Previous Page Next Page 
సౌజన్యసాహితి పేజి 2


     "శాంతీ!  సురేష్ ని పోయి నాలుగు పొడుగు కవర్లూ ఒక ఉత్త కవరూ, స్టాంపులూ అవీ అన్నీ  తెమ్మనవూ?"
     "ఎందుకండీ! దొరగారూ! ఎవరికీ ఉత్తరాలు రాస్తారేమ్.....?" కొంటెపిల్ల శాంతి. రోజూ మామూలే  అయినా ఆశగా అడుగుతుంది.
     "చెబుతాగా .... మీ ఆయన్ని వెతకాలి. త్వరగా రాఫో."
    "ఛీ! ఫో! నే చెప్పను...... ముందివాళ వచ్చిన ఉత్తరాలు చూపించు....."
    పిచ్చిపిల్ల దీనికి మాధవి రాసే ఉత్తరాల్లో ప్రేమ వుంటుందని నమ్మకం. అనుమానం.  కాని మాధవికి పెళ్లయి పోయిందని మొగుడికి ఉద్యోగం కూడా ఐపోయిందనీ తెలియదు అన్నయ్యలంటే  నవమన్మధులనో గోపీలోలురనో అనుకునే  చెల్లెమ్మల్లో మా శాంతిది ఫస్టుమార్కు.
    ఉత్తరాలు బల్లమీద పడేసి కుర్చీలో కూలబడి బల్ల మీద కాళ్లు  పారేశాను.
     శాంతి నవ్వుతూ "ఐతే దాచుకో" మని వెళ్లిపోయింది. ఆడపిల్ల కదా! బల్లమీద పడేసి  చూసుకోమంటే దాచుకోమంది. దాచుకుంటే చూస్తానని రక్కుతుంది.
     తొలి వుత్తరం చింపేను. "నీతో గడిపిన రోజులు ఎలా మరచిపోను డియర్!......" నవ్వొచ్చింది. నాకు.... మా శంకరం .... యీ రూర్కెలాలో  ఉద్యోగం అయింది వీడికి. అయినా విచారిస్తున్నాట్ట! నాకే ఆ ఉద్యోగం అయితే వీణ్ణి వీడితో గడిపిన రోజులూ కూడా కలిపి మర్చిపోదును.... ఏమో..... కాని వాడురాసిన ఉత్తరం అంతా చదివేసరికి నిజమే. "వీడు నన్ను యెంతో ప్రేమించాడు" అనుకున్నాను. దూరాభారం కూడానా?..... రైలుకి వెళ్ళి చూడాలి. రూర్కెలా వెళ్లిపోతున్నవాణ్ణి ధైర్యం చెప్పి పంపాలి. "అది నా తక్షణ కర్తవ్యం " -
    "ఇదుగో కవర్లు... త్వరగా స్నానానికి రమ్మని పెద్దక్కయ్య  చెప్పింది." సురేష్ వచ్చాడు  - వాడెప్పుడు పరిగెడుతూనే వస్తాడు - నడక అలవాటులేదు.
    "చేస్తానుగాని, అమ్మావాళ్లూ ఏం చేస్తున్నార్రా?" అని అడిగాను.  ఇంకా మా శంకరం గురించే ఆలోచిస్తున్నాను.
    సురేష్ కుర్రవెధవే ఐనా అదోలా నవ్వి "నీ గురించే మాట్లాడుకుంటున్నారు" అన్నాడు.
     "చచ్చేమ్! ఉద్యోగం. సద్యోగం లేదని కాదుగదా?" సరిగా అటెంషన్ లో కూచున్నాను.
     "ఉహూ... మామయ్య వచ్చారుగా! బ్రహ్మచారి ముదిరినా, బెండకాయ ముదిర్నా...... అని...." అంటూ వాడు చేతి కందకండా తుర్రుమన్నాడు.
    'హే భగవాన్! మావయ్యల నెందుకురా పుట్టించావ్' తల తాటించి కుర్చీలో వెనక్కి చేరబడిపోయాను. నేను ఆటలాడుతున్నా నంటాడు అతగాడు పైగా నా ఆటకట్టిస్తా నంటాడు - దుంపతెగ.. .ఇంత పిసరు సానుభూతి లేదు. పైగా 'మా రోజుల్లో ఇంకా తిప్పలు పడ్డాం..... పెద్దవాళ్ళ కాళ్లుపట్టి  వీపుగోకి బ్రతికి బాగుపడ్డాం..... ఢక్కా మొక్కీలు తినాలిరా..... ఓ కాయితంముక్క తేడం.... దానికి ఫ్రేము బిగించడం ఆనక 'డిగ్రీ' అంటూ పెద్ద కబుర్లూ! అయితే, ఇంతవాళ్ళ మవుదుమురా' అంటాడు. ఆ కాయితం ముక్కకై ఎన్ని అహర్నిశలు అఘోరించామో తెలీదుకదా ఆయనకి! ఉత్త పాతకాలం మనిషి మరి ఏం చేస్తాం!
    ఎక్కడో "సమ్మంధాలున్నాయంటాడు." "ఎవడ్నో పట్టుకుంటే ఉద్యోగం వస్తుందంటాడు." దగాగోర్ బడాయి కోర్ మామయ్య.
     'హతవిధీ! నాకు పెళ్ళాం అవసరమో కాదో నాకు తెలియదా? ఇంత నమ్మకం నామీదనున్నదే వీళ్లకీ ఏం చేయాలి? ఆ పిల్లదెవరో దానిక్కూడా ఈ నమ్మకం నామీద నుండొద్దా? దానికి ఆలోచనలే వుండరాదు కాబోలు!! ఈ మాటే బయటికన్నానో, బాబోయ్? ఒక్కసారి కంచుగంటల్లాంటి మూడు కంఠాలు నామీద దాడిచేస్తాయ్! మామయ్య క్రౌర్యం దీనికి గుణక మవుతుంది. ఉద్యోగం ఐతే గాని పెళ్లియేమిటీ? అంటేచాలు.
     'మీ ఆవిణ్ని ఒంటి స్తంభం మేడలో కూచోబెట్టి పారాయిస్తో వుంటావా? లేక కృష్ణపరమాత్మలా పాదతాడస చేయించుకుంటావా?' అంటుంది కొంటెగా అక్కయ్య.
     బావ ఏం చేస్తాడో మనకి తెలియదుమరి. పోన్లే  పెద్దదాని రహస్యాలు మనకెందుకని గాని లేకపోతేనా?......
    అంతలో:అమ్మ నా అభ్యుదయ భావాలన్నీ 'నేరాలు' క్రిందే జమ కడుతుంది.
     'నీకు ఉద్యోగం వచ్చేకా పెళ్ళాం కావాలా? అంటే ఉద్యోగం, పెళ్ళి, రెండూ చంక నెత్తుకుని నువ్వు చక్కా పోతానంటావ్? అంతేనా?  చూశావురా అన్నయ్యా! వీడితంతు ఇక నాకు వీడు 'ఆలి' వచ్చాకా కూడేం పెడతాడ్రా' అని వాళ్ళన్నయ్యకి (పైన నేను మనవిచేసిన విలన్ కి) పిర్యాదు కూడా చేస్తుంది వెర్రిబాగుల అమ్మ
    అమ్మకి వాళ్ళన్నయ్య మాటపదహారు వన్నెల బంగారం -
    ఆ మామయ్య వెంటనే 'అంతవాడే వీడు' అంటూ అందుకుంటాడు - పైగా 'ఆ మూడు ముళ్లూ వేశాకగాని వీడికి ఉద్యోగం రానివ్వకూడదు - అలా ఐతేనేగాని వీడి ఆటలు కట్టవ్' అంటాడు కూడాను.
    నా అభ్యుదయ భావాల మీద అమ్మకు కలిగే అపోహలను తొలగించడం బ్రహ్మతరం కూడా కాదు. ఈ ఒక్క మామయ్యకు తప్ప - ఈ ఆడ అమ్మలు, అక్కలు, చెల్లెలూ మొదలైన వాళ్లతో వాదించగల తర్కజ్ఞానం గాని వాదనా పటిమగాని ఏ టెక్ట్సు పుస్తకంలోనేగా రాసినా బాగుణ్ణు! మొత్తానికి నా నోరు కట్టుబడిపోయిన గంటదాకా వాళ్ళంతా నామీద దండయాత్రను ఉపసంహరించుకోరు.
    పేపర్లో 'వాటెండ్ కాలమ్స్' చూస్తూ చూస్తూ ప్రాణం విసిగి 'మాట్రి మోనియిల్' కాలమ్స  కేసి కన్ను తిప్పుతానో లేదా, కాలేజీలో ఇంటర్ మీడియట్ వెలగబెట్టిన నేరాన, ఇట్టే పసిగట్టేస్తుంది ఆ విషయం చెల్లి.
    'ఒరే! దాచినా దాగదురా.... నీ కెందుకురా ఆశ్రమ? రంభలాంటి పెళ్ళాన్ని....' అంటుందది. దాని మాటలను సగం లోనే అందుకుంటాడు మావయ్య.... "వాళ్ల నాన్న అనగా'రంభ' నాన్న వేయించే ఉద్యోగాన్ని  కూడా తెస్తాం" అంటూ పూర్తి చేస్తాడు.
    'మీకు జీవితమంటే ఆటగా వుందన్న మాట?' నేను అభిమన్యుడంత కోపం ప్రదర్శిస్తాను.
     అంతా నవ్వేస్తారు.
     'మాకు కాదు జీవితం అంటే ఆటగా వుంటే - అది నీకే.... .అది కట్టించాలనే వెళ్లారు మీ నాన్నగారు' అంతా ఏకగ్రీవ తీర్మానం చేస్తారు.
     'నేను... నేను.. పార్వతీశంగారి ఇంటికి వెళ్తాను. చదరంగం "ఆడుకుందికి"
    లేచి వెనుదిరగకుండా వెళ్ళిపోతున్నాను - ఆడియన్స్ అల్లరి ప్రారంభిస్తే స్టేజిమీదనించి వింగ్ లోకి పారిపోయే నటులాగ!
    గుమ్మంలో అసలు సూత్రధారి ప్రత్యక్షం.
    'ఏరాఁ.... విశ్వం! వుండు నీతో మాట్లాడాలి' అంటూ నాన్న ఎదురయ్యాడు.
    తిరిగి మేకపిల్లలా వచ్చి కుర్చీలో కూలబడ్డాడు.
    'కాయా? పండా?' నాన్న అంటే బొత్తుగా (అయిన బొద్దు మీసాలంటే కూడా) భయంలేని అమ్మ ప్రశ్న?
    'పండున్నరా' నాన్న జవాబు.
    'ఆటకట్టు' విలన్ మావయ్య ఆనందం. చివరికి కథ అంతా టూకీగా ఏమిటయ్యా? అంటే..... 'తాంబూలాలు పుచ్చుకుంటే నేను కోరిన ఉద్యోగం ఆనక కన్యాదానం చేస్తాట్ట ఓ మోతుబరిగారు. పేరెందుకు లెండి పెద్దమనిషిగదా.....'
    పార్వతీశంగారితో  చదరంగం ఆడుతున్నాను. ఐనా మూడేళ్ళ క్రితం జూలైలోనే, పదిహేనో తేదీనాడు రాత్రి అవతల వానకురుస్తో వుంటే కిటికీలోనించి  మీదపడే 'జల్లు' ననుభవిస్తో డైరీలో రాసుకున్న  మాటలు.... 'నేను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాను... అదీ ఉద్యోగం వచ్చాకా పెళ్ళి చేసుకుంటాను...... దమ్మిడీ కట్నం అడగను' అని రాసిన కవిత్వమే జ్ఞాపకం వస్తోంది నాకు.
    'ఇదుగో నా గుర్రం గెంతింది.... నీ ఆట కట్టు!' పార్వతీశంగారికి, ఛెస్సాటలో గెలిస్తే హిట్లరంత శరీరమై పోతుంది!
    'ఆటకట్టు!' అన్నమాట ఫెడీలుమని తగిలింది నా కర్ణపుటాలకు.
    'విలన్ మామయ్య ప్రవేశించాడుగా లేకపోతే ప్రేమించే పెళ్లి చేసుకుందును' అన్నాను పిక్కలు కలిపేస్తూ నేను.
     'ఇంకా చెప్పావుకాదు....? ఉద్యోగం ఇచ్చే మామగారేనా? ...అంటూ పార్వతీశంగారు తనకే మరో పెళ్ళి కాబోతున్నంత సంతోషంగా నా వీపుమీద 'ఛెళ్లు' న ఒక్కచరుపు చరిచాడు -
    ' అది సంగతి ..అందు కే అబ్బాయిగారి ఆటగట్టింది.' అన్నాడు మళ్ళీ పరమ రహస్యం కనిపెట్టినట్లు.
                                                                      *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS