Previous Page Next Page 
వసుంధర కధలు-8 పేజి 2


                                    3
    ఆరోజు నన్ను కలుసుకుందుకు ప్రదీప్ వచ్చాడు.
    "ఏమిటి విశేషం?" అన్నాను.
    "లక్ష్మణరావు చచ్చాడు" అన్నాడు ప్రదీప్.
    "చాలా థాంక్స్!" అన్నాను.
    "కానీ నువ్వు నాకు అయిదు వేలే యిచ్చావు. సాధారణంగా హత్య కేసులో నేను దొంగతనానికి  ప్రయత్నించను. అయితే మిగతా ఇరవై వేల కోసం అక్కడ దొంగతనం కోసం ప్రయత్నించాల్సి వచ్చింది"-
    "మిగతా ఇరవై వేలేమిటి?" అన్నాను.
    "సాధారణంగా నేను హత్య చేస్తే పాతికవేలు గిట్టుబాటయ్యేలా ఏర్పాటు చేసుకుంటాను. నువ్వు అయిదు వేలు అన్నప్పుడు పోనీలే లక్ష్మణరావు పెద్దింటి వాడు గదా -- మరో ఇరవై వేలు అక్కడ దొరక్కపోదులే అనుకున్నాను. కాని అక్కడ ఒక్క పైసా కూడా కిట్టుబాటు కాలేదు" అన్నాడు ప్రదీప్.
    "పాపం -- నీ దురదృష్టం !"
    "దురదృష్టం నాది కాదు నీది!" అన్నాడు ప్రదీప్.
    "ఏమన్నావ్?" అన్నాను ఉలిక్కిపడి.
    "దురదృష్టం నాది కాదు నీది!" అన్నాడు ప్రదీప్ మళ్ళీ.
    "అంటే?"
    "ఆ ఇరవై వేలూ ఇప్పుడు నువ్వు నా కివ్వాలి అన్నాడు ప్రదీప్.
    "ఇది మర్యాద కాదు. మన బేరం అయిదు వేలకే అన్నాను.
    "నా కస్టమర్స్ తో నేనెప్పుడూ న్యాయంగానూ, మర్యాదగానూ వుంటాను. హత్యకు సంబంధించినంత వరకూ మన బేరం అయిదు వేలకే, అది నేనూ ఒప్పుకుంటాను. కానీ నువ్వు హత్య చేయించిన రహస్యం అటు పోలీసు లకూ- ఇటు రమకూ తెలియకుండా ఉండాలంటే -- నేను నోరు మూసుకోవాలి గదా! అందుకు...."    
    ఉలిక్కిపడ్డాను . ప్రదీప్ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.
    నెమ్మదిగా ప్రదీప్ వంక చూశాను. అతను విలాసంగా సిగరెట్ కాలుస్తున్నాడు. ఏ చీకూ లేనివాడిలా కనబడుతున్నాడు.
    ఇంతవరకూ ఎవరూ నన్ను ఈ కేసులో అనుమానించడం లేదు. ప్రదీప్ అందరి అనుమానాన్నీ నాపైకి మళ్ళించగలడు. హత్య దొంగతనం కోసం జరిగిందని పోలీసులు అనుకుంటున్నారు.
    "ప్రదీప్ ----ఇది న్యాయం కాదు. నువ్వు నీ కస్టమర్నీ మోసం చేస్తున్నావు...." అన్నాను.
    "ఇందులో మోసమేమీ లేదు. నేను ముందుగానే హెచ్చరించాను. నువ్వు గుడిసెలో భోజనమే కావాలన్నావు. నువ్వు నాకు మొదట్లో పాతిక వేలిచ్చి వుంటే నువ్వెందుకు హత్య చేయాలనుకుంతున్నావో తెలుసుకుందుకు నేను ప్రయత్నించి వుండేవాణ్ని కాదు. అయిడువేలకే బేరం పెట్టడంతో నేను మొత్తం వివరాలన్నీ తెలుసుకున్నాను. నీ కధ నాకు పూర్తిగా తెలుసు. కధ తెలిశాక దాన్ని సొమ్ము చేసుకోకుండా ఉండగలనా?" అన్నాడు ప్రదీప్.
    ఎంత పొరపాటు చేశాను? హత్యకు కారణంతో సహా మొత్తం అన్నీ ప్రదీప్ కు తెలుసును. ఈ విషయంలో నేను చాలా తెలివి తక్కువగా వ్యవహరించాను. విషయం రమ దాకా వెడితే మా పెళ్ళి ఆగిపోతుంది. పోలీసులదాకా వెడితే కటకటాల వెనక్కు వెడతాను.
    "మిస్టర్ ప్రదీప్! నాకేసు బయటపడితే నీకే నష్టం . నేను హత్య చేయమాన్నాను కానీ చేయలేదు. నా నేరంతో పాటు నీ నేరం కూడా బయటపడితే...."
    "నా కలాంటి భయాలేవీ లేవు. రాచ పుట్టుక తోడూ లేకుండా చావదంటారు. నేనెప్పుడు కటకటాల వెనక్కి వెళ్ళినా ఎందరి జాతకాలో నా చేతుల్లో వుంటాయి. వాళ్ళంతా కలిసి నన్ను రక్షిస్తారు. లేదా నాతో పాటే వాళ్ళూ చస్తారు. అయినా జైలంటే సంకోచం లేదు నాకు. నా గురించి బాధపడక. నీ సంగతి నువ్వు చూసుకో" అన్నాడు ప్రదీప్.
    ప్రదీప్ తెగించినవాడు. అతణ్ణి నేనేమీ చేయలేను. నేనతడిని బెదిరించి ప్రయోజనం లేదు.
    "ఒక్కసారి ఇరవై వేలంటే చాలా కష్టం నాకు. ఎక్కణ్ణించి తెచ్చేది?" అన్నాను.
    "నాక్కావలసిన డబ్బు తీసుకునేందుకు కూడా రెండు పద్దతులున్నాయి. మేడ పద్దతి యేమిటంటే ఒక్కసారి మొత్తం డబ్బు తీసుకోవడం . గుడిసె పద్దతి ఏమిటంటే వాయిదాల మేఅ తీసుకోవడం. ఎటొచ్చీ రెండో దాంట్లో వ్యవహారం నీటుగా వుండదు. వడ్డీలు వసూలు చేయాలి. రూపాయి విలువ పడిపోతున్నప్పుడూ , ధరలు పెరుగుతున్నప్పుడూ బాకీ పెంచుతుండాలి. చాలా వ్యవహరాలుంటాయి" అన్నాడు ప్రదీప్.
    నేనిప్పుడు ప్రదీప్ చేతుల్లోకి వెళ్ళిపోయాను. అతడి నుంచి బయటపడడం కష్టం. నన్నతను పాడి ఆవులా వాడుకుంటాడు. అవసరమైనప్పుడల్లా వచ్చి డబ్బు కావాలని వేధించి వేడుతుంటాడు.
    అతడికి కోరిన డబ్బివ్వడం మినహాగా నేను చేయగలిగిందేమీ లేదు. అయితే ఇలా ఎన్నాళ్ళు సాగదు. రమ ద్వారా ఆస్తి కలిస్తే ఏమోగానీ- లేని పక్షంలో నేను ప్రదీప్ కి డబ్బివ్వ లేను.
    "నాకు కొంత వ్యవధి కావాలి" అన్నాను.
    "వ్యవధి తప్పక ఇచ్చాను. కానీ టైం ఈజ్ గోల్డ్ , ఎంత వ్యవధి తీసుకుంటే అంత ఖర్చవుతుంది. ఆ విషయం ఆలోచించుకో" అన్నాడు ప్రదీప్.
    
                                  4
    రెండురోజులు రమతో మాట్లాడేను. రమకు పెళ్ళి యే మాత్రమూ ఇష్జ్తం లేదని తేలిపోయింది.
    అప్పుడు నేనొక నిర్ణయానికి వచ్చాను. లక్ష్మణరావు మీద మరీ అంత కక్ష వున్నప్పుడు నేనే అతణ్ణి స్వయంగా చంపవలసింది. ప్రేమించిన యువతి కోసం ఆ సాహసం చేశానని సరిపెట్టుకుని వుందును. లక్ష్మణరావు హత్య జరిగినప్పటికీ ఎవరూ న గురించి ఆలోచించడం లేదు. అప్పుడూ నేను పట్టుబడేవాణ్ని కాదు. నా వ్యవహారంలోకి రెండో మనిషిని లాగి కొరివితో తలగోక్కున్నాను.
    కిరాయి హంతకులు ప్రమాదకారులు. ఈ విషయం స్వానుభవం మీద తెలుసుకున్నాను. లక్ష్మణరావు ప్రాణం తీయడానికి ప్రదీప్ పాతికవేలు కావాలనుకున్నాడు. లక్ష్మణరావు నాకంటే ధనవంతుడు. అతడి ప్రాణాల కంటే నా ప్రాణాల విలువ ఎక్కువుండదు. అయినా ప్రదీప్ నా ప్రాణాలకూ అదే రేటు కట్టాడు. ఇంకా ఎక్కువ చేస్తాడేమోనని నా భయం కూడా! ప్రదీప్ లాంటి వాడి చేతిలో పడ్డాక నేను చచ్చినవాడితో సమానం. అందుకే నా హత్య ఏదో నేనే చేసుకోవలసినది.
    నా హత్య ఏదో నేనే చేసుకోవలసింది -- అన్న ఆలోచన తట్టగానే ఓ ఆలోచన వచ్చింది. ఎలాగూ ఏదో హత్య చేయవలసి ఉందనుకున్నప్పుడు ఇప్పుడీ ప్రదీప్ ని చంపేస్తే!
    ప్రదీప్ ని చంపడం గురించి చాలా ఆలోచించగా ఎన్నో మంచి పాయింట్లు అందులో కనిపించాయి. ఈ ఆలోచన నాకు ముందే ఎందుకు కలగలేదు.
    అయితే ప్రదీప్ ని నేను చంపగలనా? జీవితంలో ఇప్పటికే ఎన్నో హత్యలు చేశాడు- ఇంకా చేయాలనుకుంటున్నాడు. చేస్తే గీస్తే ఒకే హత్య చేద్దామనుకుంటున్నాను . అలాంటి నావల్ల ప్రదీప్ ని చంపడం అవుతుందా?
    ఈ విషయమై బాగా అలోచించి ఓ నిర్నయానికొచ్చాను. అందులో చాలా రిస్కు వుంది. ఫేయిలయ్యానా జైలుకు పోతాను. ఉరికంబం మెక్కుతాను. విజయం సాధించానా రమను చేపట్టి హాయిగా జీవిస్తాను. జీవితంలో ఆమాత్రం రిస్కు తీసుకోవాలి.
    ముందుగా రమను కలుసుకుని "హంతకుడి గురించి నాకు కొంత ఆచూకీ తెలిసింది. వాడు చాలా ప్రమాదకారి , ఆత్మరక్షణకు నాకు అయిధమేమైనా అవసరం. ఓ రివాల్వర్ దొరికితే బాగుండును...." అన్నాడు.
    లక్ష్మణరావు దగ్గర ఓ రివాల్వర్ వుందనీ దాన్నతనుచాలా రహస్యంగా దాచి వుంచుతాడనీ నాకు తెలుసు. రమకు ఆ వివరాలు తప్పక తెలిసి వుంటాయని నా అనుమానం.
    "ఎవరా హన్తాకుడు?" కుతూహలంగా అడిగింది రమ.
    'అప్పుడే ఏమి చెప్పలేను. వాడో కిరాయి హంతకుడని నా అనుమానం. వాడెవరో ఇంకా తెలియలేదు కానీ మీ అన్నయ్య మీద ద్వేషం వున్న ఓ వ్యక్తీ వాణ్ని నియామించి నట్లు తెలిసింది..."
    రమకు నిజమే చెప్పాన్నేను.
    రమ ఇంకా వివరాలడిగింది కానీ నేను చెప్పలేదు.
    ఆమె రివాల్వర్ గురించి ఏమీ చెప్పలేదు. లక్ష్మణరావు రివాల్వర్ గురించి ఆమెకు తెలుసునో తెలియదో! లేక అది నాకివ్వడం ఆమెకు ఇష్టం లేదో!
    రివాల్వర్ సంపాదించడం నాకు మరీ అంత కష్టం కాదు. కానీ లక్ష్మణరావు రివాల్వర్ వుంటే నాకు ఇంకా ప్రయోజనకరంగా వుంటుంది. ఇలాంటి విషయాల్లో తొందరపడి కూడదు. నా ప్రాణాలకే మోసం వస్తుంది.
    అయితే ప్రదీప్ సహనానికి అంతం వస్తోంది. ఓ వారం రోజుల తర్వాత అతడు నన్ను తీవ్రంగా హెచ్చరించాడు. "ఏమిటి నీ ఉద్దేశ్యం?" అనడిగాడతను.
    "నేను పైసా పైసా కూడపెట్టి ఈనాటి కింత వాడి నయ్యాను. నా దగ్గర లక్షలేమీ మూలగడం లేదు. తెలివితక్కువగా నీతో వ్యవహారంలోకి దిగాను. అందువల్ల ఇప్పుడు ఇరవై వేలు బాకీపడ్డాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS