Previous Page Next Page 
పాప నవ్వింది పేజి 15

 

    కమల యాంత్రికంగా పాపని రమణమ్మ కిచ్చి తన గదిలో కొచ్చింది. తలుపేసుకుంది. ఏ తటపటాయింపు ముందు వెనకలు లేకుండా తన సామాన్లన్నీ గబగబా సర్దుకుంటున్నది. పక్క చుట్టతో సహా చడీ చప్పుడూ లేకుండా.
    రాజేశ్వరికి భయం వేసింది. కమల గదిలో తలుపు వేసుకుని ఏం చేస్తున్నట్టు? చడీ చప్పుడు లేదు. రమణమ్మ చేత పిలిపించింది. జవాబు లేదు. తను పిలిచింది. ఫలితం కనిపించలేదు. ఎమిటైందో కమల లోపల ఏ స్థితిలో వుందో అన్న ఆందోళన లో శ్రీనివాసరావు గారి చేత పిలిపించింది. తమ పిలుపులే తనని వెక్కిరించినై ఆ నిశ్శబ్దంలో.
    'ఇక తలుపులు పగలగొట్టటానికి ముందు ఒక్కసారి 'పాపచేత పిలిపిద్దాం.' అన్నాడు అయన. దాంతో నిద్రపోతున్న పాపని లేపి తీసుకొచ్చారు. 'పాపా కమలను పిలమ్మా. అన్నం తినకుండా పడుకుంది' అన్నారు.
     పాప 'కమలీ కమలీ తలుపు తియ్యి' అంటూ కొట్టింది. సమాధానం లేదు. 'కమలీ నాకు నిద్రొస్తుంది రా కమలీ' అంటూ తలుపు బాదింది. కమల రాకపోవడంతో పసిపిల్ల ఇక పట్టలేక ఏడుస్తూ 'కమలీ అమ్మా అమ్మా' అంటూ ఏడుపు పెద్దది చేసింది. ఈ ఆఖరు పిలుపుకి కమల బైటి కొచ్చింది.
    ముఖంలో ఏడ్చిన గుర్తులేమీ కనపడలేదు. కాని పది లంకణాలు చేసినట్టుంది. పాప నెత్తుకుని 'అన్నం తిన్నావా పాపా' అని అడిగింది. పాప ఔననగానే 'సరే బజ్జో ' మని బుజానేసుకుంది. అలిసి సగం నిద్రట్లో లేచిన పాప వెంటనే నిద్రపోయింది.
    పాపని పడుకోబెట్టి కమల సరాసరి రాజేశ్వరి దగ్గరికి వెళ్ళింది. ఇంకా మనిషి లోని జడత్వం ఏమీ వదలలేదు.
    కమల తలుపులు తియ్యటం చూసి వెళ్ళిపోయిన రాజేశ్వరి తల పట్టుకుని కూర్చుని వుంది. కమల దగ్గరి కెళ్ళి 'నేను వెళ్ళిపోతున్నానమ్మా' అంది.
    రాజేశ్వరి నోటమాట రాలేదు.
    తను చెప్పవలసింది చెప్పటం అయిపోయినట్టుగా కమల వెనుతిరిగింది.
    రాజేశ్వరి తేరుకుని 'కమలా ఆగమ్మా. నీకు జరిగిన అవమానానికి నేనెంతో దుఃఖ పడుతున్నాను. నేనూ ఆడపిల్లని కన్న తల్లినే. నాకు నీ బాధ అర్ధమౌతున్నదమ్మా. రాను రాను నువ్వు నాకు నీరజతో పాటే ఐనావు. నీకు జరిగిన అవమానం నాక్కూడా తల్లీ. నా మాట విను.' అని చెప్తున్నా రాజేశ్వరి కి తన మాటలు అసలు కమల చెవుల్లో దూరినయ్యా లేదా అన్న అనుమానం వచ్చింది. కమల శూన్యపు చూపు చూసి.
    రాజేశ్వరి కమల చేతులు పట్టుకుని 'కమలా నీ చేతులు పట్టుకు అడుగుతున్నానమ్మా క్షమించు. ఆ ఆప్రాచ్యుడు శ్రీపతి బదులు నేను క్షమాపణ కోరుతున్నాను కమలా' అంది దీనంగా.
    ఆ శ్రీపతి అన్న మూడక్షరాలతో కమలకి భావరహితమైన చూపులు వదిలినై. జడత్వం వదిలింది. వెంటనే రాజేశ్వరి చేతులు పట్టుకుని 'అట్లా అనకండమ్మా , పెద్దవారు మీరు క్షమాపణ కోరడం నాకు శ్రేయస్సు కాదు. నా కేవరి మీదా కోపం లేదు. కాని నేనింక ఈ ఇంట్లో వుండటం మాత్రం జరగని పని. నేనిప్పుడు వెళ్ళటం తప్పదన్నది.
    రాజేశ్వరి నీళ్ళు కారిపోతూ 'కమలా కోపం లేదంటూ మళ్ళీ వెళ్ళిపోతానంటావేమ్మా. అందులో ఈ రాత్రి పూజ ఆడపిల్లవి ఎక్కడి కెళ్తవ్. నా మాట విను. నిన్ను వదిలి పాప ఒక్క గంట కూడా వుండలేదన్నది.
    'నిజమే కాని పసిపిల్ల. నాలుగు రోజుల్లో మర్చిపోతుందమ్మా' అని ఈ రాత్రి నేను ఆశ్రమం లో గడుపుతా. రేపొద్దున్న మా యింటి కెళ్తను. నన్నిబ్బంది పెట్టకండి. పాప రాత్రికి లేచి అడుగుతుందేమో పక్కనేవరైనా దగ్గర పడుకోండని చెప్పి తన గదిలో కెళ్ళి పెట్టె బేడా బైట పెట్టుకుంది.
    ఇంక చెప్పినా వినదనుకుని రాజేశ్వరి 'కమలా ఇప్పుడు వెళ్తే వెళ్లావు కాని నేనెప్పుడూ నీకోసం ఎదురు చూస్తూ ఉంటానని జ్ఞాపకం పెట్టుకో. పాప సంగతి చెప్పక్కర్లేదు కదా. నిన్ను మళ్ళీ ఇక్కడికి తీసుకురాక మానను.' అంటూ 'బిక్షాలూ సామాను కార్లో పెట్టు. అమ్మాయిని ఆశ్రమంలో దింపి రమ్మని ఖాదర్ తో చెప్పు' అన్నది.
    ఆవిడకి ఆ క్షణాన మునుపు కమల ఆశ్రమం గురించి అన్న మాటలు గుర్తు కొచ్చినై. కళ్ళు నీళ్ళతో నిండినై. కమల వెంట వాకిలి దాకా వచ్చింది. కమల రాజేశ్వరికి, శ్రీనివసారావు గారికి నమస్కరించింది. కారెక్కి తలతిప్పి చూసేటప్పటికి శ్రీపతి హల్లో తను వెళ్ళడం చూస్తూ నిలబడి వుండటం గమనించింది.
    శ్రీపతి ఈ రెండు గంటలూ నానా విధాల మానసిక బాధ అనుభవించాడు. తను చేసిన పని ఎట్లాంటి పరిస్థితుల్లోనూ సమర్ధించలేనిదని తెలుసు. కాని ఆ క్షణాన కన్న కూతురు తనకి దూరం కావడం పట్టలేక ఆవేశపడ్డాడు. ఇంట్లో జరుగుతున్నదంతా తెలుస్తూనే వుంది ఇంతసేపు. తనే వెళ్ళి క్షమాపణ అడుగుదామనుకున్నాడు. కాని పోలేకపోయాడు. కమల నిరాకర్తిస్తుందని . వెళ్ళేటప్పుడైనా వొద్దని చెప్తామని బైటి కొచ్చాడు. కాని కమల ప్రాణం లేని యంత్రం అల్లే నడుస్తూ వెళ్ళటం చూసి మనసు బాధతో లుంగలు చుట్టుకుపోయి మూలిగింది. చేతులు కాళ్ళు ఆడలేదు. నోటమాట రాక స్థాణువల్లె నిలబడిపోయినాడు.
    ఈ స్థితిలోనే కమల కళ్ళ పడ్డాడు. కమల వో క్షణం చూసి తల వంచుకుంది. కారు కదిలింది. ఉస్సురంటూ ముగ్గురూ వెనక్కి తిరిగారు. రాజేశ్వరి రాతి విగ్రహం మల్లె నుంచున్న శ్రీపతిని చూసి ముఖం తిప్పుకుని విసురుగా లోపలి కెళ్ళింది.
    ఆరోజేవరికి నిద్రలేదు. పెద్దవాళ్ళకి పట్టలేదు. పాప మధ్యమధ్య లేచి 'కమలీ' అంటూ ఏడవటం తో తెల్లవారింది. పాప లేస్తూనే కమలీ అంటూ కూర్చుంది ఏడుస్తూ. రమణమ్మ ఎంత చెప్పినా వినకపోవడంతో రాజేశ్వరి సతమతం కావాల్సి వొచ్చింది. కాని మాధురిని పట్టటం కష్టమనిపించింది. ఇక లాభం లేదని పిల్లని కార్లో బైట వొంతులేసుకుని అన్ని చోట్లకీ తీసికెళ్ళి తిప్పుతూ అన్నీ చూపిస్తూ మధ్య మధ్య కమలీ కావాలి అంటూ పాపా చేసే అడగడాన్ని మరిపిస్తూ గడిపారు.
    రాత్రి మళ్ళీ పాపా పెద్దలూ జాగారమే. కమలీ ఆ పాట పాడేది ఈ కధ చెప్పేది. అన్నం అట్లా పెట్టేది. దుప్పటి ఇట్టా కప్పేది అంటూ పాప ఏడుపు. ఇంటిల్ల పాదికి పాపనెట్లా సముదాయించాలో అర్ధం కాలేదు. ఎట్లా తెల్లవారుతుందా అని పానాలు బిగపట్టు కూర్చున్నారు.
    తెల్లవారిం దేట్లాగో ఇంకా చేసేది లేక శ్రీనివాసరావుగారు ఆశ్రమానికి కారు పంపారు. కమల కోసం. ఆ కిందటి రోజే కమల వెళ్ళిపోయినట్టు తెలిసింది. కారు మళ్ళీ కమల ఇంటికి పంపించారు. కమల డ్రైవర్ ని పాప యోగ క్షేమాలడిగి పంపించేసింది. ఖాదర్ తిరిగొచ్చాడు కమలమ్మ జబ్బు పడ్డట్లుందంటూ.
    ఆరాత్రి పాపకు జ్వరం తగిలింది. ఈ రెండు రోజులుగా పాప కడుపునిండా తినలేదు . నవ్వలేదు. చుట్టూ తన మనుషులుండి అడిస్తుంటే ఏదో కాలక్షేపం చేసింది కాని ఆ చిన్నమనసు కమలని చూడకుండా వుండలేక పోయింది. ఆ రాత్రింకా 'కమలీ అమ్మా' అంటూ కలవరించింది. రాజేశ్వరి పక్కనే కూర్చుంది. శ్రీపతి కూడా అక్కడే వున్నాడు. ఇప్పుడు శ్రీపతి కూతుర్ని ఒక్క నిమిషం వదలడం లేదు.
    తల్లీ కొడుకూ మాట్లాడుకోటం లేదు పాప విషయం తప్ప.
    మర్నాటికి పాప జ్వరం ఇంకా ఎక్కువైంది. డాక్టరు 'బిడ్డ దేనికోసమో ఆందోళన పడుతున్నదమ్మా మన మందులేవీ పనిచెయ్యవు ఆ కోరేదివస్తే ఈ మందులక్కర లేదన్నాడు.
    రాజేశ్వరి ఒక నిర్ణయాని కొచ్చింది. ఇక తను చూస్తూ వుంటే లాభం లేదు. కమల కోసం ఎవర్ని పంపించినా సమయం దండగే కాని కమల రాదు. ఎవరికీ ఏమీ చెప్పలేదు. కార్లో వెళ్ళి కూర్చుని ఖాదర్ ని కమల దగ్గరకి తీసికెళ్ళమంది.
    రాజేశ్వరి వెళ్ళేటప్పటికీ కమల చలనం లేకుండా మంచంలో పడుకుని వుంది. కప్పుకేసి చూస్తూ . ఇంట్లో అద్దె కున్నవాళ్ళు చెప్పారు. ఈమూడు రోజుల్నించి తిండి తినలేదని వాళ్ళు బలావంతాన కాస్త కాఫీ తాగిందని.
    కమలని చూసేటప్పటికి రాజేశ్వరి మనసు తరుక్కుపోయింది. గబగబా వెళ్ళి మంచం మీద కూర్చుని 'కమలా కమలా' అంటూ రెండు చేతులూ పట్టుకుని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది.
    కమల రెండు క్షణాలు అయోమయంగా చూసి అమాంతం లేచి కూర్చుని 'మీరా అమ్మా? ఇట్లా వచ్చారేమైంది? పాప బాగానే వుంది కదా' అంటూ ప్రశ్నలు కురిపించింది.
    రాజేశ్వరి కళ్ళు తుడుచుకుంటూ జరిగిందంతా చెప్పి డాక్టరు మాటలు చెప్తూ కమలా నువ్వు ఇక్కడిట్లా పడివున్నావు. అక్కడ పాప అట్లా వుంది. నువ్వు రాకపోతే ఏమౌతుందో చెప్పలేం తల్లీ. నువ్వు రాక తప్పదు. నిన్ను తీసికెళ్ళటానికి నేనోచ్చాను. నువ్వు రాకపోతే నేనుపోను. నా మాట తీసేయ్యలేవని నేనే వచ్చానమ్మా' అంది. కమల నీరసంగానే వెంటనే లేచింది. రాజేశ్వరి ఖాదార్ ని పిలిచి విప్పకుండా ఎక్కడివక్కడ పడేసి వున్న సామాన్ల ని కార్లో పెట్టించింది.' తాళం పెట్టింది. కమలను చేత్తో నడిపించుకుంటూ కార్లో ఎక్కించి బరువు తీరిపోయినట్టు నిశ్చింతగా ఊపిరి పీల్చింది.
    ఇంట్లో అడుగు పెట్టేటప్పటికీ పాప కమలీ కమలీ అంటూ అరుస్తుంది. శ్రీపతి, శ్రీనివాసరావు గారు ఏదో చెప్తున్నారు.
    కమల సుడిగాలల్లె పరిగెత్తుకుంటూ 'పాపా' నేనోచ్చేశానమ్మా నీ కమలీ వొచ్చిందంటూ పాపని చేతుల్ల్లోకి తీసుకుంది కన్నీళ్లు కారుస్తూ.
    అంత జ్వరం లోనూ పాప కళ్ళు తెరిచి చూసి 'వచ్చావా అమ్మా కమలీ అంటూ భుజం మీద తల పెట్టుకుని యిట్టె నిద్రపోయింది. అది చూసిన వాళ్ళందరి కళ్ళు వర్షించినై.
    అంత నీరసం లోనూ కమల పాప దగ్గరే వుంది. అన్ని చూస్తూ. నిద్దట్లో కూడా కమల చెయ్యి వదల్లేదు పాప. మెల్లగా జ్వరం డాక్టర్ చెప్పినట్లే జారటం మొదలెట్టింది. పాప కొంచెం కొంచెం కళ్ళు తెరిచి కబుర్లలో పడ్డది. 'వోదిల్తే మళ్ళీ వెళ్ళిపోతావని కమల చెయ్యి మాత్రం వదల్లేదు.
    రాజేశ్వరి బలవంతాన కమల చేత పాప మంచం దగ్గరకే తెచ్చి పాలు తాగించింది.
    జ్వరం సాంతం తగ్గింది. మధ్యాహ్నం వేళకి పాపా, కమలా కావలించుకు పడుకుని నిద్రపోతున్నారు. వాళ్ళేట్లా వున్నారో మాట్లాడాలని వచ్చిన రాజేశ్వరి అది చూసి ఇద్దరి తలలూ ఆప్యాయంగా తాకి బైటికి నడిచింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS