అస్మదీయ జీవిత పరమార్ధమెల్ల
ఆమె పాదాలమీదనే అంకితమ్ము;
ఆమె హృదయము హృదయాన నందుకొనక
సార్ధకత లేదు నా నరజన్మమునకు.
భరతమాత ఆనందబాష్పాలలోన
నిండుజాబిల్లి పండువెన్నెలలోన
విశ్వ మానవ కల్యాణ వేదిపైన
జరిగినది మాకు గాంధర్వపరిణయమ్ము.
అస్మదారాధ్యదేవియౌ ఆమెకొఱకె
ఆమెకొఱకె మదీయ మహాతపస్య;
బుద్ధభగవాను గారాబు పుత్రి - ఆమె
నవ్యసుకుమారి "శ్రీకరుణాకుమారి".
నీ దరహాస చంద్రికలు నిండిన నా హృదయాంగణమ్ములో
లేదుగాధ తమస్సు లవలేశము, ప్రేమసుధానిధాన! నే
డీ దయనీయ దాసి భరియింపగలే దిక నీదు ప్రేమలో
పేదఱికమ్ము -మేను మఱపింపుము మోహన వేణుగీతికన్.
నీ యసితద్యుతుల్ కనుల నింపితి కాటుకచేసి -అల్లదే
తీయని పాటతో తలుపు తీసెను గుండెకు గున్నమావిపై
కోయిలకన్నె - నా వలపుకొండలలో కడకళ్ళనుండి వే
ఱే యమునా స్రవంతి ప్రవహించెనురా! అనురాగవార్నిధీ!
"శ్రీయుతమూర్తియై కరుణ చిందెడి చూపులతోడ స్వామి వేం
చేయును; పాదపూజ దయసేయును మా" కను సంబరాన, ఆ
ప్యాయముగా త్వదీయ పథ మారయుచున్నవి నేడు, పూచియుం
బూయని పచ్చపట్టుపరుపుల్ గొని శ్యామలశాద్వలీస్థలుల్.
నిద్దపు ముద్దుమోవి పయనించు భవన్మురళీ రవమ్ములో
నిద్దురవోయినట్లు శయనించె సమస్తము; సద్దులేని ఈ
యద్దమరేయి ఒంటిగ - రహస్యముగా - తపియించు గుండెపై
నద్దుకొనంగ వచ్చితి దయామయ! నీ చరణారుణాబ్జముల్!
ఏది మఱొక్కమాటు హృదయేశ్వర! గుండెలు పుల్కరింపగా
ఊదగదోయి! ఊదగదవోయి! సుధామయ యుష్మదీయ వే
ణూదయ రాగడోలికల నూగుచు, విస్మృతిలో విలీనమై
పోదును నాదు క్రొవ్వలపు పువ్వుల ముగ్ధ పరీమళమ్ముతో!
నీ చిఱునవ్వుపాటలు ధ్వనించెడి మామక మానసమ్ములో
లేచెనురా! ప్రఫుల్ల మురళీ రవళీ రమణీయ భావనా
వీచి - దృగంచలమ్ముల ద్రవించి స్రవించు మనోనురాగముల్
దాచుకొనంగలేని పసిదాననురా! విసిగింపబోకురా!
"ఇది యది" యంచు తేల్చి వచియింపగరాని విషాద మేదియో
హృది గదలించుచున్నది; దహింపగసాగె నిరాశ శుష్కమౌ
బ్రదుకును; స్నిగ్ధ శీతల కృపారస ధారల, దుర్దినమ్మునే
సుదినముచేయరా! యదుకిశోర! కృశాంగి ననుగ్రహింపరా!
నీరసమైన నీ ప్రణయినీ హృదయ మ్మిది చల్ల చల్లగా
నీ రసగీతిలో కరగి నీరయిపోవుచునుండె, మోహనా
కార! రవంత వచ్చి కనికారము చూపవయేని, కాల్వయై
యేరయి పొంగి పొర్లి ప్రవహింపదొ గోకుల మాకులమ్ముగన్!
ఈ కరుణామయీ హృదయమే ఒక ప్రేమ మహాసముద్రమై
లోకము నిండెరా; కడుపులో బడబాగ్నిని దాచి; కాంక్ష మ
ఱ్ఱాకయి తేలె; చక్కని దొరా! శయనింతువుగాని పొంగి వ
చ్చే కెరటాలమీద; దయసేయుము గోపకిశోరమూర్తివై.
రాధనురా ప్రభూ! నిరపరాధనురా! అనురాగ భావనా
రాధన మగ్నమానసనురా! కనరా! కరుణింపరా! మనో
వీధి పదేపదే కలకవేయుచునున్నవిరా! పురా రహో
గాథలు - ఈదలే నిక అనాధ తమోమయ కాలవాహినిన్!!
అది శరద్రాత్రి, గగన సౌధాంగణమున
దేవతాస్త్రీలు దీపాలు తీర్చినారు;
సరస రాకాసుధాకర కరములందు
కలకల మటంచు నవ్వె శృంగార సరసి.
పూచె వనలక్ష్మి; పిండారబోసినట్లు
పండువెన్నెల జగమెల్ల నిండిపోయె !
యమున శీతల సురభి తోయమున దోగి
చల్లగా - మెల్లగా - వీచె పిల్లగాలి.
ఆ మహోజ్జ్వల రజని, మోహన విహార
నవనవానంద బృందావనమ్మునందు,
అమల యమునానదీ శాద్వలములమీద
లలిత బాల రసాల పల్లవ పరీత
మధుర మంజుల మాలతీ మంటపమున
పాల ఱా తిన్నెపయి కల్వపూలతోడ
మాల గట్టుచు కూర్చున్న బాల యెవరు?
ప్రణయ మకరంద మాధురీ భరిత ముగ్ధ
లోచనమ్ములలోని యాలోచనమ్ము
లేమొ - ప్రేమ సుధారసశ్రీముఖ మగు
ఆ ముఖములోని యాకాంక్షలేమొ - త్రిజగ
తీ సముజ్జ్వల సౌందర్యతిలక మామె
ముద్దుచేతులలో ప్రేమ పుష్పమాల
అంద మెగవోయు ఏ కళానందమూర్తి
కంఠము నలంకరింప నుత్కంఠపడునొ?
"చిచ్చువలె చందురుడు పైకివచ్చినాడు!
హెచ్చరిలినాడు గాడుపుపిల్ల వాడు;
రాడు మోహనమురళీస్వరాలవాడు;
తప్ప కేతెంతు నని మాట తప్పినాడు!"
అంత కంతకు నిట్టూర్పు లతిశయించె
కొమరు చెమటలు చిగురు చెక్కుల జనించె
వదన మరచేతిలో నట్టె వ్రాలిపోయె
పడె కపోలమ్ముపై నొక్క బాష్పకణము.
అంతలోపల సుశ్యామలాంగు డొకడు
అల్లనల్లన పుడమిపై నడుగులిడుచు
వెనుకగా వచ్చి తన ముద్దువ్రేళ్ళతోడ
గట్టిగా మూసె నామె వాల్గన్నుదోయి.
కమ్మకస్తురితావులు గమ్ముమనియె
లలిత తులసీ పరీమళమ్ములు చెలంగె
తరుణి తన్మృదులాంగుళుల్ తడివి చూచి
"కృష్ణుడో, కృష్ణుడో"యంచు కేకవేసె.