Previous Page Next Page 
మనసా....ప్రేమించకే నువ్విలా పేజి 18

    "రిలాక్స్ స్పూర్తీ....రిలాక్స్! ఎన్నిసార్లు చెప్పాను- అది నీ జీవితంలో, మన మాటల్లో రాకూడదని! నాకసలు గుర్తుండదు. నీకెందుకు గుర్తొస్తుంది?" అప్పటికీ మానలా. వెక్కి వెక్కి ఏడ్చింది.
    "నా మీద ఒట్టు...ఏడిస్తే!" లాలనగా అన్నాడు. "ఇందులో నువ్వు బాధపడాల్సిందేవీ లేదమ్మా..., నీకే తెలీదూ! తెలీనిదాన్లానే ఉండిపో! నీకేం జరగలా! నీ గురించి ఆలోచిండానికీ, నిర్ణయాలు తీసుకోవడానికీ  నేనున్నాను. నాకా అధికారం ఇస్తావా?" చుబుకం పైకెత్తి కన్నీటి కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు.
    "జీవితాంతం నా అణువణువూ అధికారం నీదే ఈష్! నేను శరీరం  మాత్రమే.... నువ్వు ప్రాణానివి!"
    "మరయితే_ శరీరానికి ప్రాణం ఆర్డర్ వేస్తోంది..... నవ్వమని! నవ్వు!" అన్నాడు అధారిటీగా. తడి తడి కళ్ళతో మంచులో తడిచిన పారిజాతంలా నవ్వింది.
    "అమ్మయ్య! నా జీవితం ధన్యం! పద... ఐస్ క్రీం తినేసి వెళ్దాం!"
    "స్పూర్తీ! నీకు నాలో ముఖ్యంగా - అంటే.... అన్నిటికంటే ముఖ్యంగా ఏఁవిష్టం?" నడుస్తూ స్పూర్తి చేయి  తన చేతిలో బిగించి పట్టుకుని అడిగాడు.
    తలవంచుకుని సరిగా, జతగా పడుతున్న ఇద్దరి పాదాల లయనూ చూస్తూ "నీ మనసు!" నిక్కచ్చిగా అంది.
    "అయితే.... దానిమీద ప్రమాణం చేసి చెప్పు- నువ్వెపుడూ నవ్వుతూ, అల్లరిగా ఉంటానని!" చేయి చాచాడు. చివ్వుక్కున తలెత్తి చూసింది. మళ్లీ కళ్ళలో నీళ్లు!
    "అదుగో...." చూపుడువేలుతో వారించాడు. తడికళ్ళతోనే నవ్వేసి-
    "ప్రమాణం! నీ  మనసు మీద నేనెప్పుడూ నవ్వుతూ, అల్లరిగా ఉంటా! ఓ.కే!" అని గుప్పెట్లో ఐస్ క్రీమ్ కోంబ్ కాలర్ లోంచి లోపలికి వేసింది. అది చల్లగా గుండెమీంచి పొట్టమీంచి జారి టాక్ లో  ఆగింది.
    చలికి చిన్నగా జంప్ చేస్తూ టక్ ఊడలాగాడు.
    చిన్నగా చప్పట్లు కొడుతూ నవ్వింది.... ఈష్ ఎగిరెగిరి పడుతుంటే!
    టక్కున ఎగరడం ఆపి ఐస్ క్రీమ్ టక్ లోంచి తీయకుండా అలాగే ఉంచేసి-
    "దట్స్ గుడ్! అలా ఉండాలి!" అని నడవసాగాడు.
    "ఏయ్ఁ... అది తీసేయ్! షర్ట్ పాడవుతుంది!" టక్ లాగబోయింది.
    "నో! అది తీసేస్తే నువ్వు  నవ్వడం మానేస్తే..?!"
    "మాననులే... తీయ్ ముందు! చలేయడంలా....?" టక్ లాగి ఐస్ క్రీమ్ తుడిచి కోంబ్ విసిరేయబోతుంటే... లాక్కుని చటుక్కున నోట్లో పెట్టుకుని తినబోయాడు.
    "నాకూ...." అని తనూ లాక్కోబోయింది.
    దొరక్కుండా కొంచెం సేపు ఆడించి సగం ఇచ్చాడు. తింటూ కిలకిలగా, గలగలగా సాగారిద్దరూ.... ఒకే బాటగా, ఒకే బాసగా!
    యువతరానికి ఎంత ఆలోచనావేగం పెరిగిందంటే.... కాలమానం కంటే వేగవంతమైన ఆలోచన విధానం! ఒక తరానికి ముందు ఉంటున్నారు వాళ్ళు. అదుకే  తమ  వెనుకతరం కంటే కూడా బలమైన ఆలోచనాపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఆచరిస్తున్నారు అనిపించింది- ఆ కలిసిన జంటను చూసిన కన్నులకు.
    చదువు అయ్యేంతవరకూ ఆగి, అయ్యాక- అమ్మానాన్నలకు పెళ్ళి సంగతి చెప్పేసి పార్ట్ టైమ్ జాబ్స్ చూసుకుని కాపురం పెట్టేయడం భవిష్యత్తుగా నిర్ణయించుకున్నారిద్దరూ! వీలయితే ఇంకా చదూకోవాలకున్నారు కూడా! అంతకుముందుగా చెప్తే వాళ్ళ తల్లిదండ్రుల ప్రవర్తన అనుకూలంగా లేనట్లయితే వాళ్ళ విమర్శలకు చదువు డిస్టర్బ్ అవుతుందని జీవితాలను చక్కగా నిర్వర్తించేసుకున్నారు ధీమాగా, ధీటుగా.
                                *    *    *
    "స్పూర్తీ. ఈష్ పెళ్ళిచేసుకున్నారు" క్రాంత్ ఇసుకను కాలితో రేపుతూ.
    "అవును.... మనమే చేశాం!" అదే ఇసుకను తొక్కిపడుతూ కామిని.
    "రేవంత్ , జ్ఞాపికా కూడా చేసుకోవాలనుకుంటున్నారు" మరో కాలితో దుమ్ము రేపుతూ.
    "అవును... మనం కూడా ఎంకరేజ్ చేస్తున్నాం!" మామూలువిషయమే అన్నట్టు!
    "క్రాంత్, కామినీ కూడా ప్రేమించుకుంటున్నారు."
    "అవునూ! మనమే ప్రేమించుకోమన్నాం...." అప్పుడు అర్థమయి చివుక్కున తలెత్తింది కామిని.
    "అవునా? మనమే  ప్రేమించుకోమన్నామా!" నాకు తెలియదే.... అన్నట్టు చూశాడు. మౌనమయి పోయింది.
    "ఏవిటి కామినీ.... మనం ప్రేమించుకోవడానికి నీకేమయినా అభ్యంతరమా?"
    "లేదు! కానీ ప్రేమించుకున్నాక..?"
    "పెళ్ళి చేసుకుంటాము."
    "మన మతాలు కూడా ఒకటి కావని గుర్తుందిగా! నువ్వు సదాచార బ్రాహ్మణ కుటుంబం! నేను కాథలిక్ క్రిష్టియన్!"
    "మనసలు మాత్రం ఒకటవ్వాలని గుర్తుంది. వాటికి మతాలు ఉండవని గుర్తుంది."
    "తరువాత వచ్చే  ప్రాబ్లమ్స్ తట్టుకుంటామా...?"
    "తరువాత వచ్చే విషయాలూ అను. ఆ విషయాలు- ప్రాబ్లమ్సా, లేక విషయాలా.... అనేది వాటిని ఎదుర్కొనే మన  మానసిక పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది!"
    "మరి, మనకా పరిపక్వత ఉందా?"
    "ఎగ్లామ్ రాసేముందు పాసయ్యే హొప్ తూనూ, కాన్ఫిడెన్స్ తోనూ రాయాలిగానీ- అనుమానంతో, పిరికితనంతో కాదు. అలా అయితే అది నెగెటివ్ థింకింగ్ అవుతుంది."
    "కానీ, ఇది ఎగ్జామ్ కాదు- ఒకసారి ఫెయిలయితే మళ్లీ రాసుకోవడానికి! జీవితం!!"
    "అందుకే ఇంకా కాన్ఫిడెన్స్ తో మొదలెట్టాలి. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. నీకుందా?"
    "నువ్వు కావాలంటే నేను పెంచుకోవాలి."
    "నన్ను కావాలనుకోవడం లేదా? లేకపోతే చెప్పెయ్ఁ నేనేమీ హార్ట్ అవను. జీవితంలో ఒక ఆశ ఆర్పేసుకుంటాను."
    "మాటలు చెప్పినంత సులువుగా జీవితాలను జయించగలమా?"
    "మాటలే కష్టం! అది థియరీ! జీవితం తేలిక! ఇంట్రస్ట్! అది ప్రాక్టికల్!"
    "మళ్లీ ఒకసారి ఆలోచించుకో క్రాంత్!"
    "ఏ విషయం..?"
    "నేను మీ మతం కాదు. నేననుసరిస్తున్న మతాచారాలు అర్జంటుగా మార్చుకోలేను. కట్నం తేలేను. ఏ ఆడంబరాలూ నీకు ఆనవాయితీగా అర్పించలేను. ఇప్పుడు నీ ముందు ఎలా ఉన్నానో- అలానే నీ జీవితంలోకి వస్తా.... నిరాడంబరంగా! ముందుముందు పిల్లలు పుట్టి, ప్రేమ తగ్గి, 'మతం కాదూ.., కట్నం తేలేదూ...., కానుకలు ఇవ్వలేదు....' అనేవయినా ఆరోపణలు వస్తే నిర్థాక్షిణ్యంగా నిన్నొదిలేసి వెళ్లిపోతా!" సూటిగా చెప్పింది.
    వెనక్కి వంగి నవ్వాడు... చాలాసేపు!
    "మతాలూ, కులాలను బట్టి పెళ్ళిళ్లు విజయవంత మవుతాయనుకునే సెంచరీలో, ఆలోచనాధోరణిలో మనం లేము. నేనసలు లేను! ఇక కట్నాలూ, కానుకలూ ఆశించే జీవితం నిర్మించుకునే కక్కుర్తి లేదు నాకు. నువ్వు మాట్లాడేదెలా  ఉందంటే....ఎల్.కె.జీ.లో స్కూలుపిల్లాడ్ని స్కూల్ కు  పంపిస్తున్నట్టు! ఇవన్నీ ఆలోచించకుండానే నేను బయటపడ్డా ననుకున్నావా? నేనడిగింది నీ 'ఇష్టం' మిగతావి కాదు."
    "నాకిష్టమే! కానీ, నా గురించి నేను చెప్పాలిగా!" కామిని.
    "నాక్కావాలని అడిగింది- నా ఎదురుగా ఉన్న ఈ కామినినే! తను తెచ్చేవీ, ఇచ్చేవీ కాదు" క్రాంత్.
    "సరే... పిల్లల్ని కూడా ఇవ్వోద్డంటావా!" టీజింగ్ గా అడిగింది.
    "నీకిష్టం లేకపోతే ఇవ్వొద్దు! అయినా..... పిల్లల్ని నాకివ్వడమేంటి? మనిద్దరం కలిసి వాళ్ళకు జన్మనిస్తాం, పెంచుతాం, చదివిస్తాం! వాళ్ళే మనలా పెళ్ళిచేసుకుని వెళ్లిపోతారు. తర్వాత మళ్లీ మనిద్దరం ఇప్పుడెలా ఉన్నామో అలాగే మిగిలిపోతాం. కాకపోతే- తెల్లజుట్టు వస్తుందంతే! అలాంటి వచ్చివెళ్లిపోయే పిల్లల్ని కూడా ఇవ్వనన్నా నాకేవీ అభ్యంతరం లేదు. నాకు నువ్వు కావాలి.... మరణించేదాకా! తోడుంటావా!"
    'ఎంత ప్రాక్టికల్ గా , ఎంత నిజంగా,  ఎంత వాస్తవంగా అడిగేశాడు!' అనుకుని విస్తుబోయింది.
    'హిమాద్రి చేయిచాస్తే....పవనం పరుగెత్తి వెళ్లకుండా ఉంటుందా?మేఘం చిలకరిస్తే పచ్చిక పులకరించకుండా ఉంటుందా? నువ్వే నన్నడిగితే ఇచ్చేయకుండా ఉండగలనా?' మనసులోనే గొణుక్కుంది కామిని.
    "నీకు నేనంటే ఇష్టమేనా?" పచ్చికలో కూర్చుంటూ క్రాంత్.
    "చాలా....!" తోడుగా తనూ కూర్చుంటూ.
    "మరి- చెప్పలేదేం ఇన్నాళ్లూ!" కళ్ళు కలిపేస్తూ.
    "ఇవన్నీ ఆలోచించి!" కళ్ళు వాల్చేస్తూ.
    "ఇప్పుడిక మానేస్తావా?" గడ్డిం ఎత్తి పట్టి.
    "మానేసి మూడు నిముషాల ఇరవై సెకండ్లయింది!" రెండుకళ్ళూ  ఒకేసారి కొట్టి.
    "థాంక్యూ! ఇక మొదలెట్టకు  కూడా!" ఒక కన్ను మాత్రమే కొట్టి తనూ నవ్వి!
    ఇద్దరూ లేచి బయల్దేరారు...గమ్యం వైపేమో మరి!  
                                     *    *    *
    మూడువైపుల నుంచీ మూడుజంటలూ అక్కడికి చేరేసరికి రేవతీ, ఆనంద్ అనందంగా కళ్ళద్దాలు సరిచేసుకుంటూ కబుర్లు చెప్పేసుకుంటున్నారు.
    ఆనంద్ పేపర్లు ఎగిరి అక్కడోక్కటి, ఇక్కడొకటి పడున్నాయి.
    రేవతి శాండిల్స్ చెరోవైపూ పడున్నాయి. హ్యాండ్ బ్యాగ్ కాస్త దూరంలో పడి ఉంది. కానీ, ఇద్దరూ మాత్రం ఎదురూబొదురు కూర్చుని నోటితో మాట్లాడుతూనే 'డెఫ్ అండ్ డెమ్, లాంగ్వేజ్ లో  చేతులు కదిపినట్టు- చేతుల్తో కూడా మాట్లాడేసుకుంటున్నారు. వీళ్ళ  మూడుజంటలూ వచ్చి చుట్టూ నిలుచున్నా  ఇద్దరికీ కనిపించలా! ఈ లోకంలో వుంటే కదా!
    చూసీచూసీ వళ్ళుమండి, స్పూర్తి గట్టిగా రేవతి చెవి దగ్గర అరిచింది-
    "సోడాబుడ్డీ! మేమొచ్చి అరగంటయింది! అరగంటనుంచీ వింటున్నా మీరేం మాట్లాడుకుంటున్నారో మాకర్థంకావట్లా! ఒకరు మాట్లాడుతూ, ఒకరు వింటూఉంటే విషయమేంటో తెలుస్తుంది! ఇద్దరూ మాట్లాడుతుంటే ఒకేసారి- విషయం ఎవరికర్థం అవుతుందే! మీకయినా మీరేం మాట్లాడుకుంటున్నారో అర్థం అవుతోందా?" అని.
    నింపాదిగా తలతిప్పి-
    "ఓఁ! మీరొచ్చేశారా... అప్పుడే?" అంది విసుగ్గా.
    "అప్పుడే ఏవిటి... మొద్దూ? మేమెళ్లి రెండు గంటలయింది!" కామిని తలమీద కొట్టింది.
    "అయితే ఏవిటట? ఇంకో రెండుగంటలు ఉండి రాలేకపోయారూ?! ఇప్పుడేం కొంప మునిగిందని అప్పుడే వచ్చారు!" విసుక్కుంది రేవతి.
    "చీకటయితే నీకు రేచీకటోచ్చి, కళ్ళు కనబడక మమ్మల్ని తిట్టుకుంటావని వచ్చాం!" జ్ఞాపిక ఒకటి కొట్టింది.
    "మీరూరికే అలా రేవూని కొట్టకండీ!" ఆనంద్ అన్నాడు.
    "ఆహాఁ.... గొప్ప జాలి! నువ్వెవరు బాబూ.... వకాల్తా పుచ్చుకుంటున్నావ్?" స్పూర్తి వెక్కిరించింది.
    "ఇదుగో.... బాబూ, బుజ్జీ అంటే నేనొప్పుకోను!  మీట్ మిస్టర్ ఆనంద్.... నా  బాయ్ ఫ్రెండ్! మేమిద్దరం గాఢంగా ప్రేమించుకుంటున్నాం!" అంది రేవతి మృదువుగా.
    "ఈ రోగం ఎప్పట్నుంచే నీకు? మేం వెళ్లినపుడు బానే ఉన్నావ్ గా! సడన్ గా ఈ ప్రేమెలా పుట్టిందే.... మాకు చెప్పకుండా!" జ్ఞాపిక చెయ్యిపట్టుకుని కుదిపేస్తూ అడిగింది.
    "ప్రేమ  చెప్పి పుట్టదండీ! పుట్టాక చెబుతుంది! కదు.... రేవూ?" ఆనందన్నాడు ప్రేమగా  రేవతి వైపు చూసి - కళ్ళద్దాలు సరిచేసుకుంటూ.
    "అవును! అయినా- మీ అందరికీ నాకు చెప్పాకే ప్రేమ పుట్టిందా? నాకు మాత్రం చెప్పకుండా ప్రేమ పుట్టకూడదా?" వాదనకు దిగింది.
    "చాలా బాగా పుట్టిందిగానీ, ఇంతకీ... ఈ ప్రేమ ఎప్పుడు మొదలయింది రేవతీ?" ఫ్రెండ్లీగా అడిగాడు క్రాంత్.
    "ఆఁ చూడు.... క్రాంత్ ఎంత బాగా అర్థంచేసుకున్నాడో! మీరు నా ఫ్రెండ్స్ అనుకోవడానికే సిగ్గేస్తోంది!" అని  గర్ల్స్ వైపు చూసింది.
    మళ్లీ క్రాంత్ వైపు తిరిగి, "మీరందరూ అలా వెళ్లిపోయారా ఇందాక..."
    "మేం వెళ్లడం కాదే.... నీ ప్రేమ ఎప్పుడు మొదలయ్యింది? మాక్కూడా చెప్తే ఎంతో ఎంకరేజ్ చేసేవాళ్ళంకదా!" అని రాజీకొచ్చింది కామిని.
    "ప్లీజ్ కామినీ... పాపం- తనని చెప్పనివ్వండి!" అన్నాడు రేవంత్.
    "థాంక్యూ మిస్టర్ రేవంత్! ఆనంద్- ఇతను చూడూ... నిజమైన ఫ్రెండంటే!" అంది రేవతి.
    "వెరీ గ్లాడ్ టు మీట్ యూ... రేవంత్!" అన్నాడు ఆనంద్.
    "ఇంతకీ... నీ ప్రేమకథ చెప్పవే!" స్పూర్తి టెన్షన్ పడింది.
    "ప్రేమ కథేముందండీ.... మీలానే  మేమూ ప్రేమించుకుంటున్నాం!"క్యాజువల్ గా చెప్పాడు ఆనంద్.
    "ఎప్పటినుండీ ఆనంద్ గారూ..?!" జ్ఞాపిక మర్యాదగా అడిగింది.
    "నన్నయితే కసురుకుంటావ్- ఆనంద్ నేమో 'ఆనంద్ గారూ....' అని పిలుస్తున్నావ్! ముందొచ్చిన నేనెక్కువా? ఇప్పుడొచ్చిన అతనెక్కువా?" టాపిక్ మలిపేసి తగాదాకు దిగింది మళ్లీ.
    "ఇంతకీ మీ ప్రేమకథ చెప్పవే!" కోపాన్ని కంట్రోల్ చేసుకుంది స్పూర్తి.
    "తనే చెబుతుంది. మీరెందుకు కంగారుపడుతున్నారు?" ఈష్ కొంచెం రిలాక్స్ చేశాడు.
    "మీరెళ్లి రెండు గంటలయిందా... మా ప్రేమ మొదలయి రెండు గంటలయింది!" కళ్ళద్దాలు సరిచేసుకుని చెప్పింది.
    "రెండు గంటల్లోనే అంత అమరప్రేమికులు ఇంత తొందరగా ఎలా అయిపోయారబ్బా! అమాయకంగా ఆనంట్ ను అడిగాడు రేవంత్.
    "ఏయ్ఁ... వాళ్ళింకా చచ్చిపోలేదు! చచ్చిపోయిన వాళ్ళను అమరప్రేమికులంటారు!" జ్ఞాపిక కసిరింది.
    "సారీ...ఇంత గాఢప్రేమికులు ఇంత తొందరగా..." అడిగేలోపు-
    "మిస్టర్...." ఆనంద్ పేరు మర్చిపోయి ఆగిపోయాడు.
    "రేవంత్! రేవంత్!"
    "హాఁ... మిస్టర్ రేవంత్! లవ్ ఎట్ ఫస్ట్ సైట్... అని విన్లేదా?" చిన్నపిల్లాడ్ని చూసినట్టు చూశాడు రేవంత్ వైపు ఆనంద్.
    "య్యా! విన్నాం!"
    "మాకూ అలాగే రెండుగంటల క్రితం 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్' అయింది!" కూల్ గా చెప్పాడు కళ్ళద్దాలు పైకి జరుపుకుంటూ.
    "మా అభిప్రాయాలూ, ఆశయాలూ కలిసిపోయాయి!" ఆనందంగా చెప్పింది రేవతి.
    "ఏ ఏ అభిప్రాయాలు కలిశాయే?" స్పూర్తి యంగ్జయిటీ అడిగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS