జయలక్ష్మి నవ్వుకుంటూ వెళ్ళింది. జానకిరాం ఒక్కసారి నిట్టూర్చి మళ్ళా ఒకసారి గౌతమి ఉత్తరాన్ని చదువుకున్నాడు.
* * *
సాయంత్రం నాలుగ్గంటలు దాటాక జయలక్ష్మి స్నేహితురాలింటికి వెళ్ళొస్తానని శ్రీలక్ష్మికి చెప్పి కృష్ణమూర్తి ఇంటికి వెళ్ళింది. కృష్ణమూర్తి ఒక్కడే ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాడు. స్వాతి జ్యోతి వాళ్ళ ఇంటికి ట్యూషనుకు వెళ్ళింది.
"కులాసాగా ఉన్నావా అన్నయ్యా" అంటూ వచ్చిన జయలక్ష్మిని చూసేసరికి కృష్ణమూర్తి నస్సు వాత్సల్యంతో ఉప్పొంగిపోయింది. స్వాతితో తను విడిగా కాపురం ఉంటున్నాక ఏ బంధువూ తన ఇంటికి ఎప్పుడూ రాలేదు. బంధువులనూ, తల్లిదండ్రులనూ, తోబుట్టువులనూ వదులుకుని ఇన్ని సంవత్సరాలుగా జీవిస్తున్న తన ఇంటికి ఒక రక్తాన్ని పంచుకుని పుట్టిన తమ్ముడు జానకిరాం రావటం ప్రారంభించాక అతని మనస్సు కొంచెం తేరుకుంది. శలవులకు ఆ ఇంటికి వచ్చిన జయలక్ష్మి ఇప్పుడు తన ఇంటికి వచ్చిందంటే అతని సంతోషానికి హద్దు లేకపోయింది.
అక్కడే కుర్చీలో కూర్చున్నది. జయలక్ష్మి.
"జయా, ప్రతి సంవత్సరం శలవులకు నాన్న గారింటికి వస్తూ పోతూనే ఉన్నావు. కాని ఇంత కాలమూ ఈ కృష్ణమూర్తి అన్నయ్యను చూట్టానికి ఒక్కసారీ రాలేదు. నేటి కాలానికి ఈ అన్నయ్య నీకు గుర్తొచ్చా డన్నమాట, పోనీలే తల్లీ, ఈ మాత్రం అభిమానం చూపించినందుకు చాలా ఆనంద పడుతున్నాను" అన్నాడు కృష్ణమూర్తి ఉద్వేగంగా.
జయలక్ష్మి మనస్సుకు కష్టం కలిగింది. ఈ అభియోగాన్నుంచి తప్పించుకోవాలంటే అనేక కారణాలు చెప్పాలి. ఆ కారణాలు హేతువాదానికి విలువలేనివి. మానవ హృదయంలో విరుద్ధ ప్రవృత్తులు ఎల్లకాలం తిష్ఠ వేసుకుని ఉండవు. ఒక సమయంలో లేని ధైర్యం మరొకసారి రావచ్చు. ఒక సమయంలో రాని చొరవ మరొక సమయంలో ముందుకు దారి తియ్యవచ్చు.
"నీమీద నాకు ఎన్నడూ కోపం లేదన్నయ్యా. మనస్సులో నిన్ను చూడాలనుకున్నా పరిస్థితుల ప్రాబల్యం వల్ల రాలేకపోయాను. ఏదైనా ఒక తప్పును ఎప్పుడో చేస్తే పిడుక్కూ బియ్యానికీ ఒకటే మంత్రమంటే ఎట్లా చెల్లుతుంది. ప్రతి చిన్న విషయానికీ, అదే తప్పును వేలెత్తి చూపుతుంటే జీవితానికీ అంతకన్న యమ చర ఇంకోటి ఉండదు. ఒకరి మనస్సుని మార్చాలని సంవత్సరాల తరబడి పాటుపడేకన్న మన మనస్సుని కాలానుగుణ్యంగా మలుచుకుంటే అంతకన్నా శుభప్రదమైన విషయం మరొకటి ఉండదు. సరే దానికేం గాని, వదినె ఇంట్లో లేదా?" అన్నది జయలక్ష్మి.

"తాసిల్దారు గారింటికి ట్యూషనుకు వెళ్ళింది. వచ్చేవేళయింది. ఈ పాటికి వస్తూ ఉండొచ్చు" అన్నాడు కృష్ణమూర్తి.
"వదినెను చూడాలని ఎప్పుడనుకున్నా చూడలేకపోయాను. ఆ రోజులు అటువంటివి. ఏసమయంలో ఏ వ్యక్తితో పరిచయం చేసుకోవాల్సొస్తుందో, పరిచయం అవుతుందో మనకు తెలీదు కదా" అన్నది జయలక్ష్మి.
అంతలోనే స్వాతి, జ్యోతి ఇద్దరూ వచ్చారు. ఈ కొత్త వ్యక్తి ఎవరా అని స్వాతి ఒక్క క్షణం ఆలోచించిన వెంటనే స్ఫురణకు తెచ్చుకుని,
"ఓ, జయలక్ష్మీ మేం గుర్తున్నామా తల్లీ, ఎంత కాలాని కొచ్చావు మా ఇంటికి" అన్నది ఆప్యాయంగా జయలక్ష్మివైపు చూస్తూ.
"కులాసానా వదినా. నిన్ను చూడాలని ఉవ్విళ్ళూరుతూ ఉరకలు వేసుకుంటూ వచ్చాను. నువ్వేమో సంపాదన పరురాలివి. ట్యూషనుకు వెళ్ళావని అన్నయ్య చెప్పారు" అన్నది జయలక్ష్మి.
"ఏదో పొట్టతిప్పలు. బ్రతకలేక బడిపంతులూ, తిండికి లేక ట్యూషన్లూ అన్నారు. ఈ అమ్మాయి తాసిల్దారు గారమ్మాయి. పేరు జ్యోతి. వీళ్ళ తమ్ముడికి, చెల్లెళ్ళకీ చిన్న క్లాసులవాళ్ళకి ట్యూషను చెపుతాను. మా జయలక్ష్మిని చూశావా జ్యోతీ, ఈవిడా ఒక ఆడబడుచు" అన్నది స్వాతి జ్యోతిని, జయ లక్ష్మికి పరిచయం చేస్తూ.
"నమస్కారం. మీరూ విశాఖపట్నంలో ఆనర్సు చదువుతున్నారు కదూ నాలుగయిదు రోజుల క్రితమే జానకిరాం అన్నయ్య చెప్పారు. పరీక్షలయి మీ రొస్తున్నారని" అన్నది జ్యోతి.
"జానకిరాం అన్నయ్య" అనే మాట విని జయ లక్ష్మి ఆశ్చర్యపడింది.
"అయితే తాసిల్దారుగారు మనకు బంధువులా వదినా, మా అన్నయ్యలు వీరికీ అన్నయ్య వరుస అవుతారా" అన్నది జయలక్ష్మి.
ఈ మాటకు జ్యోతీ, స్వాతీ నవ్వారు.
"బంధువులు కాకపోయినా ఆత్మ బంధువులు. జ్యోతికి అన్నలుగాని, అక్కయ్యలు గాని లేరు. అందుచేత ఆ సరదా మన కుటుంబం ద్వారా తీర్చుకుంటున్నది. జ్యోతి నాకూ ఆడబడుచు. నువ్వూ శ్రీలక్ష్మి ఆమెకు అక్కయ్యలు, వారిద్దరూ అన్నయ్యలూ తెల్సిందిగా, ఇంక ఈ ఆడబడుచుల మధ్య నే నలిగిపోకుండా చూసుకోవాలి" అవి కాఫీ తేవటానికి వెళ్ళింది. జ్యోతి జయలక్ష్మి అక్కడే కూర్చున్నారు కృష్ణమూర్తితో మాట్లాడుతూ.
జయలక్ష్మి మనస్సు పరిపరి విధాలపోతున్నది. మురహరి మేనమామ ఈ జ్యోతి తండ్రిగారేనా అని అడగటానికి మనస్కరించలేదు. జ్యోతి ఏదో ప్రశ్నలు వేస్తున్నా ముభావకంగానే సమాధానం చెపుతున్నది జయలక్ష్మి.
కొంత సేపయ్యాక స్వాతి కాఫీ తెచ్చింది. అంతా కాఫీ తాగి కబుర్లల్లో పడ్డారు. జయలక్ష్మిని చూస్తుంటే జ్యోతికి ఏదో తెలియని సద్భావము, ఆప్యాయత, ఆమెతోనే ఎక్కువగా మాట్లాడాలనే ఆకాంక్ష కలిగినయ్యి. ఆనర్సు చదువుకున్న ఆమె తో మాట్లాడితే, తెలియని విషయాలు తెల్చుకోవచ్చుననీ, విశాఖపట్నం విశేషాలు వినవచ్చుననీ, చనువుగా అక్కయ్యతో మాట్లాడినట్లుగా మాట్లాడి అక్కయ్య లేనికొరత ఈ రీతిగా తీర్చుకో వచ్చుననీ ఎన్నో ఆలోచించుకుని, అంచనాలు వేసుకుంది మనస్సులో జ్యోతి.
జ్యోతిని చూసి నప్పట్నుంచీ మురహరి మేనమామ కూతురు ఈ పిల్లే కామాలనిపించింది. జయలక్ష్మికి, అడగటానికి అభిమాన పడింది.
"మాబావ మీకూ తెలుసా" అని ఆ పిల్ల అంటే తన అభిమానం దెబ్బతింటుందని నిశ్చయించుకుంది జయలక్ష్మి. ఏమిటో మనస్సులో అనిర్వచనీయమైన ఆలోచనలు. దారీ తెన్నులేని ఆలోచనలు. ఏమిటో తెలియని ఆలోచనలు.
22
అగ్గిపెట్టె దగ్గర్నుంచి ఆటంబాంబు దాకా మాట్లాడుకున్నారు నలుగురూ. జయలక్ష్మి మాటల్లోని నేర్పు, ఓర్పూ స్వాతికి నచ్చినయ్యి స్వాతి మాట పొందికనూ, మనస్సు నొప్పించకుండా ఇతరుల తప్పులను సూటిగా చెప్పగల మాటల తీరునూ చూసి స్వాతి ఎడల ఎనలేని సద్భావాన్ని మనస్సులో ఏర్పర్చుకుంది జయలక్ష్మి. చిన్న పిల్లయినా పెద్దమాటలు మాట్లాడుతూ, పెద్దల మాటను వప్పుకుంటు అందరితోనూ సభ్యతగా నవ్వుతూ చిలిపిగా మాట్లాడే జ్యోతి స్వభావాన్ని హర్షించింది జయలక్ష్మి. చదువుకున్నదనే గర్వం లేకుండా సహృదయతతో సంసార పక్షంగా మాట్లాడుతూ స్నేహానికి ప్రాణం అర్పించే విశాల హృదయురాలిగా జయలక్ష్మిని తన మనస్సులో చిత్రించుకున్నది జ్యోతి. ఈ ముగ్గుర్నీ చూసి మురిసిపోయి ఈ నాటికి తనూ ఒక వ్యక్తిత్వం గల వ్యక్తిగా గుర్తింపబడినందుకు ఎంతో ఉప్పొంగి పోయాడు కృష్ణమూర్తి. ఈ సమావేశంలో జానకిరాం కూడా ఉంటే ఎంతో బావుండునని పించింది కృష్ణమూర్తికి. కాని ఆ రోజున జానకిరాం ఎందుకో రాలేదు.
సాయంత్రం ఆరు గంటలు దాటాక వెళతానన్నది జయలక్ష్మి. అప్పుడే వెళ్ళటానికి వీల్లేదు, మా ఇంటికి వచ్చి వెళ్ళాలని పట్టుపట్టింది జ్యోతి. మరోసారి వస్తానని చెప్పినా జ్యోతి వప్పుకోలేదు.
"మీ చెల్లెలు అంతగా పట్టు బడుతుంటే ఒకసారి వాళ్ళింటికీ వెళ్ళి తరువాత మీ ఇంటికి వెళ్ళు జయా" అన్నది స్వాతి.
"వదినెకూడా చెప్పారు. ఇంక తప్పదు" అన్నది జ్యోతి.
"ఇవ్వాళే రావాలంటావా, పోనీ రేపొస్తాను" అన్నది జయలక్ష్మి. ఆమె మనస్సులో ఏదో సంశయం పీకుతూనే ఉంది.
"నువ్వు రానంటే ఊరుకునేది లేదు అక్కా. చెల్లెలు అంతగా బ్రతిమాలుతుంటే ఈ జయలక్ష్మి అక్కయ్యకు ఇంత గర్వమా అని అనుకోవాల్సొస్తుంది" అన్నది జ్యోతి జయలక్ష్మి చెయ్యి పట్టుకుని. కృష్ణమూర్తి కూడా వెళ్ళిరమ్మన్నాడు. జయలక్ష్మికి సరేననక తప్పలేదు.
జ్యోతి, జయలక్ష్మి వాళ్ళింటి వెళ్ళారు. వెళ్ళగానే జ్యోతి జయలక్ష్మిని తల్లికి పరిచయం చేసింది. ఆప్యాయంగానే ఆదరించి, కుశల ప్రశ్నలు వేసింది జ్యోతి తల్లి.
మంత్రముగ్ధురాలుగా జ్యోతి వెనుక తిరుగుతూ జ్యోతి అడిగే ప్రశ్నలకు జవాబు చెపుతూ ఇల్లంతా కలయదిరిగింది జయలక్ష్మి. ఆమె మనస్సులోని ఆరాటము ఆమె మాట్లాడే మాట లకు అడ్డుపడి అప్పుడప్పుడూ మాట తడబడుతున్నట్లుగా ఉన్నది.
"ఆనర్సు ప్యాసయ్యాక ఏం చేస్తావు అక్కా" అన్నది జ్యోతి. ఇద్దరూ జ్యోతి గదిలో కూర్చున్నారు.
"ఏం చేస్తాను. నేనేం చెయ్యగలను" అన్నది జయలక్ష్మి తడబడుతూ.
"అదేమిటీ. ఏదయినా ఉద్యోగం చేస్తావా లేక కాలేజీ లెక్చరరుగా వస్తావా. మన వూరు కాలేజీలో లెక్చరరుగా చేరితే చాలా బావుంటుంది" అన్నది జ్యోతి.
