16
"మీనాక్షి వుందా?' హల్లో అడుగు పెడుతూ కుర్చీలో కూర్చుని నవల ఏదో చదువు కొంటున్న భానుమూర్తి నడిగింది విశాల.
"లేదు."
"ఎక్కడి కెళ్ళింది?"
"అత్తయ్యా వాళ్ళింటికి."
అక్కడే కాసేపు కూర్చోవడమా , లేక వెనక్కు వెళ్ళిపోవడమా అన్న దైద్వీభావమానసయై ఓ క్షణం అలాగే నిల్చుంది విశాల.
"కూర్చో కూడదా?"
"ఊహు...."
'ఏమో?"
"చెప్పందే!" నవ్వి క్రీగంట చూస్తూ అంది.
"ఇప్పుడు చెప్తున్నానుగా? కూర్చో."
భానుమూర్తి కెదురుగా కుర్చీలో కూర్చుంది. విశాల.
"మాష్టారూ గారూ తన అంగీకారాన్ని యిచ్చేశారు, విశాలా! ఇక ఎదురు చూడవలసింది ఆ శుభ ఘడియల కొరకే!' నవ్వుతూ అన్నాడు భానుమూర్తి.
విశాల ముఖం సిగ్గుతో కెంపు వర్ణాన్ని ధరించింది.
"నేను నిజంగా అదృష్టవంతుణ్ణి! ఇంతటి ఉత్తమురాలు నాకు సహచారిణి అవుతుందని నేనేరోజూ అనుకోలేదు. అదృష్టదేవత వరించడం అలస్యమైతేనేం? నిరీక్షణకు తగిన ఫలితమే దొరికింది!"
"ఆ మాట మీరు కాదూ అనవాలసింది నేను! అయినా అదృష్టమంటేనే భయం నాకు. అదీ చంచలమైంది. ఏరోజు వెళ్ళి పోతుందో కూడా తెలీదు." భానుమూర్తి ముఖంలోకి చూస్తూ భయంగా అంది విశాల.
అదృష్టాన్ని శంకించడమంటే నన్నూ శంకించడం కాదు గదా!" సన్నగా నవ్వుతూ అన్నాడు.
"లేదు, లేదు , మీరలా ఎప్పటికి అనుకోకండి! జన్మజన్మలకు మీకు నేను కృతజ్ఞురాలినే!' అంది అర్ధనిమీలిత నేత్రయై.
"కృతజ్ఞురాలివా? ఎందుకో?" ముఖం ముడిచి అన్నాడు.
"ఎందుకా? అమావాస్య లాంటి జీవితంలో పూర్ణ చంద్రుడివై వెన్నెల కురిపించినందులకు!"
"ఓ! అయితే నేను గూడా నీకు కృతజ్ఞుడినే!"
విశాల నవ్వింది.
"ఎందుకని అడగవెం?"
"ఏదో చెప్తార్లెండి!"
"నువ్వు చెప్పగా నేను చెప్పరాదేమిటి? శిశిరం లాంటి నా జీవితంలో వసంతోదయం అయినందుకు."
"కాదు. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు." తలవంచి అంది విశాల.
"మరి ఒక్కరూ నాక్కనిపించలేదే!"
"మీరు చూడలేదు గాబోలు!"
"చూస్తున్నా కనిపించలేదు."
విశాల ముసిముసిగా నవ్వింది.
"విశాలా!' భానుమూర్తి కుర్చీలో నుండి లేచి విశాల చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ పిల్చాడు.
ఆ స్పర్శతో విశాల హృదయం పులకరించింది. కళ్ళెత్తి భానుమూర్తి కళ్ళల్లోకి చూడ లేకపోయింది. పెదమలు మెల్లగా కంపించాయి.
"మనిద్దరి మధ్యా కృతజ్ఞతా భావం వుండకూడదు .. తెలిసిందా?"
"అదెలా వీలవుతుంది?" భానుమూర్తి చేతిలో నుండి తన చేతిని తీసుకుని అంది విశాల.
"ఎందుక్కాదు?"
"రేపొకవేళ 'నన్ను ప్రేమించవద్దు, విశాలా!" అంటే మానుకొవాల్నా?"
"అలా ఎందుకంటాను?"
"ఎందుకనగూడదు? ఈమాట అన్న తర్వాత ఆ మాట మటుకు అనరన్న నమ్మకమేమిటి?" వచ్చే నవ్వు ఆపుకుంటూ అంది.
"ఉహు.... అలా ఎప్పటికీ చెప్పను. కృతజ్ఞత అనే కారుమేఘం నీ ప్రేమచంద్రుణ్ణి కప్పేయడం నాకిష్టం లేదు. స్వచ్చంగా, సుందరంగా ప్రకాశవంతంగా వెలుగుతూ, వెన్నెలను వెదజల్లాలి. అందుకు యిలాంటి కారుమేఘాలను మనం దగ్గరకే చేరనివ్వరాదు."
"కవిత్వం వస్తుందే!"
"ప్రేమించిన ప్రతివాడికీ కవిత్వ మోస్తుందట!"
'అని ఎవరన్నారట!"
"ఎవరో నాకు గుర్తు లేదు. కానీ అది నిజమని నాపట్లే రుజువైంది."
"మరి నాకు రావడం లేదే?' విశాలమైన కళ్ళు కిలకిల నవ్వుతున్నాయి.
"నువ్వు ప్రేమించడం లేదు గాబోలు!" విశాల చేతిని మృదువుగా తొక్కి అన్నాడు భానుమూర్తి.
"అయితే నేను ప్రేమించానో లేదో తెలుసుకునేందుకు ఏదన్నా పరీక్ష పెడతారా?'
"అవును, అదే చెయ్యాలి!"
"ఏం పరీక్షో?"
"ఆలోచిస్తున్నాను."
విశాల గలగలా నవ్వింది.
అమృతం చిలికినట్లున్న ఆమె నవ్వుకు భానుమూర్తి తన్మయత్వం చెంది "విశాలా!' అన్నాడు.
'ఆలోచించారా?"
"పరీక్ష పెట్తున్నానమ్మాయ్! జాగ్రత్తగా విను."
విశాల మధురంగా నవ్వి మనోజ్జంగా తల ఊపి చెప్పమన్నట్లు మన్మధ బాణాల్లాంటి చూపుల తూపుల్ని విసిరింది.
భానుమూర్తి కి మల్లెల డోలికల్లో ఊగినట్లనిపించింది. "సప్త సముద్రాల కవతల కీకారణ్యం ఉంది. కీకారణ్యం మధ్య దెయ్యాల మర్రి ఉంది. ఆ దెయ్యాల మర్రి చిటారు కొమ్మనో చిలకుంది. ఆ చిలక నోట్లో దేదీప్యమానంగా వెలిగే వజ్రాల ఉంగరం ఉంది. ఆ ఉంగరం నువ్వు తేవాలి!"
"బాబోయ్! ఇప్పుడే ప్రాణాలు పోయేటట్లున్నాయి! ఇక వెళ్లడమేమిటి?"
"అప్పుడే ప్రేమించినట్లు తెలిసేది!"
"దానికన్నా కవిత్వం చెప్పడం సులభంలా వుంది!" పైట చెరగు నోట్లో అడ్డం పెట్టుకుని అంది.
"అయితే కవిత్వమే చెప్పు!"
"ఇద్దరం కలిసి కవిత్వం చెప్తే ఆంధ్రదేశం భరించగలదా?"
"ఓ!"
"అయితే ఈ కవిత్వం ఎంతకాల మోస్తుందంటారు?" అతి ప్రయత్నం మీద నవ్వు ఆపుకుంటూ అంది.
భానుమూర్తి ఓ క్షణం ఆగి, నెమ్మదిగా -- "బహుశా పెళ్లయ్యెంత వరకూ రావచ్చు" అన్నాడు.
విశాల ఫకాల్నున నవ్వింది. భానుమూర్తి శృతి కలిపాడు.
"మీకు కృతజ్ఞతే చూపరాదా? ఇదెక్కడి శాసనం బాబూ!" అంది చెక్కిలి మీద చెయ్యి చేర్చి కళ్ళు తిప్పుతూ.
"ఊహు.. చూపకూడదు . అది శాసనమే!"
"శాసనాన్ని ఉల్లంఘిస్తే?"
"చూడు, విశాలా! కృతజ్ఞత ఎవరికి చూపాలి? నాకా? ఏం చేశానని చెప్పు? కృతజ్ఞత భావం మనుషుల్లో వుండవలసిందే! కాదని చెప్పను. కానీ మనిద్దరి మధ్యా కాదు. నీకోసం నేనేమీ ఘనకార్యం చెయ్యలేదు. కష్టాలు పడలేదు. నిన్ను నేనేదో ఉద్దరించానని నన్ను శిఖరాగ్రం మీద కూర్చోబెట్టి నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. అది నాకెంత మాత్రం యిష్టం లేదు." టేబిలు మీద చేతులాన్చి విశాల ముఖంలోకి చూస్తూ గంబీరంగా అన్నాడు.
"కృతజ్ఞత చూపడమే నన్ను నేను తక్కువ చేసుకోవడమైతే అది నాకిష్టమే."
"నాకిష్టం లేదని చెప్తున్నాను." కఠినంగా అని, తలతిప్పి కంఠం మృదువుగా మార్చి-- "మనిద్దరి మధ్యా వుండాల్సింది కృతజ్ఞత కాదు, అనురాగం " అన్నాడు.
విశాల కిటికీలో నుండి దూరంగా చూస్తూ ఏదో ఆలోచిస్తుంది.
భానుమూర్తి కుర్చీలో కూర్చుంటూ విశాల ముఖంలోకి చూసి -- "ఏమిటంత దీర్ఘాలోచన?" అన్నాడు.
విశాల నెమ్మదిగా కళ్ళు భానుమూర్తి వేపు తిప్పి "నేను ఎదుర్కొంటున్న సమస్య నే మన పిల్లలు కూడా ఎదుర్కొనవలసి వస్తుందేమో?' అంది భయం భయంగా.
భానుమూర్తి మెల్లగా నవ్వి - "ఆ భయం నీకేం అక్కర్లేదు. అప్పటికి కులమత రహితమైన సమాజం ఏర్పడవచ్చు. మానవులంతా ఒకటేనని చాటి చెప్పే మానవతా సిద్దాంతమే తప్పకుండా అమల్లో వుంటుంది." అన్నాడు. మహోజ్జ్వలమైన ఆ భవిష్యత్తులోకి చూస్తూన్నట్లున్నాయి భానుమూర్తి చూపులు.
"ఏమో... నన్ను గురించి ఇన్నాళ్లుగా నాన్న ఎంత బాధపడ్డారో చూస్తుంటే...' విశాల ఆగింది.
"అలాంటి భయాలు పెట్టుకోకు, విశాలా! సరేనా?' అనునయంగా ఆన్నాడు.
విశాల తిరిగి ఆలోచనలో పడిపోయింది. చట్టాలూ, కట్టుబాట్లూ ఉండవలసిందే కానీ అవి మనిషి హృదయాన్ని సంకుచితం చేసేదిగా ఉండరాదు. అలా అయిన రోజు మానవ కళ్యాణానికి , విశ్వ శ్రేయస్సుకూ తప్పకుండా ఆటంకాలౌతాయి.
మనిషికీ, మనిషికీ మధ్య అంతర్ధ్వేషాన్ని రెచ్చగొట్టే కులం నశించి పోవడమే మంచిది.
పాతిక సంవత్సరాల క్రితమే తన తండ్రి ధైర్యం చేసి హరిజన యువతిని పెళ్ళి చేసుకున్నాడు. తన సంతానం ఎలాంటి సమస్యలను ఎడుర్కొనాలో బహుశా ఆరోజు నాన్న ఊహించి ఉండరు. ఒకవేళ నాన్న దృక్పధం లో ఆదర్శ ప్రాయమైన వినూత్న ప్రపంచం ఉండి ఉండవచ్చు.
మనిషి హృదయంలో దృడంగా కట్టబడిన ఈ కులమత కుడ్యాలను పడగొట్టేందుకు ఎందుకింత ఆలస్యం జరుగుతుంది? ఎన్నో పుస్తకాలు, సినిమాలు, ఉపన్యాసాలు యీ విషయం మీద చాలాకాలంగా వస్తూనే ఉన్నాయి. కానీ పరిశీలించి చూస్తె అవన్నీ కలిసి సాధించిన విజయం బహు స్వల్పంగా కనిపిస్తుంది. ఆంధ్ర దేశంలో జరిగే మొత్తం వివాహాల సంఖ్య సేకరించినట్లయితే నూటికి రెండో వంతు కూడా వర్ణాంతర వివాహాలు జరగడం లేదేమో?
అయినా తనకిన్ని భయాలు, సందేహాలు ఎందుకూ? అవన్నీ నిరాదారమే కావచ్చు. కేవలం తను కల్పించుకున్న భయాలే. క్రమక్రమంగా 'కులం' నాశనమై పోవచ్చు. భవిషత్తు ఉజ్వలంగా ప్రకశించవచ్చు. అవును. తప్పకుండా అలాగే జరుగుతుంది.
"ఏవిటి? మాటామంతీ లేకుండా అలా బొమ్మల్లా కూర్చుండి పోయారిద్దరూ?"హాల్లోకి వచ్చిన మీనాక్షి అంది.
విశాల తేరుకుని "మాట్లాడుకోను మాటలే లేవు" అంది.
"ఓహో! అలాంటి 'దశ' కూడా ఒకటుంది గాబోలు!" అంది నవ్వుతూ మీనాక్షి.
"దేనిలో?' విశాల చురచురా చూస్తూ అంది.
"ప్రేమలో?"
భానుమూర్తి ఫకాలున నవ్వాడు.
"నే వెళ్తున్నా!" అంటూ విశాల ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.
