Previous Page Next Page 
అర్దరాత్రి ఆడపడుచులు పేజి 18


    ఆగిపోయింది సృజన. ఆమెకి గుర్తువచ్చింది, నిన్న ఉస్మాన్ తననిచిత్రహింసపెట్టబోతుంటే అహల్య చివరిక్షణంలో వచ్చి కాపాడడం.
    తనకి మేలు చేసినవాళ్ళపట్ల కృతజ్ఞత చూపించాలనీ వీలయితే తిరిగి మేలు చేయాలని ఆమెకి సంస్కారం నేర్పింది.
    నిన్న తన ప్రాణాలు కాపాడింది అహల్య. ఇప్పుడు ఆమె ప్రాణాపాయంలో ఉంది.
    ఏం చెయ్యాలి ఇప్పుడు తను? ఆమెని ఆ స్థితిలో వదిలేసి వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవడం తప్పుకాదా?
    కానీ......కానీ......వెళ్ళిపోవడం అంటే తనని ఈ చెరలోనుంచి విముక్తి.
    అహల్య కోసం తను ఆగిపోతే.....ఇంక ఆ తర్వాత బతుకంతా ఇక్కడే గడిపెయ్యవలసివస్తుందే!     అడుగుముందుకేస్తే స్వేచ్చ!
    అడుగు వెనక్కి వేస్తే జీవితాంతం నరకం?
    కానీ
    అహల్య ఈ స్థితిలో ఉన్నప్పుడు అడుగుముందుకు వేసిపారిపోవడం అన్యాయం!
    అడుగువెనక్కి వేసి ఆమెని రక్షించడం సరైనపని!
    ముందుకా?
    వెనక్కా?
    వూగిసలాడుతోంది ఆమె మనసు.
    కొద్దిక్షణాల తర్వాత ఒక నిశ్చయానికి వచ్చి ముందుకు నడిచింది సృజన.
    మళ్ళీ అహల్య మూలుగువినబడింది. ప్రాణాలకోసం పెనుగులాడుతున్నమనిషి మూలుగు అది.
    ఇంక ఆలోచించలేదు సృజన. చరచర వెనక్కి నడిచివచ్చింది అహల్య. అహల్య పక్కన కూర్చుండిపోయి, ఆమె గుండెల్లో గుచ్చుకుని ఉన్న వెండి దీపారాధన కుందిని చేత్తోపట్టుకుని లాగింది.
    ఆనకట్టకుగండిపడినట్లు ఏకధారగా కారింది రక్తం. సృజన చేతులుకూడా రక్తసిక్తాలయ్యాయి.     ఒక్కసారి గజగజ వణికింది అహల్య. దుర్భరమైన బాధతో మూలుగువెలువడింది ఆమె గొంతులోనుంచి.
    తర్వాత నిశ్చలంగా అయిపోయింది అహల్య శరీరం.
    అదిచూసి భయకంపితురాలయిపోయింది సృజన.
    టకటకబూట్లశబ్దం వినబడింది. విహ్వలంగా తలఎత్తి చూసింది సృజన.
    కానిస్టేబుల్ కిష్ణయ్య నిలబడి ఉన్నాడు అక్కడ. అతను సృజన చేతిలోని దీపారాధన కుందివైపు, నేలమీద పడిఉన్న అహల్యవైపు మార్చి మార్చి చూస్తున్నాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో విప్పారి ఉన్నాయి.
    "నీయమ్మ కడుపుకాల! అహల్యని చంపేశావా?" అన్నాడు కొద్దిగా తేరుకున్న తర్వాత.
    "నేను.....నేను...." అని ఏదో చెప్పబోయింది.
    "నేనేచేశానంటావా? కనబడుతూనే ఉందిగా ఇంక నీకు నా చేతిలో మూడింది చూస్కో!"
    "నేను.....నేను.....చంపలేదు"
    "మరి? తనంతట తనే పొడుచుకు చచ్చిపోయిందా ఏమిటి?"
    "అతను.....చిన్నారావు.....చంపాడు"
    "ఏడీ చిన్నారావు?"
    "పారిపోయాడు"
    "మరినువ్వెందుకు పారిపోలేదూ?"
    "ఈమెపడిపోతే సాయం చెయ్యాలని వెనక్కి వచ్చాను"
    అంతకంటే పెద్ద అబద్దం తన జీవితంలో విని ఉండనట్లు మొహం పెట్టాడు కిష్ణయ్య.
    "ఏంటి? ఈవిడ పడిపోతే నువ్వు రక్షించడానికి తిరిగి వచ్చావా? సినిమాలు కతలు చెప్తున్నావా ఏంటి?"
    "నిజంగానే! రాత్రి అతనెవరోనన్ను చిత్రహింసపెట్టబోతుంటే ఈమె అడ్డం వచ్చింది కదా!
    అందుకని....."
    "అందుకని సినిమాల్లోలాగా కృతజ్ఞత భరించలేక తిరిగివచ్చావా? ఎవరునమ్ముతాడే నీదొంగ బాడఖావ్ కతలు! లే! లేముందు!"
    "నేను నిజమే.....చెబుతున్నాను" అని వాక్యం పూర్తిచెయ్యనేలేదు సృజన.
    సాచిచెంపమీద బలంగా కొట్టాడు కిష్ణయ్య. ఆ దెబ్బకు ఆమె పళ్ళన్నీ కదిలినట్లయింది పెదిమచిట్లిరక్తం కారడం మొదలెట్టింది.
    "లే!" అన్నాడు కిష్ణయ్య మోటుగా ఆమె రెక్కపట్టుకు లేవదీస్తూ.
    "ఎక్కడికి?" అంది సృజన ఏడ్చేస్తూ.
    "ఎదురుప్రశ్న లేశావంటే ఎముక లిరగ్గొడతాను నాతోరా!"
    "వద్దు! ప్లీజ్! వద్దు!"
    మరో దెబ్బ ఆమె వీపుమీద పడింది. వెన్నెముక విరిగినంత బాధ కలిగింది.
    ఆమెని బరబర ఈడ్చుకుపోవడం మొదలెట్టాడు కానిస్టేబుల్ కిష్టయ్య.
    "నన్నువదిలిపెట్టెయ్! నన్ను వదిలిపెట్టెయ్!" అంటోంది సృజన. కబేళాకు గుంజుకువెళ్ళబడుతున్న మేకపిల్లలా దీనాలాపనలు చేస్తూ విలవిల్లాడుతూ గింజుకుంటోంది తను.
    ఆగాడు కిష్ణయ్య. బలంకొద్దీమరొక దెబ్బ వేశాడు సృజన లేతశరీరం మీద. ఆ దెబ్బకుదిమ్మెర పోయినట్లు నిశ్చేష్టురాలయి ఉండిపోయింది సృజన.
    వెంటనే జేబులోనుంచి బేడీలు తీసి ఆమె సుకుమారమైన చేతులు తొడిగాడు కిష్ణయ్య.
    అప్పుడు వినబడింది రంగేలీ గొంతు.
    "అయ్యో! అయ్యో! ఎంత ఘోరం! ఎంత ఘోరం! ఎవరు చేసారు ఇంతపాపం!"
    "ఇదిగో! ఈ పాపపు ముండే" ఆనందు కిష్ణయ్య జవాబుగా.
    వాళ్ళు ఉన్న చోటికి పరిగెత్తుకు వచ్చింది రంగేలీ "ఎవరూ? ఎవరా పనిచేసింది?" అని సృజనని చూసి " నువ్వా! నీకేం పొయ్యేకాలం వచ్చిందే మాయముండా నేను వెళ్ళి చాయ్ పొడి కొనుక్కొచ్చేలోగా ఇంత ఘోరం చేసేస్తావా? ఓసి నీ బతుకు బండ అయిపోనూ!" అంది అక్కసుగా. తర్వాత మళ్ళీ అహల్యపడివున్న చోటుకిపరుగెత్తింది రంగేలీ.
    తర్వాత పెద్ద కేక వినబడింది ఆమె గొంతులో నుంచి.
    "అహల్య అక్కబతికే ఉంది కిష్ణయ్య! అయితే కొన ప్రాణం!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS