Previous Page Next Page 
జీవనకలశం పేజి 17


    టైపు వర్కు పూర్తిచేసి ఇంటిదారి పట్టేసరికి రాత్రి పదకొండు గంటలు దాటుతుంది. నిద్ర కళ్ళమీదకి వస్తూంటే యాంత్రికంగా అడుగులు పడుతూ వుంటాయి. రోడ్డు పక్కన చెట్లు వీచే చల్లనిగాలి అతన్ని సేద దీరుస్తూంటుంది. అక్కడే నిద్రపోతే యెంత బాగుండు అని అన్పించీ అబ్బ ఇంకా యెంత దూరం నడిస్తే ఇల్లు వస్తుందీ అని మత్తు వదుల్చుకుని పరిసరాలని గమనిస్తాడు.
    "ఇంకా చాలా దూరమే నడవాలి" అంటుంది తెలివి తెచ్చుకున్న మనస్సు,
    శ్రీలక్ష్మి వాసు ఇబ్బంది పడుతున్నది తెల్సుకుని భర్తకి తెలియకుండా యాభై రూపాయలు పంపింది.
    వాసు తిరస్కరించాడు.
    వాసు మాలతో తిరిగి చదువు మొదలుపెట్టించాడు. వీరభద్రం పరీక్షలకి కష్టపడి చదువు తున్నాడు.
    వాసుకి టైపు వర్కు ఇచ్చే కృష్ణమూర్తిగారు వాసుని వివరాలన్నీ అడిగారు.
    "మెరిక లాంటి కుర్రాడు యం.ఎ. పాసయీ అవకాశం దొరక్క అవస్థపడుతున్నాడు. యేదైనా ఆసరా దొరికితే పైపైకి పోయే తెలివి తేటలు వున్నాయి. చూడాలి.....యేదైనా మంచి అవకాశం" తనలో తను అనుకున్నాడు. మరిచి పోకుండా ప్రయత్నమూ చేస్తున్నారు.
    అయితే యే ప్రయత్నమూ కలసిరాలేదు.
    
                             *    *    *

    ఒకరోజు
    మాల పుస్తకాలు ముందేసుకుని లెక్కలతో కుస్తీ పడుతోంది.
    దభాలున తలుపుతోసుకుని శ్రీలక్ష్మి విసురుగా వచ్చింది.
    ఎలా ఆహ్వానించాలో అర్ధంకాని మాల "కూర్చోండి" అంది కుర్చీ చూపిస్తూ.
    శ్రీలక్ష్మి కూర్చోలేదు.
    వురిమి చూసింది, మాల కాళ్ళు వణుకు మొదలెట్టాయి.
    "రాక్షసీ యేమంటూ మా వాసుని శని గ్రహంలా దాపురించావో మా కుటుంబమే చిన్నాభిన్న మయిపోయింది. మా వాసుని వదిలి వెళ్ళిపోతావా లేదా. వెళ్ళు ఇక్కడ నించి వెళ్ళిపో...!"
    ద్వారం వైపు చూపిస్తూ అపర కాళిలాగా ఆజ్ఞాపిస్తున్న శ్రీలక్ష్మి వైపు చూస నా సంసారంేందుకు మాలకి ధైర్యం చాలలేదు.
    నెలవైపు చూస్తూ నిల్చివుంది.
    నీకు మా వాసు తప్ప మరెవ్వరూ దొరక లేదూ! నీకు కావాల్సింది డబ్బే కదూ నేనిస్తా కాని మా వాసుని వదిలేసెయ్.
    "వెళ్ళిపోతావా లేదా!" గొంతు చించుకుని అరుస్తోంది శ్రీలక్ష్మి, ".................."
    రామలక్ష్మణుల్లాంటి అన్నదమ్ములు గర్భ శత్రువుల్లా మారారు నీమూలకంగా? నా బిడ్డలు చిన్నాన్నా చిన్నాన్నా అంటూ దిగులుపడ్డారు. నా సంసారం నడిబజారులో పడేందుకు సిద్ధంగా వుంది. ఓ మహాతల్లి నీకు కావల్సింది డబ్బేగా ఇంద ఈ నగలన్నీ తీసుకో. తీసుకుని మావాసు రాకముందే వెళ్ళిపో. మళ్ళీ ఈ జన్మలో కన్పించ బోకు నీమూలకంగా కదూ పీటల మీద పెళ్ళి కాస్తా తప్పిపోయింది. ఆ చంద్రహారం చాలకుంటే ఈ గాజులుకూడా తీసుకో! తీసుకుని నామరిదిని వదిలిపెట్టు......అంటూ గొలుసు, గాజులూ మాల గుప్పెట్లో కుక్కి "వెళ్ళిపో..... వెనక్కి తిరిగి చూశావా.... గొంతుపిసికి చంపేస్తాను. వెళ్ళు" అంటూ ఒక్కతోపు తోసింది.
    బోర్ల పడబోయి నిలదొక్కుకున్న మాల గొంతులోనించి ఒక్కమాట రాలేదు. పెగుల్చుకుంది. "అవేం కాకొద్దు......నాకొద్దు "భయంగా శ్రీలక్ష్మిని చూస్తూ.
    "యేం చాలలేదూ! మంగళసూత్రం తప్ప మరేంలేదు నాదగ్గర" ఇంకేం వున్నా యెంత విలువైనదైనా నీ ముఖాన కొట్టేసే దాన్ని. డబ్బుకి గడ్డితినేది నీలాంటి ఆడవాళ్ళు. నీలాంటి వాళ్ళవల్లే సమాజం ఇలా తగలబడిపోతుంది మొగుడికిపెళ్ళాం. పెళ్ళానికి మొగుడు కాకుండా. దౌర్భాగ్యులారా..... పెళ్ళిపో...."
    మాల మనస్సుని కూడదీకుంది.
    "వెళ్ళను" అన్నట్లు తల అడ్డంగా వూపింది.
    ఈ తిరస్కారం భరంచలేని శ్రీలక్ష్మికి పిచ్చి పట్టినట్లయింది.
    "రాక్షసీ....పోవూ....పోక యేంచేస్తావ్ ఎవరితో చెప్పుకుంటావో చూస్తాను" అంటూ శ్రీలక్ష్మి మాలచెయ్యి పట్టుకుని బరబరా లాక్కుపోతోంది.
    రోడ్డునపోయే జనం ఆగి ఆ వింతను చాలా ఖుషీగా చూస్తున్నారు.
    "వాసు ఇంటికి వచ్చేసరికి ఈ చుట్టుపట్ల కన్పించావా.....జాగ్రత్త నిన్ను చావగొట్టేస్తాను" అంటూ పిచ్చిదానిలా మాలని బైటకి తోసే స్తూంటే బైటకి వెళ్ళకుండా తలుపు పట్టుకుని నిల్చోటానికి విశ్వప్రయత్నం చేస్తోంది.

                    
    "చెప్తూంటే నీకుకాదూ." అంటూ చేతులు లాగి విసురుగా నెట్టేసింది.
    మాల బోర్ల పడింది. కంకర రాళ్ళు ముఖం అంతా గీసుకుపోయి రక్తం చిమ్ముతున్నాయి.
    "మాలా ఇదేమిటి ఎందుకిలా పడిపోయావు అంటూ కంపెనీనించి వచ్చే వాసు ఖంగారుగా లేవదీసి ఇంటోకి తీసుకువస్తూ వదినగారిని చూశాడు "వాసుబాబూ నేనెక్కడికి వెళ్ళనూ" అంటూ యేడ్చింది మాల.
    "నిన్ను నేను యెక్కడికీ పంపనమ్మా! నేనుండగా నిన్నెవ్వరూ యేం చెయ్యలేరు. అంటూన్న వాసు వదినని చూసి ఆశ్చర్యపోయాడు.
    "వదిన ఈ ఇంటికి వచ్చిందా? ఎందుకు. వచ్చి ఏం చేసింది" ఆలోచనలు అనేక రకాలుగా సాగిపోతున్నాయి.
    "వాసూ దాన్ని దూరంగా తోసెయ్యి. ఈ రాక్షసి మూలంగా మన కుటుంబం ఎంత నష్టపోయిందో నీకు తెలియదయ్యా..... నిన్ను గురించి లోకులు ఎన్నెన్ని అభాండాలు వేస్తు న్నారో నీకు తెలియదు. నేను వినలేకపోతున్నాను. అది నిన్ను వదలటంకల్ల నువ్వే దాన్ని వదిలి వచ్చేసెయ్యి..... వాసూ నా ముఖంచూసి వచ్చెయ్యి"
    వెర్రిదానిలాగా మాట్లాడుతున్న శ్రీలక్ష్మిని తెల్లబోయి చూశాడు. "వదినా....మాలని వదిలి పెట్టటం అనేది కల్ల. ఆ అమ్మాయికి ఒక దారి దొరికేవరకూ బాధ్యత నాదే ఎవరు యెన్ని చెప్పినా నా నిర్ణయం మార్చుకోను. వీణ ఎలా వుంది. బాబ్జీ యెలా వున్నాడు.
    వాసు వాతావరణం తేలికపడాలని తనలో కోపం సెగలు కక్కుతున్నా పైకి ప్రశాంతంగా మాట్లాడటానికి ప్రయత్నించాడు.
    "మేము మీకు కావాలా వాసు బాబూ! అందరూ నువ్వు మారిపోయావన్నా నేను నమ్మలేదు. కాని నిజమే అని తెలుసుకున్నాను. నీకు మేం అక్కరలేదు. కాని ఆ పసివాళ్ళకి యేం తెలుసు చిన్నాన్నా అంటూ కలవరిస్తున్నారు. ఆయుష్షువుంటే బ్రతుకుతారు. లేకుంటే చస్తాం అంతేగా వాసూ ... నువ్వు వస్తావని యెంతో ఆశతో మీ అన్నయ్యకి తెలియకుండా వచ్చాను. ఒక్కసారి వాళ్ళని చూస్తావని ఆశ పడ్డాను. నా ఆశ అడియాశ అని అర్ధమైంది. వెళ్ళి పోతున్నాను."
    "అన్నయ్యకి తెలియకుండా దొంగతనంగా మాత్రం రాలేను. నువ్వు వెళ్ళు వదినా. అన్నయ్య వున్న సమయంలోనే వస్తాను. వచ్చి వీణని చూస్తాను.'
    మరిదిని తీక్షణంగా చూసింది శ్రీలక్ష్మి.
    "నువ్వూ... మీ అన్నయ్యా.... అసలు ఈ మగజాతి అంతా రాక్షసులు. మీకు మనస్సులు లేవు. వంచన చేస్తూనే బ్రతుకుతారు. చెయ్యండి ఇంకా ఎన్నాళ్ళు ఇలా చేస్తారో చూస్తాను. అసలు దీనికంతకీ మూలకారణం ఇది కదూ....అదె నీకు మంచిది సరే..."
    సుడిగాలిలానే వెళ్ళిపోయింది.
    "వదినా....వదినా.... అంటూ పిలుస్తున్న వాసు పిలుపు ఆ గాలిలో కలిసిపోయింది.
    వాసుదృష్టి మాలవైపు మళ్ళింది. ఆ తర్వాత గాని చూడలేదు. క్రిందపడివున్న గాజూలూ, చంద్రహారం.
    వెక్కి వెక్కి యేడుస్తూనే జరిగింది అంతా చెప్పేసింది మాల నిశ్చలంగా నిల్చి విన్న వాసు మెల్లగా వంగి గొలుసు, గాజులూ తీసి కర్చీఫ్ లో మూటకట్టాడు. మాల దగ్గరగా వచ్చాడు.
    "మాలా....మన జీవితాలు వడ్డించిన విస్తరి కాదు. ఒక గమ్యం చేరేవరకూ ఒడుదుడుకులు తప్పవు. అప్పుడు కాని నిన్ను అందరూ అర్ధం చేసుకోలేరమ్మా. నువ్వు నాకు భారం అని యెప్పుడూ నేను అనుకోను. నిన్ను ఓ అయ్య చేతిలో పెట్టి కళ కళలాడుతూ సంసారం చేసుకుంటూ వుంటే చూడాలని కలలు కంటున్నాను. నీకు ఓ ఆధారం దొరికిన తర్వాత ఆ అన్వేషణ. యెదీ ఇలాచూడు అప్పుడు ఈ వాసుబాబు గుర్తు వుంటాడా ? చెప్పు......కళ్ళు తుడుచుకో తల్లీ."
    ఆప్యాయంగా అంటున్న వాసు మాటలు అమృతం వర్షించినట్లు అయినాయి.
    నా మూలకంగా యెంతో పోగొట్టుకున్నా విచారించకుండా నా శ్రేయస్సే కోరే ఈ మనిషి దేవుడుకాదూ అనుకుంది మాల.
    "వీణని ఒక్కసారి చూసివస్తాను. వదిన యెందుకో చాలా క్షోభపడుతోంది. కారణం యేదో బలమైనదే వుండి వుండాలి. ఆవిడని ఇలానే నెప్పుడూ చూడలేదు. చూసి త్వరగా వచ్చేస్తానూ" అంటూంటే కళ్ళు తుడుచుకుని తల వూపింది మాల.
    వాసు అన్నగారి ఇంటివైపు సాగిపోయాడు.

                              *    *    *

    వడి వడిగా అడుగులు వేస్తూనే వున్నాడు కాని మెదడు తీవ్రంగా పనిచేస్తోంది.
    వదిన ధోరణి అదోలా మారటానికి కారణం! నేను వాళ్ళకి అంత అమర్యాద కల్గించేనని యేం చేశాను? అనాధ అయిన ఆడపిల్లకి కాస్త చేయూత ఇవ్వటం నేరమా! స్వయం కృషితో చిన్న ఉద్యోగం చేస్తూ కాలం గడవటం అవమానమా? టైపు చెసీ, ట్యూషన్లు చెప్తే అన్నయ్యని కించపర్చినట్లా.
    పొద్దున్న 9 గంటలకు తిన్న అన్నం యెప్పుడో అరిగిపోయింది. మూడు గంటలు అయిన దగ్గర నించీ కడుపులో ఆకలి దేవేస్తోంది. యింటికి వస్తూనే కాస్త వేడికాఫీ తాగుదాంలే అనుకున్నా ఈ గొడవలో ఆకలి మాటే గుర్తులేదు. కాని ఇప్పుడు గుర్తు వస్తోంది ఆకలి. మెయిన్ రోడ్డు మీద హోటళ్ళలోని అద్దాల బీరువాల్లోని తినుబండారాలు వాసుని పరిహసిస్తున్నట్లు కన్పిస్తూంటే రక్తం వుడికెత్తిపోయింది వాసుకి.
    ఓ పెద్దరాయి తీసి వాటిముఖం పగలగొడదా మన్న ఆలోచనవచ్చి రాయి తీసుకున్నాడు. అంతలోనే యేవేవో ఆలోచనలు సుళ్ళు తిరిగాయి.
    ఇన్ని సంవత్సరాలుగా ఎన్నడూ కల్గని ఈ వెర్రి ఆలోచన ఈ రోజు యెందుకు కల్గింది.
    ఇదివరకు ఈ ఆకలి బాధ తెలియవలసిన అవుసరం రానిచ్చేది కాదు వదిన. దరిద్రం మానవుడి ఆలోచనలని యెలా వక్రమార్గంలో పట్టిస్తాయో అర్ధమవుతూనే వాసు చేతిలోని రాయి జారి క్రింద పడిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS