Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 2


    'చాలా రాత్రయింది. ఇక పడుకో శాంతీ.' నోటివరకూ వచ్చిన మాటలు నాలుక చివరనే ఆగిపోయాయి. నిశ్శబ్దంగా బయటకు నడిచి తలుపులు దగ్గరవేసి వెళ్ళిపోయి పడుకున్నాడు శ్రీహరి.

                                          2

    మర్నాడు సాయంత్రం శ్రీహరి టాంగా తీసుకురావడానికి వెళ్ళబోతూండగా, అప్పుడే ముస్తాబు ముగించి గది బయటికి వచ్చిన పద్మ, "ఇవాళ న్యూ మార్కెట్ కెళ్దామా? కొన్ని కొనుక్కోవలసిన వున్నాయి" అంది.
    "మీ యిష్టం. మీ ఇద్దరూ ఎక్కడి కంటే అక్కడికే. కలకత్తా అంతా నాకు కొట్టిన పిండి" అంటూ అక్కడే ఉన్న చెల్లెలి వైపు చూచాడు శ్రీహరి. నుదుట తిలకం దిద్దు కొంటూన్న శాంతి ముఖం యిటు త్రిప్పింది. అన్నయ్యతో ఏదో అనబోయి మళ్ళీ వదినముఖం చూచి ముఖం త్రిప్పేసుకుంది. మౌనంగా జోళ్ళు తొడుక్కోసాగింది.
    "ఏమిటి, శాంతీ? ఏదో చెప్పబోయావు?" అన్నాడు శ్రీహరి.
    "ఏం లేదన్నయ్యా" అంది శాంతి మందహాసంతో.
    "నేను నమ్మను" అన్నాడు శ్రీహరి కుర్చీలో కూర్చుంటూ.
    ఇక శాంతికి చెప్పక తప్పలేదు. "మరొక్క సారి దక్షిణేశ్వరం చూడాలన్నయ్యా."
    ఆడపడుచు మాటలు వింటూనే పద్మ కళ్ళు ఆశ్చర్యంగా కదిలాయి. "చూశాంగా నిన్న?"
    శ్రీహరి కొద్ది నిమిషా లూరుకొని, "ఏం? ఆ చిత్రం యింకా పూర్తికాలేదా?" అనడిగాడు చెల్లెల్ని సాభిప్రాయంగా చూస్తూ.
    ఈసారి శాంతి ఆశ్చర్యపోయింది. "నువ్వు చూశావా?" అనడిగింది విస్ఫారిత నేత్రాలతో.
    నవ్వాడు శ్రీహరి. "ఊఁ. రాత్రంతా నిద్రపోకుండా వేస్తున్నావు కదూ? ఏదో వేస్తావు కానీ యింతందంగా పెయింట్ చెయ్యగలవని నేనెప్పుడూ అనుకోలేదు సుమా."
    ఆ అన్నాచెల్లెళ్ళ సంభాషణేమీ అంతుపట్ట లేదు పద్మకు. సంగతి వివరించి భార్య అనుమానం నివృత్తి చేశాడు శ్రీహరి.
    "బాగుంది. కావలిస్తే ఇంకెప్పుడైనా చూడవచ్చుకానీ తిరిగిన చోటికే తిరగడమేమిటీ, ఇంకా చూడవలసినవి అనేకం ఉండగా?" రుసరుస లాడింది పద్మ.
    "పోనీ మరోసారెప్పుడైనా వెళ్దాంలే అన్నయ్యా" అంది శాంతి.
    శ్రీహరి మౌనంగా బయటకు నడిచాడు. మౌనంగా ఎక్కి కూర్చోవడమే కాని పద్మకు, శాంతికి కూడా తెలియదు,  ఎక్కడికెళ్ళుతున్నారో. శ్రీహరి చెప్పలేదు. టాంగా దక్షిణేశ్వరం చేరడంతో శాంతి ముఖం ఆనంద ప్రఫుల్లమై పోయింది. ఉత్సాహంగా ఉరికింది టాంగాలోంచి.
    "తెలుసు, మీకు చెల్లెలంటే ప్రాణమని. ఈ ముక్క యింటి దగ్గరే చెప్తే తీరిపోయేదిగా, నే నాగిపోదును?" అంది పద్మ అప్రసన్నంగా.
    "ఈమాత్రం దాని కంత విసుపు దేనికి పద్మా? చూచింది మళ్ళీ చూడక్కర్లేదని ఎక్కడా లేదుగా? చూడు, శాంతి మనకంటే చిన్నది. దానికంటే పెద్దవాళ్ళం. ఇంత చిన్న చిన్న విషయాలకు కూడ దానిని చిన్నబుచ్చడం బాగుండదు. అదీ కాక నాల్గురోజులుండి వెళ్ళిపోయే పిల్ల."
    "అయితే? అయ్యిందిగా నిన్న? నేనేదో బొత్తిగా పరాయిదాన్నన్నట్లు మాట్లాడుతారేమిటి?" కొంచెం తీవ్రంగానే ఉంది పద్మ కంఠస్వరం.
    శ్రీహరి మందహాసం చెయ్యడానికి విఫల యత్నం చేశాడు. అతనికి తెలియకుండానే కంఠంలో కొద్ది తీక్షణత ధ్వనించింది. "చూడు, పద్మా. కళ అనేది సామాన్య విషయం కాదు. ఆ కళారాధక హృదయాన్ని కలిగివుండటం ఏదో పూర్వజన్మ సుకృతం. అందుకు మనం సంతోషించాలి, అభివృద్ది చెయ్య ప్రయత్నించాలే కాని దాని విలువ తెలియనట్టు మాట్లాడకూడదు. అది ఏదో ఒక ఆవేశంలో చిత్రిస్తోంది. మధ్యలో ఆగిపోయినట్లుంది. ఇప్పుడే పూర్తవ్వాలి కాని ఆపితే ఇక ఆగిపోవడమే అవుతుంది."
    సంభాషిస్తూనే ముందుకు నడిచారు. అప్పటికే శాంతి, రాధాకృష్ణావలోకనంలో లీనమై పోయింది.
    "అదేమిటో పూర్తిగా కానీయమ్మా. మళ్ళీ మళ్ళీ రప్పించక" అంది పద్మ నవ్వుతూనే శాంతి భుజంపై చెయ్యి వేసి.
    "ఉష్. డిస్టర్బ్ చెయ్యకు. ఇటు రా" అని భార్యతో అంటూ నది ఒడ్డుకు దారితీశాడు శ్రీహరి. అయిష్టంగానే కదిలింది పద్మ. నాలుగ్డుగులు వేశారో, లేదో, "హాల్లో! శ్రీహరీ!" అనే పిలుపు విని ఆగిపోయారు.
    'ఎవరు?' అనుకొంటూ ప్రక్కకు తిరిగాడు శ్రీహరి. చూస్తూండగానే అతడి ముఖం కళకళలాడిపోయింది. "ఓ రాజా! నువ్విక్కడున్నావేమిటి?" అంటూ వెళ్ళి చెయ్యి పట్టుకున్నాడు. "చూడు, పద్మా. ఇతడు నా స్నేహితుడు రాజశేఖరం. నా భార్య పద్మావతి" అంటూ పరిచయం చేశాడు.
    "నేనిక్కడ రీసెర్చ్ లేబొరేటరీలో స్టాటిస్టీషియన్ గా రెండేళ్ళనుంచీ పని ఛేస్తున్నాను. ఎమ్మెస్సీ అవ్వగానే వుద్యోగం దొరికింది. ఇపుడు పరమనంటయ్యానుకూడ" అని చెప్పుకున్నాడు రాజశేఖరం.
    "నేను ఇక్కడొక మోటారు కంపెనీలో ఇంజనీరుగా వచ్చాను. రెండు నెలలనుండీ పని చేస్తున్నాననుకో. కుటుంబాన్ని మాత్రం నిన్ననే తీసుకొచ్చాను. నా భార్యను చూశావుకదూ? అదుగో, అక్కడ మా చెల్లెలుంది. రా, పరిచయం చేస్తాను" అన్నాడు శ్రీహరి.
    రాజా దృష్టికూడా అటు తిరిగింది. చెక్కిట చెయ్యిజేర్చి, కాటుకదిద్దిన విశాల నేత్రాలను మరింత విశాలంచేసి, ప్రతిమలలో ఒక ప్రతిమగా కన్పట్టుతూన్న శాంతిని, జీవకళ లీనుతున్న పాలరాతి విగ్రహాలతో పోటీపడుతున్న బంగరు ఛాయతో లేగులాబీ వర్ణపు దుస్తులలో మెరసిపోతున్న సజీవ సౌందర్యమూర్తిని, కొద్ది క్షణాలు చకితుడై చూచాడు రాజా.
    "శ్రీహరీ! మీ చెల్లెలు చిత్రకారిణా?" అని ప్రశ్నించాడు మెల్లగా.
    "అవును. కాని, ఎలా కనిపెట్టావు?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు శ్రీహరి.
    నవ్వాడు రాజా. "నేనుకూడా చిత్రకారున్ని కావటంవల్ల. తర్వాత మాట్లాడదాంలే. ఆవిడని 'డిస్టర్బ్' చెయ్యద్దు. అలా పోయి కూర్చుందాం."
    ముగ్గురూ లేక్ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటూండగా శాంతి వచ్చి కలిసింది.
    "చూడు, శాంతీ. ఇతడు రాజశేఖరం, నా ప్రాణ స్నేహితుడు. ఇక్కడ ఉద్యోగమట" అన్నాడు శ్రీహరి.
    అన్నయ్య ప్రక్కన కూర్చుంటూ, "నమస్కారం" అంది చేతులు జోడించి.
    చేతులెత్తకుండానే చిరునవ్వుతో "నమస్కారం అన్నాడు రాజా. "అయినా మనకు నమస్కారాలేమిటి? రెండు మూడుసార్లు వెనుక నేను మీ ఇంటికొచ్చాను, గుర్తుందో లేదో కాని!"
    "లేదండీ" అంది సిగ్గుపడుతూ శాంతి.
    "అప్పటికి బాగా చిన్నతనం దానికి" అన్నాడు శ్రీహరి.
    "అయితే రాధా మాధవ చిత్రీకరణం ఎంత వరకు వచ్చింది? ఇంకా ఇప్పుడు మొదలుపెట్టబోతున్నారా?" నవ్వుతూ ప్రశ్నించాడు రాజా.
    ఆ ప్రశ్న వింటూనే అతి ఆశ్చర్యంగా చలించాయి శాంతి నేత్రాలు. 'అన్నయ్య చెప్పాడా?'
    "ఆయనగారు కూడ చిత్రకారుడేనటమ్మోయ్, శాంతీ నిన్ను చూస్తూనే చిత్రకారిణివని గుర్తు పట్టేశారు. కళాకారుల కేమైనా మూగభాష లుంటాయేమో మరి!"
    "నిజం?" శాంతి చూపులలో, మాటలలో ఆశ్చర్యానందాలు తొణికిసలాడాయి.
    చిరునవ్వుతో సమాధానమిచ్చాడు రాజశేఖరం. "చూడగానే ఏడు విగ్రహాలు ఎనిమిదెప్పుడయ్యాయా, అని కొద్దిగా కలవరపడవలసి వచ్చింది సుమండీ."
    అందరూ పక పకా నవ్వేశారు. శాంతి చెంపలు కెంపులీనాయి. "ఏం? చిత్రకారిణిగానే ఎందుకూహించారు? కవయిత్రి కాకూడదా?" అంది. వాలిపోతూన్న కమలనయనాలను బలవంతంగా పైకెత్తుతూ.
    అదే నిర్మలమైన చిరునవ్వుతో సమాధాన మిచ్చాడు. "మీరీ ప్రశ్న తెలిసే అడుగుతున్నారు. అయినా సమాధానం చెప్పుతాను. కవయిత్రుల నేత్రాలు నిశ్చలంగా ఒకచోట నిలువవు, ప్రత్యేకంగా ఒక్క వస్తువునే పరికించవు. భూమి నుండి ఆకాశంవరకు పరిసరంలో కన్పట్టే చేతనా చేతనాలన్నిటినీ, జీవ నిర్జీవాలన్నిటినీ సమదృష్టితో పరిశీలిస్తూ పరుగులెడతాయి కవితాదృష్టులు. చిత్రకారుల దృష్టి ఒకచోటే నిలిచిపోతుంది. చిత్రించదలచిన దృశ్యాన్ని కాని, వస్తువునుగాని ఒకే భంగిమలో పరీక్షించి ముందు హృదయఫలకంపై హత్తించుకుంటారు."
    ఆ మాటలకు అంగీకారసూచకంగా శాంతి పెదవులపై క్షణకాలం చిరునవ్వు లాస్యం చేసింది.
    "ఇంతకూ నే నడిగినది చెప్పలేదు" అన్నాడు రాజా తిరిగి విషయానికి వస్తూ.
    శాంతి కొంచెం తటపటాయిస్తుండగా శ్రీహరి, "నిజంగా చెప్పడానికి మాటలు చాలవు. రాజా, నా చెల్లెల్ని గురించి నేనే ఘణంగా చెప్పకూడదు. శాంతిలో యింత కళ వుందని నాకే యింతవరకూ తెలియదు. నువ్వే చూద్దువుగాని, రేపు రా మా యింటికి" అన్నాడు.
    "మీరిక్కడకు క్రొత్తగా వచ్చారు గనుక ముందు నే నాహ్వానించడం మర్యాద. రేపుఉదయం ఫలహారం, భోజనం కూడా మా యింట్లోనే. అడ్డు చెప్పకూడదు" అంటూ రాజా తన అడ్రస్ యిచ్చాడు.
    "ఆల్ రైట్. అయితే న్యూమార్కెట్ కు కూడ రేపు అటునుంచటే వెళ్ళవచ్చు పద్మా. రాజా కూడ వుంటాడు మనతో. ఇంతకూ యిప్పుడెక్కడి కెళ్దాం?" అడిగాడు శ్రీహరి.
    "ఇక్కడెంతో ప్రశాంతంగా వుంది. ఇక్కడే కూర్చుందాం" అంది శాంతి చటుక్కున.
    "అవును." రాజా బలమిచ్చాడు.
    "ఇద్దరూ చిత్రకారులే మరి!" అని హాస్యం చేసింది పద్మ.
    "మీరేమేం చిత్రాలు వేస్తారు? తరుచూ వేస్తూంటారా?" కుతూహలంగా ప్రశ్నించింది శాంతి, రాజాను.
    "ఏమో! మాయింటి కొచ్చినపుడు చూద్ధురు గాని." గంభీరంగా అని ముఖం ప్రక్కకు త్రిప్పి నవ్వుకున్నాడు రాజా.
    శాంతి చిత్రాల విషయంలో శ్రీహరి మాట లను పురస్కరించుకొనే అతడావిధంగా అన్నాడని గ్రహించిన శాంతీ, పద్మా నవ్వుకున్నాడు.
    "అలాగే కాని, నీ పెళ్లెప్పుడైందిరా? ఆవిడ దేవూరు? చదువుకుందా? పెళ్ళికి నన్ను పిలవలేదేం?" శ్రీహరి అడిగాడు.
    "ఏమో ఆవిడనే అడుగుదురుగాని రేపు. నా భార్యగురించి నేను చెప్పితే అతిశయోక్తిగా వుంటుంది."
    శ్రీహరి స్నేహితుని బలంగా ఒక్క గ్రుద్దు వేశాడు. "పెద్దవాడనైనా, ఉద్యోగం చేస్తున్నా, నీ కొంటెగుణాలు పోలేదురా." ఈసారి అంతా నవ్వేశారు.
    మర్నాడు ఉదయం వదిన లేపగా లేపగా బద్ధకంగా, బలవంతంగా నిద్ర లేచింది శాంతి. "ఓప్రక్క మీ అన్నయ్య అక్కడికి వెళ్ళాలని తొందరపడి పోతుంటే నువ్వింకా ముసుగుదన్ని నిద్రపోతూంటివి. రాత్రంతా అందరూ నిద్రపోతూంటే బొమ్మలు, తిమ్మలు గియ్యడం, నగలు ప్రొద్ధెక్కేవరకూ నిద్రా! బాగుంది వరుస!"
    ముఖం కడుక్కోవడానికి వెళ్ళుతున్న శాంతి ఆగి నిశ్శబ్దంగా వదిన కళ్ళలోకి చూసింది. "ఇప్పుడు అన్నయ్యను పెళ్ళాడి, నువ్వు క్రొత్తగా మా యింటికి వచ్చావుకనుక నీకు నేనూ, నా అలవాట్లూ క్రొత్తగానే వుండవచ్చు. కాని నాకు ఊహ తెలిసినప్పటినుంచీ నా అలవాట్లు అవే. మార్పులేదు."
    "మహ చక్కగా మారతావులే. పెళ్ళికానీ. మామీదే యీ సాగుబడంతా!" హేళన చేసింది పద్మ.
    "అసంభవం. నాకు పెళ్ళిమీద కోరిక లేదు, వదినా." మెల్లగా, స్పష్టంగా అంటూ కదిలిపోయింది, "అదీ చూస్తానుగా!" అని వదినచేసే సవాలు వినిపించుకోకుండా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS