున్నాడు. చెప్పాక ఏం అంటుంది? ఆశ్చర్యపడుతుందా! ఆనందపడుతుందా! అపోజ్ చేస్తుందా ఆమె అభ్యంతరాలని తను నమ్మించి చెప్పి తోసిపుచ్చగలననే నమ్మకం-ఆమె వాళ్ళందరిని తను వప్పించగలడా! అందరిని ఎందుకు వప్పించడం అర్చన వప్పుకుంటే చాలు తనకి. అర్చన తన ప్రపోజల్ ని సంతోషంగా అంగీకరించకుండా వుంటుందా. ఈ దేశంలో ఒక పెళ్ళయిన స్త్రీ, బిడ్డతల్లి, భర్తనించి విడిపోగానే యింక భవిష్యత్తులో ఆనందమే వుండదనుకునే నిర్లిప్తత అలవాటు చేసుకుంటుంది. అలాంటి స్థితిలో నేనున్నాను నీకు' అని ఓ పురుషుడు చేయి అందిస్తే సంతోషంగా అందుకోదా ఆ స్త్రీ! ఆ పురుషుని విశాల హృదయాన్ని, సంస్కారాన్ని అభినందించదా! తన విశాల హృదయం చాటుకోడానికి కాదు. తను ఎవరి మెప్పులకి ఆశించి ఏదో గొప్పపని చేస్తున్నానని అర్చనని చేపట్టాలనుకోడం లేదు. అర్చన తనకి కావాలి. పురుషుడు రెండోపెళ్ళి చేసుకోగాలేనిది స్త్రీ చేసుకుంటే ఏం. పవిత్రత, శీలం, మానం ట్రాష్ అన్నీ ఇంతకీ ఆమె నేరం ఏమిటి అని ఆమె అన్ని సుఖాలకి దూరం అవ్వాలి. పట్టుమని పాతికేళ్ళు లేని ఆమె జీవితాంతం వంటరిగా ఎందుకు బతకాలి. తిరిగి తనకో తోడు నీడ దొరుకుతుంటే ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి ఆమె. వెధవలోకం ఏమంటుంది. నాలుగు రోజులు అనుకుంటుంది చెప్పుకుంటుంది. అయినా ఈ రోజుల్లో ఎవరి గురించి ఆలోచించే తీరిక ఓపిక ఎవరికీ లేవు. తనవాళ్ళనుంచి తప్పకుండా అభ్యంతరం వుంటుంది. బుద్ధిలేదా, నీకేం గతిలేక పెళ్ళయిన పిల్లతల్లిని పెళ్ళాడావా" అని చివాట్లేస్తారు. అభ్యంతరాలు చెపుతారు నమ్మించాలని చూస్తారు అడుగుతారు. ఎవరి మాటా తను లెక్కచెయ్యడు. అర్చనే కావాలి తనకి అర్చనని ఏ విధంగానూ దూరం చేసుకోలేడు తను. ఈ రెండేళ్ళు ఆమె కోసం పడ్డ ఆరాటం తను మరిచిపోడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS