Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 2


    1956 ఏప్రిల్ 26వ తేదీన పరీక్షలై బైట ప్రపంచంలోపడ్డాను. నేటిమేటి వెరైటీ గాయని రమోలా "అంజలి పిక్చర్స్"లో పాడటానికి వెళ్ళింది. అడపా దడపా రెండు మూడు పాటలు పాడేది. మాకు కొంచెం సహాయంగా వుండేది. ఇక మిగిలిందల్లా నేను. అసలే గడ్డురోజులు ధైర్యం కోల్పోయినప్పుడల్లా 'అన్నయ్యా' అంటూ చలపతిరావు గారింటికి అమ్మని తీసుకొని వెళ్ళేదాన్ని. చలపతిరావు గారి భార్య 'అన్నపూర్ణ' ఆవిడ నిజంగా అన్నపూర్ణే ఎంతో ఆప్యాయంగా ఆదరించేది. "వదినా" ఇట్టా వూరికే కూచుంటే ఎలా వదినా", అంటే "మీ అన్నయ్యకిచెప్పవే" అనేది." "అల్లరిబాజా" వచ్చిందా అనేవారు చలపతిరావుగారు." ఏం చేస్తారో నాకు తెలీదు అన్నయ్యా నాకు పని కావాలి. డబ్బు సంపాదించాలి. చచ్చేటంత బిజీగా వుండాలి. ఎంతయినా కష్టపడతానన్నా "ఏం పనమ్మాని" అడిగేరు. అదేమిటన్నయ్యా! లోయర్ నుంచి విద్వాన్ దాకా నేర్చిన సంగీతం నాలిక గీసుకోడానికా" అన్నా! అన్నయ్య నవ్వారు. నేనో పెద్ద పాటకురాల్ని కాదు. కానీ.....ఈ కోరస్ లూ, సోలోబిట్లూ పాడేవాళ్ళకేవీ తీసిపోనని అన్నయ్యకి తెలుసు. అంతకన్నా నాలో ఉత్సాహం. చురుకుదనం, పట్టుదలా చలపతిరావుగారికి బాగా నచ్చేవి.
    అలాగని సినిమా ఫీల్డులో ఎందులోనో ఒకందులో పడెయ్యడానికి వారికి ఇష్టంలేదు! కారణం గౌరవనీయమైన కుటుంబంలో పుట్టి కట్టుదిట్టాలతో పెరిగినదాన్నని కూడా బాగా తెలుసుకనక ఏవిధంగానైనా మంచిగా మా కుటుంబానికి సహాయం చెయ్యాలనుకొనేవారు. ఆ రోజు రానే వచ్చింది.
    "లక్షాధిపతి" పిక్చర్లో కోరస్ వుంది. అందులో వేస్తాను. పాడు చూద్దాం అన్నారు. ఎగిరి గంతేశాను. అంటే 1956 ఏప్రిల్ 26 న పరీక్షలయ్యాయి. 30 వ తేదీన సినీ ఫీల్డులో అడుగు పెట్టేనన్నమాట.
    రికార్డింగ్ అయిపోయింది.
    నా పాట మీద (కోరస్ అయినా) రిమార్కులు ఏవీ రాలేదు. బాగుందన్నారు. ఎందుకంటే కోరస్సే కదా అనొచ్చు. కాని చలపతిరావుగారి దగ్గర ఓకే అనిపించుకోవడం అంత సులభంకాదు. ఆయన ఒకే అన్నారంటే గవర్నమెంట్ ముద్రే. 'సినీ ఫీల్డులో "ఎవరి దగ్గరయినా పాడేయ్యొచ్చు" అన్న సర్టిఫికేట్ అన్నమాట.
    తరచుగా పాటల్లో వేసి ఎంకరేజ్ చేస్తూ డబ్బులిప్పిస్తూ మమ్మల్ని ఆదుకొనేవారు. అవకాశం దొరికితే - చిన్న చిన్న సోలోబిట్స్ కూడా పాడించేవారు. ఒక విధంగా మా కుటుంబం పట్టాల మీదకొచ్చిందని చెప్పాలి. ఏప్రిల్ నుండి ఆగస్టులోకి అడుగుపెట్టాం 1956 వ సంవత్సరం. ఆగష్టు నెల 26 వ తేదీ - ఆ రోజే శ్రీశ్రీతో నా పరిచయం.
    
                              మొదటిసారిగా శ్రీశ్రీని చూసిన వేళ

                                      
    
    ఆ రోజు ఆగష్టు 25 వ తేదీ.
    నా మనస్సేమీ బాగులేదు. ఏదో సాధించాలి సరయిన దారేదీ కనబడటంలేదు. కనబడుతున్న దారులు నచ్చటం లేదు. చలపతిరావుగారున్నారు కదా అన్న ధీమాతో లేని హుషారు తెచ్చుకుని కూర్చున్నాను.
    సాయంకాలం ఆరు గంటలైంది. చలపతిరావుగారు 26 వ తేదీ ఉదయం 7  గంటల నుండి 1 గంట వరకు వాహినీలో రికార్డింగ్ వుంది. రమ్మని కబురు చేశారు. వెంటనే అమ్మని తీసుకొని' ఆయన ఇంటికి వెళ్ళాను. "మీ అన్నయ్య రికార్డింగ్ కి వెళ్ళారు. వచ్చేదాకా వుండమన్నారే" అని వదిన చెప్పింది. అక్కడే భోజనం చేశాం.
    ఇంతలో చలపతిరావుగారొచ్చారు. "అమరదీపం" డబ్బింగ్ పిక్చర్ తీస్తున్నారని, అందులో సోలోబిట్ - నేనూ, మాధవ పెద్ది సత్యం ఒక జంటని, రాణి, పిఠాపురం నాగేశ్వర్రావు ఇంకొక జంటకి నలుగురం కలిసి పాడాలని, ఆరు నిముషాల డాన్స్ పాట అని చెప్పారు.
    నా ఆనందానికి అవధులు లేవు. అక్కడే అప్పుడే రిహార్సల్స్ ఇచ్చారు. కారులో ఇంటిదగ్గర దింపేశారు. 26వ తేదీ ఉదయం  9 గంటల దాకా కాల్ షీటని, మా పాటకాక మరోపాట కూడా జరుగుతుందని చెప్పారు.
    ఒరిజినల్ తమిళ్ పిక్చర్ అమరదీపం. దానికి చలపతిరావుగారే సంగీత దర్శకత్వం చేశారు. తెలుగు డబ్బింగ్ ఇది.
    26వ తేదీ ఉదయం 7 గంటలకి కారొచ్చింది. అమ్మని తీసుకొనివెళ్ళాను. నన్నొంటరిగా మా నాన్నగారు వెళ్ళనిచ్చేవారు కాదు. ఆయన మాటకి ఎదురు తిరగడమే! సింహం అన్నమాట! అదీగాక నాకూ ఒక్కదాన్నే వెళ్ళడం అంటే భయంతోపాటూ, ఇష్టం కూడా వుండేదికాదు.
    వాహినీ రికార్డింగ్ థియేటర్ కిటకిటలాడుతోంది. నా గుండె దడదడలాడుతోంది. ఒక పక్క భవిష్యత్తు మీద ఆశ. రెండో పక్క సోలో ఎలా పాడతానోనన్న భయం. ఈ రాణి, మాధవపెద్ది, పిఠాపురం ఎవరూ నాకు తెలీదు.
    మా పాట 2 గంటలకి వచ్చింది. 4 గంటలకి ఫస్ట్ బిట్ అయ్యింది. "ఓకే అన్నారు. 'అన్నయ్య! బతికేనురా' అనుకున్నాను.
    "సెకండ్ బిట్" మంచి ఉత్సాహంగా వుంది నాకు. రడీ - మానిటర్ అన్నారు మాధవ పెద్ది. మంచి కోపరేషన్. అతనే 'నువ్వెవరమ్మాయని' అడిగితే చెప్పాను.
    "బాగా పాడుతున్నావు. భయపడకు ఇంకా బాగా పాడు" అన్నారు. "థాంక్స్" అన్నా.
    నా వంతు వచ్చింది. "సోలో బిట్ పాడండి" అన్నారు.
    నేను సోలో బిట్టు పాడుతున్నాను.
    "మరొకసారి" అన్నారు. పాడేను.
    "క్లీర్ గా మరోసారి పాడమ్మాయి" అన్నారు. పాడేను.
    "అహః సరిగ్గా లేదండీ చలపతిరావు గారు" అన్నారు.
    నాకు నిజంగానే దడ పుట్టింది. తప్పేమిటో అర్ధంకావడం లేదు. అడగడానికి కొత్త ధైర్యం చాలటంలేదు. 'చచ్చాన్రా' అనుకున్నాను.
    కాగితం తీసి మళ్ళీ బాగా చదువుకున్నాను. అందులో 'సరిగా తలకై ఆడిస్తాడూ' అనే లైను పాడుతున్నాను. అది 'తలకాయ్' అని పాడాలి. నా తప్పు నాకే తెలియడం లేదు. 'తలకై, తలకై' అని పాడేస్తున్నాను. "కట్ కట్" అని అరుస్తున్నారు. లోపల్నుండి "తలకాయ్ తలకాయని పాడాలి" అంటున్నారు. నాకు మాత్రం 'కై' అనే వస్తోంది.
    ఇంతలో లోపల్నుండి మాసిపోయిన షరాయి లాల్చీ, కొద్ధిగా పెరిగిన గడ్డం స్నానంచేసి బహుశా 2,3 రోజులైనా అయివుంటుంది. ఎడంచేత్తో సిగరెట్ దమ్ముకొడుతూ- కుడిచేయి ఆడించేసుకుంటూ ఒకాయన నా దగ్గరికి వచ్చారు.....
    చూడగానే - 'ఎవరబ్బా ఈయన' అనుకున్నాను. నన్ను చూస్తూనే "నువ్వు తెలుగుపిల్లవా, అరవదానివా" అని అడిగారు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS