Previous Page Next Page 
అర్దరాత్రి ఆడపడుచులు పేజి 20


    అటూ ఇటూ కాని అవస్థలో ఉంది మధుమతి ఇప్పుడు.
    పాలిటిక్సు ప్లే చెయ్యడం తనకు బాగా తెలుసు. ఈ మోటు జీవితంలో రాటుదేలి బాగా నేర్చుకుంది తను.
    అయితే.
    ముందు అహల్య చనిపోవాలి.
    ఊహాతీతమైన అవకాశం వచ్చింది తనకు. దాన్ని నిలుపుకోవాలి. చేయి జారిపోనివ్వకూడదు.
    స్పృహలేని అహల్యని స్పృహలోకి రానియ్యకూడదు.
    "మళ్ళీ ఇంకో డాక్టరెందుకు? అవసరం! రంగేలీ చేతిమందు పనిచెయ్యలేదంటే ఇక ఆ దేముడే దిగివచ్చినా ఏమీ చెయ్యలేడు. అవునా కిష్ణయ్యా?" అంది, ఒక్క దెబ్బతో రంగేలీనిదువ్వుతూ, కిష్ణయ్యకి ఇంపార్టెన్స్ ఇస్తూ, ఎవరూ ఏ ప్రయత్నమూ చెయ్యకుండా నిరుత్సాహపరుస్తూ.
    తర్వాత ఆమె చురుకయిన దృష్టి తెరిచి ఉన్న ఇనప్పెట్టిమీద పడింది.
    "డబ్బంతా దోచుకున్నట్లున్నారే! ఎవరిపని?" అంది ఆక్రోశంగా.
    "చిలకలచిన్నారావుట!" అన్నాడు కిష్ణయ్య.
    "ఎవరుచెప్పారు?"
    "ఆ పిల్లముండ! సృజన!"
    "అది ఇక్కడే ఉందా?"
    "అదే అహల్యని పొడిచింది"
    "నేనుకాదు! నేను కాదు!" అంది అదంతా వింటున్న సృజన. కానీ ఆమె మాటలు ఆమెకే వినబడలేదు.
    "మరిచూస్తూ నిలబడతావేమయ్యా కిష్ణయ్యా! వెళ్ళి ఆ చిన్నారావుని పట్టుకునేప్రయత్నం ఏమీ చెయ్యరా ఏం?" అంది మధుమతి.
    "పోయినడబ్బు ముఖ్యమామనకీ? పోతున్న ప్రాణం ముఖ్యమా? బాగానేఉందే నువ్వుచెప్పేది. అక్క చచ్చిపోతుంటే అది పట్టించుకోకుండా డబ్బు సంగతి మాట్లాడతావేంటీ?" అంది భవానీ అనే ఇంకో స్త్రీ.
    ఆమె మనసులో కూడా అహల్యగురించిన బాధలేదు. ఆ ఇంట్లో నెంబర్ వన్ ప్లేను, అంటే మేడమ్ స్థానం ఖాళీ కాబోతోందని తను కూడా గ్రహించింది భవాని. ఆ ఛాన్సు తేలిగ్గా కొట్టెయ్యడానికి మధుమతి ప్రయత్నిస్తోందని కూడా కనిపెట్టగలిగింది.
    ఉల్ ఫాగా మధుమతిని మేడం కానివ్వకూడదు.
    అందుకని తనుకూడా రంగంలోకి దూకింది.
    ఏరంగంలో అయినా, లీడర్ షిప్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళే ప్రతి విషయంలో ముందుకువచ్చి అందరినీ డామినేట్ చేసి తనమాట చెల్లుబాటు చేసుకుని అందరినీ తనవెనక నడిచేటట్లు చేసుకుంటారు.
    అలాగే ఇక్కడకూడా, లీడర్ షిప్ కోసం ఇద్దరు స్త్రీలమధ్య పోరాటం నెమ్మదిగా మొదలయింది.
    జనంలో అతి కొద్దిమంది మాత్రం లీడర్ షిప్ క్వాలిటీస్ కలిగిఉంటే ఎక్కువమందికి కేవలం 'ఫాలో దిలీడర్' అనే స్వభావం ఉంటుంది. అందరిలోకి డామినేటింగ్ నేచర్ ఉన్న వ్యక్తిని లీడర్ గా అంగీకరించాక ఆ లీడర్ వెనుకనే నోరెత్తకుండా వెళ్ళిపోతుంటారు.
    అక్కడ ఉన్నవాళ్ళలో అలాంటి వాళ్ళందరూ, వల్ల సంకల్పం లేకుండానేవాళ్ళకు తెలియకుండా మనసుల్లో బేరీలు వేసుకోవడం మొదలెట్టారు.
    మధుమతి డబ్బు మనిషి. అది ఆమె మాటలవల్లే తెలుస్తోంది. చనిపోతున్న మనిషి సంగతి పట్టించుకోవడంలేదు ఆమె.
    భవానీ మధుమతిలాంటి మొండి మనిషిని కూడా ఎదుర్కోగలిగింది.
    పైగా ఆమెకి మనిషి ప్రాణాలు ముఖ్యంలాగా ఉంది. డబ్బుకాదు.
    రేపు మధుమతి మేడమ్ అవుతే డబ్బుకోసం తమని చెండుకుతినవచ్చు.
    కానీభవాని అలాంటిమనిషిలాగా లేదు.
    అక్కడున్న వాళ్ళెవ్వరూ కూడా, ఈ విషయాలు ఇంత వివరంగా, ఇన్ని పదాలలో ఇన్ని వాక్యాలలో ఆలోచించలేదు.
    కానీక్షణంలో సగంలోనేవాళ్ళ మనసులు ఈ వాదం తాలూకు సారాంశాన్ని వంట పట్టించుకున్నాయి.
    భవాని అప్పటికప్పుడు అక్కడికక్కడే అనధికారికంగా లీడర్ అయిపోయింది వాళ్ళకు.
    ఒక్కమాటతో!
    తనకు అనుకూలంగా మారుతున్న పరిస్థితిని గమనించింది భవాని. వేడిమీద ఉన్నప్పుడే దెబ్బవెయ్యాలని తనకుతెలుసు. అందుకని స్థిర కంఠంతో అంది.
    "కిష్ణయ్యా! నువ్వు తొందరగా వెళ్ళి మన పెద్ద డాక్టరుగారిని పిలుచుకురా! ఉస్మాన్! ఈ ఉస్మాన్ గాడేడీ?"
    కొంతమంది ఉస్మాన్ ని వెదకడానికి బయలుదేరారు.
    కిష్ణయ్యడాక్టరుని పిలుచుకురావడంకోసం బయటికి నడిచాడు. అతని వెనకే వచ్చింది భవాని.
    "కిష్ణయ్యా!"
    అతను వెనక్కి తిరిగాడు.
    అతనివైపు సాభిప్రాయంగా చూసింది భవాని. ఇద్దరి చూపులు కాసేపు కలుసుకుని ఉండిపోయాయి.
    "కిష్ణయ్యా! నెమ్మదిగా రా! తొందరలేదు"
    అర్ధమయిందన్నట్లు నెమ్మదిగా తల ఊపాడు అతను. తగ్గు స్వరంతో అంది భవాని.
    "అహల్య నీకు ఏం చేసిందో అంతకు రెట్టింపు నేను చేస్తాను. నన్నుకనిపెట్టి ఉండు. కేసూ, గొడవా కాకుండా చూడూ. ఇక్కడి సంగతులు నేను చూసుకుంటాను"
    తల ఊపాడు కిష్ణయ్య.
    అప్పటికే అక్కడికి వచ్చి చేరింది. రంగేలీ పాదరసంలా మారిపోతున్న పరిస్థితిని కరెక్టుగా అంచనావెయ్యగలదు ఆమె.
    అందుకనే గెలిచే ముఠావైపు గెంతేసింది తను.
    "ఎట్లా ఉంది?" అంది భవాని.
    "నాచేతి మాత్రావైకుంఠ యాత్రా!" అంది రంగేలీ రాగయుక్తంగా.
    "అంతేనా?"
    "అంతే! అలాంటి మందువేసా? సాయంత్రందాకా గుటగుటలాడితర్వాత గుటుక్కుమంటుంది ప్రాణం!"
    "ఉండవలసినదానివి రంగేలీ!" అంది భవానిమెచ్చుకోలుగా.
    "అక్కా బావా నన్ను గుర్తుపెట్టుకోవాలి" అంది రంగేలీ మొగ గొంతులో సిగ్గు పలికిస్తూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS