Previous Page Next Page 
మనసు పొరల్లో పేజి 15

 

    గుండ్రంగా కుంకుమబొట్టు పెట్టుకుని గబగబా తలుపులన్నీ మూసేసీ వీధి తలుపుకి తాళం పెట్టింది. చెంప మీది మచ్చ కనబడకుండా హ్యాండ్ కర్చీఫ్ ని అడ్డం పెట్టుకుని పక్కింటి కెళ్ళి తాళం చెవులు వాళ్ళకిచ్చి "మావారోస్తే ఈ తాళాలు ఇచ్చెయ్యండి. నేను మా అన్నయ్య గారింటికి వెళుతున్నాను" అని చెప్పి రిక్షాని పిలిచి సూటు కేసు రిక్షాలో పెట్టి 'పోనీయ్' అంది. రిక్షా కదిలాక గుండె మీంచి పెద్ద బరువు దిగినట్టుగా ఫీలయింది. అంతదాకా తను వెళ్ళే లోపల పానకాలు వోచ్చేస్తాడేమోనన్న భయం ఆమెని కంగారు పెట్టేసింది. రిక్షా స్పీడ్ గా పోతుంది.
    రిక్షా చక్రాలకి గంటలు కట్టినట్టున్నాడు రిక్షావాడు. రిక్షా చక్రాల కదలికకి గంటలు ఘల్లుఘల్లుమని మోగుతున్నాయ్! ఆ చప్పుడు చల్లటి గాలి,  అలసిపోయిన శరీరానికి మనస్సుకి హాయిగా అనిపించి మనసు దూది పింజలా ఎగిరి పోతున్నట్టనిపించింది. బయటి ప్రపంచాన్ని చూసి ఎన్నో ఏళ్ళయినట్టనిపించించింది. అంత ప్రశాంతతా, హాయి ఈ మధ్య కాలంలో ఎన్నడూ అనుభవించలేదనిపించింది. ఈ పీడా ఇంతటితో  తెగతెంపులు చేసుకోవాలి. మళ్ళీ మాములుగా కాలేజీలో చేరాలి. చదువుకోవాలి- అనుకోగానే వొంట్లో కొండంత బలం వొచ్చినట్టనిపించింది. పొట్ట మీద చెయ్యి పెట్టి చూసుకుంది. పొట్ట ఎత్తుగా అనిపించింది. బిడ్డ లోపల తిరుగాడుతుందంటారు. ఇదేనేమో! అనుకుంది. 'తన బిడ్డ' తను తల్లి కాబోతుంది.' అనుకోగానే ఏదో కొత్త భావం , వొళ్ళు పులకరించింది. పానకాలుతో విడాకులు తీసుకుంటుంది. తనకు పుట్టబోయే బాబో, పాపో ఎవరైనా సరే, తనకి నాచ్చిన విధంగా పెంచుతుంది. పెద్ద చదువులు చదివిస్తుంది. తన జీవితమంతా ధారపోసి తన బాబుని ప్రయోజకుడిగా తయారుచేస్తుంది.' అనుకుంది. తన ఆలోచనలకి తనకే నవ్వొచ్చింది కౌసల్యకి. "బాబే' అని ఏమిటి గ్యారంటీ? పాప అవుతే? ఒక్క నిముషం ఏదో భయంలాంటిది? పాపయితే మాత్రం? డానికే లోటూ రాకుండా అమ్మా, నాన్నా , రెండూ తనే అయి పెంచుతుంది.' అనుకుంది . అంతలో ఇల్లోచ్చెయ్యడంతో తన ఆలోచనలకి తనే నవ్వుకుంటూ రిక్షా దిగి, సూట్ కేసు తీసుకుని రిక్షా వాడికి డబ్బిచ్చి పంపించేసింది. ఇల్లు చూడగానే ఎంతో ఆనందంగా అనిపించింది కౌసల్యకి. సూట్ కేస్ తీసుకుని మెట్లెక్కి వసారాలో అడుగు పెడుతుంటే ఏదో తెలియని భయం ఆవరించింది ఒక్క నిముషం! అంతలోనే ఆ గదీ ఆ తలుపులూ అన్నీ తనని పలకరిస్తున్నట్టుగా అనిపించింది. సంతోషమే "వొదినా!" "వొదినా!" అని పిలుస్తూ లోపలి కెళ్ళింది.
    రాధ పకోడీలు చేసింది. సుధాకర్ పిల్లలూ అంతా కలసి తింటున్నారు. కబుర్లు చెప్పుకుంటూ , కౌసల్యని చూడగానే "రా- రా....సమాయనికొచ్చావు. వెదర్ డల్ గా మబ్బుగా వుంది కదూ? వేడివేడిగా ఉల్లిపాయ పకోడీలు తినాలనిపించింది. అందులో మీవోడినా చేస్తే - నీకు తెలుసుగా అలా తింటూ పోవడమే! స్మితా! అత్తయ్యకో ప్లేటు తెచ్చి పెట్టామ్మా అంటూ బావగారూ రాలేదా?" అన్నాడు సుధాకర్. గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతూ.
    "రాలేదన్నయ్యా!" అంది ముక్తసరిగా కౌసల్య.
    "ఏమీ?" ఎందుకని?"
    "ఇంట్లో లేరు. ఎటో వెళ్ళారు.'
    "పోన్లే, మంచి పని చేశావు, పకోడీలు చేస్తున్నప్పటినుంచి నీ గురించే నీ గురించే మాట్లాడుకుంటున్నాం." నూరేళ్ళుయుష్షు.
    వీళ్ళ సంభాషణ విని లోపల్నుంచి పరుగెత్తుకొచ్చింది. రాధ ఎడం చేత్తో- ఆ పిండి చేత్తోనే పకోడిలా పళ్ళెం పట్టుకొని.
    "చూశావా? మా వార్త నీకెలా అంది పోయిందో? దీన్నే 'టేలిపతి ' అంటారు. పిండి కలిపినప్పటి నుంచి నీ మాటలే! ముఖ్యంగా మీ అన్నయ్య కలవరిస్తున్నారు" అంటూ భర్త వైపు తిరిగి "హమ్మయ్య! ఇంక అన్నా చెల్లెళ్ళీద్దరూ కలిసి తృప్తిగా తినండి" అంటూ ఉండండి వేడిగా పట్టుకొస్తాను" అని వంటింట్లోకి కెళ్ళింది రాధ. వెంటనే పకోడీలు ప్లేటు నిండా పెట్టి వోద్దంటున్నా వినక సగం కౌసల్యకి సగం సుధాకర్ కి వేసింది.
    "వోద్దోదినా! నాకు చాలు" అని వంగి రెండు చేతులు అడ్డు పెట్టడం వల్ల, చెంప మీది మచ్చ కనబడకుండా ఇంతసేపూ కర్చీఫ్ ఎడం చేత్తో పట్టుకుని చెంపకి చెయ్యినాన్చుకుని కూర్చున్న కౌసల్య అ మచ్చ సంగతి మర్చేపోయింది. స్మిత ఆ మచ్చని చూసి "అత్తయ్యా! చెంప మీద దెబ్బ తగిలిందా? ఏదైనా పురుగు కరిచిందా?" అని అడిగింది అరిందలాగా"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS