"ఇది నా గది. అంటే నేను వుండే గది కాదు. తోచనప్పుడల్లా ఈ గదిలో కూర్చుని ఒక్కన్నే ఆడుకుంటూ వుంటాను. అన్నట్టూ మీకు కొరియన్ చెక్కర్ వచ్చా?"
అతడు అర్ధంకానట్టు బ్రహ్మానంద వేపు చూశాడు. అక్కడి నుండి దృష్టి మరల్చి బల్లవైపు చూశాడు. బల్లమీద నక్షత్రం ఆకారంలో చైనీస్ చెక్కర్ బోర్డు. దానికి గుచ్చబడి పావులూ వున్నాయి.
బ్రహ్మానంద ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంటూ- "దానికీ దీనికీ పెద్ద తేడా లేదు. దాంట్లో మన పావులన్నీ అవతల వారి గళ్ళలోకి చేరాలి. దీంట్లో అలాకాదు. కింగ్ పిన్ (రాజు) అవతలి శిఖరాగ్రం చేరుకుంటే చాలు. ఒక ఆట ఆడదామా?"
"ఇప్పుడా?"
"బైట వర్షం వచ్చేటట్టు వుంది. తగ్గాక వెళుదురుగాని".
అతడు తిరిగి బల్లమీదకు చూశాడు. మిగతా చిన్న చిన్న పావులకి విరుద్దంగా కింగ్ పిన్ పావు ఎత్తుగా లావుగా వుంది. అతడికి వర్షం తగ్గేవరకూ ఏం చెయ్యాలో తోచలేదు. ఎదుటి కుర్చీలో కూర్చున్నాడు.
"మొదలు పెడదామా?"
"సరే!"
బ్రహ్మానంద- "ఒక్కో మనిషికీ ఒక్కో వ్యసనం వుంటుంది. కొంతమందికి సిగరెట్టు... కొంతమందికి భజన చెయ్యటం .... ఇలా .... నాకున్న వ్యసనం ఇదొక్కటే. కానీ మిగతా వాటితో పోలిస్తే ఇది ఆరోగ్యకరమైన అలవాటు. మెదడుకు పదును పెడుతుంది. ఇదే లేకపోతే, మనుష్యులకి దూరంగా ఇలా బ్రతకటం కష్టమయ్యేది అనుకుంటాను. రెండువైపుల ఎత్తులు వేసుకుంటూ ఒక్కన్నే ఆడుకుంటూ పోతూ వుంటే ఎంతకాలం గడిచిందీ తెలీదు. ఆటకేముంది. ముందు పళ్ళు స్వీకరించండి" అంటూ పళ్ళెం అతడి వైపుకి తోశాడు.
అతడు ఒక పిన్ ముందుకు జరుపుతూ, "ఒక్కళ్ళే ఆడుకోవటానికి అంత తెలివితేటలు అవసరం లేదనుకుంటానే!" అన్నాడు.
బ్రహ్మానంద వెనక పిన్ ని ముందుదాని మీదనించి గెంతించి అవతలిగదిలో పెడుతూ నవ్వాడు. "పైకి అలా కనిపిస్తుంది. పైకి మామూలుగా కనిపించే వాళ్ళందరూ తెలివితక్కువ వాళ్ళు అనుకోవటం ఎంత తెలివితక్కువో - పైకి మామూలుగా కనిపించే ఈ ఆట అంత తెలివి తక్కువది అనుకోటం కూడా తెలివి తక్కువే. నేనూ మొదట్లో మామూలుగానే అనుకునేవాడిని, కానీ నేను ఒక్కన్నే కూర్చుని ఆడుతున్న కొద్దీ గొప్ప గొప్ప విషయాలు బయటపడేవి. ఒక్క చిన్న పావే ఎంతో పెద్ద కింగ్ పిన్ ని చాలా ఇబ్బంది పెడుతుంది." అంటూ అడ్డుగా వున్న ఇంకొక పిన్ ని కూడా కదిపాడు. దాంతో కింగ్ పిన్ ముందు నిచ్చెన మెట్లలాగా ఖాళీలు ఏర్పడ్డాయి. తర్వాత ఎత్తులో ఒక గెంతుతో అతడి పిన్ ప్రత్యర్ధి దుర్గంలోకి వెళ్ళిపోయేలా కనిపించింది.
అంతలో పెద్ద ఉరుముతో బైట వర్షం మొదలైంది మళ్ళీ.
"ఆంజనేయులూ, సౌదామిని బాగా ఆడతారు. కానీ నాతో సమానంగా అడగలిగేది సౌదామిని ఒక్కతే! అన్నట్టూ ఇలా ఆశ్రమానికి గ్రాంటు శాంక్షన్ చేసేదీ, ఇచ్చేదీ ప్రభుత్వంలో ఏ డిపార్టుమెంటు? ఎండోమెంట్సా? లేక రెవెన్యూనా?"
"కాదు. దీనికి వేరేగా మరో డిపార్ట్ మెంటు వుంది" అంటూ తర్వాత ఎత్తు ఏమెయ్యాలా అని ఆలోచించబోయాడు. ఈ లోపులో పెద్దగా అరుస్తూ, చిలుక లోపలికి వచ్చి పంజరంలోకి చేరింది. ఉన్నట్టుండి అది అరిచే అరుపు ఆ గోడలమధ్య వికృతంగా ప్రతి ధ్వనించి ఏకాగ్రతను చెడగొడుతోంది. ఆ హడావిడిలో అనాలోచితంగా మరో పావును ముందుకు కదిపాడు.
అతడు కదపడం అయిపోయి, బ్రహ్మానంద వంతు రాగానే ఎవరో మంత్రించినట్టు చిలుక అరవటం మానేసింది.
"సాధారణంగా ఎంత గ్రాంటు ఇస్తారు?"
ఆ వ్యక్తి తడబడి, "నెలకి పదినుండి పదిహేను వేల వరకూ" అన్నాడు.
"అబ్బో అంతా! నెలకి రెండు మూడు వేలకన్నా ఎక్కువ వుండదనుకున్నానే."
"ఏమో! నాకంత తెలియదు. నేను మరో శాఖనుండి ఈ డిపార్ట్ మెంటుకి కొత్తగా వచ్చాను."
బ్రహ్మానంద తన కింగ్ పిన్ ని తీసి ప్రక్కరంధ్రంలో పెడుతూ, "అంతకుముందు మీరు ఏ శాఖలో పనిచేసేవారు?" అని అడిగాడు.
"న్యాయశాఖ".
"ఇలా మీరు పరీక్షకి వచ్చినపుడు ఇక్కడ మనుషుల "అవకతవకల్ని" బాగా లోతుగా పరిశీలిస్తారనుకుంటా కదూ" అని, అతడు చప్పున తలెత్తడంతో నవ్వి"..... నా ఉద్దేశం గ్రాంటులు ఇవ్వాలా? వద్దా అని...." అంటూ పూర్తిచేశాడు.
అతడూ తేలిగ్గా నవ్వేస్తూ "అంతే అంతే" అన్నాడు.
"చూశారు గదా! ఏమిటి అభిప్రాయం?"
"చాలా చక్కగా వుంది. ఎవరి విధులు వాళ్ళు బాగా నిర్వర్తిస్తున్నారు. చివరికి చిలుకా, లేడిపిల్లా కూడా" అతడి కంఠంలో నవ్వు ధ్వనించింది.
"అయితే మేం అడిగితే గ్రాంటు వచ్చేదే అంటారు."
"తప్పకుండా! మీరు అడిగినా అడక్కపోయినా నేనైతే రిపోర్టు పంపించాలి కదా! మీకూ ఒక కాపీ అందజేస్తాను చదువుకుందురుగాని, అదేమిటి? మీ పిన్ అలా ముందుకు జరిపారు? ఇప్పుడు ఒక్క గెంతులో నా కింగ్ మీ స్థావరాన్ని చేరుకుంటుంది గమనించారా?"
బ్రహ్మానంద నవ్వాడు. "మీరు మా అతిథి. మీరు గెలిచినా అది నా ఓటమికాదు. అదీగాక పైకి అలా కనబడిన మీరూ గొప్ప ఆటగాళ్ళే..... ఈ విషయం ముందే తెలిస్తే మీతో పోటీకి కూర్చునేవాడినే కాను...."
వచ్చిన అతిధి కొద్దిగా గర్వాన్ని చిరునవ్వుకి మిళితం చేస్తూ ఆఖరి ఎత్తు వేయటానికి తన కింగ్ పిన్ ని చేత్తో పట్టుకున్నాడు. అంతే.
"ఆccccc"
అతడి గొంతునుండి బయల్పడిన కేక సగంలోనే ఆగిపోయింది. అడుగునుండి తిమింగలం కొడితే నీళ్ళల్లోంచి ఉవ్వెత్తున పైకి లేచిన పడవలా అతడా కుర్చీలోంచి గాలిలోకి లేస్తూ వికృతంగా అరిచాడు. గాలిలో అతడి శరీరం పాములా మెలికలు తిరిగి దబ్బుమన్న శబ్దంతో నేలమీద పడింది. హైపవర్ కరెంటు అతడి శరీరంలోంచి ప్రవహించడం వల్ల అతడి వెంట్రుకలు కాలిపోయాయి. పెదాలు నల్లగా మారిపోయాయి. మాంసం ఉడికినట్టు శరీరం కమిలిపోయింది. బంతిలా ఎగిరిన శరీరం నేలమీద ఒక్కక్షణం గిలగిలా కొట్టుకొని ఆగిపోయింది.
ఇంత జరుగుతున్నా ఇదంతా మామూలే అన్నట్టు ఎదురు కుర్చీలోంచి బ్రహ్మానంద కదల్లేదు. పడిపోయిన వాడిని చాలాసేపు అలాగే చూస్తూ వుండిపోయాడు. తరువాత నెమ్మదిగా నవ్వేడు. వంగి టేబుల్ అడుగున వున్న ప్లగ్ తీసేసి అతడు పట్టుకున్న కింగ్ పిన్ ని రంధ్రంలోంచి బైటకి లాగి, వైరుని యధాస్థానంలోకి తోసేశాడు.
పైకి అమాయకంగా కనబడుతుంది .... కొరియన్ చెక్కర్.
.... అప్పుడే వర్షం వెలిసింది. సన్నటి తుంపర్లు మాత్రం ఇంకా పడుతూనే వున్నాయి. కోట బురుజులాంటి గోడ ప్రక్కనున్న రోడ్డుమీద ఓ పదిమంది గుమిగూడి వున్నారు.
రోడ్డు ప్రక్కన ఒక వ్యక్తి చచ్చిపడి వున్నాడు. వర్షంవల్ల ఆ శవం బట్టలు శరీరానికి అతుక్కుపోయి వున్నాయి. వాటినుంచి నీళ్ళు క్రిందకి కారుతున్నాయి. అతడి ప్రాణంపోయి ఎంతోకాలం కాలేదు. ఉధృతంగా కురిసిన వర్షానికి తెగిన ఎలక్ట్రిక్ తీగ అతడిమీద పడి వుంది.
"ఎవరో పాపం షాక్ కొట్టిపడిపోయాడు" అంటున్నాడు- అక్కడ చేరిన వాళ్ళల్లో ఒకడు!
అంతలో బ్రహ్మానంద అక్కడికి చేరుకున్నాడు. అతణ్ణి గుర్తించిన వాళ్ళు నమ్రతగా తొలగి నిలబడ్డారు.
"ఎవరీ అభాగ్యుడు?" అని అక్కడ వారిని ఉద్దేశించి అడిగాడు.
"పడిపోయి వుండటంచూసి బతికున్నాడేమోనని కదిపాం. అప్పటికే చచ్చిపోయి చాలాసేపు అయిందనుకుంటాను. జేబులు వెతికితే చిన్న కార్డు దొరికింది."
"ఏం కార్డు?"
"పోలీస్ డిపార్ట్ మెంట్."
పోలీసు జీపు దగ్గరైంది. "వర్షం కురిసినప్పుడు కరెంటు స్తంభం ప్రక్కనుండి నడవకూడదని తెలీదు కాబోలు" అంటూ బ్రహ్మానంద వంగాడు. అతడి జేబులోంచి సిగరెట్టు లైటర్ తీసి పరీక్షించినట్లు చూసి మరుక్షణం మళ్ళీ పెట్టేశాడు. జీపు ఆగుతూ వుండగా గుంపులోంచి బైటపడి కోటవైపు నడిచాడు.
శవం జేబులోంచి సిగరెట్ లైటర్ తీసి పెట్టేస్తున్న కొద్ది క్షణాల్లో అతడి కళ్ళు కెమెరా ఫిల్ముకన్నా వేగంగా కదలడం అక్కడ ఎవరూ గమనించలేకపోయారు.
* * *
ఆంజనేయులు బ్రహ్మానంద వున్న గదిలోకి ప్రవేశించాడు. అతడి చేతిలో పది పన్నెండు ఫోటోలున్నాయ్.
చనిపోయిన వ్యక్తి జేబులోంచి తీసిన సిగరెట్ లైటర్ కెమెరాలో ఉన్న రీలు తాలూకు ఫోటోలు అవి.
"ఏం, నా అనుమానం కరక్టేనా?" అడిగాడు బ్రహ్మానంద.
"కరెక్టే" అంటూ ఆంజనేయులు ఒక ఫోటో అందించాడు. లేడికాలుని బ్రహ్మానంద కట్టుదగ్గర సరిచేస్తున్న దృశ్యం అది ఫోటో వెనక్కి అందిస్తూ "రాంప్రసాద్ ని పిలువు" అన్నాడు.
ఆంజనేయులు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి రాంప్రసాద్ వచ్చాడు. పానకం అందించిన కుర్రాడు అతడు. అయితే అప్పటిలా నిక్కరుమీద లేడు. ఫాంటుతో ఉన్నాడు.
"రావోయి! రా! అంతా సరిగ్గా సరిపోయిందా?"
"సరిపోయింది సార్? అంతా మీరు చెప్పినట్టే చేశాను. శవాన్ని పడేయటం..... కత్తిరించిన వైరు పడేట్టు చూడడం.....సిగరెట్టు లైటర్ లో ఫిల్ము తీసి ఆంజనేయులుగారికి అందించటం....అంతా అనుకున్నట్టే జరిగింది."
"రాంప్రసాద్ నీ వయసెంతోయ్?"
"ఇరవై రెండు సార్!"
'ఎంతకాలం అయ్యింది నువ్విక్కడ చేరి?"
"పన్నెండేళ్ళు."
"జీతం ఎంత వస్తుందోయ్?"
అకస్మాత్తుగా అతడి మొహంలో నవ్వు మాయమైంది.
"రెం...." అతడి మాట పూర్తికాలేదు. దాన్ని కట్ చేస్తూ బ్రహ్మానంద అన్నాడు.
".... ఆపైన చేసిన ప్రతీ పనికి బక్షీస్ మామూళ్ళు! .... అవునా? ఇది కాక ఏదైనా రవాణా చేస్తే అందులో కమీషను. మొత్తం అంతా కలిపి నాలుగైదు వేలదాకా వుండొచ్చు. అంటే ఒక ఐ.ఏ.యస్. ఆఫీసర్ క్కూడా రానంత డబ్బు!!!నువ్విక్కడ పనికుర్రాడిగా చేరినప్పుడు నీ జీతమెంతోయ్? నూట ఇరవై కదూ! హ్హె హ్హె పది పన్నెండు సంవత్సరాల్లో నలభై రెట్లు పెరిగింది. కేవలం నీ స్వయంకృషివల్లే పెరిగింది. కంగ్రాచ్యులేషన్స్."
"థా... థాంక్యూ సార్!"
"రాంప్రసాద్! నీ వయస్సులో నేను టీ కప్పులు కడిగాను. రాత్రిళ్ళు వీధి అరుగుల మీద పడుకున్నాను. చలికి వణికాను. వర్షంలో తడిశాను. అన్నట్టు నీకన్నా నేను తెలివైన వాడినేనా?"
