అటు అమెరికాలో వున్న తన బావని పెళ్ళి చేసుకుంటానని, ఇప్పట్నుంచే కలలు కంటూ వుంటుంది.
ఎప్పుడో అయిదేళ్ళ క్రితం అమెరికా వెళ్ళిన తన బావకు తనంటే ఇష్టమని...ఏదో ఒక రోజొచ్చి కామాక్షి డియర్ అని తనను పెళ్ళి చేసుకుని, అమెరికా తీసుకెళ్తాడని ఆశ.
అలా ఆ ఆశల్లో బ్రతికేస్తూ....
"అమెరికా ట్రావెలాగ్ చదువుతూ, భవిష్యత్తులో అమెరికాలో వుంటే పనికొచ్చే విషయాలు తెలుస్తాయంటుంది.
* * *
"ఏయ్...ప్రనూషా....నీ సెలక్షన్ సూపరే..." అంది కామాక్షి.
'అవునవును. భలే బాయ్ ఫ్రెండ్..." అంది ప్రసూనాంబ.
"ఛ....వూర్కోండి...అదేం లేదు" అంది ప్రనూష.
'పోనీ....నేను ట్రయ్ చేసేదా....ప్రసూనాంబ ఆశగా అంది.
ఎక్కడో మండి, మరెక్కడో గుచ్చుకుని....అంది ప్రనూష. "అతడొట్టి రోడ్ సైడ్ రోమియో..." అని అలా ఎందుకన్నదో ఆమెకే తెలుసు. అతనెలాంటివాడో కూడా తెలుసు.
* * *
వేదాచలం కాలు కాలిన పిల్లిలా తన క్యాబిన్లో అటూ, ఇటూ తిరుగుతున్నాడు. తన మేనేజర్ సీటుకే అవమానం జరిగినట్టు ఫీలవుతున్నాడు.
యాభయ్యేళ్ళ వేదాచలం సిన్సియారిటీతో, ఎఫిషియన్సితో కాకుండా కేవలం సీనియారిటీతో మేనేజర్ పదవిలోకి వచ్చాడు. ఆఫీసులో ఎప్పుడూ తన సుపీరియారిటీని చూపించుకునే ప్రయత్నం చేసేవాడు. దానిక్కారణం తను తన సుపీరియార్టీ చూపించకపోతే తనని స్టాఫ్ చులకనగా చూస్తారని భయం.
చాలావుంది 'బాస్' లు చేసే పనే వేదాచలమూ చేస్తున్నాడు. తన బాసిజమ్...అనుక్షణం సబార్దినేటర్ల మీద చూపిస్తాడు. తనో సింహస్వప్నంగా స్టాఫ్ అనుకోవాలని అతని తాపత్రయం.
వాస్తవానికి వేదాచలానికి స్టాఫ్ ఎవరూ భయపడరు. దానిక్కారణం అతనికి ఎఫిషియన్సీ లేకపోవడం, వివిధ రకాలైన సబ్బులను మార్కెటింగ్ చేయడం, వీటిని ప్రమోట్ చేయడం లాంటి పనులు చేసే ఆ ఆఫీసులో మేనేజర్ గా అతను చేయగలిగేది ఏమీ వుండదు. ఆ బాధ్యత అంతా స్టాఫ్ కు అప్పగిస్తాడు. కేవలం అతను నిమిత్తమాత్రుడే.
అతనికి భార్యంటే అమితమైన భయం. ఫోన్ రింగయితే ముందు భార్య గొంతు వినగానే తన ఎదురుగా ఎవరున్న 'పర్సనల్ అని చెప్పి బయటకు పంపిస్తాడు. భార్య మాటలను వినయంగా వినడం, అవసరమైతే అలాగే...అలాగే....అంటూ తలూపడం (భార్య ఎదురుగా లేకపోయినా సరే) చేస్తుంటాడు. భార్యను డామినేట్ చేయడం తన వల్లకాదని అర్ధమైనది. కనీసం స్టాఫ్ నైనా డామినేట్ చేసి తన పెత్తనం చెలాయించాలని అతని ఉద్దేశం.
ఇలాంటి సైకాలజీ చాలమందిలో కనిపిస్తుంది. తను బలహీనత కప్పిపుచ్చుకోవడానికి చాలామంది చేసే పనే వేదాచలమూ చేస్తున్నాడు. దానికితోడు అతను ఉమనైజర్..భార్య అందంగా లేకపోవడం, తనకన్నా రెండు మూడురెట్లు లావుగా వుండటం, పడగ్గదిలో అతడ్ని డామినేట్ చేయడంలాంటి విషయాలు అతడ్ని ఉమనైజర్ని చేసుంటాయ్.
తన హోదాని అడ్డుపెట్టుకొని తన కోరికలు తీర్చుకోవాలనుకునే మనస్తత్వాన్ని అతను డెవలప్ చేసుకున్నాడు. అతని టార్గెట్ ఇప్పుడు ప్రనూషే.
ప్రనూషను ట్రాప్ లోకి లాగాలన్న ఆలోచన యాభయ్యేళ్ళు దాటిన వేదాచలానికి రావడం హాస్యాస్పదమే....అయితే అమ్మాయిలను ట్రాప్ లోకి లాగడానికి, అమ్మాయిలతో సెక్స్ అనుభవించడానికి, వయసుకూ సంబంధం లేదని అతని ఆత్మవిశ్వాసం.
ఎదుటి వ్యక్తి అవసరాన్ని, తను అవకాశంగా మార్చుకోవాలన్నది అతని సిద్దాంతం. ఎవరెవరికే బలహీనతలున్నాయో తెలుసుకోవాలనుకుంటాడు.
ప్రనూష ఓ యువకుడితో స్కూటర్ మీద రావడం గమనించాడు. ఆరోజు ఆలస్యంగా వస్తే ఆబ్సెంట్ మార్క్ పెట్టేసి, తన వార్నింగ్ ని అలా తెలియజేయాలనుకున్నాడు. కానీ, ఠంచన్ గా వచ్చింది. అయితే ఆ వచ్చిందీ ఓ కుర్రాడితో, అదే భరించలేకపోతున్నాడు అతను. ఇంతవరకూ ప్రనూష గత జీవితం గురించి తెలియదు. తన గురించి తెలుసుకునే అవకాశం ఇవ్వలేదు ప్రనూష, అది పూర్తిగా తన వ్యక్తిగతమని ఆఫీసులో జాయిన్ అయినప్పుడే చెప్పేసింది అందరికీ. ఆవిధంగా ఆమె వ్యక్తిగతం గురించి ఎవరూ 'ఆరా తీయకుండా ముందే ఏర్పాటుచేసుకుంది.
ఆమెను ఏదోవిధంగా సాధించాలి. తన సాధింపులు భరించలేక తనకు 'లొంగడమో..' లేదా ఈ ఉద్యోగానికి 'ఉద్యాపన పలకడమో చేయాలి.
బెల్ కొట్టి ఫ్యూన్ని పిలిచి ప్రనూషను పిలుచుకు రమ్మన్నాడు.
ఫ్యూన్ వైపు ఆశ్చర్యంగా చూసింది ప్రనూష.
తన నీ టైంలో మేనేజర్ ఎందుకు పిలిచినట్లు? ఫైల్స్ అన్ని క్లియర్ చేసింది. ఆలస్యంగా కూడా రాలేదు. మళ్ళీ ఏదైనా ప్లాన్ వేశాడా?
"ఏయ్...ప్రనూషా ఏంటీ స్టాట్యూలా అయిపోయావు? మేనేజర్ పిలిచినందుకా?
కామాక్షి మాటలతో ఆలోచనల్లో నుంచి బయటపడి మేనేజర్ క్యాబిన్ లోకి వెళ్ళింది.
స్టాఫ్ ఆసక్తిగా చూస్తున్నారు. "ఏం జరుగుతుందోనని."
* * *
