Previous Page Next Page 
మళ్ళీ వచ్చిన వసంతం పేజి 26

 

    'వచ్చేవా అమ్మా నా తల్లీ వచ్చావా - ఆ కారుకి ఏదైనా ప్రమాదం జరిగిందా అని, పిల్లవి ఎలా వున్నావో, ఏ కబురూ తెలియలేదని బెంగపడి చచ్చిపోతున్నాం - ఆదేవుళ్ళకి వెయ్యిమొక్కులు మొక్కుకున్నాం - నాయనా వెంకటరమణా, పిల్లని క్షేమంగా ఇంటికి చేర్చావు" - రాజమ్మ మాటలు వింటూ, రాజమ్మ పిన్ని ఒక్కర్తీ ఇక్కడ కెందుకొచ్చిందో అర్ధంకాక ఖంగారు పడిపోయింది శారద.
   
    "ఒక్కర్తివీ ఎందుకొచ్చావే మొన్ననేగా నన్ను చూసింది" - శారద కుర్చీలో కూలబడింది. జుట్టు ముఖానపడుతోంది - షర్టుపై బటన్ ఊడిపోయింది - రాజమ్మ శారదకేసి చిత్రంగా చూసింది 'ఉండు - కాసిని మంచినీళ్ళు తాగుముందు. తర్వాత చెప్తా" - "ఒద్దులే - అసలు ఎందుకొచ్చావో చెప్పు - నీళ్ళు నా దగ్గరే ఈ బాటిల్ లో వున్నాయిలే" అంది శారద వాటర్ ఎత్తి నీళ్ళునోట్లో పోసుకుంది.
   
    'ఒక్కర్తినీ ఎలా వస్తానమ్మా మీ నాన్నలేడూ నాకు తోడు'-
   
    "ఏమిటీ - నాన్న కూడా వచ్చారా. ఏరీ" - శారద గుండెలు దడదడ కొట్టుకున్నాయి. ఒకవేళ తను ఆరోజు చెప్పకుండా వచ్చేసినందుకు ఆవేశపడ్డారేమో - బి.పి. పెరిగిపోయిందేమో -హార్టు ట్రబుల్ మళ్ళీ మొదలైందేమో - ఇక్కడ ఆస్పత్రిలో చూపించుకోటానికి వచ్చారేమో - లేకపోతే మొన్ననేగా తనుచూసింది అందరినీ - శారద లోపలకెళ్ళి డ్రస్సు మార్చుకుంది. ఈ డ్రస్సులో నాన్న చూస్తే ఆయనకి చాలా కోపం వస్తుందని తెలుసు - చీరకట్టు కుంది - ముఖాన బొట్టు పెట్టుకుంది జుట్టు కట్టుకుంది - ముందు గదిలో కొచ్చేసరికి రాజమ్మలేదు. శారద సూట్ కేసు లోపలపెట్టి టీ కాచుకుందుకి నీళ్ళు స్టౌమీద పెట్టింది.
   
    ఎదురుగా రాజారావు తండ్రిని చూడగానే గజగజ వణికిపోయింది ఓ నిముషం - కానీ వెంటనే తేరుకుంది. నిజం చెప్పటం, చెప్పటం వలన కొత్త కష్టాలు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. అయినా నాలుగు రోజుల్లో తను బొంబాయి వెళ్ళిపోతుంది దినేష్ ప్రోగ్రాము ప్రకారం, సాయంత్రం వీలయితే నీరజని కలవాలి. బొంబాయి వెళ్ళబోయేముందు ఒక్కసారి కలసి ఏదో కారణంతో కేసు దూరంగా వాయిదా వేయించమని చెప్పాలి. ఇంటి వాళ్ళతో తనను తను పనిచేసే కంపెవీ వాళ్ళు ట్రయినింగుకి పంపుతున్నారు, వెడుతున్నానని చెప్పాలి ఇంకా ఇవన్నీ ఎంతో నేర్పుగా మేనేజ్ చెయ్యాలి. ఇదే ఎంతో కష్టమైన పని - ఇన్ని గొడవల్లో ముసలాడు నాన్నకి, ఈ ఛాదస్తపు పిన్నికి నిజం చెప్పకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు అని నిశ్చయించుకుని మనసుని గట్టిచేసుకుంది శారద.
   
