"వాడికి పాతికేళ్ళు నెత్తిమీద కొచ్చాయ్! అయినా బాబుముందు పిల్లిలా నిలబడతాడు."
"అదేమన్న మాటలే. కొడుకు తండ్రికి అణకువగా వుద్మతం మంచిదేగా? అసలా సాంబయ్యకుండాలి బుద్ది! కొడుకు మంచి చెడ్డలు చూడాల్సింది ఆయన. ఎవ్ తరుణంలో జరగాల్సింది ఆ తరుణంలో జరగాలి. వచ్చిన మంచిసంబంధాలన్నీ దురాశకుపోయి వదులుకున్నాడు. ముఫ్ఫై ఏళ్ళు వచ్చేదాకా సాంబయ్య కొడుక్కు పెళ్ళి చెయ్యడు. ఆ తర్వాత చెయ్యాలనుకున్నా పిల్లనిచ్చే వాళ్ళుండరు."
"ఎందు కివ్వర్లేవయ్యా? వాణ్ణి చూశే ఇస్తారు - వాడి ఆస్తి చూసిగాని! డెబ్బై, ఎనభై ఎకరాల ఆసామి, లక్షాధికారి. డబ్బు ముందు, తర్వాత మంచి చెడ్డలు."
రచ్చబండమీద జరుగుతోన్న లోకాభిరామాయణం హఠాత్తుగా ఆగిపోయింది!
వెంకటపతి బీడీదమ్ములాగుతూ రావడంచూసి, పెద్దలు ఈ కొత్తసంవత్సరం సంకురుమయ్య దేనిమీదుగా పోతాడా అన్న చర్చలో పడ్డారు. వెంకటపతి వచ్చి పెడగా కూర్చున్నాడు. అందరితో కలిసి మెలిసి మాట్లాడాలని వెంకటపతికి వుంటుంది. కాని కలవలేడు. తను మాటల్లో కల్పించుకొని మాట్లాడటానికి ఏమీ వున్నట్లు అనిపించదు. అలాంటి సందర్భాల్లో ఎక్కడో అక్కడ, ఎవరో ఒకరు తన తండ్రి మీదగానీ, తనమీదగానీ పుల్లవిరుపుగా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఆ మాటలు సూటిగా లేకపోవటంతో, తను ఎదురుతిరిగి సమాధానం చెప్పటానికి ఉండదు. డొంకతిరుగుడుగా మాట్లాడి, మళ్ళీ నాలుగు అనటానికి తనకున్న అనుభవమూ, తెలివీ, మాటలూ చాలవు.
"వెంకటపతీ? పప్పన్నం ఎప్పుడు పెడతావురా?" అందర్లోకీ వృద్దుడయిన పరమయ్య అడిగాడు.
అసలే మాటలు దొరకని వెంకటపతి, పెళ్ళిమాట వచ్చేసరికి బిగుసుకుపోయాడు. దానికితోడు మనిషికి చచ్చేంత బిడియం.
"ఏంరా! మాట్లాడవేం? వయసు దగ్గరపడినవాడ్ని నీ పప్పన్నం తినకుండానే పోతానేమో?"
వాళ్ళు కూర్చున్న రచ్చబండకంటే కఠినంగా నవ్వులు వినిపించినై.
"వుండవయ్యా నువ్వు? అసలు వాడికి.....వాడికి పెళ్ళంటే ఇది లేదేమో?" కామయ్య అన్నాడు. ఈ సారి అంత కఠినంగా పైకి నవ్వలేక లోలోపలే నవ్వుకొన్నారు.
"ఛ! అదేం మాట? వాడి తండ్రికే ఇష్టం లేదయ్యా!" లౌక్యంగా అన్నాడు కాంతయ్య.
వెంకటపతి చర్రున లేచాడు. అంతదూరంలో మునగదీసుకొని పడుకొని వున్న కుక్కను కర్రతో ఓ బాదు బాది చరచరా వెళ్ళిపోయాడు.
"అంట్లవెధవ! దాన్ని కొడతాడెందుకు? ఆ కొట్టేదేదో వాడి బాబును జబిర్తే పోలా?" ముసలాయన అన్నాడు.
"చూస్తా వుండు. అదీ ఎప్పుడో చేస్తాడు." జోస్యం చెప్పాడు కాంతయ్య.
వెంకటపతి నేరుగా మాలపల్లి వెళ్ళి చింతడి ఇంటిముందు ఆగి కేకేశాడు:
"ఒరే చింతాయ్? చింతాయ్?"
చింతడి పెళ్ళాం గబగబా బయటకొచ్చి "అయ్యో! దొరగారా?" అంది.
"ఏమేవ్? నీ మొగుడెక్కడికి పోయాడే?" చింతడి పెళ్ళాం కళ్ళలోకి ఆకలిగా చూస్తూ అడిగాడు. అది ముడుచుకుపోయింది. పైట సర్దుకొని "ఇంట్లోనే వున్నాడు" అంది.
"మరి పిలుస్తుంటే బయటకు రాడేం?"
"తాగి వాల్లు తెలవకుండా పడుండాడు."
"గాడ్ది కొడుకు! తెల్లవారుజామున రమ్మను. తూరుప్పొలానికి ఎరువు తోలాలి."
"అట్టాగే వత్తాడు దొరా!"
"వస్తాడా?" ఏం మాట్టాట్టానికీ తోచక, దాంతో ఇంకాసేపు మాట్లాడాలనీ, దాన్ని చూస్తూ నిలబడాలనీ అన్నాడు.
"తప్పకుండా వొత్తాడు దొరా! నేను తెల్లారగట్టేలేపి పంపుతాగా?" అంటూ వెనక్కు వెనక్కు గుడిసెకేసి నడిచింది.
"ఏం వస్తాడే? తాగుబోతు గాడ్దికొడుకు" అంటూ, ఎవడో తోసినట్టు అక్కడనుండీ కదిలివెళ్ళిపోయాడు.
ఇంటికొచ్చి మంచంమీద పడుకోబోతున్న వెంకటపతిని చూసి తండ్రి అడిగాడు: "ఏరా? ఇంత పొద్దుపోయిందాకా ఎక్కడున్నావ్?"
"రచ్చబండ దగ్గర కూర్చున్నాలే." విసుక్కున్నట్లు చెప్పాడు వెంకటపతి.
"అక్కడేడవున్నావురా? నేనింటికొస్తూ చూస్తే అక్కడలేవే?" సాంబయ్య కటువుగా అన్నాడు.
వెంకటపతి తగ్గిపోయాడు. "అక్కడ కాసేపు కూర్చుని పల్లె కెళ్ళాలే."
"ఎందుకురా పల్లెకు ఎల్లింది?" తండ్రి గద్దించి అడిగాడు.
"చింతడ్ని నైపోగు తోలటానికి తెల్లారగట్ట రమ్మన్నా." ధైర్యాన్ని పుంజుకొని చెప్పాడు కొడుకు.
"చింతడెందుకురా మళ్ళీ? ఏసోబు కొడుకుని రమ్మని చెప్పాంగా?"
"నాకేం తెలుసూ?"
"నీముందే గదరా చెప్పాను?"
"మర్చిపోయాను."
"పోతావ్ రా, పోతావ్!" మొలతాటికి కట్టుకొన్న తాళంచెవుల గుత్తిని సర్దుకొని - పడుకున్నాడు సాంబయ్య.
ఉగాది వెళ్ళింది. మాగాటి భూమి నెర్రెలుకొట్టి నోళ్ళు తెరచి రోహిణీ ఎండలు మేశాయి. వెంకటపతి భూమికి ఎరువులు తోలాడు.
తొలకరి వానలు పడ్డాయి. ఏరువాకొచ్చింది. కొత్త కాలవ వరదనీటితో పొంగి పారుతోంది. వెంకటపతి భూమి దున్ని నీరు పెట్టాడు. నాటు వేశాడు.
వినాయకచవితి వచ్చింది. వెంకటపతి కలుపు తీసి ఎరువులు చల్లి నీరు పెట్టాడు.
దసరా పండగ వచ్చింది. పైరు ఏపుగా పెరిగింది. వెంకటపతి పాలకంకులకు మందుకొట్టి పురుగును చంపాడు.
దీపావళి పండగ కోటి దీపాల వెలుగుల్తో కొత్త ఆశల్ని మోసుకొని వస్తూండగా వెంకటపతి వరికోతలు ఆరంభించాడు. ఓదెలు అరగానే కుప్పలు వేయించసాగాడు. తూరుప్పొలం కుప్పవెయ్యటం అవగానే, కొత్తకాలవకింద పొలం కుప్ప వేస్తుండగా వెంకటపతికి మూడు తక్కువగా మూడు పదులు నిండాయి.
పొద్దువాలకముందే కుప్పవెయ్యటం పూర్తయింది. కూలీలు జట్టుగా కలిసి వెళ్ళిపోయారు. గుంటలో కాళ్ళూ చేతులూ కడుక్కొని, తలగుడ్డతీసి విదిలించుకొంటున్న వెంకటపతికి, చేలో పరిగేరుకొంటున్న చింతడి పెళ్ళాం మాణిక్యం ఒంటరిగా కన్పించింది. ఓరచూపులు చూస్తూ కుప్ప వెనక్కు చేరింది. వెంకటపతిలో అణిగివున్న భౌతిక వాంఛలు మేలుకొన్నాయి. ఉడుకు రక్తం మెదడులోకి చిమ్మింది. వరికుప్పకేసి దూకుడుగా వచ్చాడు. కుప్పకానుకొని నిల్చున్న మాణిక్యం - తనను చూసి పారిపోతుందనుకొన్న మాణిక్యం - వెంకటపతి కళ్ళలోకి సూటిగా చూసి కిసుక్కున నవ్వింది. వెంకటపతి మాణిక్యం ముందుకు వచ్చాడు. లేడిపిల్లను నోటికి కరచుకోబోయేముందు అటూ ఇటూ చూసే పెద్దపులిలా వెంకటపతి తలతిప్పి పక్కకు చూశాడు. బాణాకర్ర తీసుకొని గనెం మీద నడిచివస్తోన్న సాంబయ్య కన్పించాడు! కుప్ప సర్దుతున్నట్టు చేతులాడిస్తూ కుప్పచుట్టూ తిరగసాగాడు. అల్లంత దూరంలో సాంబయ్యను చూసిన మాణిక్యం పరిగబుట్ట నెత్తిన పెట్టుకొని, మాగాటికి అడ్డంపడి పోసాగింది. తూర్పు గనెంమీద వస్తున్న సాంబయ్య అడ్డంతిరిగి దక్షిణపు గట్టు ఎక్కాడు. సాంబయ్యను తప్పించుకొన్నాననుకొని తలవంచుకొని ఉరకలు తీస్తున్న మాణిక్యం నెత్తిమీదబుట్ట వెనకనుంచి గుంజగా, వెనక్కు ఒరిగిపోయి ఆగిపోయింది.
"లమ్దిముండా! దించు గంప!" సాంబయ్య కంఠం గర్జించింది. మాణిక్యం తత్తరపోయింది. బుట్టకింద పెట్టి "దొరగారూ! పరిగ! పరిగేరుకున్నా!" అంది.
సాంబయ్య బుట్టలోవున్న రాలిపోయిన వరికంకుల్ని కర్రతో కలియతిప్పాడు. బుట్ట అడుగుదాకా కర్రగుచ్చి చూసిన సాంబయ్యకు అనుమానానికి ఆస్కారం దొరికింది.
"ఎత్తవే? ఆ పై పరిగంతా యెత్తి అడుగునేముందో చూపించు!"
"అయ్యగారూ! అంతా పరిగె అయ్యగారూ! అంతా పరిగే......" మాణిక్యం మాట పూర్తికాకముందే సాంబయ్య కర్రతో మాణిక్యం మెడవంచి "తియ్ ముందు, తప్పుడు ముండా! ఆ బుట్ట అడుగున ఏముంది? వడ్లుకాదూ?" అన్నాడు.

