నేటి హిరణ్యాక్షుడు
ఇరవైయేళ్ళ కిందట నమశ్శివాయ ఈ వూరొచ్చినప్పుడు ఏ
చిరునవ్వును తీసుకొచ్చాడో అది ఇప్పటికీ అతని ముఖార
విందాన్ని అలంకరిస్తూనే ఉంది.
కొంతమంది చిరునవ్వును అంటించుకుని తిరుగుతారు.
వాళ్ళ మొగం చూసీ చూడగానే అది తెచ్చిపెట్టుకొన్న
నవ్వని తెలిసిపోతుంది. కొంతమంది అవసరం పడినప్పుడు
దరహాసం ధరిస్తారు. అదీ కృత్రిమమే అనీ మనం ఆయాసం
లేకుండా గ్రహించేస్తాము. నమశ్శివాయ చిరునవ్వు మాత్రం
కర్ణుడి కవచకుండలాలలాగ అతనిలో సహజంగానే
పుట్టుకొచ్చింది.
అంత చిక్కని చిరునవ్వుకు హక్కుదారుడైన నమశ్శివాయను హిరణ్యాక్షుడనీ బకాసురుడనీ అంటే ఎవరూ ఒప్పుకోరేమో? పైకి కనబడని రాక్షసత్వం అతనిది. ఈనాటి రాక్షసులు ఎంతో అందంగా కనబడతారు. నేనుకూడా మొదటిసారి నమశ్శివాయని కలుసుకున్నప్పుడు ఇలాగే పొరబడ్డాను. గాలం విసిరినట్లు నామీద తన చిరునవ్వును ప్రయోగించాడు.
నమశ్శివాయ యీ కాలపు బీల్జిబజ్ అని తెలుసుకోవడానికి నా కెంతోసేపు పట్టలేదు.
నమశ్శివాయ దొంగ. పచ్చి దొంగ. గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ తెలిసినవాడు. వాటికి కావలసిన మెరుగులన్నీ ఇచ్చి తన దొంగతనాన్ని ఒక లలితకళగా అభివృద్ధి చేశాడు.
కానీ ఈ దొంగకి శిక్షలేదు. అసలు నమశ్శివాయ చేస్తున్నది దొంగతనం అని గుర్తించడమే కష్టం. దొంగతనం చెయ్యవలసిన అవసరం ఏముందతనికి? బోలెడంత ఆస్తి ఉన్నవాడు. ఇరవైఏళ్లుగా వ్యాపారంచేసి ఆ ఆస్తిని మరింత అధికంచేశాడు. పదిమందిని తనకింద ఎప్పుడూ పోషిస్తున్నవాడు. ఒక్కడూ పట్టుమని ఒక ఏడాదిపాటయినా తన దగ్గిర పని చెయ్యకపోతేనేంగాక! ఎవ్వరినీ తన నోటితో తాను పొమ్మనలేదు. వాళ్ళంతా వాళ్ళుగాపోతే ఉండమని ప్రాధేయపడనూ లేదు.
నమశ్శివాయ ఎంత పెద్దమనిషి తరహాగా కనబడతాడు! ఊళ్ళో అతనికెంత పలుకుబడి ఉంది! అతనా దొంగ? నమశ్శివాయ దొంగతనం చేస్తాడంటే అలా అన్నవాడినే అంతా తిడతారు.
నన్ను తిడితే తిట్టండి కాని నమశ్శివాయ దొంగ అనడం మానలేను. అయితే పోలీసుల నోటీసులోకి వచ్చే దొంగతనం కాదతనిది. కోర్టులో ఫిర్యాదుచేస్తే ఋజువు లేదు పొమ్మంటారు. చోరీ సరుకు నమశ్శివాయ తనదగ్గిర అట్టిపెట్టుకోగలిగినది కాదు. ఇంకొకళ్ళ దగ్గర దాచిపెట్టగలిగినదీ కాదు.
నమశ్శివాయ ఇతరుల మనశ్శాంతిని అపహరిస్తూ ఉంటాడు.
చెప్పేనుకాదూ ఈ దొంగతనానికి హైకోర్టుకి వెళ్ళినా శిక్షలేదు. పది పదిహేనేళ్ళనుంచీ నమశ్శివాయని బాగా ఎరుగుదును నేను ఎవరి మనశ్శాంతినైనా ఇట్లే చిత్రంగా లాగెయ్యగలడతను. ఇతరుల మనశ్శాంతిని తస్కరించి ఏం చేసుకుంటాడతను? ఈప్రశ్నకి జవాబు చెప్పగలగడం కష్టమే నిజానికిది తనకెందుకూ ఉపయోగపడదు. ఇంకొకడికి మనశ్శాంతి లేకుండా చెయ్యడంవల్ల నమశ్శివాయకి లభించే లాభం రూపాయణాపైసల్లో లెక్కించదగ్గది కాదు ఎదుటివాడి మనశ్శాంతిని తొలగించ గలగడమే ఒక ప్రజ్ఞ. దాన్ని కోల్పోయినవాడు చిత్రహింసపడుతూ ఉంటే నమశ్శివాయకి అమేయమైన ఒకానొక ఆధ్యాత్మికానందం కలుగుతుంది.
తూరిగను పట్టుకొని ఒక కాలు లాగీ, ఒక రెక్క విరిచీ చిన్నపిల్లడు చెప్పరాని సంతోషం పొందుతాడు ఇది కేవలం చిన్నతనపు సరదా నమశ్శివాయ దీనిని అత్యున్నత శిఖరాలకి తీసుకుపోయాడు. మానసిక వీధుల్లో సాగించే దండయాత్ర అతనిది. ఎంత గుండెనిబ్బరం కలవారైనా నమశ్శివాయ ధాటికి తట్టుకోలేరు.
విధేయంగా తమ మనశ్శాంతి నతనికి సమర్పించుకొని తిరోగమించ వలసిందే.
యక్సురేవేసి వైద్యుడు దుష్టాంగాన్ని పోల్చుకుంటాడు క్లోరోఫారం యిచ్చి నొప్పి లేకుండా శస్త్రవైద్యం చేస్తాడు. నమశ్శివాయది యక్సురే చూపు. ఎదుటివాడి మనస్తత్వాన్ని ఇట్లే చదివేస్తుందా చూపు వాడిమీద క్లోరోఫారంలాగ పని చేస్తుంది. నమశ్శివాయ చిరునవ్వు మనశ్శాంతిని లాక్కుంటున్నప్పుడు రోగికి ఏమాత్రమూ నొప్పి అనిపించదు. తర్వాత యావజ్జీవితం తహతహలాడిపోతాడు పాపం ఆ అనాధ ప్రాణి.
అది గర్వం అనుకోండి మరేదైనా అనుకోండిగాని నేనొక్కన్నే నమశ్శివాయతో నెగ్గుకొస్తున్నాను. ఎన్నోసార్లు నమశ్శివాయ నామీద రకరకాల అస్త్రాలు ప్రయోగించి చూశాడు. కోల్పోవడానికి నా కసలు మనశ్శాంతి అనేదే లేదు. ఆ సంగతి నమశ్శివాయకి తెలియకపోవడమే నా తురుఫాసు.
ఎన్నోసార్లు నన్నతడు తన చక్రబంధంలోనికి ఈడ్వాలని చూశాడు. నే నంగీకరించినట్లే కనబడేవాణ్ని నన్ను చాలా ఆప్యాయంగా పలకరించి ఏవేవో ప్రతిపాదనలు చేస్తాడు. అన్నిటికీ నేను ఔనని తల వూపుతాను. ఆ ప్రతిపాదనలు అమలు చెయ్యడమనేది ఉండదని మా యిద్దరికీ తెలుసును. కాని చర్చించేటప్పుడు మాత్రం ఒక చిన్న విషయాన్ని కూడా మరిచిపోకుండా ప్రణాళికలు వేస్తూ ఉంటాం.
"రేపు మెయిల్లో మనం బొంబాయి వెళుతున్నాం మీరు సరాసరిగా స్టేషనుకి వచ్చేయ్యండి. సీట్లు రిజర్వు చేయించేస్తున్నాను" అంటాడు నమశ్శివాయ.
హోల్డాలయినా తీసుకెళ్ళకుండా మర్నాడు మనిషిని మాత్రం స్టేషనులో హాజరవుతాను. రిజర్వేషను ఉండదు. నమశ్శివాయ రాడని నాకు తెలుసును. నేనతనికోసం కాసుకుని కాసుకుని నిరాశ చేసుకుని బెంగగా యింటికి పోతానని నమశ్శివాయ ఉద్దేశం. అతను రాడని రుజువు చేసుకోడానికే నేను స్టేషనుకి వెళ్ళి బొంబాయి మెయిలు కదిలేదాక వుండి తిరిగి పోతాను.
మర్నాడో వారం రోజుల తర్వాతనో మళ్ళీ మేం యిద్దరం కలుసుకున్నప్పుడు ఒక్కరమూ ఈ సంగతి ఎత్తము నమశ్శివాయ మరేదో కొత్త ప్రతిపాదన చేస్తాడు. నేను సావకాశంగా వింటాను. నాకు తోచిన సలహాలేవో ఇస్తాను. "రాజేశ్వర్రావుకి ఈ ఉద్యోగం ఇస్తే ఎలా వుంటుందని మీ ఉద్దేశం?" అని అడుగుతాడు నమశ్శివాయ ఓహో రాజేశ్వరరావు మనశ్శాంతిని దొంగిలించాలని ప్రయత్నమన్నమాట అని నేను మనస్సులో అనుకోని కొంచెంసేపు ఏమీ మాట్లాడను.
"ఏం మాట్లాడరు?"
"అదే ఆలోచిస్తున్నాను రాజేశ్వర్రావుకన్నా ఇంకా పనికొచ్చే వాళ్ళెవరైనా వున్నారేమో అని చూస్తున్నాను."
"లేదు రాజేశ్వర్రావే రైటయిన మనిషి."
కొన్నాళ్ళబాటు రాజేశ్వరరావు నమశ్శివాయదగ్గర కొలువులో కుదురుకుంటాడు. కొన్ని సంవత్సరాలకి సరిపడ అనుభవాలతో నిష్క్రమిస్తాడు. నేను చెప్పలేదూ రాజేశ్వర్రావుని పొమ్మని నమశ్శివాయ తన నోటితో తాను ఒకనాటికీ అనడు. ఇక్కడ నుండి పోతే చాలునని రాజేశ్వర్రావే అనుకొనక తప్పని పరిస్థితులు కల్పిస్తాడు.
నమశ్శివాయ ఎవరి మనశ్శాంతినీ అకస్మాత్తుగా తస్కరించడు. ఆకాశంలో మేఘం క్రమక్రమంగా మాయమైనట్లు అతని సమక్షంలో నీ మనశ్శాంతి హారతి కర్పూరమైపోతుంది. ఇందుకతడు ఉపయోగించే టెక్నిక్ ఇప్పటికీ నాకర్ధం కాలేదు. కాని అదేదో గొప్ప టెక్నిక్ అని మాత్రం ఎరుగుదును. ద్వారం వెంకటస్వామి నాయుడుగారు శంకరాభరణం తానం వాయించడంలో ఒక ప్రత్యేక ప్రక్రియ చూపిస్తారని ఎవరెరగరు? కాని అదేదో మనకి కూడా తెలిస్తే మనం కూడా అలాగ వాయించగలం కాదూ? కాని మనకది తెలియదు. అంతే ఇంచుమించు నమశ్శివాయ టెక్నిక్ కూడా ఇంతే. నాయుడుగారిలో దేవత్వముంటే నమశ్శివాయలో రాక్షసత్వం వుంది. అంతే భేదం!
ఈ రాక్షసత్వంలో కూడా ఏదో ఆకర్షణ ఉందని ఒప్పుకోకతప్పదు. నమశ్శివాయకి నేను సదానందం అని ఒక ముద్దు పేరుపెట్టాను. అతనికొక శాశ్వతమైన చిరునవ్వు ఉందన్నానుకాదూ? అది నిద్రలోకూడా అతని ముఖంమీద నాట్యమాడుతూ వుంటుంది. అతని విజయానికది ధ్వజం. తన ఆవరణలోకి వచ్చిన అందరి మనశ్శాంతినీ అతడపహరిస్తాడు. అందుకతని చిరునవ్వే సాక్షి.
అతని మోటారుడ్రైవరు పని మానుకున్న రోజున బాకీ జీతంకోసం పదిగంటలకి నమశ్శివాయ దర్శనం చేసుకున్నాడు. ఉండు ఇస్తానన్నాడు నమశ్శివాయ ఇవ్వనని ఎప్పుడూ అనడు. గుమ్మంలోనే కూర్చున్నాడు డ్రైవరు. మధ్యాహ్నం పండ్రెండు గంటలయింది. నమశ్శివాయ రెండోసారి బైటకివచ్చి రిస్టువాచీ చూసుకుంటూ. "అరగంటలో వచ్చేస్తాను. ఇక్కడే వుండు" అని కారు నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. డ్రైవరు భోజనం చెయ్యలేదని నమశ్శివాయకి తెలుసు. "ఈ రూపాయి తీసుకుని ఎక్కడైనా భోజనం చేసిరా" అని నమశ్శివాయ బుద్ధిపూర్వకంగానే అనలేదు. అరగంటలో వచ్చేస్తానన్న నమశ్శివాయ ఆ రోజంతా యింటికి రాలేదు. విసిగి వేసారి వుసూరుమంటూ వెళ్ళిపోయాడు డ్రైవరు. మర్నాడు నమశ్శివాయ తోటమాలి నడిగి కనుక్కున్నాడు. "డ్రైవరు ఎంతసేపు కాచుకు కూర్చున్నా"డని అంతసేపు బాధపెట్టగలిగానని ఆనందం నమశ్శివాయకి.
ఎవరి అంతస్తుకి తగిన ఫాయాలో నిలబడి వాళ్ళని చిత్తు చెయ్యగలడు నమశ్శివాయ. అతనితో సంభాషణ ఒక అనుభవం. అలాగ మాట్లాడుతూనే ఉంటాడు. నీ చెవులు రెండూ అతని జేబులోకి పోతాయి. ఆ సంగతి తెలియనే తెలియదు. తర్వాత ఇంటికి వచ్చి తడిమి చూసుకుంటే చెవులుండవు. ఇంద్రజాలం అనుకుంటారు కాదూ? ఈసారి నమశ్శివాయతో మాట్లాడి చూడండి.
---౦౦౦---