    'మా ఫ్రెండు రమ అనివుంది. దాని పెళ్ళి అంటే వెళ్ళాము. డిన్నరు అయే సరికి ఆలస్యమయింది" - శారద గూట్లో ఏదో సద్దుతు అని, "నాన్నగారూ - మీ ఒంట్లో ఎలా వుంది - అప్పుడు సెలవులే దని వచ్చేసాను కదా, ఈ రెండురోజుల నుంచి వున్న వర్కంతా త్వరత్వరగా చేసేసాను. పై వారం సెలవు పెట్టి మీ దగ్గరకే వద్దామనుకుంటున్నాను" అంది.
   
    "అదేమిటేమరి. ఊరెళ్ళిన దానిని రానేలేదని చెప్పింది సుబ్బలక్ష్మి - "రాజమ్మ పిన్ని గట్టిగా అంది.
   
    "ఊ -ఆవిడలాగే చెప్తుందిలే - నేను ఎప్పుడొచ్చానో, ఎప్పుడెక్కడ కెడతాను వాళ్ళకి ఎలా తేలుస్తుందీ - వీళ్ళుపైన, వాళ్ళ పనులలో వాళ్ళుంటారు - పైగా వాళ్ళింట్లో బాలింతరాలు, చంటి పిల్లాడు నేను ఊరినించి రావటం చూడలేదంతె - శారద వంటింట్లోకెళ్ళింది.
   
    "నువ్వు ఇప్పుడు మాకోసం ఏమీ చేయకు. సుబ్బలక్ష్మీ, ఉప్మా చేసింది. తిన్నాం -మీ నాన్న హార్లిక్సు తాగాడు - చాలు మాకు అంది రాజమ్మ. శారద మాటల్లో ఏదో అబద్దం వుందని మనసుకి అనిపిస్తోంది. సుబ్బలక్ష్మి చాలా పద్దతైన మనిషి ఒకరి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడే మనిషి కాదని రాజమ్మకి తెలుసు.
   
    రాజారావు కూడా శారద మాటలు పూర్తిగా నిజంకావనే అనుకున్నాడు మనసులో పూర్తిగా అబద్దమా అనేది తను చెప్పలేడు - ఇంటివాళ్ళు తనురావటం చూడలేదు. పనిలో వున్నారు అంటే నమ్మలా, వద్దా - శారద లేనప్పుడు కన్నా శారద వచ్చాక రాజారావు ఆవేదన ఎక్కువైంది.
   
    ముందుగదిలో కూర్చుని పేపరు తిరగేస్తున్న వేంకటేశు అంతా వింటూనే వున్నాడు. అతను వచ్చిన సంగతి ఇంకా గమనించలేదు శారద. 'నాన్న - ఎవరున్నారు ముందు 'గదిలో' అంది నెమ్మదిగా.
   
    "అదేమిటమ్మా - అన్నయ్య - నువ్వు చూడలేదా"-
   
    శారద ముఖం వెలవెలపోయింది - అంటే అక్కడ ఇల్లు తాళం వేసి, పంతులుగారికి, భార్యకి అప్పగించి, నాన్న, పిన్ని, అన్నయ్య అంతా వచ్చేసారా. ఎప్పుడొచ్చారూ?. శారదకి అన్నయ్యంటే భయమే మొదటినుంచి ఎందుకంటే ఏడొంక తిరుగుళ్ళు తెలియక, ముక్కుకు సూటిగా వెళ్ళే వ్యక్తి వేంకటేశం.
   
    'ఎక్కడి నుంచి వస్తున్నావు' - వేంకటేశు సీరియస్ గా ముఖం పెట్టాడు "చెప్పాగా ఇప్పుడే పిన్నితోను నాన్నగారితోను - మా ఫ్రెండు పెళ్ళికెళ్ళి వస్తున్న" - అంది ఎటోచూస్తూ.
   
    'ఫ్రెండంటే - ఆడ, మగ' - వేంకటేశు గొంతులో చాలా కాఠిణ్యం నిండింది.
   
    శారద క్షణం తత్తరపడింది. 'అదే - రమ అని' నసిగింది.
   
    "పెళ్ళికి సూట్ కేసుతో వెళ్ళావా" -
   
    షాక్ తిన్నట్టయింది శారదకి అన్నయ్య తనని ఎప్పుడు చూసాడూ కార్లో వస్తూ విజయవాడలో ఆగినపుడు ఎవరైనా తనని చూసామని చెప్పారా. విజయవాడలో బయలుదేరేప్పుడు దినేష్ ఫ్రెండు కూడా కార్లో తమతోబాటు ఇక్కడికి వచ్చాడు - అతన్ని కూడా చూసాడా-
   
    తన పత్రికదలిక కనిపెట్టమని ఎవర్నయినా తనకు తెలియనీయకుండా వెంటపంపించాడా - ఏమిటీ - అసలు ఇంట్లో వాళ్ళంతా తననెందుకో అదోవిధంగా చూస్తున్నారు. అదివరకటిలా ప్రేమగా తనతో ఎవరూ మాట్లాడంలేదు - ఊరెళ్ళినప్పుడు కూడా అంతా అదోలా ప్రవర్తించారు తనతో -బహుశా అన్నయ్య రామాన్ని కానీ, లలితని కానీ కలిసివుంటాడు - అంతే !! - తను ఊరికే ఖంగారు పడిపోతోంది - శారద ధైర్యంకూడగట్టుకుంది.
   
    "మాట్లాడవేం" అరిచాడు అన్నయ్య.
   
    "అవును - సూట్ కేసుతోనే వెళ్ళాను - మా ఫ్రెండుచీరలు డ్రైక్లీనింగ్ నిచ్చి తెమ్మంది. అవి పెట్టిలో పెట్టి తీసికెళ్ళి ఇచ్చి తిరిగి సూట్ కేసు తెచ్చుకున్నాను" - శారద అక్కడ నుంచి లోపలకెళ్ళిపోయింది.
   
    వేంకటేశుకి నోటమాటరాలేదు. తన కళ్ళు తనని ఇంతగా మోసం చేస్తాయా ఖచ్చితంగా ఇందులో ఏదో మోసం వుంది. ఏదో చెప్పకూడని విషయాలు దాస్తోంది శారద. ఎందుకు దాస్తోందో తెలియటంలేదు! వేంకటేశు మనసు చాలా బాధపడింది. తన వాళ్ళందరిలో ఎంతో తెలివైంది శారద. డిగ్రీ వరకూ చదువుకున్నదీ శారదా -ఎంతోగారాబంగా పెంచి పెద్ద చేసినందుకు, భర్త, పిల్లలు సంసారం చూసి మురిసిపోవాలనుకుంటే ఇక్కడ వ్యవహారాలన్నీ అడ్డదిడ్డంగానే వున్నాయి. లలిత ద్వారానే రామం పరిచయమయ్యాడు - మరి లలితతో శారదకి స్నేహం వున్నట్టులేదే - లలిత చాలా మర్యాదయిన పిల్ల, ఎంతో బాధ్యత తెలిసిన పిల్ల - తను లలితను కలవాలి. శారద గురించి దినేష్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి - గట్టిగా నిశ్చయించుకున్నాడు వేంకటేశు.
   
                                   *    *    *
   
                                          11   


    లలిత, వేంకట్రామయ్య ఇంటినుంచి బయలుదేరి తిన్నగా శంకర్ ఇంటికి వెళ్ళారు. ఇంట్లోంచి ఈ మధ్య ఎక్కడికీ వెళ్ళటం లేదు. వెంకట్రామయ్య చాలా చిరాగ్గా వుంది. అందులోనూ చిన్నకొడుకు రాసిన ఉత్తరంలో విషయాలను లలిత తీసిపారేయటంతో వెంకట్రావుకి మరీ బాధగావుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS