తనతో మాట్లాడటానికి అమ్మాయిలంతా అలా కూర్చుండిపోయారేమోనని అతను యాంగ్జయిటీతో చూస్తున్నాడు.
అబ్బాయిలంతా వెళ్ళిపోయారని నిర్ణయించుకున్నాక మంజుల ఠక్కున పైకి లేచింది.
ఆమె ఆంజనేయులు వైపు చూసి నవ్వి, అతని దగ్గరకు నడుస్తోంది.
ఆనందం, ఆశ్చర్యాల జడివానలో తడుస్తున్నాడతను.
ఆమె చేతిలో ఏదో బంగారపు ముద్దకు చమ్కీలు తగిలించినట్టు మెరుస్తోంది.
"అదేమిటి? బంగారపు హారమా? తన మెళ్ళో వేసి 'ఐ లవ్ యూ' అంటుందా? ఈ ఉత్సవానికి సాక్ష్యంగా అమ్మాయిలందరినీ వుండమందా? ఏం కాబోతుంది?- ఆంజనేయులు ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు.
మంజుల వచ్చేస్తోంది.
తను లేవాలి. లేచి- ఆ అందంమీద గౌరవం ప్రకటించాలి. కాని యిదేమిటి తను లేవలేకపోతున్నాడు. ఆనందం బరువుకు కుంగి- పోతున్నాడు?- అతనిలో అతనే సంభాషించుకున్నాడు.
అతనికి మరింత దగ్గరగా మంజుల.
"మీ కుడిచేయి ఇలా ఇవ్వండి" మంజుల ఆజ్ఞాపిస్తున్నట్టు సీరియస్ గా అడిగింది.
అతను ఏమీ ఆలోచించకుండానే చేయి ముందుకు చాచాడు. ఆమె చేతిలో ఖడ్గం వున్నా సరే అతను అలానే చేయి చాచేవాడు.
"ఈ రోజు రాఖీ పండుగ. దీన్ని అన్నయ్యకు చెల్లెలు కడుతుంది. అందుకే దాన్ని నీకు కడుతున్నాను" ఒక్కో పదాన్ని వత్తి పలుకుతూ ఆమె తన చేతిలోని రాఖీని అతనికి కట్టింది.
ఏవో సముద్రాలు తనలోంచి బయటకు వురకడానికి ప్రయత్నిస్తున్నట్టు- అగ్నిపర్వతాలు పగిలి లావా అంతా తన గుండెలోకి ప్రవహిస్తున్నట్టు- కళ్ళముందు కనిపిస్తున్న చెట్లన్నీ కూలి తన ఒక్కడి మీదే పడిపోతున్నట్టూ కొండలు సింహపు పిల్లల్లా కదిలి తన మీదకు వచ్చేస్తున్నట్టు అతను వణికిపోతున్నాడు.
తల పైకెత్తి చూశాడు. ఇక వెళ్ళిరావడానికి మంజుల అటు తిరిగింది.
మంజుల వెనుక లైన్ లో బుద్దిగా నిలుచున్నారు అమ్మాయిలు.
ఆమె అడ్డు తొలగడంతో వెనకనున్న అమ్మాయి ముందుకెళ్ళింది. తన చేతిలోని రాఖీని తీసి కట్టింది. మొత్తం పదమూడు మంది అమ్మాయిలు అతనికి రాఖీ కట్టారు. కుడిచేయి అంతా రాఖీలతో ఉబ్బిపోయింది.
అమ్మాయిలంతా వెళ్ళడానికి జరుగుతున్నారు.
అతని కళ్ళల్లో నీళ్ళు.
పేదరికం మీద, అమాయకత్వం మీద, పాపం, పుణ్యం ప్రపంచమార్గం తెలియని పసితనం మీద. చిన్నపాటి అభిమానంకోసం వెంపర్లాడిన మనసుమీద అమ్మాయిల నవ్వులు సుత్తల్లా కొడుతున్నాయి. గొడ్డళ్ళతో చీలుస్తున్నాయి.
మంజుల డయాస్ ఎక్కి బ్లాక్ బోర్డులో చాక్ పీసుతో ఏదో రాసింది. అమ్మాయిలంతా చప్పట్లు చరిచారు. చివరిసారన్నట్టు ఆంజనేయులు వైపు చూసి ఒక్కొక్కరే నిష్క్రమిస్తున్నారు.
మరో నిముషానికి అందరూ వెళ్ళిపోయారు.
అతను ఒక్కడే మిగిలిపోయాడు.
క్లాస్ రూమ్ గోడలు అలానే జరిగి ముందుకు వచ్చి తనను మధ్యలో ఇరికించుకుని చంపెయ్యమని అతను వేడుకున్నాడు. కానీ మంజుల హృదయంలాగే అవికూడా కఠినమైనవి.
సిగ్గు, అవమానం, బాధ, కోపం, కసి- ఏవేవో ఉద్రేకాలు అస్పష్టంగా అక్టోపస్ లా పాకుతున్నాయి.
కళ్ళలోంచి జారుతున్న నీళ్ళు చెక్కిళ్ళపై పడి నోట్లోకి వస్తున్నాయి, తన జీవితంలాగే ఉప్పగా వున్నాయి.
నీటి పొరల్లోంచి ఎదురుగ్గా వున్న బ్లాక్ బోర్డులోని అక్షరాలు మసగ్గా కనిపిస్తున్నాయి.
కూడి కూడి చదివాడు- పెద్దన్నయ్య.
"ఏమిటండీ ఆంజనేయులుగారూ! మౌనవ్రతం పాటిస్తున్నారు. ఏమిటంత దీర్ఘ ఆలోచన. కాఫీ చల్లారిపోతుంది తాగండి" ప్రియంవద అతని వాలకం చూసి విసుక్కుంది.
ఏదో యూనివర్శిటీలో లైఫ్ గుర్తుకొస్తేనూ" తల దించుకుని చెప్పాడు.
"యూనివర్శిటీ చదివే రోజుల్లో మీరు హీరోగా ఓ వెలుగు వెలిగారా?"
"లేదు కమెడియన్ ని, ముఖ్యంగా మా క్లాస్ లో అందుకే మధ్యలో చదువు ఆపేసి వచ్చేశాను."
"పాపం" ఆమె సానుభూతి ప్రకటించింది.
టాపిక్ ను మార్చటానికన్నట్టు ఆమె "రేపు మన ఆఫీసుకు ఓ కొత్త అమ్మాయి రాబోతుంది. హైదరాబాద్ నుంచి ఇక్కడికి ట్రాన్స్ ఫర్ అయ్యింది. పేరు శకుంతల. ఆమె వస్తున్న సందర్భంగా ఊర్వశీలో రేపు పార్టీ అరేంజ్ చేశాడు అభినయ్. మొత్తం స్టాఫ్ నంతా పిలుస్తున్నారు అని తనకు తెలిసిన సమాచారం చెప్పింది.
"అలాగా" అన్నాడు.
కాఫీ తాగడం పూర్తయ్యింది.
ఇద్దరూ లేచారు.
బిల్లు ఆమె చెల్లించింది. వక్కపొడికోసం జేబులన్నీ వెదికాడు. చివరకు వెనుక జేబులో అర్ధరూపాయి తగిలింది. వక్కపొడి పొట్లం తీసుకున్నాడు.
ప్రియంవద అతనికంటే ముందు నడుస్తూ మలుపు తిరిగింది. వెనక్కి తిరిగి చూస్తే అతను కలబడలేదు. మరో రెండు అడుగులు వేసిందో లేదో లక్ష్మి కనపడింది.
"హాయ్"
"హలో"
ఇద్దరూ పలకరించుకున్నారు.
"ఏమిటంత ఆలస్యం నువు లేకపోవడంతో ఆంజనేయులితో క్యాంటీన్ కెళ్ళి కాఫీ తాగి వస్తున్నాను."
"అతనితో వెళ్ళవా!" లక్ష్మి ఆశ్చర్యాన్ని ప్రకటించింది.
వక్కపొడి పొట్లాన్ని చించడానికి ఆంజనేయులు మలుపు దగ్గర ఆగాడు. వాళ్ళ మాటలు మాత్రం వినిపిస్తున్నాయి అతనికి. లక్ష్మి గొంతు గుర్తుపట్టాడు.
"నా ఖర్మకాళీ ఆంజనేయులతో వెళ్ళాను. నువు లేకపోయినా లోటు అతని సమక్షంలో స్పష్టంగా తెలిసిందనుకో."
"నిజమే మరెవరితోనైనా వెళ్ళుండాల్సింది, బోర్ కంపెనీ అతను."
"ఎవరితోనైనా వెళితే అప్పుడే చిలవలు పలవలు ప్రచారమవుతాయి ఆఫీసులో ఆంజనేయులైతే సేఫ్. అతనికి ఏ ఆడపిల్లా పదవిని అందరికీ తెలుసు. ఏ ఆడపిల్లయినా అతన్ని పెద్దన్నయ్యలా చూస్తుందని అందరి నమ్మకం. నామీద రూమర్స్ ఏమీ ప్రచారం జరక్కుండా వుండాలంటే అతనె బెస్ట్ అనిపించి వెళ్ళాను."
"కరెక్టే మన శీలంమీద నిందలు పడకుండా వుండాలంటే ఆంజనేయుల్నే తోడు తీసుకెళ్ళాలి."
ఆంజనేయులు చెవులు ఆ తరువాత మాటలను వినడానికి మొండికేశాయి. మంజుల మీదున్న కోపం మంత్రించినట్టు మాటమైపోయింది. తనంటేనే ద్వేషం మొదలైంది. ఐ హేట్ మై సెల్ఫ్...అనుకున్నాడు మెల్లగా.
* * *
