Previous Page Next Page 
అపరాజిత పేజి 17

   
    'శకుంతల బాధ్యత ఎలా అని ఆలోచిస్తున్నావా? నేను బ్రతికి వుండగా నా బిడ్డకు మరో వ్యక్తి తండ్రిగా వ్యవహరించటాన్ని నేను భరించలెను. నేను మళ్ళీ వివాహం చేసుకోబోవటం లేదు. ఈ జీవితానికి ఈ అనుభూతి చాలు. మా దూరపు బంధువుల్లోని ఒకామె శకుంతలను పెంచటానికి ఒప్పుకుంది, ఆమెకు ఎవరూ లేరు. వయసు మళ్ళిన ఆమెకు ఇంత ఆశ్రయం ఇచ్సినట్లూ అవుతుంది. శకుంతలకు ఓ పెద్ద దిక్కూ ఏర్పడుతుందని ఈ ఏర్పాటు చేసుకున్నాను. శకుంతలను అత్తయ్యచేతగానే, మామయ్యచేత గానీ పంపించు. నువ్వు మాత్రం రాకు. తీరా నిన్ను చూశాక నేను ప్రలోభానికి గురికావచ్చు.
    రాధ విషయం బాధపడుతూ రాశావు. రాధ చిన్నపిల్ల కాదు. చాలా తెలివైంది కూడా. ఒకరు చెబితే వినే తత్వం కాదు. చాలా ధైర్యం కలది. జీవితంలో ఎలాంటి ఒడుదుడుకు ల్నైనా ఎదుర్కోగల మనస్థైర్యం కలది. ఆమె గురించి పెద్దగా బాధపడకు.
    నువ్వు ఎక్కడ వున్నా, ఎలా వున్నా! అన్నివేళలా సుఖంగా వుండాలని కోరుతూ
                                                                                                           నీ
                                                                                                          బావ
    మాధవికి దుఃఖం పొర్లుకొచ్చింది. గబగబా బాత్ రూంలోకి వెళ్ళిపోయింది. రెండు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. బయటనుంచి కాలేజీ బెల్ వినిపించింది. ముఖం కడుక్కొని అద్దంలో చూసుకుంది. ఏడ్చినట్లు కనిపిస్తుంది. ముఖానికి ఇంత పౌడరు అద్దుకొని బయటకు వచ్చింది. ఇంటర్వెల్ కావటంవల్ల కాలేజీ అంతా హడావిడిగా వుంది. మాధవి అర్ధరోజు శలవుపెట్టి ఇంటికి బయలుదేరింది. మాధవికి ఆలోచించాలని లేదు. కళ్ళుమూసుకొని పడుకోవాలని వుంది.
    'ఏమ్మా అప్పుడే వచ్చేశావ్?' మెల్లా ఇంట్లో కూర్చొని అప్పడాలు ఒత్తుతున్న పరమేశ్వరి ప్రశ్నించింది.
    'తల నొప్పిగా వుంది పెద్దమ్మా' అంటూ గదిలోకి వెళ్ళిపోయింది మాధవి. చేతిలో వున్న హ్యాండ్ బ్యాగునూ, పుస్తకాలనూ టేబుల్ మీదకు విసిరేసి మంచానికి అడ్డం పడింది. చీర మార్చుకొనే వోపిక కూడా లేదు. కళ్ళు మూసుకుంది. లేడి వెంటబడే వేటగానిలా తరుముకొస్తున్న ఆలోచనలను తప్పించుకోని పారిపోలేక పోతుంది ఆమె మనస్సు.
    బావ తనను ఎంత తేలికగా తృణిక రించగలిగాడు! తనకు తను అర్పించుకోవటానికి సిద్ధంగా వున్న ఆడదంటే ఏ మగవాడికైనా లోకువేనేమో! తనకోసం ఇంత కాలంగా తపస్సు చేసిన బావేనా, తను వస్తున్నానని రాస్తే, వద్దని రాశాడు! తనను యింత అవమానిస్తాడా!
    బావ తనను అవమానించాడా? బావ తనకోసం త్యాగం చేసిన మహా పురుషుడు. బావ రాసింది అక్షరాలా నిజం. మధుమీద కోపం కొద్దీ, ఆవేశంలో తను బావ దగ్గరకు వెళ్ళాలనుకుంది. కాని తన మనస్సులో వున్న మధు బొమ్మను చెరిపేసే శక్తి తనలో వుందా? బావ ఎంత మంచివాడు. తనకు కావాల్సిందేదో తనకే తెలియని పరిస్థితి! 'నీకు కావాల్సింది ఫలానాది' అని తెలియజెప్పాడు.
    'కాఫీ తాగు, తలనొప్పి సర్దుకుంటుంది' పరమేశ్వరి గొంతు విని మాధవి కళ్ళెత్తి చూసింది. లేచి కూర్చొని కాఫీ గ్లాసు అందుకుంది.
    'పెద్దమ్మా!' అంటూ ఆగిపోయింది మాధవి.
    'ఏమ్మా! ఎందుకలా వున్నావ్? కళ్ళు వాచి వున్నాయేం?' ఆదుర్దాగా ప్రశ్నించింది పరమేశ్వరి.
    పెద్దమ్మకు తనంటే ఎంతప్రేమో!
    'బావ ఉత్తరం రాశాడు.'అంది. ఆమె వేసిన ప్రశ్నను వినిపించుకోనట్లే.
    'ఏం రాశాడు?' మాధవి కళ్ళలో దేన్నో వెతకటానికి ప్రయత్నిస్తూ అడిగింది పరమేశ్వరి..
    'శకుంతలను పెంచటానికి ఎవరో మనిషి దొరికిందట. శకుంతలని పంపించమన్నాడు.'
    పరమేశ్వరి తేలిగ్గా నిట్టూర్చింది. మాధవి మీద శకుంతల బరువును మోపటం మొదటినుంచీ యిష్టం లేదు.
    'ఎప్పుడు పంపించమన్నాడు?'
    'వెంటనే పంపించమన్నాడు.'    
    'మరెప్పుడు తీసుకెళతావు?'
    'నేనా?' మాధవి గ్లాసులో మిగిలిన కాఫీని ఒక్క గుక్కలో తాగేసింది.
    'రాధ వెళుతుందా? శకుంతల రాధ దగ్గర వుండదు' అంది పరమేశ్వరి మామూలుగానే.
    'నేను వెళ్ళలేను పెద్దమ్మా, కాలేజీలో పని చాలా వుంది. నువ్వెళ్ళకూడదూ? పెద్దదానివి. నువ్వెళితేనే బాగుంటుంది. బావ కూడా నిన్నే పంపించమన్నాడు.'
    పరమేశ్వరి వో క్షణం ఆలోచించి 'సరే! రేపు పొద్దుటి బస్ కు వెళతాను' అంది. పరమేశ్వరికి ఆ పెంచే మనిషిని కూడా చూడాలని వుంది. పసిబిడ్డను ఎవరి చేతుల్లోని పెట్టాలంటే కొంచెం బాధగా కూడా వుంది.
    'నేనే వచ్చి ఎక్కిస్తాను,' అంది మాధవి పరమేశ్వరి ఖాళీ గ్లాసు తీసుకొని అక్కడనుంచి వెళ్ళిపోయింది.

                                    11

    రాజారావు కట్నం డబ్బు పంపించి నట్లు చెప్పలేదు. మాధవి చెబితే శివ శాస్త్రి మొత్తం దబ్బు తీసేసుకుంటాడనీ భయపడ్డది. మధుకు ఇవ్వాల్సిన వెయ్యిన్నర ఇచ్చేశాక చెప్పాలనీ, మిగిలిన దబ్బు ఇంటి ఖర్చులకి పరమేశ్వరి చేతికి ఇవ్వాలనే అనుకుంది. పరమేశ్వరి బయటకు వెళ్ళగానే కళ్ళు మూసుకొని పడుకొంది. కునుకు పట్టింది.
    'ఏమ్మా! రాజా అమ్మాయిని పంపించమన్నాడట!' శివశాస్త్రి గది గడపలో నిల్చొని వున్నాడు.
    'అవును పెదనాన్నా!' ముభావంగా జవాబిచ్చింది. మాధవికి మాట్లాడాలని లేదు కాసేపు మౌనంగా, ఒంటరిగా కళ్ళు మూసుకొని పడివుండాలని వుంది.
    'మగవాడు ఎలా పెంచుతాడు? పెళ్ళి చేసుకుంటున్నాడా?'
    'లేదు.' అనబోయి 'నాకు తెలియదు' అనేసింది.
    శివశాస్త్రి మాధవి ముఖంలోకి పరిశీలనగా చూశాడు. ముఖం బాగా వాడిపోయి వుంది, రాజారావు మాధవిని చేసుకోవటం లేదనీ అందువల్లనే పిల్లను పంపించమన్నాడనీ అర్ధం చేసుకొన్నాడు. తేలిగ్గా నిట్టూర్చాడు. ఆ మధ్య కొంత కాలంగా అతనికి వో దిగులు పట్టుకొంది. మాధవి పెళ్ళి చేసుకోని వెళ్ళిపోతే ఇల్లు గడవటం ఎలాగా అనే చింత పీడించసాగింది. శివశాస్త్రికి సంతోషాన్ని కలిగించిన విషయం ఏదో మాధవి లీలగా గ్రహించింది శివశాస్త్రి చిన్నగా అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
    ఛ! ఏం మనుషులు! పెదనాన్న, ఒక నాడు తను ఆ ఇంటికి రావటానికి ఇష్ట పడని పెదనాన్న, ఈనాడు తను ఆ ఇంటిని వదలడం ఇష్టపడటం లేదు. తనే అతని బిడ్డయితే తన వివాహం గురించి ఆలోచించదా! అక్కయ్య పెళ్ళి కోసం ఎంత గొడవ పడిపోయాడు? రాధ తన పెళ్ళి తానే స్వయంగానే చేసుకోగలదని బహుశా నమ్మకమేమో? రాధ అప్పుడప్పుడు తెచ్చిపెట్టె చిరుతిండ్లకు ఆశ పడుతున్నాడు. కూతురు ప్రయోజకురాలనుకుంటున్నాడు. తను మాత్రం వివాహం చేసుకోకుండా అలాగే వుండపోతే చాలు పెదనాన్నకు. చీకూ చింతా లేకుండా తిని తిరగొచ్చును. ఎంత స్వార్ధం!
    తన జీవితం ఇలా వీళ్ళందరికోసం బలి అయిపోవాల్సిందేనా? తను ఎవరికీ అక్కర్లేదు. ఈ ఇంట్లో వాళ్ళకు తన సంపాదన కావాలి.
    చిన్నతనంలో తల్లిదండ్రుల చల్లని నీడకు దూరం అయింది. యవ్వనంలో మొదటిసారిగా తనను ఆకర్షించి, ఆశలు చూపించిన మధు కూడా తనను వదిలేసి వెళ్ళిపోయాడు. ఏఆధారం ఆసరాతో తను మిగిలిన జీవితాన్ని నిశ్చింతగా గడపాలని అభిలషించిందో అదీ తనకు లభించలేదు. భగవంతుడు తనను ఎందుకింత దారుణంగా శపిస్తున్నాడు!
    బావ దగ్గరకు వెళితే! బావకు తన అసహాయతను తెలియజేసి ఇంత ఆసరా ఇవ్వమని అడిగితే? బావ మంచివాడు. తప్పక తనను స్వీకరిస్తాడు. కాని...ఒకసారి అలా రాసిన బావ దగ్గరకు తను వెళ్ళి ఏం అడగగలదు? చిన్నప్పటినుంచీ తను ఎవర్నీ, నోరుతెరిచి ఏదీ అడగలేదు.
    తను బావను గౌరవించింది. మధును ప్రేమించింది. మధు దగ్గిర కెళ్ళి జరిగిందంతా చెబితే? పిచ్చి మధు! వట్టి ఉద్రేకం, బావతో తనను పార్కులో చూసి అపార్ధం చేసుకున్నాడు. మధు ప్రవర్తనకు ఆశ్చర్య పడవలసిందీ, అభిమాన పడవలసిందీ ఏమీ కాదు. ఆ పరిస్థితిలో మీరే కాదు ఎవరైనా అలాగే అర్ధం చేసుకుంటారు. తను మాత్రం ఏం చేసింది. మధుతో మనస్సు విప్పి మాట్లాడిందా? తనూ అభిమాన పడిందిగా? తను అడక్కుండానే నాలుగు వేలు అప్పు తెచ్చాడు. అది తీర్చటానికి ఓనర్ వర్కు చేశాడు. అదంతా ఎవరి కోసం చేశాడు? తన కోసమే, కేవలం తన బావను చేసుకోవటానికి సిద్ధపడింది. అందుకే తనకు భగవంతుడు మంచి శిక్షే విధించాడు.
    మధు ఎంత బాధపడి ఉండకపోతే తనకు ఒక్క ఉత్తరం అయినా రాయకుండా వుంటాడు! దబ్బు పంపించితే తన తండ్రి అడ్రసుకు పంపించమని పెదనాన్నకు అడ్రసు రాశాడు. ఆ అడ్రసు తన దగ్గిర వుంది. మధు ఉద్యోగం మానేసి వుంటాడు. లేకపోతే తన అడ్రసు ఇవ్వకుండా తన తండ్రి అడ్రసు ఎందుకు ఇచ్చివుంటాడు. రేపే తను వాళ్ళకివ్వవలసిన డబ్బు పంపించేస్తే? ఎలా?
    మాధవికి వో ఆలోచన వచ్చింది. ఆ దబ్బు వంకతో తను మధువాళ్ళ ఊరికి వెళ్ళవచ్చు. మధు కనిపిస్తే అన్ని విషయాలూ అభిమానపడకుండా మాట్లాడుకోవచ్చు. అలా కాకపోయినా మధు ఎక్కడ వుండేదీ, ఎలా వుందీ తెలుసుకోవచ్చు.
    తెల్లవారి పరమేశ్వరిని బస్ ఎక్కించి తనూ మధూ వాళ్ళ ఊరికి వెళ్ళటానికి నిశ్చయించుకొంది మాధవి అంతవరకూ బరువుగా వున్న మనస్సు కొంత తేలిక పడినట్లనిపించింది.
    అప్పటికి బాగా పొద్దువాటారింది. గదిలో ఉక్కగా వుంది. అలా చల్లగాలికి ఎక్కడికైనా వెళ్ళాలనిపించింది మాధవికి. కాని వోపికలేదు. లేచి ముఖం కడుక్కొని డాబాపైకి వెళ్ళి పచార్లు చేస్తూ ఆలోచిస్తూ, రోడ్డుమీద వచ్చేపోయే జనాన్ని చూస్తూ కాలక్షేపం చెయ్యసాగింది. దూరంగా రాధ, ఎవరో యువకుని పక్కగా నడుస్తూ కనిపించింది. అలా నడిరోడ్డున ఎవరితోనో రాసుకుంటూ నడుస్తున్న రాధను చూస్తుంటే మాధవికి ఎబ్బెట్టుగా తోచింది, అంతకుముందు రాధతో కనిపించె యువకుడు కాదు అతను, రోజుకొక యువకునితో అలా సంచరించే రాధ జీవితం, ఎటు పోతుందో, ఎక్కడకుపోయి ఆగిపోతుందోననే దిగులు కలిగించింది మాధవికి. ఏమయినాసరే రాధను మంచి మార్గంలో పెట్టటం, ఆ ఇంటికి పెద్ద పిల్లగా తన బాధ్యత వుంది!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS