Previous Page Next Page 
మారిన విలువలు పేజి 16

 

    అప్పన్న ప్రకాశానికి సొమ్ము ఎందుకు మదుపు పెడుతున్నాడో, వాళ్ళిద్దరి మధ్య అంత నమ్మకం ఎలా ఏర్పడిందో జానకికి కూడా అర్ధం కాలేదు.
    "ఏదో కుర్రాడు బ్రతికిందికి పాటు పడుతున్నాడు పొతే పోనీ అని కొంత సొమ్ము పారేసిందికి అప్పన్న కోటీశ్వరుడెం కాదు. ఎంత ధనవంతు లైనా నిరాపెక్షగా తమ సొమ్ము ఎదుటి వాళ్ళ మీద ఖర్చు పెట్టరు. ఆర్ధికంగా నో, వ్యావహారికంగానో , పారమార్ధికంగానో ఏదో లాభం అందువల్ల లభ్యం తుందన్న నమ్మకం కలగందే చెయ్యి విదిలించరు. అటువంటిది కిళ్ళీ కొట్టు పెట్టుకొని బ్రతుకుతున్న అప్పన్న....."
    "సరిగ్గా చెప్పేవు, అక్కా! కనిపించినవాళ్ళ కల్లా ధనం పంచిపెట్టే ఔదార్యం అప్పన్న దగ్గర లేదు. మనందరి లాగే అతనికీ డబ్బు మీది వ్యామోహం, తనది అనే మమకారం సమపాళ్ల లో ఉన్నాయి. నడి వీధిలో జల్లుకోనేటంత డబ్బు కూడా అతని దగ్గర లేదు. కాని, మనలో చాలామంది లో ఉండని గుణం ఒకటి అతని దగ్గర ఉన్నది. అది, ఎదుటి మనిషిని నమ్మడం. ఈ మంచి గుణం అతన్ని చాలాసార్లు మోసగించింది కూడా. అయినా దానిని విడిచి పెట్టలేక పోతున్నాడు.
    "అటువంటి నమ్మికతోనే నాకు సొమ్ము మదుపు పెట్టేడు. అతను సొమ్ము పెట్టేడు; నేను పని చేస్తున్నాను. లాభం ఇద్దరం సమంగా పంచుకొంటున్నాం. ఇది మా ఒప్పందం" అన్నాడు ప్రకాశం.
    ఇందులో ప్రకాశం పెద్దగా నష్ట పోయేందుకేమీ లేదనుకొన్నారు ఇంట్లో వాళ్ళు. ప్రకాశానికి మాత్రం అది జీవన్మరణ సమస్య గా అనిపించేది. తన నీతి నిజాయితీలను మదుపుగా పెట్టి మానవుల మంచితనం తో చేస్తున్న వ్యాపారం అది. అందులో లాభం వెంటనే కనిపించక పోయినా నెమ్మదిగా తేలుతుంది. తను చేయవలసినదల్లా అంతవరకు ఓపికతో గాడి తప్పకుండా నడిచి పోవడమే అనుకొన్నాడు ప్రకాశం.
    ప్రకాశం ఓపికతో ఎదురు చూసేడు. ఒకరోజు ఒక వారం కాదు; ఒక నెల, రెండు నెలలు కాదు; ఏడాది పాటు ఓపికతో ఎదురు చూసేడు -- తన డైరీ లో సంతృప్తి కరంగా ఒక్క వాక్యం వ్రాసుకోడానికి. ప్రకాశానికి డైరీ వ్రాసే అలవాటు మొదటి నుంచీ లేదు. కాని ఇటీవల కావాలనే ఆ అలవాటు చేసుకొన్నాడు. తన చుట్టూ పక్కల వాళ్ళ మాటలు తనలో ఎటువంటి ఊహలు రేకెత్తిస్తాయో , తన చేతలు వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయో రోజువారీ గా చూసుకొందుకు డైరీ లాటి ఒక వస్తువు అవసరం అనుకొన్నాడు.
    ఎన్నిసార్లో దాన్ని పేజీ తరువాత పేజీగా తిప్పి చూసుకొనేవాడు. మనసును తళుక్కున మెరిపించే మాటలు అరుదుగానే కనిపించేవి. అవైనా గమ్యం తెలియని మెరుపులు. నట్టనడి సముద్రంలో , నావలో ప్రయాణిస్తూ ఏ దిక్కో తెలియని పరిస్థితిలో ఆ చిన్న చీకటిని చీల్చుకొని ఆకాశం అంచులో ఓ మూల లీలగా మెరిసిన మెరుపు లాంటిది అది. అందువల్ల గమ్యం తెలియక పోయినా, చిట్ట చీకటిలో వెలుగును చూడగలిగెను అన్న సంతృప్తి కలుగుతుంది.
    అటువంటి మెరుపులు అ పీజీలలో అక్కడక్కడ కనిపించేవి. ఏ సహృదయుడైనా అతను చేస్తున్న పనిని సమర్ధిస్తున్నప్పుడో, ఏ ఉత్సాహవంతుడైనా -- "ప్రకాశం , నీలాటి వాళ్ళు ఈ సంఘంలో ఎంతైనా అవసరం" అని భుజం తట్టినప్పుడో అటువంటి వెలుగు కొద్దిగా కనిపించేది.
    మొట్ట మొదటి పేజీ అతని దృష్టి లో చాలాసేపు నిలిచేది. "ఆంధ్రులకు ఆరంభశూరత్వం ఎక్కువ అనే సామెతను నా పట్ల నిజం చెయ్యకు, భగవంతుడా! నేను పట్టిన మార్గం అవాంచనీయమైనది కాకపొతే నన్ను ముందుకు పోనీ. తాత తండ్రుల అడుగు జాడల్లో నడవని వాళ్ళు నాశనం అవుతారనే అభిప్రాయాన్ని మానవుల్లో బలపదనీయకు. కష్టించి పనిచేస్తే అభివృద్ధి దేనిలో నైనా పొందవచ్చు అన్న నా నమ్మకాన్ని నాశనం చెయ్యకు."
    ఇది ప్రకాశం తన డైరీ మొదటి పేజీ లో వ్రాసుకొన్న దైవ ప్రార్ధన, జీవిత ఆశయం కూడా. రోజూ ఈ మాటల్ని మననం చేసుకొనేవాడు. ఆరునెలల దాకా అతను వేసిన అడుగు వేసిన చోటునే నిలిచిపోయినట్లు అయింది. ఇంటా బయట కూడా ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.
    "ఏమయ్యా పంతులూ! సదువుకొన్నోడివి. మా పొట్టల మీద కొట్టకపోతే ఉద్దోగం చేసుకోకూడదా?" అనేవారు మిగిలిన పేపర్లు ఇస్తున్నవాళ్ళు. వాళ్ళంతా కట్టుకట్టి ప్రకాశానికి వాడుకలు దొరక కుండా చేసేవారు. సైకిలు షాపు వాళ్ళకు లంచం పెట్టి అతనికి సైకిలు అద్దె కివ్వకుండా చేసేవారు.
    "నువ్వు సైకిలు పట్టుకొని ఉడాయిస్తే, ఎక్కడని వెతుకుతాము? పాతిక రూపాయల డిపాజిట్ కట్టు. ముక్కు , ముఖం తెలియని వాళ్ళకి మేము సైకిళ్ళు ఇయ్యం" అనేవాడు మిగిలిన వాళ్ళ నుంచి లంచం తిన్న సైకిలు కొట్టు యజమాని.
    కాదు, కూడదని వాదిస్తే ఏ బొక్కి సైకిలో పడేసేవాడు. ఆది పదడుగులు నడిచేసరికి గొలుసు తప్పెడి పోయేది. రెండు వీధులు తిరిగేసరికి టైరులో గాలి యెగిరి పోయేది. అక్కడి నుండి మిగిలిన ఇళ్ళన్నీ తనతో పాటు సైకిల్ ను నడుపుకుంటూ పేపర్లు ఇవ్వవలసి వచ్చేది ప్రకాశానికి.
    "ఏమిటోయ్ , మరీ ఇంత లేటు చేస్తున్నావు? మిగిలిన వాళ్ళంతా ఏనాడో ఇచ్చి పోయేరు" అనేవారు వాడుకదారులు.
    ఇది పని కాదని ప్రకాశం రెండు మూడు రోజుల సైకిలు తీసుకోనకుండా పరుగుపెట్టి పేపర్లు అందిచ్చేడు. అతి చల్లని ప్రాతః కాల సమయం లో కూడా అతని బట్టలు చెమటతో తడిసి పోయేవి. పని పూర్తయేక పది నిమిషాల దాకా ఊపిరి అందుకోలేక ఒక మూల కూలబడేవాడు.
    నాలుగు రోజుల నాటికే అది ఆచరణ యోగ్యమైన ఆలోచన కాదని తెలుసుకొన్నాడు. తను ఈ వృత్తిని నిర్వహించాలనుకొంటె రెండే రెండు మార్గాలు ఉన్నాయి. స్వంత సైకిలేనా ఉండాలి; లేదా ఈ వృత్తి లో ఉన్న వాళ్ళను మంచి చేసుకోవాలి. మొదటిది డబ్బుతో సమకూడవలసిన పని. రెండవది మంచి మాటలతో అనుకూలించవచ్చును అనుకొన్నాడు ప్రకాశం.
    పేపరు కుర్రాళ్ళంతా తమ తమ పేపర్లు తీసుకొని సైకిళ్ళ కు బిగించి కట్టుకొని, రేసుకు సిద్దంగా ఉన్న పందెపు గుర్రాల్లా సైకిలు హేండిల్ బార్ల మీద చేతులు పెట్టుకొని నిలబడ్డారు. ప్రకాశం తన కట్ట పేపర్లు చేతిలో పట్టుకు నించున్నాడు.
    "ఏం, పంతులూ! ఈరోజు పేపర్లు పంచవా?"
    "ఎలా పంచేది? నేనూ మీతో పాటు బ్రతుకుదామని వస్తే, మీరంతా కట్టుకట్టి నన్ను తోసేస్తున్నారు. మీరింత మంది ఉండగా నేనొక్కడ్నీ ఎక్కువై పోయానా?" చెప్పండి మరి."
    "అది కాదు పంతులూ. చదువుకున్నోడివి ఏదో నౌకరీ చూసుకుంటే సరిపాలా? ఇక్కడి కెందుకు రావాలా అని?"
    "నౌకరీ సరిపోయే చదువుంటే ఇక్కడి కెందుకు వస్తాను? అది లేకే ఈ పని"అన్నాడు ప్రకాశం.
    "అయితే నీకూ మాలానే సదువు సంధ్యలు లేవన్న మాట. మరి అంత సోగ్గా బట్టలేత్తావు!నీటుగా తల దువ్వుతావు!ఇంకా ఏదో పెద్దోడివనుకున్నాము."
    ప్రకాశం అన్నమాట వాళ్ళకు చాలా హితవుగా ఉంది. అతడు ఏదో విధాన తమ కన్న అధికుడన్న భావన వాళ్ళలో కలిగి, అతన్ని ముందుకు పోనీయకుండదన్న ఈర్ష్యతో అడ్డు తగిలేరు. ఇప్పుడు అతడూ తమలాటి ఆశక్తుడే అని తెలుసుకొన్నాక వాళ్ళకు అతని మీద సానుభూతి కలిగింది.
    "ఎర్రతొక్కరా. అందుకే డాబుగా కనిపిస్తడు. పోనీండ్రా . వచ్చినాడు తిరిగి ఎక్కడకు పోతడు!ఆడికీ ఓ సైకిలియ్యమను" అన్నాడు అందరికీ నాయకుడి వంటి రాములు.
    అంతటితో ప్రకాశం సమస్యలు తీరిపోయేయని చెప్పేందుకు లేదు. పగలల్లా ఎంత కష్టపడినా తగినంత డబ్బు కళ్ళపడేది కాదు. సైకిలు అద్దెకు, కాఫీకి పోగా మిగిలిన డబ్బులు చూసుకుంటే,దీని కోసమేనా తను రోజల్లా రెక్కలు ముక్కలు చేసుకొన్నది అనిపించేది అతనికి.
    "ఏదిరా నీ ఆర్జన? ఏరోజూ ఇంటికి రాదేం? ఏమాత్రం కూడదీ సేవేం? అంతా ఒక్కసారే చూసి మమ్మల్ని ఆశ్చర్య పరుద్దాం అనుకొంటున్నావా?' అని హేళన చేసేవాడు అన్న.
    "నే చెప్పలా, పంతులూ, ఈ పని  కూడూ, గుడ్డా పెట్టదని? ఉట్టి దండగ మారి బేరం. ఏదైనా ఎపారం పెట్టవయ్యా అంటే ఇన్నావా?' అనేవాడు అప్పన్న.
    "వ్యాపారం అంటే పెట్టుబడి కావాలప్పన్నా! పెట్టుబడికి నా దగ్గర సోమ్మెక్కడుంది? ఒకవేళ అదృష్టం కలిసొచ్చి ఏదైనా వ్యాపారం పెట్టినా దీనికి అనుసరించే ఉండాలని నా కోరిక. ఇది ఒక వృత్తిగా స్వీకరించేను. దీని సంగతేదో
పూర్తిగా చూడంది వదలలేను. వదలదలచలేదు" అనేవాడు ప్రకాశం.
    ఆరునెలలు గడిచేసరికి ప్రకాశం కాస్త కాలు నిలదొక్కుకున్నాడు. అతని పనిని, ఉనికిని చాలామంది గుర్తించేరు. సహృదయుల దగ్గరి నుండి సలహాలు కూడా అందజోచ్చాయి. తన్నేరిగిన అందరి దగ్గరి నుండీ మంచి మాటనే ప్రతిఫలంగా పుచ్చుకొని తన చేతనైనా విధంగా వారికి సహాయపడేందుకు ప్రయత్నించేవాడు ప్రకాశం. ఆమంచి భావననే పెట్టుబడిగా పెట్టుకుని తనొక నాడు ఆభివృద్ధి , పొందవచ్చునన్న నమ్మకం అతనికి ఉంది.
    "ఆ పేపర్లిచ్చే కుర్రడేనా? ఎరగా.... బొద్దుగా.... అయ్యో తెలియక పోవడమేమిటి? మా పిల్లల్ని రోజూ స్కూలు బస్సెక్కిస్తుంటాడు. దూరం నాలుగడుగులైనా మెయిన్ రోడ్డు దాటి వెళ్ళాలా, పిల్లలు ఏ కార్ల క్రింద పడతారో అని భయపడేదాన్ని. ఉదయం పని వేళలో ఇల్లు వదిలి పది నిమిషాలైనా బయటికి వెళ్ళిందికి వీలు పడక చచ్చేదాన్ననుకోండి.
    "ఫరవాలేదమ్మా. ఆ సమయానికి నేపెపర్లివ్వడం అయిపోతుంది. ఈ దారంటేగా ఇంటికి పోతాను? పాపాల్ని బస్సెక్కించి వెళ్ళిపోతాను లెండి" అన్నాడు. పాపం, రోజూ వేళకు వచ్చి పిల్లల్ని తీసుకు పోతాడు. నా ప్రాణం తెరిపిగా ఉన్నదనుకొండి."అంటుందోక ఇల్లాలు.
    "అయ్యో , ఈపాటి దానికే మీరు చెప్తున్నారు! మొన్న మేము ఇల్లు మార్చేటప్పుడు ఎంత సహాయ పడ్డాడని! ఈ కుర్రాడు లేకపోతె ఈ పనాయెదా అని అనిపించిందంటే నమ్మండి." ఇంకో గృహిణి అభిప్రాయం.
    "చిన్నపని , పెద్దపని ఏం చెప్పినా చేసి పెడతాడా? ఒక్క రోజైనా , అమ్మా, నాకిది కావాలని అడగడు సుమండీ!" ఇంకో ముసలమ్మకు అతనిలో కనిపించిన మంచి గుణం.
    "ఎవరో మర్యాదస్తులైన కుటుంబం లోని వ్యక్తీ లాగే ఉన్నాడు. పాపం ఇంట్లో పోట్లాడి వచ్చేడో, లేక ఇంటి వాళ్ళే వెళ్ళగొట్టేరో?కాస్త చదువు, సంధ్య ఉన్నవాడి లాగే అగుపిస్తాడు." ఇవన్నీ ప్రకాశం గురించి అతని పుట్టు పూర్వోత్తరాలు తెలియని వారి అభిప్రాయాలు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS