అపరాజిత
నాలుగవ భాగం
--నాయని కృష్ణకుమారి
14
రైలు హోరుపెడ్తూ ముందుకు పరిగెత్తుతోంది. ఆకాశం నల్లటి మేఘాల ముసుగు కప్పుకుని రోగార్తుడైన మనిషి ముఖంలా మసక మసకగా కనిపిస్తున్నది. బయట నిర్విరామంగా పరిగెత్తే చెట్లూ, కొండలూ, మనస్సులో మరింత సంచల నానికి కారణమవుతున్నాయ్. మధు మనసు అస్థిరంగా ఉంది. తన పక్కన కూచున్న మనిషి రైలు కుదుపుకు అటూ ఇటూ వూగుతూ తన్మయత్వం భజిస్తున్నాడు. మధు మనస్సు కూడా ఆవేశంతో వూగిపోతున్నది. ఒక్కసారి కంపార్ట్ మెంట్ తలుపు తీసుకుని బయటికి దూకేద్ధామా అన్నంత ఉద్రిక్తత నరనరాల్లో విద్యుచ్చక్తిలా వ్యాపిస్తోంది. ఏం చేస్తున్నాను, ఏం కావాలి నాకు అనే ప్రశ్నలతో అతని మెదడు వేడెక్కి కుత కుత ఉడికిపోసాగింది.'
మాధవి తన బ్రతుకులో బిడియంగా ప్రవేశించి, ఆరని చిచ్చు రగల్చగల్గిన సమర్డురాలెలా అయిందో అంతు పట్టడం లేదు. మాధవికీ రాధకూ ఎంత తేడా: ఒకరు నిత్య సంశయం మనస్సుతో తాను సుఖించలేక తన్ను ప్రేమించిన వ్యక్తిని కూడా నిరాశలో ముంచగలిగిన అవివేకి మరొకరు, తను ప్రేమించిన వ్యక్తి సుఖంకోసం వెనకా ముందూ చూడకుండా రాబోయే పరిణామాలైనా వూహించకుండా తన సర్వస్వమూ చిరునవ్వుతో సమర్పించగలిగిన దేవత! అవును, రాధ నిజంగా దేవత!
దూర దూరంగా చరించే రాధ తన జీవితంలో కెంత చిత్రంగా ప్రవేశించింది! చిలిపిగా ఎప్పుడూ ఎండాకాలపు ఈదర గాలిలా దూసుకువస్తూ, వంటలూ వనితలూ అంటూ ఆడ వ్యాసాల గొడవతో వేధించే రాధ వ్యక్తిత్వం, హిమరగోన్నతం అనే విషయం తను ముందే ఎందుకు గుర్తించలేదు! అంత చిలిపి రాధలో ఇంత నిండు గుండె పరిపూర్ణ ప్రేమతో స్పందిస్తున్నదన్న విషయం గుర్తించడానికి తన కింత ఆలస్యం ఎందుకైంది? రాధ తన్ను ప్రేమించి ఆరాధిస్తున్న విషయం ఎంత నిర్భయంగా స్పష్టంగా చెప్పింది!
ఆరోజు ఒంటరిగా తన్ను కవ్విస్తూ తన మనస్సులో ముసురుకున్న విచార మేఘాల్ని పారదోలడానికి విశ్వ ప్రయత్నం చేసింది రాధ.
"నీ విక్కన్నుంచి వెళ్ళిపో రాధా! ఎనిమిది కావస్తోంది, కాసేపు ఒంటరిగా ఉండనీ నన్ను" కొంత విసుగ్గానే అన్నాడు తను.
"నే వెళ్ళాక నీ ఒంటరితనాన్ని పెద్ద భూతంలా చిత్రించుకుని వల పోసుకోడానికా! వీల్లేదు. ఆ మాటకొస్తే నే నిక్క న్నుంచి వెళ్ళనే వెళ్ళను"-
"వెళ్ళ కేం చేస్తావు: ఇంట్లో పెద్ద వాళ్ళ భయం కూడా లేదా నీకు: అయినా నే నెట్లాపోతే నీ కెందుకు! ఆ మాధవి పంపుతోందా వూరడించమని!
"మధూ!" ఇంచుమించు పిచ్చెత్తిన మనిషి అరిచినట్లే అరిచింది రాధ. ఆ అరుపుకు తన చిరాకూ పరాకూ గాలిలో కలిసి తాను నిర్విన్నుడైపోయాడు.
మాధవి ప్రస్తావన ఎందుకిక్కడ? ఆవిడ ప్రసక్తి లేందే నీవే విషయమూ వ్యక్తం చెయ్యలేవులాగుంది. మీ మగ వాళ్ళంతా మూర్కులు. స్త్రీల మనస్సులో అతి సున్నితభాగాల్ని నొప్పించి ఆడుకునే కిరాతకులు. నన్ను నీవు మాధవి చెల్లెలుగానే తప్ప పరిపూర్ణ స్త్రీగా చూడనే లేవా?
నా అనునయమూ, నీపట్ల నాకున్న శ్రద్ధా నీ స్థితికి నేనుపడే తహతహా ఇవన్నీ బూటకంగా కనిపిస్తున్నయ్యా నీకు!"- రాధ ఆవేశంతో వూగిపోతోంది. కళ్ళు ఎర్రబారి, ముక్కు పుటాలు అదిరి అశ్రువులు చెంపలమీద జాలు కడ్తున్న రాధ. కట్టుకుంటున్న పిచ్చికగూడు కూలిపోగా నిస్సహాయంగా వావిడిచి రోదించే పసిపిల్లలా కనిపిస్తుంది. అయోమయంగా తనేం చేస్తున్నాడో తెలుసుకోకుండానే ఆమె తలను తన రెండు అరచేతుల మధ్యా అమర్చుకుని అలానే దాన్ని తన గుండెల మీద అద్దుకుని ఉండిపోయాడు. అంతకు ముందెప్పుడూ తను చూడని అటువంటి శోక పరిదీపమూర్తిని మరెలా సమాశ్వసించాలో ఆ క్షణాన తనకు తెలియనేలేదు. ఈ రాధ ఇంతకు ముందు తానెరిగిన రాధ కాదు. ఈవిడ గుండెల్లో అగ్నిపర్వతాలు కదులుతున్నాయ్. మాడి మసి అయిపోతానన్న స్పృహ లేశమైనా లేకుండా దీపకళిక చుట్టూ తిరిగే శలభంలా రాధ తన చుట్టూ తిరుగుతోందా? తనకు తెలియదా, ఈ గుండెల్లో చిత్రించ బడ్డ మాధవి రూపం ఎంతలా ప్రకాశిస్తున్నదో? ఆ క్షణాన తన మనస్సు విలవిల్లాడి పోయింది.

వెక్కి వెక్కి యేడుస్తున్న రాధ శరీరం తన శరీరానికి ఆనుకుని చిరుగాలికి చిగురాకులా చలిస్తోంది. ఆవిడ స్పర్శ అతనిలో కొత్త ఉత్తేజాన్ని నింపినది. కేవలం ఆవిడను బుజ్జగించాలన్న ఉద్దేశంతోనే బలమైన తన చేతులు రాధ శరీరాన్ని పెనవేసుకోవడం మాత్రమే తెలుసు తనకు. అప్పుడే తను చుట్టూవున్న ప్రపంచాన్నీ, మనస్సులో నిలుపుకున్న మాధవినీ యుక్తా యుక్తాలనూ అన్నిటినీ విస్మరించాడు తానూ తన చేతుల్లో ఉన్న రాధా యీ ఇద్దరే చరాచర ప్రపంచంలో సత్యమైన అంశాలనే దృఢనమ్మకం తన నర నరాలలో చిత్రంగా నిండిపోయింది. "ఆ మాధవికాదు నీకు కావలసింది యీ రాధ" అని ఎవరో గుండెల్లో ఘోష పెడ్తున్నట్ల యింది. అంతే! ఆ తరువాత స్త్రీ పురుషుల సాన్నిహిత్యం, అంత మత్తెక్కిన మనస్సులతో ఎట్లా ఆడుకోవాలో అట్లాగే ఆడుకుంది. గది మధ్యలో ఉన్న తాము పక్కమీదకి ఎట్లా చేరారో తెలియదు. వేరే శరీరమంటూ లేకుండా రాధ తనలో కరిగిపోవాలనే వెర్రి కోరిక తనలో ఎట్లా విజ్రుంభించిందో కూడా తెలియదు-ఆ తరువాత తనువును ముంచెత్తిన మత్తుపొర వీడి, పొంగుతున్న ఉద్రేకం చల్లారిన తర్వాతగాని, జరగకూడని పని జరిగినట్లుగా తెలుసుకోలేకపోయాడు తను. ఆ ఎరుకవల్ల తనమీద తనకే అసహ్యం వేసింది. ముఖం ఎత్తి రాధ కళ్ళవైపు చూడడాని గ్గూడా భయపడిపోయాడు. రాధ వాడిన కలువకాడలా ఉంది. అరమోడ్పిన ఆమె కళ్ళల్లో ద్వేషంకానీ అసహ్యంకానీ ఏవీ కనిపించలేదు. పాల నురగలాంటి పక్క మీద అనిర్వచనీయమైన తృప్తి ముఖ మంతా వెలిగిపోతుండగా కోరుకున్నది పొందగలిగిన పసిపిల్లలా ముగ్ధంగా కనిపించింది రాధ. ఆ రాధకు తనెంత ద్రోహం చేశాడు. చివరకు "నన్ను క్షమించు రాధా! నా వల్ల పెద్దపొరపాటే జరిగిపోయింది" అనిమాత్రం అనకలిగాడు. తన మాటలు అర్ధం కానట్లు వో క్షణాన వింతగా చూచి, "జరిగింది. పొరపాటే అయితే అందుకు నీతోపాటు నేనూ బాధ్యురాలనే కదా! ఇందులో ఒకరు క్షమించడం మరొకరు క్షమింపబడడం అనే ప్రసక్తిలేదు. ఒక్క విషయం మన స్పూర్తిగా చెప్తున్నాను. ఇప్పుడు ఎటువంటి పొరపాటయినా జరిగిందని నేను అనుకోవడంలేదు. నీకు నన్ను నేను అర్పించుకున్నాను. నాలో ప్రతి అణువూ నిన్ను కోరుతోంది. ఒక స్త్రీ ఏడ్చి మొత్తుకుని ఎదుట నిలచిన పురుషున్ని దుయ్య బట్టవలసిన స్థితిలో నిర్భయంగా ఇలా చెప్పడం నీ పురుషత్వం మెచ్చుతుందో లేదో నాకు తెలియదు. కాని నిజం మాత్రం అదే. నా యిష్టం లేకుండా ఏదీ జరగలేదు" అన్నది రాధ. తాను ఆ క్షణాన ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ఇంత నిబ్బరంగా స్పష్టంగా ప్రవక్తకు మల్లే వచిస్తున్న ఈ వ్యక్తిని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియలేదు. తన కున్న అతి విలువైన వస్తువును, తన ప్రాణాధికుడైన భర్తకు అర్పించి తృప్తితో వెలిగిపోయే మహా పతివ్రతలా ఉంది రాధ. కాని తన స్థితి ఏమిటి? తల రెండు అరచేతుల మధ్యా తాపడం చేసి స్తబ్దంగా ఉండిపోయాడు.
రాధ మెల్లిగా దగ్గరకు వచ్చింది. చూపుడు వ్రేలి కొసతో అతని చుబుకాన్ని మృదువుగా పైకెత్తి రెండు కళ్ళలోకి నిండుగా చూచింది. ఆ చూపులో భయమూ నిస్సహాయతా, చిరాకూ వంటి భావాలు మచ్చుకైనా లేవు. మమతా, జాలీ, ఒక రకమైన ధీమా-వీటిని రంగరించుకొని జగత్తు నంతా గుప్పిటలో పెట్టుకున్న విజేత చూపుల్లా మెరుస్తున్నాయ్.
"మధూ! నా శరీరాన్ని నీ కిలా అర్పించడానికి నే నెందుకు విముఖంగా లేనో ముందు నీకు తెలియాలి. నిన్ను గురించి నా మనసు ఆలోచించే తీరు కొంతలో కొంతయినా నీకు స్పష్టం కావాలి. నీవూ, మాధవీ పరస్పరం ప్రేమించుకున్నారు. కాని ప్రేమకు ఉండవలసిన లక్షణం ఆత్మార్పణ. అది మీ యిద్దరిలోనూ లోపించిందంటున్నందుకు నామీద కోపం తెచ్చుకోకు. సాంసారిక మైన చిక్కులూ, కోరి తానై తనమీద వేసుకున్న బరువులూ ఈ వలయంలో నుండి తెగదెంపులు చేసుకుని ఇవతల పడి తన్ను తానై నీకు అర్పించు కోలేకపోయింది మాధవి. తాను రాలేక మరో దారి లేక నీ అంతట నువ్వు చేయి అందిస్తే ఆ బురదలో నుంచి బయట పడదామని ఆశగా ఎదురు చూచింది. నీ విషయంలో తాను చొరవ చూపలేకపోవడమూ, తెగింపు కనపరచలేకపోవడమూ నీలో అభిమానాన్ని పెంచుతుందన్న సత్యాన్ని గ్రహించలేకపోయిన మూర్కురాలు మాధవి. మధూ! ప్రేమకు గొడ్డలిపెట్టులాంటి లక్షణం స్వాభిమానం. ఆ లక్షణం వల్లనే తన డిప్పలోకి తాను కుంచించుకుపోతున్న తాబేలులా నీవు మాధవికి మరీ దూరంగా జరిగిపోయావు. నీ చేయూత అందకపోవడంవల్ల మాధవి ఏ ఆసరా కనిపించిన అందుకోవాలన్న స్థితికి వచ్చింది. అభిమానం చంపుకోలేక పోయావు గాని గుండెల్లో చెక్కుకున్న మాధవి రూపును రక్తం చిమ్మకుండా చెరిపేసుకో లేక పోతున్నావు. నిబ్బరంగా నీవా పని చేయడానికి నీకు సహాయం కావాలి. అ సహాయం నేను!" స్పష్టంగా, నిరుద్రేక స్వరంతో ఒక ప్రకృతి సత్యాన్ని విప్పి చెప్తున్నంత తాపీగా చెప్పుకుపోతోంది రాధ. తన చూపుల్లో అయోమయపు ఛాయలిలా సమసిపోలేదు. తాను రాధ కళ్ళల్లోకి చూస్తున్నా ఆ కళ్ళని దూసుకుని ఆవిడ ఆకారంలో ఇమిడి వెలుగుతున్న వ్యక్తిత్వాన్ని సాక్షాత్కరించుకో డానికే ప్రయత్నం చేశాడు. రాధ ఇంకా చెప్తూనే ఉంది.
"నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నీ పట్ల అచంచలమైన, ప్రతిఫల రహిత మైన ప్రేమ నా హృదయమంతా నిండి ఉంది నా ప్రేమ నీవు నా కే విధంగా ఆధారంగా నిలవగలవా అని చూడడంలేదు. నేను నీకేవిధంగా మనశ్శాంతి నివ్వగలనో, ఆ తీరు తెన్నులు అన్వేషిస్తోంది. ఇప్పుడు జరిగిన సంఘటన నీ ఆలోచనా ప్రవాహాన్ని మరోదారి పట్టించక తప్పదు. ఈ క్షణం నుండీ నీ గుండెల్లో ఆ మాధవితోపాటు ఈ రాధకు కూడా కొంత చోటు ఇవ్వకుండా ఉండడం నీవల్ల కాదు. అది చాలు మాధవి గతమైన నీ విధుర ప్రేమయొక్క దుష్ట ఫలితాల తీవ్రత తగ్గడానికి!"
