Previous Page Next Page 
వసంతం పేజి 17

               

                                     19

    కొన్ని రోజులు ప్రశాంతంగానే గడిచిపోయాయి - ధైనందిన జీవితం ఏ ఒడిదుడుకూ లేకుండానే సాగుతోంది గోపాలానికి. ఆఫీసులో తనకి కంపెనీ వ్యవహారాలతో వెంకట్రామ్ ఉత్తరువుచేసినట్టు రోజు రోజూ పరిచయం చేస్తున్నారు, కంపెనీకి. గవర్నమెంటుకీ మధ్య నడుస్తోన్న చాలా వ్యవహారాలని క్రమంగా అర్ధం చేసుకుంటున్నాడు గోపాలం.
    ముఖ్యంగా లాకి సంబంధించిన విషయాలు తెలుసుకున్న కొద్దీ అతనికి సరదా ఎక్కువైంది. కేస్ లా బాగా చదవడం మొదలుపెట్టేడు. అటు కొద్ది మాసాల్లో తాను కూర్చోబోయే పరీక్షకి. ఇటు తన ఉద్యోగ బాధ్యతలకీ కూడా ఇది చాలా సహకరించడమే కాకుండా, ఎంతో అనురక్తి కలిగింది కంపెనీ లలో అతనికి.
    ఈ సంవత్సరం ఇంకో ఆరు నెలల్లో లా డిగ్రీ తీసుకుంటే, ఈ పాండిత్యంతో లీగల్ ఎడ్వయిజర్ గా పోవొచ్చు అని అతని ఆశ. వెంకట్రామ్ సూటిగా చెప్పకపోయినా, ఒకటి రెండుసార్లు ఆ మాట వ్యక్తం చేసేరు.
    ప్రతిరోజూ ఆఫీసు, ఆ తరవాత కాలేజీ. ఇల్లు - రాత్రి చదువు ... క్రమంగా అలవాటు ఐపోయింది. సెలవురోజుల్లో ఎక్కడికైనా వెళ్ళడం.... తరుచు ఎవరో ఒకరు వొస్తూనే ఉండే వారు. అతనూ, వసంతా.
    ఆ రోజు ఆదివారం. ఉదయం ముఖర్జీ, భార్య, వొచ్చి భోజనం చేసి వెళ్ళేరు, మధ్యాహ్నం పడుకుని లేచేసరికి నాలుగు దాటిపోయింది.
    "క్లబ్ కి వెడదాం-చాలారోజులై పోయింది అంది వసంత.
    ఈ మధ్య క్లబ్ కి అట్టే వెళ్ళడంలేదు అక్కడ ఉన్న స్వేచ్చకాని, వసంత డ్రింక్స్ తీసుకోవడం కాని. అతనికి నచ్చదు. కాని. సూటిగా ఈ మాట అని వాదోపవాదాలు పెంచడం ఇష్టంలేక, "లేక్స్ కి వెడదాం నువ్వూ వొచ్చిచాలాకాలం ఐపోయింది" అన్నాడు గోపాలం.
    "సెక్రటరీ ఫోన్ చేశాడు, అందరూ అడుగుకున్నారట. బ్రిడ్జి ఆడాలనీ ఉంది. పది అంది వసంత.
    "సెక్రటరీ ఎప్పుడు ఫోన్ చేసేడు!"
    "విన్నను-"    
    కబ్ సెక్రటరీ బాగా జ్ఞాపకం ఉన్నాడు గోపాలానికి అతని పేరు సుధాపశురాయ్. చాలా పాశ్చాత్య నాగరికత అతనిలో ఉట్టిపడుతూ ఉంటుంది. అతనిక్కడ ఇంజనీరు. జీతంవేలలో,        
    అతనంటే వొళ్ళుమంట గోపాలానికి.
    వసంత కబ్ కి వెడితే ఆమెతోనే ఉంటాడు రాయ్ చూడగానే కరచాలనం చేస్తాడు. ఆమెతో తరవాత తప్పనిసరిలాగ తనతోనూ కరచాలనం చేస్తాడు ఆమె భుజంమీద చెయ్యివేసి మాట్లాడతాడు. తను అక్కడ లేనట్లే.
    ఆ విషయం కలిగించేబాధ సరేసరి, అంతకన్న ఎక్కువబాధ అతన్ని చూసి వసంతపొందే సంతోషం. ఆమెకళ్ళల్లోకి ఒక్కసారి కాంతి ఎక్కువొచ్చేస్తుంది. వెయ్యి కుశలప్రశ్నలు వేస్తుంది. అతనితో చాలాసేపు మాట్లాడుతూ కూర్చుంటుంది.
    ఆమె తనదృష్టిలో తప్పుపని ఏమీ చెయ్యదని అతనికి తెలుసును. కాని, వారిద్దరూ అంత సన్నిహితంగా ప్రవర్తిస్తోన్నప్పుడు ఈర్ష్యతో. కోపంతో, అతనికి చాలా చికాకుగా ఉంటుంది. వసంత విస్కీ తాగడం అతని వల్లనే మొదలు పెట్టిందని గోపాలం గట్టి నమ్మకం.
    "క్లబ్బుకి వొద్దు- మరెక్కడికైనా సరే."
    "క్లబ్బుకి వొద్దు- మరెక్కడికైనా సరే."
    "ఇంకెక్కడికి వెడతాము,- మంచి పిక్చరేదీ లేదు. కల్చరల్ ప్రోగ్రాం ఏదీ లేదు.....క్లబ్బుకి నీ అభ్యంతరం ఏమిటి?"
    "అక్కడ అంతా కృత్రిమంగా ఉంటుంది"
    "నీకు నాకలా అనిపించదు"
    వొస్తూన్న కోపం లోలోపలే అణగదొక్కుకుని. "చాలా విషయాల్లో మనకి వేరు వేరు భావనలుంటాయి.....కాని, నిజం చెప్పాలంటే అక్కడ వాళ్ళందరిలో నువ్వు కలిసిపోవడం చూస్తే నాకు చికాకుగా ఉంటుంది." అన్నాడు గోపాలం స్వరం తగ్గించి.
    "అంటే?"
    తలదువ్వుకోడం ఆపి, వెనక్కి తిరిగిందీ వసంత.
    "అంటే నీకు అర్ధంకాకపోతే చెప్పడం అనవసరం"    
    అద్దంవేపు తిరిగి తల దువ్వుకోడం ముగించే దాకా ఏమీ అనలేదు వసంత.
    "అంటే గోపాలం, నా ప్రవర్తన బాగా లేదనా నువ్వు అనేది?"
    "కాదు వసంతా..... నువ్వు చెడు ఉద్దేశంతో ఏమీచెయ్యవని నాకు తెలుసును. కాని, అందరూ ఏమనుకుంటారు?" సానునయంగా అన్నాడు గోపాలం.
    "లోకం అంతా ఏమన్నా నాకు అవసరం లేదు నువ్వు ఏమనుకుంటావు."
    అతని కళ్ళల్లోకి తీవ్రంగా చూస్తూ అడిగిన ప్రశ్నకి ఏమీ సమాధానం ఇవ్వలేకపోయాడు గోపాలం.
    ఆమె బట్టలు వేసుకుని ఇవతలికి వొచ్చింది. నేను క్లబ్బుకి వెళ్ళివొస్తాను-నీకు చిరాకుగా ఉంటే రాకు." అని క్రిందికి వెళ్ళిపోయింది.
    మ్రాన్పడినట్లు నిలబడిపోయాడు గోపాలం. కోపంలో ఆవేశంలో అతనికి జ్వరం వొచ్చి నట్లైంది ఆమె కారు చప్పుడు విన్నాక బాల్కనీ లోకి వొచ్చాడు.
    చాలాసేపు అక్కడే నిలబడ్డాడు. తలుచుకున్న కొద్దీ వసంత ప్రవర్తన మరీ బాధాకరంగా ఉంది అతనికి. తనని వ్యక్తిగా. భర్తగా ఎందుకు చూడదు? సున్నితంగా చెప్పినా, సూటిగా చెప్పినా మాట వినదు, క్రమంగా ఆమె బాధ్యతలు నేర్చుకుంటుందనే ఆశతో ఇన్నాళ్ళూ సహించాడు. కాని, తన సహనానికీ హద్దులేదా, కొరడా దెబ్బలాగ ఎవరో ప్రశ్నించారు...సహించక, ఏం చేస్తాడు? అతను తన జీవితాన్ని ఆదాయం కోసం అమ్ముకున్నాడు - తనని త్యాగం చేసుకున్నాడు - వసంత మూలంగా కాక ఏముంది తనకి?
    ఈ నిజం తెలిసి జ్ఞాపకం ఉంచుకుని ఇలాగా ప్రవర్తిస్తోందా వసంత?
    లేదు నేను డబ్బుకోసం వసంతని పెళ్లాడలేదు. ఆమెని నిజంగా ప్రేమించాను. ఆమె చేసినది క్షమించాను- నా ప్రాణంగా చూసుకునే ఉద్దేశంతో వివాహం చేసుకున్నాను...ఆమె నిరుపేద ఐనా పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నా, ఆమెని వివాహం చేసుకునే ఉండేవాడిని....
    అదీ నిజం, కాని తన ధనలోభత్వంకాదు.
    -ఇంకో నిజం ఆమె సౌందర్యం. ఆమెలో మొదట, తనని ఆకర్షించినది ఆమె సౌందర్యం..తను ఆరాధించుకుని. అనుభవించి, ఆనందించే సౌందర్యం.
    ఆ సౌందర్యంకోసం ఆమెని ప్రేమించేడు తను. ఆమె డబ్బు కోసంకాదు. ఆమెకోసం.
    రకరకాల ఆలోచనలు మనశ్శాంతిని చెల్లా చెదరు చేస్తున్నాయి. ఈపాటికి వసంత క్లబ్ కి వెళ్ళి ఉంటుంది. నిన్న రాయ్ టెలిఫోన్ చేసినప్పుడు అతనికి వాగ్ధానం చేసి ఉంటుంది. ఇవేళ రాడానికి ఆమెకోసం అతను వరండాలో నిలబడి ఎదురు చూస్తూ ఉంటాడు...
    గట్టిగా కళ్ళుమూసుకున్నాడు. కాని, వసంతని కాని. రాయ్ ని కాని దూరంగా ఉంచలేక పోయాడు.
    వెనువెంటనే క్లబ్ కి వెళ్ళి చూడాలనిపించింది. కనీసం తాను దగ్గర ఉంటే చెయ్యకూడని పని వసంత చెయ్యకపోవొచ్చును. బహుశా ఏమీలేని పరిస్థితులకి రంగులువేసి ఆలోచనలతో రూపం ఇచ్చి చూసి భయపడుతున్నాడు...
    వసంత ఎందుకిలాంటి పని చేస్తుంది? పూర్వపు పరిస్థితులకీ, ఈనాటి పరిస్థితులకీ చాలా భేదం వుంది. ఆమెకు వేరు ఆలోచనలు వుంటే అంత ఓపెన్ గా ఎందుకని ప్రవర్తిస్తుంది!
    లోపలికి వెళ్ళాడు, ఇల్లంతా తనని వెక్కిరిస్తోంది. ఇక్కడ ఒంటరితనం పిచ్చి ఎత్తిస్తోంది, ముఖం కడుక్కుని బయటికి వెళ్ళాడు- ఎక్కడికి అని ఆలోచన లేకుండా.
    పార్క్ స్ట్రీట్ చేరేసరికి కొంచెం చినుకులు ప్రారంభించాయి. రోడ్డుదాటి పుస్తకాల షాపు దగ్గిర నిలబడి పుస్తకాలు చూడ్డం ప్రారంభించాడు. ఈ మధ్య సంసారంలో, చదువులో పడి పుస్తకాలు చదవడం తగ్గిపోయింది.
    ఒకటి తరవాత ఒకటి పుస్తకాలు చూడసాగాడు - డిటెక్టివ్ పుస్తకాలు అతనికి నచ్చవు. అవే ఎక్కువగా ఉన్నాయి. అట్టల మీద అర్ధనగ్నంగా ఉన్న బొమ్మలు.
    బయటవర్షం ఎక్కువైపోయింది. ఆర్కేడ్ లో చాలామంది తలదాచుకున్నారు. వెనకాల షెల్ఫు మీద తనని ఆకర్షించిన పుస్తకం తీయించి పేజీలు తిరగేస్తున్నాడు. అది ఒక అమెరికన్ లాయరు తన అనుభవాలమీద రాసిన పుస్తకం.
    ఆ పుస్తకం చూస్తూంటే, ఎవరో భుజం మీద చెయ్యివేశారు.
    వెనుతిరిగి చూసేడు. క్షణికంగా జ్ఞాపకం రాలేదు. వెనువెంటనే, వాల్తేరులో తన క్లాస్ మేట్ మాధవరావు అని జ్ఞాపకం వొచ్చి, "ఆశా! మాధవరావ్! మీరిక్కడికి ఎలాగ వొచ్చేరు!" అన్నాడు.
    చాలా సంతోషంగా కరచాలనం చేసి, చెయ్యి భుజంమీదవేసి, 'పోల్చుకోలేరని అనుకున్నాను - మీరూ చాలా మారిపోయేరు.. ఈమె శ్రీమతి.."
    కొంచెం దూరంగా నిలబడ్డ ఒక యువతిని పరిచయం చేశాడు మాధవరావు. ఆమెకి నమస్కరిస్తూంటే, "ఈయన గోపాలంగారు- ఈమె శాంతాదేవి..." అన్నాడు.
    శాంతవైపు క్షణమాత్రం చూశాడు. మాధవ రావు చాలా ధనవంతుడని అతనికి జ్ఞాపకం. యూనివర్శిటీకి అతను స్కూటర్ మీద వొస్తూ ఉండేవాడు, ఆ రోజుల్లో మాధవరావు చాలా ఫాషీగా ఉండేవాడు. సిల్కుచొక్కాలూ బంగారు బొత్తాములూ మాధవరావుని చూడగానే జ్ఞానపం వొచ్చేది గోపాలానికి, ఇంకా చాలా మందికి.
    శాంతని అతను తన శ్రీమతి అని పరిచయం చెయ్యకపోతే. ఈ నగరంలోని లక్షలాది ఆడవారిలో ఆమె ఒకటిగా అతను అనుకుని, గుర్తించలేకపోయాడు. ఆమె చాలా సామాన్యంగా ఉంది. వాయిలు చీర, కాళ్ళకి మామూలు చెప్పులు, చెవులకి చిన్నరింగులూ. మెడలో పలచటి గొలుసు- ముఖంమీద ఎర్రటి బొట్టు...
    "నమస్కారం!" అంది.
    అతను మళ్ళీ మాధవరావువేపు చూసేసరికి అతనిలో వొచ్చిన మార్పునికూడా గమనించగలిగేడు గోపాలం. బాగా నలిగిపోయిన టెరిలినో చొక్కా, కొంచెం మాసిపోయిన తెల్లపంట్లం, పాలిష్ అవసరం ఐన చెప్పులు.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS