Previous Page Next Page 
వసుంధర కధలు-6 పేజి 2

 

    ఆరోజు పుస్తకాలకు జ్యోత్స్న రావడం అదే మొదటిసారి-- సుకుమార్ ని ఏకాంతంగా కలుసుకోవడం. సుకుమార్ ఆమెకు పుస్తకాలిచ్చాడు. ఆమె వెళ్ళిపోయింది.
    అప్పుడు సుకుమార్ మనసు పరిపరివిధాల పోయింది.
    ఆమె ఎందు కొచ్చింది? నిజంగా పుస్తకాలకెనా?
    తండ్రి ఈ సమయంలో ఇంట్లో వుండడని ఆమెకు తెలుసు. తనుంటాడని తెలుసు. ఇద్దరూ రహస్యంగా కలుసుకునే అవకాశమున్నదని చెప్పడం కోసం ఆమె వచ్చిందా?
    ఆలోంచించిన కొద్ది జ్యోత్స్న తన గురించి పరితపిస్తున్నదన్న భావన సుకుమర్లో కలిగింది. అయినా అతడు ధైర్యం చేయలేకపోయాడు. ఈలోగా మరి రెండు సార్లు జ్యోత్స్న అతడి నడిగి పుస్తకాలు తీసుకుంది.
    ఇక లాభం లేదనుకొని ఒకరోజున అతడే తలుపు తట్టి ఆమెను పిలిచాడు. ఆమె తలుపు తీసి కరణమడిగింది.
    ఏం చెప్పాలో తెలియలేదు సుకుమార్ కి.
    "మీ యింట్లో మంచి తెలుగు నవలలేమైనా ఉంటె ఇస్తారని...." అంటూ గొణిగాడు.
    "రండి....." అంటూ ఆమె అతడి నహ్వానించి తనింట్లోని పుస్తకాలు చూపించింది.
    అలా ప్రారంభమైంది వారి పరిచయం. అటుపైన యెన్నడూ పగటి సమయంలో జ్యోత్స్న కు తనే తలుపు తట్టాల్సిన అవసరం రాలేదు. ఆమె స్నానం చేసి వచ్చి సోఫాలో కూర్చోగానే సుకుమార్ తలుపు తడతాడు. ఆమె తలుపు తీస్తుంది.
    ఇద్దరూ కాసేపు కబుర్లుచెప్పుకుంటారు. ఆమె అతడితో స్నేహపూర్వకంగా మాట్లాడుతుంది. అతడికది సంతోషం. కానీ తమ పరిచయం అంతకుమించి వెళ్ళాలన్నది అతడి కోరిక. అందుకతడేమీ చొరవ చేయలేక పోతున్నాడు.
    అలా రోజులు గడుస్తున్నాయి.
    ఒకరోజున సాహిత్యం, మరొక రోజున సంగీతం, ఒక రోజున సినిమాలు, మరోకరోజున రాజకీయాలు , ఒకరోజున సంప్రదాయాలు, మరో రోజున విజ్ఞాన శాస్త్రం- ఇలా వాళ్ళేన్నో విషయాల మీద మాట్లాడుకున్నారు. సంభాషణ ఎప్పుడూ ప్రేమ గురించి సాగలేదు. ఆమె ఆ ప్రసక్తి తీసుకువస్తే బాగుండునని అతడి కుంది. తనే తీసుకువస్తే బాగుండునని ఆమె అనుకుంటున్నదన్న అనుమానమూ అతడికుంది.
    అతడి మనసులో కల్మషముంది . అది బయట పడనంత వరకూ అతడు మంచివాడే అవుతాడు. ఆమె మనసులో యేముందో అతడికి తెలియదు.
    ఆరోజు కూడా జ్యోత్స్నసోఫాలో కూర్చుని నవల చదువుతూ మధ్య మధ్య తలుపు వంకే చూస్తోంది. తలుపు మ్రోగడం కాస్త ఆలస్యమైంది. చప్పుడైనదే తడవుగా ఆమె వెళ్ళి తలుపు తీసింది.
    "రండి రండి - నవల కంటే మీతోనే మంచి కాలక్షేపంగా ఉంది నాకు --" అంది జ్యోత్స్న అతడి నాహ్వానిస్తూ.
    ఆ ఆహ్వానానికతడు పొంగిపోతూ -- "థాంక్స్!" అన్నాడు.
    "ఈరోజు మీకు ఫోటో ఆల్బం చూపిస్తాను. అందులో మీరు చూడవలసిన ముఖ్యులేందరో ఉన్నారు" అందామె.
    "వెరీ గ్లాడ్ ...." అన్నాడు సుకుమార్.
    జ్యోత్స్న సోఫాలో అతడి పక్కనే కూర్చుంది. ఆల్బం టీపాయ్ అడుగు అరలోంచి తీసి ఇద్దరికీ మధ్య పెట్టి ఒక్కొక్క ఫోటో యే చూపించింది.
    అందులో వాళ్ళ పెళ్ళి ఫోటోలుంటాయని సుకుమార్ అనుకున్నాడు. అలాంటి దోక్కటీ లేదు. అన్ని విడివిడి ఫొటోలే! రెండు పేజీల నిండా అతడి ఫోటోలు, రెండు పేజీల నిండా ఆమె ఫోటోలు.
    "ఆయనకు కలిసి ఫోటోలు తీసుకోవడం నచ్చదు. కలుసుండడం జీవితానికి, ఫోటోల్లో ఎవరి వ్యక్తిత్వం వారిది విడివిడిగా ప్రతిఫలించాలి ...." అందామె అతడికి మొదటి నాలుగు పేజీలు  చూపించి. ఆ తర్వాత పిల్లల ఫోటోలు. అవీ విడివిడిగానే ఉన్నాయి.
    "మీ ఫామిలీ ఫోటో ఒక్కటీ కూడా లేదు...." అన్నాడు సుకుమార్.
    "ఇంట్లో ఎప్పుడూ ఒకర్ని  విడిచి ఒకరుండం. మమ్మల్నోక్క చోట బంధించగల ఫ్రేం ఇల్లుండగా ఫోటో ఫ్రేం -- ఎందుకూ అంటారాయన...."
    "మరి మీరేమంటారు?"
    "నేనేమీ అనను. నాకు వ్యక్తిత్వం లేదు..." అంది జ్యోత్స్న.
    "మీ మాటలు నేను నమ్మను. మీది చాలా గొప్ప వ్యక్తిత్వం --" అన్నాడు సుకుమార్ చటుక్కున.
    "నా వ్యక్తిత్వం గురించి మావారి కంటే మీకేక్కువ తెలియదు. వారి వ్యక్తిత్వమే నా వ్యక్తిత్వం --" అంది జ్యోత్స్న.
    'అంటే మీకంటూ వేరే స్నేహితులు లేరా?" అన్నాడు సుకుమార్.
    జ్యోత్స్న ఆల్బం లో ఒక పేజీ తిప్పింది. అక్కడ ఇద్దరు యువకుల బొమ్మలున్నాయి. ఇద్దరూ చాలా అందంగా వున్నారు.
    "వీళ్ళు చాలా బాగున్నారు కదూ!" అంది జ్యోత్స్న.
    సుకుమార్ తలూపాడు.
    "కానీ పాపం -- వీళ్ళలో ఒకడికి కాలు లేదు. రెండో వాడికి చేయి లేదు --..." అంది జ్యోత్స్న జాలిగా.
    'ఇంతకీ వీళ్ళెవరు?" అన్నాడు సుకుమార్.
    "ఒకప్పుడు నా స్నేహితులు...."
    "ఇప్పుడు కారా?"
    "కారు...."
    "ఎందుకని ?"
    "కాలేజీ రోజుల్లో మా యింటి పక్కనే ఉండేవారు యిద్దరూ. నేనంటే యెంతో ఇష్టపడేవారు. వాళ్లిస్తే ఫోటోలు కూడా పుచ్చుకున్నాను. పెళ్ళయ్యాక నా భర్త ఈ ఫోటోల గురించి అడిగారు. నా స్నేహితులని చెప్పాను. పెళ్ళైన ఆడదానికి హితులే తప్ప స్నేహితులుండ కూడదన్నారాయన. నేను సరేనన్నాను. వీళ్ళతో స్నేహం తెంపుకొమన్నారు. అలాగేనన్నాను. అసలా ఫోటో లేలాగోచ్చాయని అడిగారు. చెప్పాను. ఆ తర్వాతనే ఒకడికి కాలూ, ఒకడికి చెయ్యి విరిగింది. అప్పుడు వాళ్ళే నన్ను మరిచిపోయారు. ఆతర్వాత నేనింకేవరితోనూ స్నేహం చెయ్యలేదు --" అంది జ్యోత్స్న.
    సుకుమార్ తడబడ్డాడు. తటపటాయిస్తూనే -'అంతా అన్యాయం, వాళ్ళు చేసిన తప్పేమిటి?" అన్నాడు.
    "ఏమిటో కానీ -- తప్పు చేశారనే నేననుకున్నాను."
    "ఎందుకని?"
    "వాళ్ళలో ఏ తప్పు లేకపోతె వాళ్ళకే కాళ్ళూ చేతులూ విరగవు. మావారికేమీ కాలేదు. నాతొ ఎవరు స్నేహం చేసినా శ్రీవారి కాలో, చెయ్యో విరగదీస్తే తప్ప - వారిని నేను గౌరవించ,లేను...." అంది జ్యోత్స్న.
    సుకుమార్ కి ఆమె మాటలు సరిగా అర్ధం కాలేదు. ఆమె తన భర్తను గురించి తన్ను హెచ్చరిస్తోందా? తన ద్వారా భర్తపై కసి తీర్చుకోవాలను కుంటుందా?
    ఆమె మనసులో ఏదో వుంది. ఆల్బం చూపడం లో ఆమె తనకు ఏదో సందేశం పరోక్షంగా అందిచదల్చుకుంది.
    స్నేహితుల మన్నందుకు జగదీష్ ఇద్దరు యువకుల కాళ్ళూ, చేతులు విరగొట్టాడు. ఈ విషయం పనిగట్టుకుని జ్యోత్స్న తనకెందుకు చెప్పినట్లు? ఆమె తన్ను హెచ్చరిస్తోందని అనుకుందామా అంటే భర్త కాలూ, చెయ్యి విరగాదీసే మగదీరుడి కోసం తానేదురు చూస్తున్నట్లూ ఆమె సూచించింది.
    ఇప్పుడు తనేం చేయాలి?
    సుకుమార్ కి అర్ధమయింది.
    జ్యోత్స్న నన్ను పరీక్షిస్తోంది. ఆమె చెప్పింది విని తను భయపడితే -- తనామెకు లోకువై పోతాడు. తనామే నెంతగా ప్రేమిస్తున్నాడో చెప్పాలి. ఆమె సహకరిస్తే భర్తకు గుణ పాఠము చెప్పగలనని మాటివ్వాలి.
    సుకుమార్ తననొక సారి జగదీష్ తో పోల్చుకున్నాడు. అందచందాలలో జగదీష్ తనకు సాటిరాడు. ఇంక బలం విషయం చూస్తె -- తను జగదీష్ అంత దృడంగా ఉండకపోయినా -- అతడి కంటే బాగా పొడుగు . అవసరమైతే తనతడిని తన్నగలడు.
    సుకుమార్ జరిగినదేమిటో ఊహిస్తున్నాడు. పెళ్ళి కాగానే ఆమె వ్యక్తిత్వాన్ని చంపేశాడు జగదీష్. జ్యోత్స్న భరించలేక తన పాత స్నేహితులకు చెప్పుకుంది. వాళ్ళామీకు సాయపడాలని వచ్చి భంగపడి వెళ్ళారు. అప్పట్నించీ ఆమె కొత్త స్నేహితులకోసం యెదురు చూస్తోంది. భర్తకు బుద్ది చెప్పాలన్నదామె ఆశయం.
    "జ్యోత్స్న! నువ్వే నా ప్రాణం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకోసం యేమైనా చేస్తాను. నువ్వు నా కౌగిలిలో ఒదిగిపోతూ - నన్నాజ్ఞాపించు . నేను నీ మాటలు శిరసావహిస్తాను. నీ వ్యక్తిత్వానికి రక్షణ కల్పిస్తాను..." అనాలనుకున్నాడు. కానీ అతడి గొంతు పెగలలేదు. కష్టపడి గొంతు సవరించుకుని రెండో ప్రయత్నం చేయబోతూ =-- "నేను ....." అన్నాను. అంతే కాలింగ్ బెల్ మ్రోగింది.
    "ఈ సమయంలో ఎవరు చెప్మా?' అంది జ్యోత్స్న.
    "మీవారేమో--" అంటూ లేచి నిలబడ్డాడు సుకుమార్.
    "ఫరవాలేదు- కూర్చోండి--" అంది జ్యోత్స్న.
    "వచ్చిందే ఆడవాళ్ళో అయుంటారు నాకు పనుంది లెండి వస్తాను......."అంటూ సుకుమార్ చరచరా తన వాటాలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు.
    ఆ సమయంలో ఆమెకు లేని భయం తనక్కలిగినందుకు సుకుమార్ ఎంతగానో ఆశ్చర్యపడ్డాడు.

                                    2
    జ్యోత్స్న వెళ్ళి తలుపు తీసింది.
    ఒక అపరిచితుడు గుమ్మం బయట నిలబడి వున్నాడు.
    "జగదీష్ గారిల్లిదే కదూ!' అన్నాడతను.
    "ఇల్లిదే -- వారింట్లో లేరు......." అంది జ్యోత్స్న.
    "ఫవరాలేదు -- మీతో నే మాట్లాడతాను-------......" అంటూ చొరవగా లోపల కొచ్చి తలుపు వేశాడతడు.
    "ఎవరు మీరు?' అంది జ్యోత్స్న కంగారుగా.
    "పని మీద వచ్చాను-" అన్నాడతడు.
    "మీరెవరు?"
    "ఎవరంటే ఏమిటి -- నా పేరు చెప్పాలా?' అన్నాడతడు.
    జ్యోత్స్న విస్తుపోతూ అతడి వంక చూసింది.
    "నువ్వు బాగున్నావు....." అన్నాడతడు.
    జ్యోత్స్న కు మాటరాలేదు.
    "నువ్వు చాలా బాగున్నావు........" అన్నాడతడు మళ్ళీ.
    "బాగుంటే?' అంది జ్యోత్స్న కాసేపటికి గొంతు పెగల్చుకుని.
    "నువ్వెప్పటికీ బాగుండాలని నా కోరిక........"
    "అంటే?"
    "అంటే అర్ధం కాలేదూ-- నువ్వు చెడి పోకూడదన్న మాట......."
    "అర్ధం కాలేదు......." అంది జ్యోత్స్న.
    "ఆడది చెడిపోవడమంటే అర్ధం విడమర్చి చెప్పాలా?"
    జ్యోత్స్న ధైర్యం తెచ్చుకొని--" నేను బాగున్నాను కదా - ఇప్పుడు చెడిపోవడం గొడవెందుకు?" అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS